అమ్మాయిలూ, అబ్బాయిలూ ఫెండ్‌షిప్ చేయరా?
కౌర్ కౌర్ మే కహానీ. హిందీలో కౌర్ అంటే ముద్ద. చార్మి కౌర్ మనకు తినిపించే ప్రతి సినిమా ముద్దలో ఒక విషయం ఉంటుంది. బెరుకు ఉండదు... ఆమె నడిపే బుల్లెట్‌కి బ్రేక్ ఉండదు.
గుండెలో ఉన్న మాటకి స్పీడ్‌బ్రేకర్ ఉండదు.
అడగడమే తరువాయి గన్‌షాట్‌లా సమాధానం వచ్చేస్తుంది.
‘జ్యోతిలక్ష్మీ’ ఆడియో రిలీజ్‌కి ముందు సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూ.... ఎక్స్‌క్లూజివ్‌లీ మీకోసం...
♦ లైఫ్ ఎలా ఉందండీ? మీ పేరుకు తగ్గట్టుగా చార్మింగ్‌గా ఉందా?
చార్మి: అలానే ఉంది. ఇంకా చెప్పాలంటే కొత్త కొత్తగా ఉంది. చేతి నిండా పని. ప్రొడ్యూసర్ రోల్ అంటే మాటలా మరి! సినిమా నిర్మాణం, నిర్మాణానంతర కార్యక్రమాలు... ఇలా ప్రతిదీ దగ్గరుండి చూసుకోవాలి కదా!
♦ మరి, నిర్మాతగా కష్టమనిపించడం లేదా?
కాస్త కష్టమే. కథానాయికగా చేసిన ఈ పదమూడేళ్లూ చాలా సుఖంగా బతికేశానని ఇప్పుడనిపిస్తోంది. చెప్పిన టైమ్‌కి షూటింగ్‌కి రావడం, యాక్ట్ చేయడంతో బాధ్యత అయిపోయేది. ఇప్పుడలా కాదు. బోల్డంత స్ట్రెస్. కానీ, ఇది కూడా కిక్కిస్తోంది. ఎంజాయ్ చేస్తున్నా.
♦ అసలు ‘జ్యోతిలక్ష్మీ’ చేయాలని ఎందుకనుకున్నారు?
ఓ నాలుగైదేళ్లుగా నేను, పూరి (పూరి జగన్నాథ్) గారు ఈ సినిమా గురించి అనుకుంటున్నాం. ‘ప్రతిదీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి’ అని నిర్మాణం బాధ్యత మొత్తం నా మీదే పెట్టేశారు పూరిగారు. నాలాంటి కొత్త నిర్మాతను నమ్మి, బాధ్యత మొత్తం ఇచ్చేయడం చిన్న విషయం కాదు.
♦ పూరి మిమ్మల్ని అంతలా ఎందుకు నమ్మారు?
(నవ్వుతూ...) నా టైమ్ బాగుండి నమ్మారు. ఈ సినిమా ఆరంభించినప్పట్నుంచీ పూర్తయ్యేవరకూ, నన్ను ఏ విషయంలోనూ ఆయన ప్రశ్నించలేదు. ‘నువ్వు బాగా చేస్తావని నాకు తెలుసు’ అనేవారు.
♦ ఇప్పటివరకు పూరి జగన్నాథ్ ఎంతోమంది హీరోయిన్స్‌తో సినిమాలు చేశారు. ఆయన దర్శకత్వంలో ఒకే ఒక్క సినిమా (హిందీ చిత్రం ‘బుడ్డా హోగా తేరా బాప్’) చేసిన మీతో అంత అనుబంధం ఎలా కుదిరింది?
కొన్ని కొన్ని అలా కుదిరిపోతాయ్. వాటికి కారణాలు చెప్పలేం. కానీ, పూరీగారితో ఈ అనుబంధం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎంత పెద్ద దర్శకుడో చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆయన చేతిలో చాలా సినిమాలున్నాయి. చిరంజీవిగారు, మహేశ్‌బాబు.. ఇలా వరుసగా స్టార్స్‌తో సినిమాలున్నాయి. అసలు భవిష్యత్తులో ఆయనకు నేను గుర్తుంటానో లేదో కూడా చెప్పలేం. అలాంటిది నాకు ఇప్పుడు డేట్స్ ఇచ్చారంటే నా మీద ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు.
♦ అంతగా నమ్మిన పూరి.. నిర్మాతగా మీ పనితీరు చూసి ఏమన్నారు?
ఏడు నెలల నుంచి ఈ సినిమాతో ట్రావెల్ అవుతున్నా. స్టోరీ సిట్టింగ్స్ నుంచి ఎడిటింగ్ వరకూ అన్ని విషయాల్లోనూ లీనమయ్యా. ‘పూరీ గారు, సి.కల్యాణ్‌గారు చాలా బాగా చేస్తున్నావ్’ అని అభినందించారు.
♦ జ్యోతిలక్ష్మీ పాత్ర కోసం బాగా సన్నబడినట్లున్నారు. ఆల్‌మోస్ట్ ఫుడ్ త్యాగం చేసేశారా ఏంటి?
పది నుంచి పదకొండు కిలోలు తగ్గాను. కానీ, త్యాగాలేవీ చేయలేదు. నచ్చినవన్నీ తిన్నా. కాకపోతే మితంగా తిన్నా. ప్రతిరోజూ వర్కవుట్స్ చేశా. అలా బరువు తగ్గడానికి నాకు నాలుగు నెలలు పట్టింది.
♦ ‘ప్రేమ ఒక మైకం’లో వేశ్యగా చేసిన మీరు, ఈ చిత్రంలో కూడా ఆ పాత్రే చేశారేం?
అయితే ఏంటండీ? ఒక సినిమాలో లవర్‌గా నటించాక మరో సినిమాలో కూడా ఆ పాత్ర చేస్తాం కదా! అలాగే, భార్య పాత్ర, తల్లి పాత్రలు రిపీట్ అవుతూనే ఉంటాయి. కానీ, వేశ్య పాత్రను మాత్రం రిపీట్ చేస్తే, ‘ఎందుకు మళ్లీ చేశారు?’ అనడుగుతారు. కథ, పాత్ర కుదిరినప్పుడు చేస్తే తప్పేంటి? అయితే, ఆ సినిమాలోని పాత్రకూ, ఈ సినిమాలోని పాత్రకూ అస్సలు పోలికే ఉండదు.
♦ వేశ్య పాత్ర చేయనున్నానని చెప్పినప్పుడు మీ అమ్మగారు ఎలా రియాక్ట్ అయ్యారు?
మా అమ్మగారిది చాలా బ్రాడ్ మైండ్. ప్రొఫెషన్‌కి న్యాయం చేసే దిశలో నేనెలాంటి పాత్రలు చేసినా కాదనరు. నేను తీసుకునే నిర్ణయాల మీద ఆమెకు చాలా నమ్మకం ఉంది. ఒకవేళ నా నిర్ణయం ఎప్పుడైనా తప్పయ్యిందనుకోండి... మళ్లీ ఆ తప్పు చేయనని కూడా నమ్ముతుంది.
♦ ఈ మధ్య వరుసగా సినిమాలు చేయకుండా వెనకబడిపో తున్నారేం?
నా కెరీర్ నా ఇష్టం. ఏదో రేస్‌లో ఉండాలి కాబట్టి, వరుసగా సినిమాలు చేయాలనుకోను. అసలు నేను రేస్‌లోనే ఉండదల్చుకోలేదు. మనసుకు నచ్చిన సినిమాలొస్తే చేస్తా.. లేకపోతే లేదు. ఈ మధ్యకాలంలో చాలా కథలు విన్నాను. ఏదీ నచ్చలేదు. ‘జ్యోతిలక్ష్మీ’ నచ్చింది కాబట్టి చేశా.
♦ ఇటీవల ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలకే పరిమితమవుతున్నారు. విజయశాంతికి రీప్లేస్‌మెంటా?
విజయశాంతిగారిని ఎవరూ రీప్లేస్ చేయలేరు. ఇక, ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ అంటారా? నేను కావాలని సెలెక్ట్ చేయడం లేదు. వస్తున్నాయి కాబట్టి, చేస్తున్నాను. ఆ మాటకొస్తే, నా లైఫ్‌లో నేనేదీ ప్లాన్ చేయను. ఏది బెస్ట్ అనిపిస్తే, అది చేసుకుంటూ వెళ్లిపోతా.
♦ మీ లైఫ్‌లో పూరి జగన్నాథ్, కృష్ణవంశీ లాంటి దర్శకులు చాలా స్పెషలేమో అనిపిస్తోంది. ఆడ, మగ స్నేహాన్ని అంగీకరించేంతగా మన సమాజం ఇంకా ఎదగలేదు. అసలు వాళ్లతో మీ అనుబంధాన్ని ఎలా విశ్లేషిస్తారు?
ఓ కాల్ సెంటర్‌ని తీసుకుందాం. అక్కడ పని చేసే అమ్మాయిలూ, అబ్బాయిలూ స్నేహంగా ఉండరా? సాఫ్ట్‌వేర్ గురించి మాట్లాడుకుందాం. అక్కడి అమ్మాయిలూ, అబ్బాయిలూ ఫ్రెండ్‌షిప్ చేయరా? అలాగే మా సినిమా రంగం కూడా! ఆడ, మగ స్నేహం గురించి సొసైటీ ఏమనుకుంటుందో నాకు తెలియదు కానీ, నా వరకు నాకు అందులో తప్పు లేదు. పూరీగారు, కృష్ణవంశీగారు నాకు మంచి స్నేహితుల్లాంటివాళ్లు.
♦ దేవిశ్రీప్రసాద్‌తో కూడా మీరు చాలా స్నేహంగా ఉంటారు కదా?
దేవి నాకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్. వాళ్ల అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు కూడా నాతో క్లోజ్‌గా ఉంటారు. దేవి మంచి హ్యూమన్ బీయింగ్. నా లైఫ్‌లో వచ్చిన అప్స్ అండ్ డౌన్స్ అన్నీ దేవికి తెలుసు. నేను డౌన్‌లో ఉన్నప్పుడు తను సపోర్ట్‌గా నిలిచాడు. అది జీవితాంతం గుర్తుంటుంది.
♦ మీరు ఎవరితోనైనా లవ్‌లో...?
అవును. ‘జ్యోతిలక్ష్మీ’తో లవ్‌లో ఉన్నాను. ప్రస్తుతం నేను ఏడ్చినా, నవ్వినా.. అంతా ‘జ్యోతిలక్ష్మీ’కి సంబంధించే!
♦ ఈ మధ్య మీ అన్నయ్య పెళ్లి చాలా ఘనంగా చేశారు. మరి మీ పెళ్లి గురించి ఆలోచించడం లేదా?
లేదు. అసలు పెళ్లి చేసుకునే మూడ్‌లోనే లేను. ఈ ఏడాది కాదు కదా... మరో రెండేళ్ల వరకూ దాని గురించి ఆలోచించే ప్రసక్తే లేదు.
♦ మీరు కొంచెం రెబల్‌గానే ఉంటారనిపిస్తోంది?
(నవ్వుతూ...) ఆ రోజు మూడ్ ఎలా ఉంటే అలా! సందర్భాన్ని బట్టి రియాక్ట్ అవుతుంటాను. అయితే ఒక్క విషయం స్పష్టంగా చెబుతా. నేను సున్నిత మనస్కురాల్ని మాత్రం కాదు. రెబల్ అవ్వాల్సిన చోట తప్పకుండా అవుతా.
♦ నిర్మాతగా కొనసాగుతారా? స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తారా?
నిర్మాతగా కొనసాగాలనే ఉంది. చూద్దాం. కానీ, స్టార్ హీరోలతో సినిమా చేయాలంటే... డేట్స్ అంత ఈజీగా దొరుకుతాయా?
♦ చార్మి అడిగితే ఇవ్వరా?
డేట్స్ ఖాళీ లేకపోతే ఎవరడిగినా ఇవ్వరు. ‘జ్యోతిలక్ష్మీ’ సినిమా సెట్ అయినంత సులువుగా అన్నీ సెట్ అవుతాయా? ఒకవేళ సెట్ అయితే హ్యాపీనే!
♦ మీరు నిర్మించే చిత్రాల్లో మీరే నటిస్తారా? బయటి హీరోయిన్లతో చేస్తారా?
తప్పకుండా వేరేవాళ్లతో చేస్తా!
♦ మీలాంటి తారలు నిర్మాతలుగా కూడా కొనసాగితే, ‘ఆడవాళ్లు ఏమైనా చేయగలరు’ అని నిరూపించినట్లవుతుంది!
(మధ్యలోనే అందుకుంటూ...) అవునండీ. నాక్కూడా ఆ ఫీలింగ్ ఉంది. ఆడవాళ్లు ఎందులోనూ తక్కువ కాదు. అందుకే, సాధ్యమైనంతవరకూ నేను నిర్మాతగా కంటిన్యూ అవుతా.
♦ చిరంజీవి 150వ సినిమాలో మీరు నటిస్తారనే టాక్ వినిపిస్తోందే!?
వినపడనివ్వండి. మంచిదే కదా!
♦ ఇంతకీ ఆ సినిమాలో మీరు ఉన్నారా? లేరా?
అది చెప్పను. టాక్ వినిపిస్తోంది కదా.. వింటూ ఉండండి (నవ్వుతూ).
♦ ఈ మధ్య హిందీలో సూపర్ హిట్ అయిన ‘క్వీన్’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ వంటి చిత్రాలు చూశారా? వాటిని తెలుగులో రీమేక్ చేస్తే నటిస్తారా?
ఆ సినిమాలు చూశాను. కంగనా యాక్టింగ్ సూపర్బ్. ఒకవేళ ఆ చిత్రాల తెలుగు రీమేక్‌కు అవకాశం వస్తే తప్పకుండా చేస్తా.
♦ ఫైనల్‌గా మీ అందం వెనుక సీక్రెట్ చెబుతారా?
ఏమీ లేదండీ... హ్యాపీగా ఉంటా. మనసులో ఒకలా బయటికి ఇంకోలా ఉండను. ఓపెన్ మైండెడ్‌గానే ఉంటా. ఆరోగ్యానికి మంచివనిపించేవన్నీ తింటా. చక్కగా వ్యాయామాలు చేస్తా.
- డి.జి. భవాని