భాష వేరు. కాని భావం ఒక్కటే. హీరో వేరు. కాని హీరోయిజం ఒక్కటే. అక్కడ హిట్ అయితే ఇక్కడ ఎందుకు కాదు. చలో... రీమేక్ చేద్దాం. కాని రీమేక్ అంత వీజీ కాదు. అది లైఫ్ ఇవ్వగలదు. ఫ్లాప్ చేయగలదు. కనెక్ట్ అయినవీ కానివీ వచ్చినవీ రాబోతున్నవీ ఈ సండే రోజున రీ విజిట్...
బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘అంధాధున్’ తాజాగా అమేజాన్‌లో రిలీజ్ అయ్యింది. ఇది ఒక థ్రిల్లర్. అనూహ్యమైన మలుపులతో కథ సాగుతుంది. అందుకే దీనిని చాలామంది రీమేక్ చేయడానికి ఉత్సాహపడ్డారు. తెలుగులో నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ రిమేక్ చేశారు. ఇక్కడే జటిలమైన సమస్య వస్తుంది. యథాతథం తీయాలా? ఏమైనా మార్పులు చేయాలా? చేస్తే నచ్చుతుందా... చేయకపోతే నచ్చుతుందా... యథాతథంగా తీస్తే కొత్తగా ఏం చేశారని అంటారు.
మార్పులు చేస్తే సోల్ చెడగొట్టారని అంటారు. అందువల్ల కొందరు దర్శకులు రీమేక్‌ల జోలికి రారు. కొందరు సక్సెస్‌ఫుల్‌గా తీస్తారు. ‘అంధాధున్’ కథ హిందీలో గోవాలో నడుస్తుంది. రీమేక్‌లో ప్రారంభంలోనే గోవా అని వేస్తారు. గోవాలో తెలుగు కథ ఎందుకు జరుగుతుంది? వైజాగ్‌లో తీసి ఉంటే ఎలా ఉంటుంది? ప్రేక్షకులకు వచ్చే సందేహం. కథ కనెక్ట్ కావచ్చు. కాని ఈ రీమేక్‌లో నేటివిటి కనెక్ట్ అయ్యిందా అనేది సమస్య.
ఇద్దరు దర్శకులు
గతంలో రీమేక్ సినిమాల్లో ఇద్దరు దర్శకులు పేరు పొందారు. వారు కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి. తమిళంలో భారతీరాజా తీసిన ఒక సినిమా బాగానే ఆడింది. దాని రైట్స్ నిర్మాత ఎస్.గోపాల్‌రెడ్డి కొన్నారు. కాని దర్శకుడు కోడి రామకృష్ణ దానిని యథాతథంగా తీస్తే ఫ్లాప్ అవుతుందని భావించి కథలో మార్పులు, యాస, స్థానికత మార్చారు. అదే ‘మంగమ్మ గారి మనవడు’. సూపర్‌హిట్ అయ్యింది.
మరో హిట్ ‘ముద్దుల మావయ్య’ కూడా రీమేక్. కాని తమిళ సినిమా ‘అరువదై నాల్’ ఆధారంగా తీసిన ‘మువ్వ గోపాలుడు’ పూర్తిగా కనెక్ట్ కాలేదు. రీమేక్‌లలో కొన్ని ఎందుకు కనెక్ట్ అవుతాయో కొన్ని ఎందుకు కావో చెప్పలేము. తమిళంలో విసు తీసిన ‘అవళ్ సుమంళిదాన్’ సినిమాను రవిరాజా పినిశెట్టి ‘పుణ్యస్త్రీ’ పేరుతో మార్పుచేర్పులు చేసి సూపర్‌హిట్ చేశారు. రవిరాజా పినిశెట్టి ఇచ్చిన భారీ రీమేక్‌లలో ‘చంటి’, ‘పెదరాయుడు’ ఉన్నాయి. ఆ తర్వాతి కాలంలో భీమినేని శ్రీనివాసరావు ఈ పల్స్ పట్టుకున్న డైరెక్టర్‌గా పేరు పొందారు.
గ్యారంటీ కథలు
సినిమా కోట్ల రూపాయల వ్యవహారం. కథ విన్నప్పుడు అది తెర మీద ఎలా వస్తుందో ఎలా హిట్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. విన్నప్పటి కథ చూసినప్పుడు తేలిపోయి భారీ ఫ్లాప్ కావచ్చు. అందుకే హీరోలు రీమేక్‌ల వైపు అప్పుడప్పుడు చూస్తుంటారు. ఎందుకంటే ఒక భాషలో హిట్ అయిన కథ మరో భాషలో హిట్ అవుతుందన్న ఒక గ్యారంటీతో. పైగా ఆ కథకు ఎంత ఖర్చు అవుతుందో, ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలిసిపోతుంది. నాగార్జున ‘విక్రమ్’ (హిందీ ‘హీరో’) తో తెరంగేట్రం చేసినా వెంకటేశ్ కాలక్రమంలో రీమేక్‌ల మీదే పూర్తిగా దృష్టి పెట్టినా ఇదే కారణం.
ఒక్కోసారి టాప్ హీరోలకు కూడా రీమేక్‌ల అవసరం ఏర్పడుతుంది. చిరంజీవికి ‘పసివాడి ప్రాణం’, ‘హిట్లర్’, ‘ఠాగూర్’, ‘ఖైదీ నంబర్ 150’ పెద్ద సక్సెస్ ఇచ్చాయి. ఇవి నాలుగూ రీమేకులే. ఇప్పుడు ఆయన మలయాళం హిట్ ‘లూసిఫర్’లో నటిస్తున్నారు. మోహన్‌బాబుకు మలయాళం నుంచి రీమేక్ చేసిన ‘అల్లుడు గారు’ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అయ్యింది. బి.గోపాల్ దర్శకుడిగా తీసిన ‘అసెంబ్లీ రౌడీ’ రీమేక్ ఆయనను కలెక్షన్ కింగ్‌ను చేసింది. కాని అదే బి.గోపాల్ వెంకటేశ్ హీరోగా చేసిన ‘చినరాయుడు’ రీమేక్ విఫలం అయ్యింది. ఆ సినిమాలోని తమిళదనం తెలుగుకు పడలేదు. తర్వాతి కాలంలో రాజశేఖర్ రీమేక్‌లకు కేరాఫ్‌గా మారాడు.
అనూహ్య ఫలితాలు
కచ్చితంగా హిట్ అవుతుందని రీమేక్ చేస్తే అనూహ్య ఫలితాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. తమిళంలో సూపర్‌డూపర్ హిట్ అయిన ‘వాల్టర్ వెట్రివల్’ను చిరంజీవి, శ్రీదేవితో ‘ఎస్‌పి పరశురామ్’గా రీమేక్ చేస్తే భారీ పరాజయం నమోదు చేసింది. అలాగే హిందీలో భారీ హిట్ అయిన ‘లగేరహో మున్నాభాయ్’ తెలుగు రీమేక్ ‘శంకర్‌దాదా జిందాబాద్’ కనెక్ట్ కాలేదు. వెంకటేశ్ ‘జెమిని’ నిరాశ పరిచింది. నాగార్జున ‘చంద్రలేఖ’ అంతే. ‘బాజీగర్’ రీమేక్‌గా తీసిన రాజశేఖర్ ‘వేటగాడు’ పరాజయం పొందింది.
తమిళంలో భారీ హిట్ అయిన ‘ఆటోగ్రాఫ్’ను రవితేజాతో ‘నా ఆటోగ్రాఫ్’ తీస్తే ప్రేక్షకులు తిరస్కరించారు. ఈ మధ్యకాలంలో తమిళం నుంచి రీమేక్ చేసిన వరుణ్ సందేశ్ ‘కుర్రాడు’, మనోజ్ మంచు ‘రాజూ భాయ్’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘స్పీడున్నోడు’, సందీప్‌కిషన్ ‘రన్’, పవన్ కల్యాణ్ ‘కాటమరాయుడు’, విష్ణు మంచు ‘డైనమైట్’, అల్లరి నరేశ్ ‘సిల్లీ ఫెలోస్’ అంతగా మెచ్చుకోలు పొందలేదు. తమిళ ‘96’ తెలుగులో ‘జాను’గా వస్తే బాగుందని పేరు వచ్చినా జనం చూడలేదు. అందుకే రీమేక్‌లో తెలియని రిస్క్ ఉంటుందని అంటారు.
కొనసాగుతున్న రీమేక్స్
అయినా సరే రీమేక్స్ కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ‘నారప్ప’ వచ్చింది. తాజాగా ‘మాస్ట్రో’ వచ్చింది. ‘ఉమామహ్వేర ఉగ్రరూపస్య’, ‘కపటధారి’, ‘తిమ్మరుసు’, ‘రాక్షసుడు’, ‘గద్దలకొండ గణేశ్’, ‘వకీల్‌సాబ్’... ఇవన్నీ రీమేక్స్ పట్ల ఆసక్తిని నిలిపి ఉంచాయి. మలయాళంలో హిట్ అయిన ‘లూసిఫర్’, ‘అయ్యప్పనమ్ కోషియం’ రీమేక్ అవుతున్నాయి. మరాఠిలో నానా పటేకర్ నటించగా పెద్ద హిట్ అయిన ‘నటసామ్రాట్’ తెలుగులో ప్రకాష్‌రాజ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తయారవుతోంది.
‘దృశ్యం 2’ రానుంది. గోడకు బంగారు చేర్పు అవసరం. ఇక్కడ గోడ కథ. గోడ గట్టిగా ఉంటే బంగారానికి దాని మీద వాలే శక్తి పెరుగుతుంది. కథను బాగా రాయడం తెలిస్తే రీమేక్‌ల అవసరం ఉండదు. తెలుగులో గట్టి సినీ కథకులు ఉన్నారు. తెలుగు సినిమాలు పరాయి భాషలో రీమేక్ అవుతున్నాయి. మన రంగంలో ఇతరులకు కథలిచ్చేలా ఎక్కువగా, కథలు తీసుకునేలా తక్కువగా ఉండాలని కోరుకుందాం.
‘
Comments
Please login to add a commentAdd a comment