మా పేరెంట్స్‌కి నేనిచ్చిన బహుమతి అది! | Sakshi Interview with Mahesh babu wife Namrata shirodkar On Mothers Day | Sakshi
Sakshi News home page

అమ్మ కలను నిజం చేశా!

Published Sun, May 9 2021 12:27 AM | Last Updated on Sun, May 9 2021 12:14 PM

Sakshi Interview with Mahesh babu wife Namrata shirodkar On Mothers Day

నమ్రతా శిరోద్కర్‌

అమ్మ అంటే అనురాగం... అమ్మ అంటే ఆలంబన...
అమ్మ అంటే ఆత్మస్థయిర్యం...
అమ్మ అంటే కొండంత అండ...
నిస్వార్థమైన ప్రేమకు చిరునామా – అమ్మ.


‘మాతృదినోత్సవం’ సందర్భంగా తన తల్లి వనితా శిరోద్కర్‌ గురించి నటి, మహేశ్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌ చెబుతూ, ‘అమ్మ అంటే ధైర్యం’ అన్నారు. ఇంకా తన తల్లి, పిల్లల గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

► మీ అమ్మగారి గురించి?
నమ్రత: అత్యంత స్ఫూర్తిదాయకమైన మహిళ మా అమ్మ. ఈరోజు నేను, నా సోదరి (శిల్పా శిరోద్కర్‌) స్ట్రాంగ్‌ ఉమెన్‌గా ఉండగలుగుతున్నామంటే మా అమ్మ పెంపకం వల్లే! మా అమ్మ జీవన విధానం నాకు గొప్ప ఇన్‌స్పిరేషన్‌. అమ్మ జాబ్‌ చేసేవారు. ఇంటినీ, ఉద్యోగాన్నీ ఆవిడ బ్యాలెన్స్‌ చేసుకున్న తీరు అద్భుతం. మేం ‘నెగ్లెక్టెడ్‌ చిల్డ్రన్‌’ అనే ఫీలింగ్‌ మాకెప్పుడూ కలగలేదు. అమ్మలేని లోటును నేనెప్పటికీ ఫీలవుతుంటాను. అయితే ఆవిడలోని చాలా విషయాలను నా సిస్టర్‌ శిల్పలో చూస్తున్నాను.

► అమ్మ నుంచి ఏం నేర్చుకున్నారు?

ఇతరుల పట్ల దయగా ఉండడం... మానవత్వం. అన్ని సమయాల్లో ధైర్యంగా ఉండడం, సవాళ్లను ఎదుర్కోవడం వంటివన్నీ ఆమె నుంచి నేర్చుకున్నాను. అవి నా పిల్లలకు నేర్పుతున్నాను. మా అమ్మ తన పిల్లలకు ‘బెస్ట్‌ మామ్‌’గా నిలిచారు. మా అమ్మలా నేను నా పిల్లలకు బెస్ట్‌ మామ్‌గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను.

► అమ్మతో గడిపిన ఆనంద క్షణాలు?
మా అమ్మగారి చివరి రోజుల్లో నాతో ఎక్కువగా గడిపారు. అవి నాకు ముఖ్యమైన రోజులు. ఆ మూడు నెలలు అమ్మకు ఏమేం చేయాలో అన్నీ చేశాను. అమ్మ చుట్టూ తిరుగుతూ ఆవిడను చూసుకున్న ఆ మూడు నెలలు నాకు స్పెషల్‌గా గుర్తుండిపోతాయి.

► సమస్యలను అధిగమించడానికి మీ అమ్మగారు ఎలా హెల్ప్‌ చేసేవారు?
అమ్మకు ఒక మంచి లక్షణం ఉండేది. ఏదైనా సమస్య గురించి చెప్పినప్పుడు ఓపికగా వినేవారు. ‘వినడం’ అనేది చాలా ఇంపార్టెంట్‌ అని చెప్పేవారు. సమస్య మొత్తం విన్నాక అప్పుడు పరిష్కార మార్గం చెప్పేవారు. సమస్య అనే కాదు.. ఏ విషయాన్నయినా పూర్తిగా వినాలనే లక్షణం అమ్మ నుంచి నాకు అలవాటయింది.

► అమ్మ చేసిన వంటల్లో నచ్చినవి?
పెప్పర్‌ చికెన్, అలాగే వైట్‌ సాస్‌ చికెన్‌ కూడా అద్భుతంగా వండేవారు.

► ‘ఆడపిల్లలు’ అంటూ... మీ అమ్మగారు పదే పదే జాగ్రత్తలు చెప్పేవారా?
జాగ్రత్తలు చెప్పేవారు కానీ పదే పదే చెప్పేవారు కాదు. ఒక తల్లిగా తను చెప్పదలచుకున్నవి చెప్పేవారు. కానీ ఏదైనా మా అంతట మేం తెలుసుకోవాలనేవారు. అలాగే ఏ దారిలో వెళ్లాలో నిర్ణయించుకోమనేవారు. ఎలా ఉంటే ఆ దారి బాగుంటుందో మాత్రం చెప్పేవారు. అలా చేయడం వల్ల మాకంటూ సొంత వ్యక్తిత్వం ఏర్పడింది. పిల్లల చెయ్యి పట్టుకుని నడిపించాలి. కానీ వాళ్ల జీవితం మొత్తం పట్టుకునే నడిపించాలనుకుంటే సొంత వ్యక్తిత్వం ఏర్పడదని నమ్మిన వ్యక్తి మా అమ్మ.

► మీకు ఆంక్షలు ఏమైనా పెట్టేవారా?
కొన్ని రూల్స్‌ పెట్టేవారు. అయితే నేను వాటిని ఆంక్షలు అనను. ఏ తల్లయినా పిల్లలకు కొన్ని నియమాలు పెట్టడం చాలా అవసరం. అవి వాళ్ల భవిషత్తుకు మంచి పునాది అవుతాయి.

► మీరు మీ పిల్లలతో ఎలా ఉంటారు?
పిల్లల కోసం పూర్తిగా టైమ్‌ కేటాయిస్తాను. పిల్లలకు మంచీ చెడు చెబుతుంటాను. గుడ్‌ ఫుడ్, బ్యాడ్‌ ఫుడ్‌కి తేడా చెబుతాను. వీలైనంత నిరాడంబరంగా ఉండమని చెబుతాను. దాదాపు ఏ పిల్లలూ అదే పనిగా చదువుకోవడానికి ఇష్టపడరు. అందుకే చదివించేటప్పుడు కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటాను. చదువుతో పాటు పిల్లలకు ఆటలు కూడా ముఖ్యం. గౌతమ్‌కు స్విమ్మింగ్, సితారకు డ్యాన్స్‌ వంటి క్లాసులు ఉన్నాయి. వాటిని ఇద్దరూ ఎంజాయ్‌ చేస్తారు.

► కరోనా లాక్‌డౌన్‌లో పెద్దలు, పిల్లలు బయటికి వెళ్లే వీలు లేదు. ముఖ్యంగా పిల్లల అల్లరిని ఎలా మ్యానేజ్‌ చేస్తున్నారు? ఇద్దరూ గొడవపడుతుంటారా?
మా ఇద్దరు పిల్లలు బంగారాలనే చెప్పాలి. వాళ్లను మ్యానేజ్‌ చేయడం నాకెప్పుడూ ఛాలెంజింగ్‌గా అనిపించలేదు. అందుకని మిగతా రోజులకి, లాక్‌డౌన్‌కి నాకు తేడా తెలియడంలేదు. ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే గొడవపడడం కామన్‌. వీళ్లిద్దరిదీ ఇల్లు పీకి పందిరేసేంత అల్లరి కాదు కాబట్టి మ్యానేజ్‌ చేసేయడమే (నవ్వుతూ).

► ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో పిల్లలను ఏ విధంగా చూసుకోవాలి?
పిల్లలతో ఉన్నప్పుడు కచ్చితంగా మాస్కు ధరించాలి. అలాగే మాస్కు ధరించడంవల్ల ఉండే ఉపయోగాలను పిల్లలకు స్పష్టంగా చెప్పాలి. ‘ఈ టైమ్‌లో కొంచెం ఎక్కువ శుభ్రంగా ఎందుకు ఉండాలి? భౌతిక దూరం ఎందుకు పాటించాలి?’ అనే విషయాలను పిల్లలకు వివరించాలి. అలాగే ఈ సమయంలో స్వచ్ఛమైన గాలి చాలా అవసరం. శుభ్రమైన శ్వాస ప్రాముఖ్యాన్ని చెప్పాలి. రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం పిల్లలకు ఇవ్వాలి. నీళ్లు ఎక్కువగా తాగాలని చెప్పాలి.

మా అమ్మ ఎప్పుడూ కరెక్టే!
► మీ అమ్మగారు మీకిచ్చిన ఆధ్యాత్మిక పుస్తకాలు కానీ... చెప్పిన విషయాల గురించి కానీ షేర్‌ చేసుకుంటారా?
ఓ సందర్భలో మా అమ్మ నాకు ‘శ్రీసాయి సచ్చరిత్ర’ పుస్తకాన్ని ఇచ్చారు. ఎప్పుడైనా ఒత్తిడిగా అనిపించినప్పుడు, సవాళ్లు ఎదురైనప్పుడు ఆ పుస్తకాన్ని ఏకాగ్రతగా చదవమని చెప్పారు. మంచి చేయడంతో పాటు సవాళ్లను అధిగమించి ముందుకు సాగడానికి ఉపయోగపడుతుందని అన్నారు. నేను ఏడు రోజుల పారాయణం పూర్తి చేశాను. మా అమ్మ ఎప్పుడూ కరెక్టే. సచ్చరిత్ర చదువుతున్నప్పుడే నాకు ఓ బలం, నమ్మకం ఏర్పడ్డాయి. ఇతరుల నుంచి ఏదీ ఆశించకుండా అభిమానించడం, జీవితాన్ని స్పష్టంగా చూడడం కూడా అలవాటైంది.
 

మా పేరెంట్స్‌కి నేనిచ్చిన బహుమతి అది!
► మీ అమ్మగారు ‘మిస్‌ ఇండియా’ పోటీల్లో పాల్గొనాలనుకున్నారట. కానీ మీరు ‘మిస్‌ ఇండియా’ అయ్యారు...
‘మిస్‌ ఇండియా’ కాంటెస్ట్‌లో అమ్మ పాల్గొనలేకపోవడానికి కారణం అప్పటికే ఆమెకు పెళ్లి కావడమే! నన్ను మిస్‌ ఇండియాగా చూడాలన్నది ఆమె కల. అది నెరవేర్చగలిగాను. నేను సాధించిన ‘మిస్‌ ఇండియా’ కిరీటం నా పేరెంట్స్‌కి నేనిచ్చిన బహుమతి. వాళ్ల కోసం ఏదో సాధించానన్న తృప్తి నాకెప్పటికీ ఉంటుంది.

నితిన్, వనిత దంపతులు

మా మమ్మీ చాలా కూల్‌ – సితార
మహేశ్‌బాబు–నమ్రతల ముద్దుల కుమార్తె సితార తన తల్లి గురించి షార్ట్‌ అండ్‌ స్వీట్‌గా చెప్పిన విశేషాలు...

► మీ అమ్మగారు వెరీ స్ట్రిక్టా?

మా అమ్మ చాలా గారాబం చేస్తుంది. వెరీ కూల్‌. వెరీ స్వీట్‌. అయితే స్ట్రిక్ట్‌గా ఉండాల్సినప్పుడు మాత్రం ఉంటుంది. మేం తప్పు చేస్తున్నాం అనిపించగానే మందలిస్తుంది. కరెక్ట్‌ ఏంటో చెబుతుంది.

► నువ్వు అలిగినప్పుడు మీ అమ్మ ఏం చేస్తారు?
ఫన్నీ స్టోరీలు చెప్పి నవ్విస్తారు.

► నీతో ఎప్పుడూ ఏం చెబుతుంటారు?
‘ముందు చదువుకో... తర్వాతే ఆటలు’ అంటారు.

► మరి.. స్టడీస్‌ విషయంలో హెల్ప్‌ చేస్తారా?
ఓ.. అన్ని సబ్జెక్టులకీ హెల్ప్‌ చేస్తారు. అలాగే ఆర్ట్‌ వర్క్‌కి కూడా! నాకేది ఇష్టమో అవన్నీ చేస్తారు.

► నీతో ఆటలు ఆడుకుంటారా?
మేం ఇన్‌డోర్‌ గేమ్స్‌ ఆడతాం. మేము ఇంట్లో పెంచుతున్న మా పెట్స్‌ నోబు, ప్లూటోతో బాగా ఆడుకుంటాం.

► మీ అమ్మ ఫేవరెట్‌ ఫుడ్‌?
అమ్మకు అన్నీ ఇష్టమే. హెల్త్‌ కోసం మంచివే తినాలంటారు. ఆర్గానిక్‌ ఫుడ్‌ని ఇష్టపడతారు.

► మదర్స్‌ డే సందర్భంగా అమ్మకు ఏం చెప్పాలనుకుంటున్నావు?
నాకు నచ్చినవి చేయడానికి ఎంకరేజ్‌ చేసే ‘బెస్ట్‌ మామ్‌’ మా అమ్మ. నా బెస్ట్‌ మామ్‌కి థ్యాంక్స్‌ చెబుతున్నాను.

– డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement