అందుకనే ఆయనతో పెళ్లికి ఒప్పుకున్నా! | Actor Meena chit chat with DG Bhavani | Sakshi
Sakshi News home page

అందుకనే ఆయనతో పెళ్లికి ఒప్పుకున్నా!

Published Sun, Jul 13 2014 12:33 AM | Last Updated on Tue, Oct 2 2018 3:16 PM

అందుకనే ఆయనతో పెళ్లికి ఒప్పుకున్నా! - Sakshi

అందుకనే ఆయనతో పెళ్లికి ఒప్పుకున్నా!

మీనా నవ్వితే... పూసింది పూసింది పున్నాగ!
మీనా మాట్లాడితే... రేపల్లె మళ్లీ మురళి విన్నది!
మీనా కవ్విస్తే... ఎన్నెన్నో అందాలు.. ఏవేవో రాగాలు!
మీనా కెరీర్‌లో ఎన్ని హిట్టు పాటలున్నాయో...
ఎన్ని హిట్టు సినిమాలున్నాయో... నిజంగా మీనా కెరీర్... ఓ సుందరకాండ!
బాలనటిగా మొదలుపెట్టి... దక్షిణాదిలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన మీనా పెళ్లి తర్వాత సినిమా కెరీర్‌కు కామా పెట్టారు.
ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. చాలా రోజుల తర్వాత ‘దృశ్యం’తో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇక వరుసగా సినిమాలు చేస్తానంటున్న మీనా చెప్పిన సంసారం ముచ్చట్లు, కెరీర్ కబుర్లు...
 
పెళ్లయిన తర్వాత సినిమాలు చేయడం చాలా తగ్గించేశారు... ఎందుకని?
మీనా: దాదాపు మూడు, నాలుగేళ్లు మాత్రమే సినిమాలు చేయలేదు. ఆ నాలుగేళ్లూ మావారే నాకు మంచి కంపెనీ. రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. ఏది నచ్చితే అది చేసేంత తీరిక. నిజం చెప్పాలంటే నేను జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టింది పెళ్లి తర్వాతే. అప్పటివరకు పరిగెత్తి పరిగెత్తి సినిమాలు చేశాను. దాంతో పెళ్లి తర్వాత రిలీఫ్‌గా అనిపించింది.     

మీ శ్రీవారి గురించి చెబుతారా?
మీనా:
మావారి పేరు విద్యాసాగర్. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. మా ఇద్దరి మనస్తత్వాలూ ఒకటే. నాకు సరదాగా ఉండటం ఇష్టం. ఆయనకు కూడా అంతే. అయితే నాకన్నా నాలెడ్జబుల్ పర్సన్. నాకు తెలియని ఎన్నో విషయాలను ఆసక్తిగా చెబుతుంటారు. ఆయన దగ్గర నాకు నచ్చిన విషయాల్లో అదొకటి.

మీది ప్రేమ వివాహమా?
 మీనా: అదేం కాదు కానీ, ఇద్దరికీ ముందే పరిచయం ఉంది. ఇద్దరి కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిశాం. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం. అయితే, పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆ సమయంలో మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మా అమ్మే ఆయన ప్రస్తావన తీసుకొచ్చింది. ఆయ నను వద్దనుకోవడానికి కారణాలేవీ కనిపించలేదు. అందుకని ఒప్పుకున్నా.

పెళ్లి తర్వాత మీ జీవితంలో ఏమైనా మార్పులొచ్చాయా?
మీనా: మార్పంటే.. నాకు నేనుగా కొన్ని నిబంధనలు పెట్టుకున్నాను. ఒక దశ తర్వాత మన ప్రాధాన్యతలేంటో మనకు తెలిసిపోతాయ్. అలాగే, సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తున్నా. బయటకు నేను పెద్ద స్టార్‌ను కావచ్చు. ఇంట్లో మాత్రం సాదాసీదా అమ్మాయినే. భార్యగా, తల్లిగా మిగతా ఆడవాళ్లు తమ బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తారో నేనూ అంతే.

పదిహేను, ఇరవయ్యేళ్లు బిజీగా సినిమాలు చేశారు కదా.. ఒక్కసారిగా ‘జాబ్ లెస్’ గా ఉండడం బాధగా అనిపించలేదా?
మీనా: మొదట్లో అంత తీరిక బాగానే ఉన్నా, ఆ తర్వాత మాత్రం ఏదో ఒక వ్యాపకం లేకుండా ఉండలేం అనిపించింది. నా భర్త, పాపకు తగిన సమయం కేటాయిస్తూనే, అడపా దడపా సినిమాలు చేయాలనుకున్నాను.

భార్య, తల్లి... బాధ్యతలు ఎలా అనిపిస్తున్నాయి?
మీనా: చెప్పాలంటే పెళ్లయిన తర్వాత బాధ్యతలు పెరిగాయి. జీవితం గురించి బోల్డన్ని విషయాలు తెలిశాయి. ఇక, అమ్మ అయిన తర్వాత అయితే జీవితం ఇంకా అద్భుతంగా ఉంది. మా పాప పేరు నైనిక. పాపకు మూడేళ్లు వచ్చేశాయి. మాటలు రాకముందు తనెందుకు ఏడుస్తుందో తెలియక సతమతమయ్యేదాన్ని. ఇప్పుడు ఫరవాలేదు. ఇవన్నీ చూశాక, నన్ను పెంచడానికి మా అమ్మ ఎంత కష్టపడి ఉంటుందో అనిపించింది. ‘నేను కరెక్ట్‌గానే పెంచుతున్నానా’ అని అమ్మను చీటికీ మాటికీ అడుగుతుంటాను. పాపకు ఏం తినిపించాలి? ఎలాంటి దుస్తులు వేయాలి.. ఇలా అన్ని విషయాల్లోనూ నాకు టెన్షనే.

షూటింగ్స్‌లో పాల్గొంటున్నప్పుడు మీ అమ్మాయిని మిస్ అయిన ఫీలింగ్ కలగదా.. మిమ్మల్ని సినిమాల్లో చూసి తనెలా స్పందిస్తుంది?
మీనా: నాతో పాటు షూటింగ్స్‌కు తీసుకెళ్లిపోతుంటాను. ఒకవేళ ఇంట్లో వదిలి వెళితే నాకు మనశ్శాంతిగా ఉండదు. టీవీలో నా సినిమాలొస్తే ‘అమ్మా... నువ్వే’ అని గుర్తుపడుతోంది. నేను విడిగా బయటికెళ్లినప్పుడు అందరూ గుర్తుపట్టి, ‘హాయ్ మీనాగారు’ అని పలకరిస్తారు. అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. కానీ, నా సొంత కూతురే నన్ను గుర్తుపడితే ఇక ఆ ఆనందం మాటల్లో చెప్పలేనంత.

మీ అమ్మా, నాన్నకు మీరొక్కరే కూతురు.. మీకు కూడా అంతేనా?
మీనా: (నవ్వుతూ) ఏమోనండి.. ఆ విషయం గురించి ఇప్పుడు ఆలోచించడం లేదు .

మీ మాతృభాష తమిళమనీ, కాదు తెలుగు అనీ చాలామంది అంటారు? అసలు మీ మాతృభాష ఏంటి?
మీనా: మా అమ్మగారు మలయాళీ. నాన్న గారు తెలుగువారు. నేను పుట్టి, పెరిగింది చెన్నయ్‌లోనే. ఇంట్లో ఎక్కువగా తమిళమే మాట్లాడతాం.

మీ కెరీర్ విషయంలో మీ అమ్మా, నాన్న సపోర్ట్ చాలా ఉంది కదా?
మీనా:
నాకు అన్ని విధాల అండ మా అమ్మే. ఏది ఒప్పో.. ఏది తప్పో వివరించి చెప్పేది. నాన్న సపోర్ట్ లేకపోతే అసలు నా కెరీర్ సాఫీగా సాగేది కాదు.

మీ అమ్మా, నాన్నకు మీరొక్కరే అమ్మాయి కాబట్టి, చాలా గారాబంగా పెంచారా?
మీనా:
ఎక్కడ స్ట్రిక్ట్‌గా ఉండాలో అక్కడ ఉంటారు. మిగతా సమయాల్లో మామూలుగా ఉంటారు.

మరి.. మీ మీరెలాంటి మదర్?
మీనా: మా అమ్మా, నాన్న నన్ను పెంచినట్లుగానే మా అమ్మాయిని నేను పెంచాలనుకుంటున్నా. అన్ని విషయాలూ నేర్పించి, మంచి గైడ్‌గా ఉండాలన్నది నా కోరిక. మా అమ్మా నాన్న తప్పొప్పులు చెప్పి, ‘నీకేది మంచి అనిపిస్తే అది చెయ్యి’ అనేవారు. మా అమ్మాయి విషయంలో నేనూ అదే చేస్తా.

మీ సినిమాల విషయంలో మీ భర్త జోక్యం ఎంతవరకూ ఉంటుంది?
మీనా:
ఆయన జోక్యం అసలు ఉండదు. ఎందుకంటే, నాకో పది అవకాశాలొస్తే నేనే రెండు, మూడు మినహా ఒప్పుకోవడం లేదు. పాత్రల ఎంపిక పరంగా నేనంత జాగ్రత్తపడుతున్న విషయం ఆయనకు తెలుసు. అందుకే, ఆయన ఇన్‌వాల్వ్ కారు.

ఓకే... ఇటీవల విడుదలైన ‘దృశ్యం’ విషయానికొద్దాం... మలయాళంలో మీరే చేసిన పాత్రను మళ్ళీ తెలుగులో చేసినప్పుడు ఎలా అనిపించింది?
మీనా: మలయాళ సినిమా అంతా అయ్యాక చూసినప్పుడు ‘ఇది బాగుంది కానీ, ఇంకా బెటర్‌గా చేసుండొచ్చు’ అనుకున్నా. ఇప్పుడు మళ్లీ తెలుగులో అదే పాత్ర చేస్తూ, ఆ బెటర్‌మెంట్ ఉండేలా చూసుకున్నాను.

గతంలో వెంకటేశ్‌తో ‘చంటి’, ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు. చాలా విరామం తర్వాత మళ్లీ ఆయనతో సినిమా చేయడం పట్ల మీ ఫీలింగ్?
మీనా:
వెంకీగారితో మళ్లీ యాక్ట్ చేయడం ఆనందం అనిపించింది. షూటింగ్ అంతా కూల్‌గా సాగింది. అయితే గతంలో నేనాయనతో సినిమాలు చేసినప్పుడు పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. అప్పట్లో నేను మితభాషిని. ఇప్పుడు చాలా మారాను.

మితభాషిని అన్నారు... ఎందుకని?
మీనా:
మద్రాసులోనే పెరిగినందువల్ల తెలుగు సరిగ్గా వచ్చేది కాదు. ఒకటి మాట్లాడబోయి ఇంకోటి మాట్లాడితే.. ఎవరి మనసైనా నొచ్చుకుంటుందేమో... అపార్థం చేసుకుంటారేమోనని భయం. కొంచెం అమాయకంగా కూడా ఉండేదాన్ని.. అభద్రతాభావం ఉండేది. అందుకని నా పనేంటో నేనేంటో అన్నట్లుగా ఉండేదాన్ని. కలుపుగోలుగా ఉంటే, అడ్వాంటేజ్ తీసుకుంటారేమోనని భయం. దాంతో పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. దానివల్ల ‘మీనాకు తలబిరుసుతనం’ అన్నవాళ్లు ఉన్నారు. వరుసగా సినిమాలు చేయడం మొదలుపెట్టాక నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎలాంటి పరిస్థితిని అయినా అధిగమించగలననే ధైర్యం ఏర్పడింది. ఆ తర్వాత కొంచెం మాట్లాడడం మొదలుపెట్టాను.

చిన్నప్పటి నుంచీ ఈ రంగంలో ఉన్నారు. ఏదైనా పశ్చాత్తాపపడాల్సిన సంఘటనలున్నాయా?
మీనా:
వ్యక్తిగతంగా ఏమీ లేవు. కానీ, డేట్స్ అడ్జస్ట్ చేయలేక కొన్ని మంచి సినిమాలు వదులుకున్నాను. అది మాత్రం ఎప్పటికీ బాధగా ఉంటుంది. నేను వదులుకున్న సినిమాల్లో ‘నరసింహ’లో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి పాత్ర ఒకటి. ఆ సినిమా అప్పుడు రజనీకాంత్ సార్ ఫోన్ చేసి, ‘నువ్వు చేస్తున్నావ్.. కంగ్రాట్స్’ అన్నారు. మా అమ్మకు ఆ పాత్ర అంత సంతృప్తిగా అనిపించలేదు. డేట్సూ లేవు. కారణాలేవైనా ఓ మంచి పాత్ర వదులుకున్నా. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నన్ను శివాజీ గణేశన్‌గారే పరిచయం చేశారు. ‘నరసింహ’లో ఆయన నటించిన విషయం తెలిసిందే.

ఒకవైపు శివాజీ సార్, మరోవైపు రజనీ సార్ నటించిన సినిమాను వదులుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతుంటా. అలాగే, కృష్ణవంశీ కంటిన్యూస్‌గా రెండు నెలలు డేట్స్ అడగడంతో ‘నిన్నే పెళ్లాడతా’ మిస్సయ్యా. అప్పుడు నాలుగు భాషల్లో సినిమాలు చేయడం వల్ల ఒక సినిమాకు వరుసగా 20 రోజులు డేట్స్ ఇవ్వడమే గగనంగా ఉండేది. అలాంటిది 2 నెలలా అని ఆలోచనలోపడ్డాను. కరెక్ట్‌గా ప్లాన్ చేసి చెప్పమని కృష్ణవంశీని అడిగితే ‘కరెక్ట్‌గా ప్లాన్ చేసే చెబుతున్నా.. రెండు నెలలు కావాల్సిందే’ అన్నారు. దాంతో వదులుకోక తప్పలేదు.

రజనీకాంత్‌తో బాలనటిగా చేసి, ఆయన పక్కనే హీరోయిన్‌గా చేశారు కదా.. ఎలా అనిపించింది?
మీనా: రజనీ సార్‌తో తమిళంలో ‘అన్బుళ్ల రజనీకాంత్’ సినిమా చేసినప్పుడు ఆయన నన్ను ఒళ్లో కూర్చోబెట్టుకుని ముద్దు చేసేవారు. నాకు బాగా నిద్ర వచ్చినప్పుడు, జో కొట్టేవారు కూడా. ఇక, నేను హీరోయిన్‌గా చేయడం మొదలుపెట్టిన తర్వాత దర్శకుడు ఆర్.వి. ఉదయ్‌కుమార్ ఒక కథ చెప్పి, రజనీగారి పక్కన యాక్ట్ చేయాలన్నారు. జోక్ చేస్తున్నారేమో అనుకున్నా. కానీ, ఆయన సీరియస్‌గానే చెబుతున్నారని తెలుసుకుని, ‘అసలు రజనీ సార్ నాతో చేస్తారా’ అన్నాను. కానీ, రజనీ సార్ కూడా చేస్తానన్నారట. వాస్తవానికి ఉదయ్‌కుమార్‌గారు ఆ సినిమాకు అడిగినప్పుడు, నేను తెలుగులో ఫుల్ బిజీ.

పైగా, ఉదయ్‌కుమార్‌గారు అడిగిన డేట్స్ కమల్ హాసన్‌గారి సినిమాకిచ్చాను. అందుకని, ‘ఇది జరగదులే’ అనుకున్నాను. ఓ రోజు ఏవీయం శరవణన్‌గారు ఫోన్ చేసి, ‘ఈ సినిమా చేయాలి’ అన్నారు. ఎలాగోలా డేట్స్ అడ్జస్ట్ చేసి ఇచ్చాను. అదే ‘ముత్తు’ సినిమా. మొదటిరోజు షూటింగ్ అప్పుడు రజనీ సార్‌తో ‘ఏం మాట్లాడాలి.. ఎలా మెలగాలి’ అని సతమతమయ్యాను. సూపర్‌స్టార్ పక్కన చేస్తున్నామన్న థ్రిల్ ఓ వైపు.. భయం మరోవైపు.. ఇలా చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండేదాన్ని. కొన్నిరోజుల తర్వాత అడ్జస్ట్ అయ్యాను.

శివాజీ గణేశన్‌తో బాలనటిగా చేశారు కదా.. ఆ అనుభవాలు గుర్తున్నాయా?
మీనా:
తమిళ సినిమా ‘నెంజంగళ్’ అది. శివాజీ సార్ చుట్టూ, నా చుట్టూనే ఆ సినిమా తిరుగుతుంది. అప్పుడు నా వయసు మూడున్నరేళ్లు ఉంటుందేమో. అసలు సినిమా అంటే ఏంటో తెలియదు. డైలాగ్స్ నేర్పించేవారు.. చెప్పేసేదాన్ని. ఈ షూటింగ్ అప్పుడు నాకు బాగా గుర్తున్న విషయం ఒకటి చెబుతాను. లంచ్ టైమ్‌లో శివాజీ సార్ గదికి వెళ్లిపోయేదాన్ని. ఎందుకంటే, ఆయనకు ఇంటి నుంచి చికెన్ 65 లాంటి వెరైటీలు వచ్చేవి. వాటి కోసం వెళ్లిపోయేదాన్ని. మా అమ్మేమో ‘రోజూ వెళితే బాగుండదు’ అని మందలించేది. దాంతో ఎప్పుడైనా ఒక రోజు వెళ్లకపోతే... శివాజీ సారే ‘ఏంటీ ఇవ్వాళ్ల రాలేదు.. రారా.. కలిసి భోంచేద్దాం’ అని పక్కన కూర్చోబెట్టుకుని, నేను తినేవరకూ ఊరుకునేవారు కాదు.

చిన్నప్పుడే సినిమాల్లోకి రావడం వల్ల చదువుకునే తీరిక చిక్కి ఉండేది కాదేమో?
మీనా:
ప్రైవేట్‌గా ఎం.ఏ హిస్టరీ చేశాను. అమ్మా, నాన్నకు చదువంటే ఇష్టం. వాళ్ల కోరిక తీర్చడం కోసమే చదువుకున్నాను. కానీ, సినిమాలు చేస్తూ, చదవడం అంత సులువు కాదు.

‘కర్తవ్యం’లో చిన్న పాత్ర చేశారు కదా..  వెంటనే హీరోయిన్ ఎలా అయ్యారు?
మీనా:
ఈతరం ఫిలింస్ పోకూరి బాబురావుగారు ఏదో సినిమాకి హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెలిసింది. నేను వెళితే స్క్రీన్ టెస్ట్ చేసి, తీసుకున్నారు. అలా హీరోయిన్‌గా తెలుగులో ‘నవయుగం’ నా తొలి సినిమా.

మీ కెరీర్‌లో కీలకంగా నిలిచిన ‘సీతారామయ్యగారి మనవరాలు’ జ్ఞాపకాలు...?
మీనా:
ముందు ఆ సినిమా చేయకూడదనుకున్నా. ఎందుకంటే అంతకుముందు చేసిన ‘నవయుగం’ పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత చేసిన ‘ప్రజల మనిషి’ కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దాంతో ఇక చదువుకుందామనుకున్నాను. అమ్మా, నాన్న కూడా అదే మంచిదనుకున్నారు. అప్పుడు హరిగారని ఓ అసిస్టెంట్ డెరైక్టర్ వచ్చి, క్రాంతికుమార్‌గారు ఓ సినిమా చేయాలనుకుంటున్నారని, నన్ను తీసుకోవాలనుకుంటున్నారని చెప్పారు.

మాకు ఇంట్రస్ట్ లేదని అమ్మ చెప్పింది. ‘ఈ ఒక్క సినిమా ట్రై చేయండి. చాలా మంచి కేరెక్టర్. ఓ తాత, మనవరాలి కాంబినేషన్‌లో జరిగే కథ. మీకు క్రాంతికుమార్‌గారి గురించి తెలియడం లేదు. చాలా గొప్ప డెరైక్టర్’ అన్నారు. సరేనని వెళ్లాం. కొద్దిగా మేకప్ వేసి, ఆ తర్వాత మేకప్ లేకుండా ఫొటోషూట్ చేసి, ఓకే అన్నారు. ‘అయ్యో.. ఓకే అయ్యిందా’ అనుకున్నా. కట్ చేస్తే ఆ సినిమా బాగా ఆడడం, నేను 200 చిత్రాల దాకా చేయడం జరిగిపోయాయి.

ఆ సినిమా సమయంలో అక్కినేని నాగేశ్వరరావుగారు సలహాలిచ్చేవారా?
మీనా: ‘మనం ఎవరి కోసమైనా వెయిట్ చేయొచ్చు.. మన కోసం ఎవరూ వెయిట్ చేయకూడదు’ అని ఏయన్నార్ గారు చెప్పారు. ఆయన నాకిచ్చిన మొదటి సలహా అది. ఆ సినిమా విడుదలైన తర్వాత... ‘లొకేషన్లో నువ్వు యాక్ట్ చేసినప్పుడు అంతగా అనిపించలేదు.  కానీ, సినిమాలో చూస్తే చాలా బాగానే యాక్ట్ చేశావ్ అనిపించింది’ అని మెచ్చుకున్నారు.

చివరిసారిగా నాగేశ్వరరావు గారిని ఎప్పుడు కలిశారు?
మీనా: చెన్నైలో గత ఏడాది జరిగిన వందేళ్ల భారతీయ సినిమా పండగకు అన్ని భాషలకు చెందిన వాళ్లూ వచ్చారు. చెన్నైలోనే ఏయన్నార్‌గారి పుట్టినరోజు వేడుక జరిగింది. ఆ వేడుకలో నేనూ పాల్గొన్నా. ఆయనను చూడడం అదే చివరిసారి. ఆయన నటించిన ఆఖరి చిత్రం ‘మనం’ ఇటీవల చూసినప్పుడు, కొద్దిగా ఎమోషనల్ అయ్యాను.

కథానాయికల కెరీర్ తక్కువ కాలం ఉంటుంది కదా. ఆ స్టార్ హోదా నుంచి పక్కకు రావాల్సొచ్చినప్పుడు చాలామంది ఎంతో బాధపడతారు. మరి మీరెలా?
మీనా: కథానాయికల కెరీర్ చాలా తక్కువ కాలమని నాకు తెలుసు. అయినప్పటికీ నేను పది, పదిహేనేళ్లు చేయగలిగాను. ఉన్నంతవరకూ మంచి సినిమాలు చేయగలిగాను. మొత్తం నాలుగు భాషల్లోనూ 200కి పైగా సినిమాలు చేశాను. ఇక, ఇంతకన్నా ఏం  కావాలి?

దక్షిణాది భాషల్లో స్టార్ హీరోలందరి సరసన చేశారు కదా.. అప్పట్లో ఎలా అనిపించింది?
మీనా: అసలా ఫేమ్‌ను గ్రహించే తీరిక ఉండేది కాదు. ఇంత పెద్ద స్టార్స్‌తో చేస్తున్నాం, ఇన్ని మంచి పాత్రలు చేస్తున్నాం అని ఎప్పుడూ ఆలోచించలేదు. వరుసగా సినిమాలు చేయడం, చేయబోయే సినిమాల కథలు వినడంతోనే సరిపోయేది. పెళ్లయిన తర్వాతే నా కెరీర్ వైభవం గురించి ఆలోచించే తీరిక చిక్కింది. అది కూడా ఎక్కడైనా బయటికెళ్లినప్పుడు ‘సినిమాలు ఎందుకు మానేశారు? మిమ్మల్ని చాలా మిస్సవుతున్నాం’ అని అందరూ అంటున్నప్పుడు, ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి, చేసిన సినిమాలను గుర్తు చేసుకుంటుంటాను.

మీనాకు తలబిరుసుతనం అనే వ్యాఖ్యలు విని, బాధపడేవారా?
మీనా:
మొదట్లో నాకు తెలియలేదు. ఆ తర్వాత తర్వాత తెలిసింది. ‘మన గురించి ఎందుకలా అనుకుంటున్నారు’ అని ఆలోచించేదాన్ని. ఆ తర్వాత తేలికగా తీసుకునేదాన్ని. మనమేంటో మనకూ, మన కుటుంబానికీ తెలుసు. బయటివాళ్లకు తెలియకపోతే ఏంటిలే అనుకునేదాన్ని. కానీ, నాతో ఫ్రెండ్స్ అయిన తర్వాత ‘మీరింత స్వీట్ పర్సనా? చాలా బాగా మాట్లాడుతున్నారే. కానీ, మీ గురించి మేం వేరేలా అనుకున్నాం’ అనేవారు. పోనీలే.. ఇప్పుడైనా తెలుసుకున్నారు కదా అనేదాన్ని.

ఒకప్పుడు స్లిమ్‌గా ఉండేవారు... ఇప్పుడలా ఉండాలనుకోవడం లేదా?
 మీనా:
పాప పుట్టిన తర్వాత బరువు పెరిగాను. మావారైతే నా బరువు గురించి ఆటపట్టిస్తుంటారు. మా పాప అన్నప్రాసన గుళ్లో చేస్తే, ఆ ఫొటోలు బయటికొచ్చాయి. అప్పుడు నేనింకా లావుగా ఉండేదాన్ని. పాప పుట్టిన తర్వాత నా గురించి నేను ఆలోచించడం మానేశాను. ఇప్పుడు మా నైనికకు మూడేళ్లు వచ్చేశాయ్. మాటలు వచ్చేశాయ్ కాబట్టి, తనకేం కావాలో చెబుతోంది. అందుకని టెన్షన్ తగ్గింది. ఇక, ఇప్పుడు నా గురించి కూడా ఆలోచించడం మొదలుపెడతా.    
 - డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement