‘‘ఒక నటుడికి తాను సంపాదించే డబ్బు ముఖ్యం కాదు. జనాలు గుర్తుపట్టి పలకరించినప్పుడు, నటించిన సినిమాల్లోని పాత్రల పేరుతో పిలిచినప్పుడు ఎంతో సంతృప్తిగా ఉంటుంది. ప్రేక్షకుల గుర్తింపే పెద్ద అవార్డుతో సమానం’’ అని నటుడు ఆనంద చక్రపాణి అన్నారు. ‘దాసి’ (1988) సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు ఆనంద చక్రపాణి. ఆ తర్వాత సరైన అవకాశాలు లేక ఇండస్ట్రీ నుంచి వ్యాపారం వైపు వెళ్లిన ఆయన ‘మల్లేశం’ (2019) సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌ని ్రపారంభించారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఆనంద చక్రపాణి ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు.
⇒
నా తొలి చిత్రం ‘దాసి’. ఆ తర్వాత ఐదారు సినిమాల్లో నటించినప్పటికీ సరైన గుర్తింపు రాలేదు. పైగా కొత్త అవకాశాలేవీ రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. దీంతో ఇండస్ట్రీని వదిలి అడ్వర్టైజింగ్ ఫీల్డ్‌కి వెళ్లి, కొన్ని యాడ్ ఫిలింస్‌కి స్క్రిప్ట్ రాయడంతో పాటు దర్శకత్వం వహించాను. ‘మల్లేశం’ సినిమాకు ప్రోడక్షన్ డిజైనర్‌గా చేసిన లక్ష్మణ్ యేలేగారి ద్వారా ఆ సినిమాలో నటించే చాన్స్ వచ్చింది. అందులో హీరో ప్రియదర్శి తండ్రి పాత్ర చేశాను.
నా పాత్రకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. నా నటన సినీ ప్రముఖులను, సినీ విమర్శకులను, సాధారణ ప్రేక్షకుడిని సైతం భావోద్వేగానికి గురి చేసింది. నా కెరీర్‌కి ఆ మూవీ ఓ మలుపులా ఉపయోగపడింది. నా జీవితం ‘మల్లేశం’కు ముందు.. ‘మలేశం’కు తర్వాత అని చెప్పుకోవాలి. నాకు ఆ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాత రాజ్ రాచకొండకు రుణపడి ఉంటా.
⇒
‘మల్లేశం’ తర్వాత ‘వరల్డ్ ఫేమస్ లవర్, అనగనగా ఓ అతిథి, విరాట పర్వం, లవ్ స్టోరీ, నాంది, వకీల్ సాబ్, టైగర్ నాగేశ్వరరావు... ఇలా దాదాపు 45 సినిమాల్లో నటించాను. ‘గెటప్’ శీను హీరోగా నటించిన ‘రాజు యాదవ్’ చిత్రం మే 24న విడుదలైంది. ఈ సినిమాలో హీరో తండ్రిగా ట్యాక్సీ డ్రైవర్ రాములు పాత్ర చేశాను. ఇందులోని భావోద్వేగ సన్నివేశాల్లో నా నటన ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది. నా కెరీర్‌లో ‘మల్లేశం, అనగనగా ఓ అతిథి, రాజు యాదవ్’ చిత్రాలు ఎంతో ప్రత్యేకం. ‘మల్లేశం, అనగనగా ఓ అతిథి’ చిత్రాలకు మించిన గుర్తింపు ‘రాజు యాదవ్’తో వచ్చింది.
⇒
ఒకే తరహా పాత్రలు కాకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేయాలని ఉంది. ‘ఆనంద చక్రపాణి మంచి నటుడు. ఏ పాత్రకి అయినా న్యాయం చేయగలడు’ అని ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల వారి నుంచి అనిపించుకోవాలన్నదే నా లక్ష్యం. ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలు చేస్తున్నాను. ‘షష్టి పూర్తి’ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌గారి ఫ్రెండ్‌గా నటిస్తున్నాను. అలాగే నిఖిల్ సిద్ధార్థ్ ‘స్వయంభూ’తో పాటు ‘గాంధీ తాత చెట్టు, ఉరుకు పటేలా’ తదితర చిత్రాల్లో నటిస్తున్నాను. ‘గాంధీ తాత చెట్టు’ చిత్రంలో నా పాత్రకి ఎంతో ్రపాధాన్యం ఉంటుంది. అదే విధంగా మరికొన్ని సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment