గాయని చిత్ర
భక్తికి పాట... ఆనందానికి పాట... బాధను దిగమింగుకోవడానికి పాట... చిత్ర జీవితం మొత్తం పాటలే. ఇంట్లో జరిగే వేడుకలకు వెళ్లే తీరిక లేదు. పాట వేదికే ఆమెకు వేడుక! ఆమె పాటలు ప్రేక్షకులకు ఓ వేడుక!!
కృష్ణన్‌నాయర్ శాంతకుమారి చిత్రను ‘పద్మభూషణ్’ వరించినవేళ పాటకు వేడుక!!! పాట రూపంలో అందరి ఇళ్లల్లోకి వచ్చిన చిత్రతో ‘సాక్షి’ స్పెషల్ ఇంటర్వ్యూ...
► పద్మభూషణ్‌ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు?
నా అన్ని విషయాలకూ నా కన్నా ఎక్కువగా ఆనందపడేది ఆయనే (భర్త విజయ్ శంకర్). మేం ఇద్దరం చాలా సింపుల్. ‘షో ఆఫ్’ అనేది తెలియదు. ఆయన ‘కంగ్రాట్స్’ అన్నారు. స్నేహితులు, బంధువులు శుభాకాంక్షలు తెలిపారు. అంతే. సెలబ్రేషన్స్ లాంటివి ఏమీ చేసుకోలేదు.
► ఇంత పేరు, డబ్బు వచ్చాక కూడా అలానే సింపుల్‌గా ఉన్నారు. ఎవరు ఇన్‌స్పిరేషన్?
మాది రిచ్ ఫ్యామిలీ కాదు. మా నాన్నగారు హెడ్‌మాస్టర్, అమ్మ హెడ్ మిస్ట్రెస్. ఇద్దరూ సింపుల్‌గా ఉంటారు. కట్టుబాట్ల మధ్య మమ్మల్ని (అక్క, తమ్ముడు) పెంచారు. ఎక్కువగా వెజిటెరియనే తినేవాళ్లం. ఎప్పుడో ఒకసారి నాన్‌వెజ్. అంతే. ఆడంబరమైన జీవితం కాదు. అమ్మానాన్న చెప్పిన విలువలనే ఇప్పటికీ పాటిస్తున్నాను. మారాలనుకున్నా మారలేను (నవ్వుతూ).
► మీకు సంగీతం పట్ల ఆసక్తి ఎలా మొదలైంది?
మా నాన్నగారు రేడియాలో పాడేవారు. నాన్నగారి పెద్దక్కయ్య వీణ వాయించేవారు. మాకు హాలిడేస్ అంటే మేనత్త ఇంటికి వెళ్లేవాళ్లం. ఆవిడ చాలామందికి మ్యూజిక్ నేర్పించేవారు. ఇంట్లో అందరికీ సంగీతం అంటే ఇష్టం ఉండటం వల్లనే చిన్నప్పుడే నాకూ ఆసక్తి ఏర్పడి ఉంటుంది. మా మేనత్త దగ్గర కర్ణాటిక్ మ్యూజిక్‌కి సంబంధించిన బేసిక్స్ అన్నీ నేర్చుకున్నాను. మా అమ్మకు వీణ తెలుసు. మా ఇంట్లో సాయంత్రం కాగానే దేవుడికి దీపం పెట్టేటప్పుడు అక్క, తమ్ముడు, నేను పాడాలి. ఏ కారణంతోనూ పాడటం మాత్రం మానకూడదు. తమ్ముడు మృదంగం వాయించేవాడు. నేను, అక్క పాడేవాళ్లం. రోజూ పూజకి, మ్యూజిక్ ప్రాక్టీస్‌కి గంటకు పైనే కేటాయించేవాళ్లం. ఆ తర్వాతే హోమ్‌వర్క్.
► మీ ఇష్టదైవం కృష్ణుడని...
అవును. కృష్ణుడికి నేను పరమ భక్తురాల్ని. ఎక్కువగా ‘కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్..’ పాడుతుంటా.
► కృష్ణుడి గురించి మీ జీవితంలో జరిగిన ప్రత్యేకమైన సంఘటనలు ఏమైనా ఉన్నాయా?
ఈ మధ్య జరిగినదే చెబుతాను. నాకు ‘పద్మభూషణ్’ ప్రకటించే రోజు ఉదయం ప్రముఖ మలయాళ డైరెక్టర్ సేతు గురువాయూర్ టెంపుల్‌కి వెళ్లారు. గుడిలోంచి వీడియో కాల్ చేసి, ‘నీ ఇష్టదైవం కృష్ణుడు’ అంటూ విగ్రహాన్ని చూపించారు. కోవిడ్ వల్ల ఈ మధ్య గురువాయూర్ వెళ్లలేదు. కృష్ణుణ్ణి అలా చూస్తూ ఉండిపోయా. ఆ సాయంత్రం పద్మభూషణ్ ప్రకటించారు.
► తెలుగులో మీరు పాడిన ఫస్ట్ పాట ‘పాడలేను పల్లవైనా’ (‘సింధు భైరవి’ చిత్రం). ఆ తర్వాత ఎన్నో పల్లవులు, చరణాలు పాడారు. ఆ పాట పాడినప్పుడు అర్థం తెలుసా?
అప్పుడు నాకు తెలుగు తెలియదు. మలయాళం, తమిళం కొంచెం దగ్గరగా ఉంటాయి. కన్నడ, తెలుగు నాకు విదేశీ భాషల్లాంటివే. కాలేజీలో త్యాగరాజ కీర్తనలవీ నేర్చుకునేటప్పుడు అర్థం తెలియకుండా పాడాను. ఇప్పుడు భాష అర్థం అయ్యాక ‘అయ్యయ్యో.. అప్పుడు ఈ పదాన్ని తప్పుగా పలికానే’ అనుకుంటాను. బాలు (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం) సార్ చాలా హెల్ప్ చేశారు. పదాలు తప్పుగా పలికినప్పుడు ఆయన అక్కడికక్కడే సరిదిద్దేవారు. అలాగే కీరవాణి, కోటి, మణిశర్మ వంటి సంగీతదర్శకులు ఎవరి ట్రాక్‌ని వారితో విడిగా పాడించకుండా, బాలు సార్, నా కాంబినేషన్‌లోనే అన్ని పాటల రికార్డింగ్‌నీ ప్లాన్ చేసేవారు. దాదాపు పది, పదిహేనేళ్లు అలా ఆయనతో కలిసే పాడాను.
► నలభై రెండేళ్లుగా పాడుతున్నారు. వాయిస్‌ని కాపాడుకోవడానికి చాలా శ్రద్ధ తీసుకుంటారా?
ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. నేను చేసేవి వేరేవాళ్లకు నప్పకపోవచ్చు. ఉదాహరణకు బాలూగారు ఐస్‌క్రీములు అవీ తినేవారు. రికార్డింగ్ అప్పుడు నేను ఫ్లాస్క్‌లో వేడినీళ్లు తీసుకెళతాను. కానీ సార్ బాటిల్‌లో చల్లని నీళ్లే ఉండేవి. ఆయనకు అది సరిపడింది. నేను ఫ్లయిట్‌లో, కారులో వెళ్లేటప్పుడు చెవులకు దూది పెట్టుకుంటాను. చల్లగాలి తగలకూడదని ముక్కు కూడా కవర్ చేసుకుంటాను. ‘ఇంత అతి జాగ్రత్త ఎందుకు? వర్షంలో కూడా తడవాలి. అన్నింటికీ అలవాటుపడాలి. లేకపోతే త్వరగా ఇమ్యూనిటీ పోతుంది’ అని బాలూ సార్ అనేవారు. నిజానికి నాకిలా జాగ్రత్త అలవాటైంది (కేజే ఏసు) దాసన్న వల్లే! కారులో వెళ్లేటప్పుడు తలకి గట్టిగా గుడ్డ కట్టుకుంటారాయన. చెవులు కవర్ చేసుకుంటారు. ఆయనతో ఎక్కువగా ట్రావెల్ చేశాను కాబట్టి నాకు అలవాటైంది. దానికి భిన్నంగా వెళదామంటే ఏమైనా అవుతుందని భయం. పైగా, నాకు పరిశుభ్రత పిచ్చి.
► ఓసీడీ కాదు కదా?
అలాంటిదే (నవ్వుతూ). నేను ఉండే పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉండాలని కోరుకుంటాను. రికార్డింగ్‌కి, కచ్చేరీలకు వెళ్లినప్పుడు అందరం ఒకే మైక్ వాడతాం. అది నాకు ఇబ్బందిగా ఉంటుంది. అప్పటివరకూ ఆ మైక్ దగ్గరగా నిలబడి ఎవరో ఒకరు పాడి ఉంటారు కదా! ఆ ఫీలింగ్ రాగానే ఏదోలా ఉంటుంది. ఇప్పుడు కరోనా అని అందరూ బ్యాగుల్లో శానిటైజర్లు పెట్టుకుంటున్నారు. కానీ కొన్నేళ్లుగా నా బ్యాగులో శానిటైజర్ పెట్టుకుంటున్నాను. నేను పాడే ముందు మైక్‌ని శుభ్రంగా శానిటైజర్‌తో తుడిచి, ఆ తర్వాతే పాడతా. హైదరాబాద్‌లో ఒక షోలో ఎవరికో మైక్ కావాల్సి వస్తే, నా దగ్గరున్నది అడిగారు. ‘క్లీన్ చేశాను.. ఎలా ఇవ్వాలా?’ అని ఆలోచిస్తుంటే ‘ఆవిడ ఇవ్వదుగాక ఇవ్వదు. ఇప్పుడే మైక్‌కి స్నానం చేయించింది’ అని బాలూ సార్ సరదాగా అన్నారు. నాతో పాటు మా అమ్మాయిని కూడా తీసుకెళ్లేదాన్ని. ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లయిట్ దగ్గరకు బస్సులో తీసుకెళతారు. ఆ బస్సు కడ్డీలు పట్టుకుంటుందని, ఎస్కలేటర్ అవీ ఎక్కేటప్పుడు పట్టుకుంటుందని తన కోసం సెపరేట్‌గా శానిటైజర్ పెట్టుకునేదాన్ని.
► చివరిగా బాలూగారిని ఎప్పుడు కలిశారు? ఆయన ఆస్పత్రిలో చేరాక మాట్లాడారా?
2019 డిసెంబర్‌లో మలేసియాలో ఒక కాన్సర్ట్ చేశాం. చివరిగా ఆయన్ను నేను కలిసింది అదే. ఆ తర్వాత కరోనా టైమ్‌లో బాలూగారు ఇంట్లో ఖాళీగా లేని విషయం మీ అందరికీ తెలిసిందే. కరోనా నేపథ్యంలో పాటలవీ చేశారు. కరోనాకు సంబంధించి తెలుగులో ఉన్న ఒక పాటను ‘కొంచెం మలయాళంలో ట్రాన్స్‌లేట్ చేసి పెడతావా’ అని ఫోన్ చేశారు. ‘చేసి పెడతావా కాదు.. నాకిది చేసి పెట్టు అని అడగాలి మీరు’ అని, చేసిచ్చాను. అలాగే కోవిడ్ టైమ్‌లో ఆయన మ్యూజిక్‌లో మా ఇంట్లో ఉండి నేను కూడా ఒక పాట రికార్డ్ చేసి, పంపాను. ఆ తర్వాత బర్త్‌డే సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పినవాళ్లందరికీ సార్ మెసేజ్ పెట్టాలనుకున్నారు.
తెలుగులో ఆయన మాట్లాడిన మాటలను మలయాళంలో ట్రాన్స్‌లేట్ చేసి, వాయిస్ పెట్టమంటే, చేసిచ్చాను. అదే చివరిగా నేను ఆయనతో మాట్లాడింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఫేస్‌బుక్‌లో కరోనా పాజిటివ్ అని బాలూ సార్ పెట్టిన వీడియో చూసి, ‘ఎలా ఉన్నారు?’ అని మెసేజ్ పెట్టాను. ‘ఏం ఫరవాలేదు... మైల్డ్‌గా ఉంది’ అని మెసేజ్ పెట్టారు. యాక్చువల్‌గా బాలూ సార్ వెళ్లిన ప్రోగ్రామ్‌కు నన్నూ రమ్మన్నారు. అయితే ఈ కరోనా టైమ్‌లో జర్నీ వద్దని మా ఆయన అనడంతో నేను వెళ్లలేదు. ‘యువర్ డెసిషన్ వజ్ రైట్’ అని సార్ మెసేజ్ పెట్టారు. ఇక ఆ తర్వాత ఆయనతో మాట్లాడలేదు. ఇలా జరుగుతుందని నేనస్సలు ఊహించలేదు. ఇప్పటికీ ఏదో ఒక ఊళ్లో సుఖంగా పాటలు పాడుతూ ఉన్నారనే భావిస్తూ ఉంటాను.
► మీ ప్రయాణం మొత్తం ఇల్లు, రికార్డింగ్ స్టూడియో చుట్టూనే తిరుగుతోంది. ఏదైనా త్యాగం చేసిన ఫీలింగ్? పశ్చాత్తాపం ఏమైనా?
పశ్చాత్తాపం ఏమీ లేదు కానీ ఫ్యామిలీలో జరిగే ముఖ్యమైన వేడుకలకు వెళ్లడానికి కుదిరేది కాదు. ఇంట్లోవాళ్లకు, బంధువులకు బాధ అనిపించడం సహజం. నాకూ బాధగానే ఉండేది. అయితే పోను పోను నా బిజీ అందరికీ అర్థం అయింది. నాకు నచ్చిన వృత్తి ఇది. అందుకని ఈ బిజీని ఎంజాయ్ చేస్తున్నాను. ఇలాంటి కెరీర్ ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతగా ఉంటాను. లైఫ్‌లో చిన్న, పెద్ద కష్టాలుంటాయి. వీటిని దాటేలా చేసింది ఈ సంగీతమే. ఇక త్యాగం గురించి చెప్పాలంటే.. త్యాగం నాది కాదు. నా కుటుంబానిది. నేను ఒంటరిగా ఎక్కడికీ వెళ్లను. మా నాన్నగారు ఓరల్ కేన్సర్‌తో చనిపోయారు.
కేన్సర్‌తో బాధపడుతున్న సమయంలోనూ నొప్పి బయటకు కనపడనివ్వకుండా, మందులు వేసుకుని నాకు తోడుగా రికార్డింగ్ స్టూడియోకి వచ్చారు. ఆయనది త్యాగం. నా జీవిత భాగస్వామి నేనే వండి పెట్టాలని, వడ్డించాలని ఎదురుచూడలేదు. ఒక దశ తర్వాత నా కెరీర్ కోసం తన కెరీర్‌ని మానుకున్నారు. త్యాగం ఆయనది. నా కూతురి (కీ.శే. నందన)తో నేనెక్కువ టైమ్ గడపడానికి కుదిరేది కాదు. రికార్డింగ్ ముగించుకుని ఇంటికి లేట్‌గా వెళ్లినప్పుడు నాన్నతో నిద్రపోయేది. నందనని మా అక్క కూడా చూసుకునేది. అమ్మని మిస్సయిన నా కూతురిది కూడా త్యాగమే. అందరూ త్యాగం చేయడంవల్లే నేను ఇంత ఎదగగలిగాను.
► మీరు వచ్చేనాటికే సుశీల, జానకిగార్లు ఉన్నారు. ఏదైనా అభద్రతాభావం ఉండేదా?
సింగర్ అవ్వాలన్నది నా లక్ష్యం కాదు. మ్యూజిక్ నేర్చుకుని ఏదైనా స్కూల్లోనో, కాలేజీలోనో మ్యూజిక్ టీచర్ అవ్వాలని ఉండేది. సినిమాలకు అవకాశం రావడంతో వచ్చాను. ఒక్కోటిగా వరుసగా అవకాశాలు రావడంవల్ల గాయనిగా స్థిరపడ్డా. అప్పటికి నేను ఎంఏ ఫస్ట్ ఇయర్. ఎక్కడికీ ఒంటరిగా వెళ్లింది లేదు. అమ్మానాన్న జాబ్ చేస్తున్నారు. నాన్న అనారోగ్యం బారినపడిన తర్వాత ఇంట్లో ఒకొక్కరుగా వంతులు వేసుకుని నాతో పాటు వచ్చేవారు. నా సంపాదనంతా మా ఫ్లయిట్ టికెట్లకే సరిపోయేది. డబ్బు మీద కూడా నాకంత ధ్యాస లేదు. ‘అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు ఇచ్చింది కాదనకూడదు’ అని నాన్న ఎంకరేజ్ చేశారు.
► పెళ్లయ్యాక మీకు తోడుగా మీ భర్త వస్తున్నారు.. మీ పెళ్లి విశేషాలు చెప్పండి?
మాది ఎరేంజ్డ్ మ్యారేజ్. ఆయన ఇద్దరు చెల్లెళ్లు బాగా డ్యాన్స్ చేస్తారు. ఒక చెల్లెలు, నేను స్కూల్‌మేట్లం. తను డ్యాన్స్ చేస్తే నేను పాడేదాన్ని. వాళ్లింటికి కూడా వెళ్లింది లేదు. అయితే రెండు కుటుంబాలకు పరిచయం ఉంది. పెద్దవాళ్లే మాట్లాడి మా పెళ్లి చేశారు. నా హజ్బెండ్ ఆర్ట్ లవర్. మా అత్తగారు వీణ బాగా వాయిస్తారు.
► ఇంత సింపుల్‌గా ఉంటారు, ఇంత బాగా పాడతారు కాబట్టి ‘చిత్ర మనింటి అమ్మాయి’ అని ఇతర భాషలవాళ్లతోనూ అనిపించుకున్నారు...
థ్యాంక్యూ. యాక్చువల్లీ ఈ మాట నాతో చాలామంది అన్నారు. నాకూ ‘మీ అందరి ఇంటి అమ్మాయి’ అనిపించుకోవడమే ఇష్టం. నన్ను ప్రత్యేకంగా చూడటం నాకిష్టం ఉండదు.
► మీ ఏకైక కుమార్తె నందనను జాగ్రత్తగా చూసుకున్నారు. దురదృష్టవశాత్తూ తను దూరమైంది. ఆ బాధను అధిగమించడానికి సంగీతం హెల్ప్ అయిందా?
వేరే బాధను అధిగమించవచ్చు కానీ ఈ బాధను అధిగమించలేకపోయాను. అది లోలోపల అలా ఉండిపోయింది. అంతే. అయితే సంగీతం ఒక ఊరటనిస్తుంది. నా పరిస్థితుల్లో ఇంకో అమ్మాయి ఒకవేళ వేరే వృత్తిలో ఉండి ఉంటే తేరుకుని నిలబడగలిగేది కాదేమో! నాకు ఇష్టం ఉన్నా, లేకపోయినా మిగతావాళ్ల కోసం నేను బతికి తీరాలి. ఎందరో త్యాగం చేస్తే నేనీ స్థాయికి వచ్చాను. ఆ దుర్ఘటన జరిగాక నేను మామూలు మనిషిని కాలేకపోయాను. ఒక ఐదు నెలలు వేరే ప్రపంచంలో ఉన్నట్లుగా అయిపోయాను. ఇక మ్యూజిక్ వద్దనుకున్నాను. ఆ టైమ్‌లో నాకు వేరేవాళ్ల జీవితంలో జరిగిన విషయాలను చెప్పి, మా వాళ్లు కౌన్సిలింగ్ చేశారు.
నేను ఒంటరిగా వెళ్లను అనే కారణంతో నా కోసం నా కుటుంబ సభ్యులందరూ త్యాగం చేశారు. మా ఆయన్నే తీసుకోండి... ఆయనది చక్కని కెరీర్. అయితే నాకు తోడుగా రావాల్సి వచ్చినందువల్ల తన కెరీర్‌ని త్యాగం చేశారు. కానీ షాక్‌లో ఉన్న నాకు ఇవేం పట్టలేదు. ‘నిన్ను నమ్మి రికార్డింగ్ స్టూడియోలో స్టాఫ్ ఉన్నారు. వాళ్ల కోసం పాటలు పాడాలి’ అంటూ మావాళ్లు నాకు ఎన్నో రకాలుగా చెప్పారు. మా అక్క, మరదలు మా ఇంట్లోనే ఐదారు నెలలు ఉన్నారు. నన్ను రికార్డింగ్ స్టూడియోకి దగ్గరుండి తీసుకెళ్లి, నేను కొద్దిగా తేరుకున్నాకే వాళ్లందరూ వాళ్ల వాళ్ల ఇళ్లకి వెళ్లారు. నా చుట్టూ ఇంతమంది ఉండేలా చేసినందుకు, అలాగే నా మానసిక వేదనకు కొంత ఉపశమనం కలిగించే వృత్తిలో నన్ను ఉంచినందుకు నా ఆరాధ్య దైవం కృష్ణుడికి కృతజ్ఞతలు.
బాలూ గారు రాగానే... భయపడిపోయా!
కమల్‌హాసన్ సార్ ‘పున్నగై మన్నన్’ (తెలుగులో ‘డ్యాన్స్ మాస్టర్’) అనే తమిళ సినిమాలో ‘కాలకాలమాగ వాళుమ్ కాదలుక్కు’ అనే పాట బాలూ సార్‌తో నేను పాడిన మొదటి పాట. అప్పటికి ఆడియో క్యాసెట్ల మీద బాలూ సార్ ఫొటోలవీ చూశాను. పాటలు విన్నాను. అయితే ఆ సినిమా సంగీత దర్శకుడు ఇళయరాజా సార్ రికార్డింగ్‌కి పిలిచినప్పుడు నేను బాలూ సార్‌తోనే పాడబోతున్నానని తెలియదు. నేను రికార్డింగ్ స్టూడియోలో ఉన్నప్పుడు హఠాత్తుగా ఆయన వచ్చారు. చాలా భయపడిపోయాను. నాకు అప్పుడు తమిళం కూడా రాదు. అయితే బాలూ సార్ ఎంత గ్రేట్ అంటే.. తనకే అన్నీ వచ్చని, తను సీనియర్ అనీ వేరేవాళ్లను తక్కువ చేయరు. దాస్ (కేజే ఏసుదాస్) అన్నతో నాకు పరిచయం ఉంది. ఆయనతో ఎన్నో కచేరీలు చేశాను. కానీ బాలూ గారితో పరిచయం లేకపోవడంతో టెన్షన్ పడ్డాను. మిగతా అందరితో ఆయన ఫ్రెండ్లీగా మూవ్ అయిన విధానం చూడగానే నా టెన్షన్ మొత్తం పోయింది. నాతో చాలా కూల్‌గా మాట్లాడారు. మర్యాద పెరిగిపోయింది. తప్పులు పాడినా సరిదిద్దుతారనే నమ్మకం ఏర్పడింది.
ఎస్పీబీతో...
జానకమ్మ వచ్చి... ‘ఏం నవ్వలేదు’ అన్నారు!
నేను బిడియస్తురాలిని. కొన్ని పాటల్లో నవ్వాల్సి వస్తుంది కదా. ఆ పాటలను స్టేజీ మీద పాడుతున్నప్పుడు నవ్వు వచ్చే చోట ఆపేసేదాన్ని. అలా ఒక వేదిక మీద పాడుతున్నప్పుడు నవ్వలేదు. ఆ తర్వాత బ్యాక్ స్టేజీకి వెళ్లినప్పుడు (గాయని) జానకమ్మ ‘అదేంటీ.. అక్కడ నవ్వాలి కదా.. ఎందుకు నవ్వలేదు’ అంటే, ‘అమ్మా.. నవ్వాలంటే నాకు సిగ్గనిపించింది’ అంటే ఆమె ఒక సలహా ఇచ్చారు. ‘నీకు అంతగా బిడియంగా ఉంటే నీ ముందూ వెనకాల ఎవరూ లేరనుకో. నువ్వూ, మైక్ మాత్రమే ఉన్నట్లుగా భావించుకో’ అన్నారు. అప్పటి నుంచి అలాగే చేయడం మొదలుపెట్టాను. ఇప్పటికీ కొంచెం సిగ్గుపడతాను కానీ ముందు ఉన్నంత కాదు. ఇళయరాజా సార్ కంపోజిషన్‌లో ‘వనజ – గిరిజ’లో ‘ఒత్తయిలే నిన్నదెన్న ఎన్ మన్న వనే’ అనే పాట, ‘సతీ లీలావతి’లో ‘మారుగో మారుగో మారూగయీ’ పాటలు పాడినప్పుడు ‘ఇవి నీ టైప్ పాటలు కాదు. నేనిక్కడుంటే నువ్వు పాడవు’ అని వెళ్లిపోయారు. ‘మారుగో..’లో కోవై సరళలా డైలాగ్ చెప్పాలి. ఆ పాటలో ఆవిడ ఉంటారు. ఆ వాయిస్‌ని మ్యాచ్ చేయాలని చెప్పి రాజా సార్ వెళ్లిపోయారు. ఆ పాటలు బాగా పాడాను.
జానకమ్మతో...
– డి.జి. భవాని
Comments
Please login to add a commentAdd a comment