
నటి మీనా చిన్న విరామం తరువాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె ఆ తరువాత తమిళం, తెలుగు, మలయాళం తదితర భాషల్లో అగ్ర కథానాయిగా రాణించిన విషయం తెలిసిందే. కాగా ఈమె నటిగా ఫుల్‌ఫామ్‌లో ఉండగానే విద్యాసాగర్ అనే బెంగళూరుకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి నైనిక అనే కూతురు కూడా ఉంది. అలాంటిది నటి మీన జీవితంలో ఇటీవల పెను విషాదం చోటు చేసుకుంది.
ఆమె భర్త విద్యాసాగర్ ఈ ఏడాది కరోనా కారణంగా అనారోగ్యానికి గురై కన్నుమూశారు. దీంతో నటి మీనా బాధ నుంచి కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది. ఆ మధ్య నటి కుష్భు, సంఘవి, రంభ తదితరులు ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. కాగా ఇటీవల మానసిక వేదన నుంచి బయటపడటానికి నటి మీనా విదేశీ పర్యటన చేసి వచ్చారు. దీంతో కాస్త తేరుకున్న ఆమె మళ్లీ చిత్రాలలో నటించడానికి సిద్ధమయ్యారు.
గతంలో అంగీకరించిన చిత్రాలను పూర్తి చేయడానికి రెడీ అవుతున్నారు. అలా ఆమె తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో ఒక్కో చిత్రం చేయాల్సి ఉంది. దీంతో పాటు మలయాళంలో మోహన్‌లాల్ సరసన దృశ్యం–3 చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం మీనా ఒక ప్రచార చిత్రంలో నటిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
చదవండి: (నాకు బలహీనతలు ఉన్నాయ్.. ఆ కామెంట్స్ చాలా బాధించాయి)
Comments
Please login to add a commentAdd a comment