హిట్‌ రిపీట్‌ అవుతుందా? | Sakshi Special Story About Remake Of Super Hit Movies | Sakshi
Sakshi News home page

హిట్‌ రిపీట్‌ అవుతుందా?

Published Sun, Feb 28 2021 12:51 AM | Last Updated on Sun, Feb 28 2021 8:14 AM

Sakshi Special Story About Remake Of Super Hit Movies

ఓ భాషలో ఏదైనా సినిమా విజయం సాధిస్తే, రీమేక్‌ ద్వారా తమ భాషలోకి తీసుకురావాలనుకుంటారు దర్శక–నిర్మాతలు. ఈజీ హిట్‌ ఫార్ములా అనేది ఒక కారణం. మంచి కథను మరో ప్రాంతం ఆడియన్స్‌కు చూపించాలనేది ఇంకో కారణం. హిట్‌ సినిమా రీమేక్‌ కూడా హిట్టే అవుతుందా? అంటే చెప్పలేం. చాలా లెక్కలుంటాయి. ఆ లెక్కలన్నీ సరిగ్గా లెక్క కట్టాలి. ఆ మంత్రం మళ్లీ సరిగ్గా జపించాలి. అప్పుడే మ్యాజిక్‌ జరుగుతుంది. ప్రస్తుతం ఓ భాషలో తయారైన అయిదు సూపర్‌ హిట్‌ సినిమాలు ఏకకాలంలో మూడు భాషల్లో రీమేక్‌ అవుతున్నాయి. ఆ సినిమాలు – ఆ రీమేక్‌ల విశేషాలు.

అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌
పృథ్వీరాజ్, బిజూ మీనన్‌  ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’. ఇద్దరు వ్యక్తుల ఈగోకి సంబంధించిన కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. సచీ దర్శకత్వం వహించారు. మలయాళంలో ఘనవిజయం సాధించింది ఈ సినిమా.  ప్రస్తుతం ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రీమేక్‌ అవుతోంది.

► తెలుగు రీమేక్‌లో పవన్‌  కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్నారు. సాగర్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాటలు–స్క్రీన్‌ ప్లే అందిస్తున్నారు. నాగవంశీ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది.
► హిందీ రీమేక్‌లో ‘దోస్తానా’ కాంబినేషన్‌  జాన్‌  అబ్రహామ్, అభిషేక్‌ బచ్చన్‌  నటించనున్నారు. నటించడంతో పాటు జాన్‌  అబ్రహామ్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు కూడా. జూన్‌ లో సెట్స్‌ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను ఎవరు డైరెక్ట్‌ చేస్తారనేది ఇంకా ప్రకటించలేదు.
► ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ తమిళ రీమేక్‌లో కార్తీ, పార్తిబన్‌  నటిస్తారని వార్తలు వచ్చాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.



హెలెన్‌  
రెస్టారెంట్‌లోని ఫ్రీజర్‌లో చిక్కుకుపోయిన అమ్మాయి అందులో నుంచి ఎలా బయటపడింది? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మలయాళ థ్రిల్లర్‌ చిత్రం ‘హెలెన్‌ ’. అన్నా బెన్‌  ముఖ్య పాత్ర చేసిన ఈ సినిమాని మతుకుట్టి జేవియర్‌ డైరెక్ట్‌ చేశారు. 2019లో ఈ సినిమా విడుదలైంది. తాజాగా ‘హెలెన్‌ ’ చిత్రాన్ని హిందీ, తమిళం, తెలుగు భాషల్లో రీమేక్‌ చేస్తున్నారు.

► అన్నా బెన్‌  చేసిన పాత్రను తెలుగు రీమేక్‌లో అనుపమా పరమేశ్వరన్‌  చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.
► ‘హెలెన్‌ ’ తమిళ రీమేక్‌ను ‘అన్‌బిర్కినియాళ్‌’ టైటిల్‌తో తెరకెక్కించారు. కీర్తీ పాండియన్‌  లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. గోకుల్‌ దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది.
► ‘హెలెన్‌ ’ హిందీ రీమేక్‌లో జాన్వీ కపూర్‌ నటించనున్నారు. దర్శకుడు, మిగతా వివరాలు ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లనుంది.



దృశ్యం 2
మోహన్‌  లాల్, మీనా జంటగా జీతూ జోసెఫ్‌ తెరకెక్కించిన థ్రిల్లర్‌ చిత్రం ‘దృశ్యం’. 2013లో విడుదలైన ఈ సినిమా పెద్ద హిట్‌. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ (దృశ్యం 2) విడుదలయింది. మొదటి భాగంలో పని చేసిన టీమే ఈ సీక్వెల్‌ తెరకెక్కించారు. ‘దృశ్యం 2’ చిత్రం ప్రస్తుతం తెలుగులో, తమిళంలో రీమేక్‌ కాబోతోంది. హిందీలోనూ రీమేక్‌ కానుందని టాక్‌.

► ‘దృశ్యం’ మొదటి భాగంలో వెంకటేశ్, మీనా జంటగా నటించారు. సీక్వెల్‌లోనూ వీరే నటించనున్నారు. మార్చి మొదటి వారం నుంచి ఈ రీమేక్‌ సెట్స్‌ మీదకు వెళ్లనుంది. జీతూ జోసెఫ్‌ డైరెక్ట్‌ చేస్తారు.
► ‘దృశ్యం’ తమిళ రీమేక్‌ జీతూ జోసెఫ్, కమల్‌హాసన్‌  కాంబినేషన్‌ లో తెరకెక్కింది. తాజాగా ఈ సీక్వెల్‌ను కేయస్‌ రవికుమార్‌ డైరెక్ట్‌ చేయనున్నారని వార్తలు వచ్చాయి. కమల్‌హాసన్‌  ప్రస్తుతం పొలిటికల్‌గా బిజీగా ఉన్నారు. మరి ఈ సీక్వెల్‌లో ఆయనే నటిస్తారా? వేరెవరైనా సీన్‌ లోకి వస్తారేమో చూడాలి.
► ‘దృశ్యం’ హిందీ రీమేక్‌లో అజయ్‌ దేవగణ్, శ్రియ నటించారు. తాజా సీక్వెల్‌ హిందీలోనూ రీమేక్‌ అవుతుందని బాలీవుడ్‌ టాక్‌.


ఓ మై కడవుళే
అశోక్‌ సెల్వన్, రితికా సింగ్‌ జంటగా అశ్విన్‌  మారిముత్తు తెరకెక్కించిన తమిళ చిత్రం ‘ఓ మై కడవుళే’. జీవితంలో రెండో అవకాశం లభించినప్పుడు ఏం చేయొచ్చు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో విజయ్‌ సేతుపతి అతిథి పాత్రలో నటించారు. 2020లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్‌ అయింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రీమేక్‌ చేస్తున్నారు.

► తమిళ వెర్షన్‌ ను డైరెక్ట్‌ చేసిన అశ్విన్‌  తెలుగు రీమేక్‌ను కూడా డైరెక్ట్‌ చేయనున్నారు. విశ్వక్‌ సేన్‌  ఈ సినిమాలో హీరోగా నటిస్తారు. పీవీపీ బ్యానర్‌ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది.
► హిందీ రీమేక్‌ హక్కులను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ దక్కించుకుంది. అశ్విన్‌  మారిముత్తునే ఈ హిందీ వెర్షన్‌ ను కూడా డైరెక్ట్‌ చేస్తారు.
► ‘ఓ మై కడవుళే’ కన్నడ వెర్షన్‌ లో డార్లింగ్‌ కృష్ణ హీరోగా నటిస్తున్నారు. అతిథి పాత్రలో కన్నడ స్టార్‌ హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌ కనిపిస్తారు.

అంధా ధున్‌
ఆయుష్మాన్‌  ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన హిందీ చిత్రం ‘అంధా ధున్‌ ’. శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్ద హిట్‌. జాతీయ అవార్డు కూడా సాధించింది. ఇప్పుడు ‘అంధా ధున్‌ ’ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రీమేక్‌ కానుంది.

► తెలుగు రీమేక్‌లో నితిన్‌  హీరోగా నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకుడు. రాధికా ఆప్టే పాత్రలో నభా నటేశ్, టబు పాత్రలో తమన్నా కనిపించనున్నారు. జూన్‌  11న ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు.
► తమిళ రీమేక్‌లో ‘జీన్స్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నటిస్తున్నారు. జేజే ఫ్రెడ్రిక్‌ ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నారు. టబు చేసిన పాత్రను సిమ్రాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘అంధగన్‌ ’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు.
► ‘అంధా ధున్‌ ’ మలయాళ రీమేక్‌ని ‘భ్రమం’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. పృధ్వీరాజ్‌ సుకుమారన్‌  హీరోగా నటిస్తున్నారు. రాశీ ఖన్నా కథానాయిక.


ఆయా భాషల్లో విజయం సాధించినట్టు ఈ రీమేక్స్‌ కూడా విజయం సాధిస్తాయా? ఒరిజినల్‌లో జరిగిన మ్యాజిక్‌ను రీమేక్‌లోనూ ఆయా చిత్రబృందాలు క్రియేట్‌ చేయగలుగుతాయా? వెయిట్‌ అండ్‌ సీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement