![Meena Husband Vidyasagar Funeral Completed - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/30/rajinikanth.jpg.webp?itok=mKtxz3JW)
విద్యాసాగర్ అంతిమయాత్రలో బంధువులు, ప్రజలు నివాళులు అర్పించడానికి వచ్చిన రజనీ
సాక్షి, చెన్నై: నటి మీనా భర్త విద్యాసాగర్ (48) భౌతిక కాయానికి బుధవారం బీసెంట్‌నగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. విద్యాసాగర్ మరణం మీనా కుటుంబాన్ని శోకసముద్రంలో ముంచెత్తగా, సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. బుధవారం ఉదయం నుంచే సినీ ప్రముఖులు, అభిమానులు స్థానిక సైదాపేటలోని మీనా ఇంటికి తరలి వచ్చి ఆమె భర్త విద్యాసాగర్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. సినీ ప్రముఖులు మీనాను ఓదార్చి సంతాపం వ్యక్తం చేశారు.
రజనీకాంత్ కంటతడి
బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న నటి మీనా భర్తను కోల్పోవడంతో ఆమె బంధువులు, సన్నిహితులు, అభిమానులు చలించిపోయారు. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న మీనాకు ఆ బాధ నుంచి కోలుకోవడానికి తగిన శక్తిని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ విద్యాసాగర్ భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించారు. నటుడు రజనీకాంత్, మీనాలది సుదీర్ఘకాల సినీ అనుబంధం. ఆయన కథానాయకుడిగా నటించిన అన్భుళ్ల రజనీకాంత్ చిత్రంలో మీనా బాలనటిగా నటించారు. ఆ తరువాత యజమాన్, ముత్తు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో రజనీకి జంటగా మంచి గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ మీనా ఇంటికి వెళ్లి ఆమె భర్త భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
(చదవండి: మీనా భర్త మృతికి పావురాలే కారణమా?)
రజనీకాంత్‌ను చూడగానే మీనా అంకుల్ అంటూ బోరున ఏడ్చారు. దీంతో ఆమెను ఓదార్చిన రజనీకాంత్ కంటతడి పెట్టారు. అలాగే నటుడు, విజయకుమార్, శరత్‌కుమార్, దర్శకుడు కేఎస్ రవికుమార్, మన్సూర్ అలీఖాన్, దర్శకుడు సుందర్ సి, కుష్భు, చేరన్, నటి లక్ష్మి, సంగీత, రంభ, స్నేహ తదితర సినీ ప్రముఖులు నివాళులర్పించారు. నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్, శరత్‌కుమార్, విశాల్ తదితరులు సామాజిక మాధ్యమాల్లో సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment