అప్పుడు ఆ మేడ మెట్లే నాకు నీడ అయ్యాయి! | Yechury chalapathi rao IS Senior artist | Sakshi
Sakshi News home page

అప్పుడు ఆ మేడ మెట్లే నాకు నీడ అయ్యాయి!

Published Sat, Jul 5 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM

ఏచూరి చలపతిరావు

ఏచూరి చలపతిరావు

బిహైండ్ ది రీల్  ఏచూరి చలపతిరావు
చెన్నైలోని కోడంబాకం... ఫుల్ బిజీ ఏరియా. కార్లు.. బస్సులు... ఆటోలు. ఈ ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించుకుంటూ ఓ 74ఏళ్ల ముసలాయన.. సారీ.. యువకుడు సైకిల్ మీద సవారీ చేస్తూ కనిపిస్తే కచ్చితంగా ఆయన ఏచూరి చలపతిరావే.
 

ఏచూరి గురించి ఏం చెప్పాలి? స్టార్ జర్నలిస్ట్ అనాలా! సీనియర్ ఆర్టిస్టు అని చెప్పాలా!
62ఏళ్ల హిస్టరీ ఆయనది.. తెలుగు సినిమా చరిత్ర టకీటకీమని చెప్పేయగలరు. దాదాపు వెయ్యి సినిమాల్లో యాక్ట్ చేశారు. కానీ, ఏం లాభం? నో బ్యాంక్ బ్యాలెన్స్... నో ఫ్లాట్. పాతకాలం సైకిలే ఆయనకు మిగిలిన ఆస్తి. ఉంటున్నది రెండు గదుల అద్దె ఇల్లు. అద్దె నాలుగువేలు, కరెంటు బిల్లు వెయ్యిరూపాయలు. 97ఏళ్ల తల్లి... 73ఏళ్ల భార్యతో ఆ ఇంట్లోనే ఏచూరి రోజులు నెట్టుకొస్తున్నారు... తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ‘అమ్మ క్యాంటీన్’ ఆయన పాలిట అక్షయపాత్ర.

రూపాయికి ప్లేటు ఇడ్లీ... ఐదు రూపాయలకు పొంగల్. పెరుగన్నం... సాంబారన్నం ఖరీదు కూడా ఐదు రూపాయలే. ఇంట్లో ఆడవాళ్లకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆహారానికి అమ్మ క్యాంటీనే ఆసరా. మరి... నెలసరి ఖర్చులకు ఏచూరి ఏం చేస్తారు?.. ఎవరి దగ్గరా చెయ్యి చాచరు.. ఎవరికీ తలవొంచరు. ‘‘ఆ పరిస్థితే వస్తే చావడానికైనా రెడీ. ఆత్మాభిమానాన్ని వదులుకోను’’ అన్నారు ఏచూరి.

ఆరోగ్యం బాగాలేకపోతే తేజ ఆసుపత్రి అధినేతలు డా. నండూరి విజయసారధి, డా. సరోజిని వైద్యం చేస్తారని ఏచూరి చెప్పారు. పాత్రికేయుల్లో ఇంటూరి వెంకటేశ్వరరావు తన గురువని, కంపెల్ల రవిచందర్ మిత్రుడని, బీఏ రాజు, జయ చేసిన సహాయం మర్చిపోలేనిదని ఏచూరి చెప్పారు. నాటి తరం నటుల్లో ఏచూరికి తెలియనివాళ్లు లేరు.

ఎన్టీఆర్, ఎస్వీఆర్‌ల అభిమానం పొందిన వ్యక్తి. శోభన్‌బాబుతో ఒకే కంచం, ఒకే మంచం తరహా స్నేహం... కృష్ణ, కృష్ణంరాజు... ఇలా ఎంతోమంది ఏచూరిని ఇష్టపడతారు. దాసరి నారాయణరావు, మోహన్‌బాబు, కె. బాపయ్య, శారద, గీతాంజలి, ఎమ్మెస్ రాజు వంటివారు పంపించే డబ్బే జీవనాధారం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, సాయిబాబా ట్రస్ట్ నుంచి ఆర్థిక సహాయం అందుతుంది.
 అసలు ఏచూరి జీవిత విశేషాలేంటి? విలేకరి నుంచి నటుడిగా ఎందుకు మారారు? ఆ విషయాలు తెలుసుకుందాం...
 
1940 నవంబర్ 13న కోనసీమలోని మాగాం గ్రామంలో పుట్టారు ఏచూరి. ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదువుకున్నారు. రాజబాబు, మాడా ఈయన క్లాస్‌మెట్స్. ఏచూరికి సినిమాలంటే పిచ్చి ప్రేమ. వచ్చిన ప్రతి సినిమా చూసి, వాటి గురించి కథనాలు రాయడం... విమర్శనాత్మక కథనాలు బోల్డన్ని. అన్నిటికీ అభినందనలే. ఇక, సొంత ఊళ్లో ఉంటే ఆర్థికంగా ఇబ్బందులపాలు కాక తప్పదని, పన్నెండేళ్ల వయసులోనే మద్రాసు వెళ్లారు.

అప్పటికే ఏచూరి రాసిన కథనాలకు మంచి గుర్తింపు రావడంతో విలేకరిగా అవకాశం వచ్చింది. అయితే మద్రాసులో ఎక్కడ ఉండాలి?... ‘‘అప్పటిమోడర్న్ థియేటర్ మెట్లే కొండంత నీడ అయ్యాయి’’ అన్నారు ఏచూరి. చాలీచాలని జీతం.. కడుపునిండా భోంచేసిన రోజులు చాలా తక్కువ. కానీ, ప్రశంసలకు కొరత లేదు. ‘భేష్.. ఉన్నది ఉన్నట్లు నిక్కచ్చిగా రాస్తున్నావు’ అని అభినందించినవారూ ఉన్నారు. ఆగ్రహించినవాళ్లూ లేకపోలేదు. ఒకసారి ఏదో కథనం రాస్తే... ఎన్టీఆర్, ఏయన్నార్ అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తే, శోభన్‌బాబు, కృష్ణ అభిమానులు ఏచూరిని వెనకేసుకొచ్చారు.

కళాకారులకు అభిమానులుంటారు కానీ, ఓ విలేకరి అభిమానులను సంపాదించుకోవడం గ్రేటే...
ఓ రోజు.. ‘ఏరా ఇలా విలేకరిగా కొనసాగితే ఇక ఎప్పటికీ సంపాదించలేవు.. ఆర్టిస్ట్‌గా ట్రై చేయి’ అని ఎస్వీఆర్ సలహా ఇచ్చారు. అది ఏచూరికి నచ్చింది. అంతే.. ఒకవైపు రచన, మరోవైపు నటనతో ఫుల్ బిజీ అయ్యారు. తెలుగులో తొలి సినిమా ‘కనకదుర్గ పూజా మహిమ’. కమలాకర కామేశ్వరరావు, విఠలాచర్య, దాసరి నారాయణరావు, ముత్యాల సుబ్బయ్య, పోకూరి బాబూరావు తదితరులు అవకాశాలిచ్చి ప్రోత్సహించారు.

కన్నడంలో ‘మహా కబీరు’ అనే చిత్రంలో యాచకుడిగా చేశారు. ఆ పాత్రలో నిజమైన యాచకుడేమో అనుకునేలా ఒదిగిపోయారు ‘‘అది సినిమా కోసం వేసిన వేషం. నిజజీవితంలో దుర్భరమైన పరిస్థితులు చవి చూసినా, ఎవరి దగ్గరా చెయ్యి చాపలేదు’’ అన్నారు ఏచూరి. ఆ మధ్య విడుదలైన ‘సుడిగాడు’ వరకూ ఆయన చేసిన సినిమాలు దాదాపు వెయ్యి. ‘‘అన్ని సినిమాలు చేసినా సహాయ నటుణ్ణి కాబట్టి పారితోషికం తక్కువ. అందుకే, ఏమీ సంపాదించుకోలేకపోయా’’ అన్నారు ఏచూరి.
 
ఓసారి కృష్ణ అయితే.. ‘‘నాతో పాటు ఉందువుగానీ.. నా వ్యవహారాలన్నీ చూసుకుందువుగానీ వచ్చెయ్’’ అన్నారట. ‘‘అదే చేసి ఉంటే ఈపాటికి ఓ మేడ, పడవలాంటి కారు ఉండేవేమో.. అంతా జాతకం’’ అన్నారు ఏచూరి. అన్నట్లు.. ఏచూరి జాతకం కూడా చెబుతారు. 20ఏళ్ల క్రితమే ఆంధ్ర రాష్ట్రం విడిపోతుందని, వైజాగ్‌లో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేస్తే మంచిదని చెప్పారు. నక్షత్రం చెబితే చాలు.. మన జీవితం చెప్పేస్తారు.

అందరి జాతకం చెప్పే ఏచూరి.. ఇటీవల తన జాతకాన్ని తిరగేశారు. షాక్‌లాంటి నిజం తెలిసింది. ‘‘వచ్చే ఏడాదిన్నర, రెండేళ్లల్లో మా ఇంట్లో ఏదో అశుభం జరగనుంది. అది మరణానికి సంబంధించినది’’ అని చెప్పారు ఏచూరి. బహుశా ఆయన తల్లికి 97ఏళ్లు కాబట్టి.. ఆవిడకే ఏదైనా... అని ఊహించుకోవచ్చు. కానీ.. అది కాదు..
 
‘‘నా జీవితం మరో ఏడాదిన్నర, రెండేళ్లలోపు ముగుస్తుంది’’ అని సింపుల్‌గా చెప్పారు. ఇప్పటివరకు ఏచూరి చెప్పిన జాతకాలన్నీ దాదాపు నిజమయ్యాయట. ఈసారి నిజం కాకపోతే ఎంత బావుంటుందో కదా!       
- డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement