నయనతార, సోనమ్ కపూర్, వరలక్ష్మీ శరత్‌కుమార్
అవును... మన స్టార్స్‌కి కనబడట్లేదు. కథలో దమ్ము కనిపించేసరికి స్క్రీన్ మీద తమ పాత్రకు కళ్లు కనిపించకపోయినా ఫర్వాలేదంటున్నారు. క్యారెక్టర్‌కి కొత్త షేడ్ వస్తుందంటే.. సినిమా మొత్తం షేడ్స్ (కళ్ల జోడు) పెట్టుకొనే ఉండటానికి రెడీ అంటున్నారు. స్క్రీన్‌పై అంధులుగా నటిస్తూ.. బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్‌కి గురి పెట్టారు. అంధ పాత్రలను ఓ చూపు చూస్తున్నారు. ప్రస్తుతం అంధ పాత్రలో నటిస్తున్న స్టార్స్‌పై ఓ లుక్కేద్దాం..
‘అంధా ధున్’ హిందీలో పెద్ద హిట్. ఈ సినిమా ఇప్పుడు తెలుగు, తమిళంలో రీమేక్ అవుతోంది. తెలుగు రీమేక్‌లో నితిన్ హీరోగా నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే దుబాయ్‌లో ప్రారంభం అయింది. ఇందులో నితిన్ అంధ పియానో ప్లేయర్ పాత్రలో కనిపిస్తారు. తమిళ రీమేక్ విషయానికి వస్తే.. ప్రశాంత్ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ను జనవరి 1న ప్రకటిస్తున్నట్టు చిత్రబృందం పేర్కొంది. జేజే ఫ్రెడ్రిక్ దర్శకుడు. ఈ సినిమాలో పియానో వాద్యకారుడిగా నటించడానికి లాక్‌డౌన్‌లో రోజుకి రెండు గంటల చొప్పున పియానో నేర్చుకున్నారట ప్రశాంత్. ‘అంధా ధున్’ మలయాళంలోనూ రీమేక్ కాబోతుందనే వార్త కూడా ఉంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ లీడ్ రోల్ చేస్తారట.
లేడీ సూపర్‌స్టార్ నయనతార కొత్త సినిమా కోసం అంధురాలిగా మారారు. మిలింద్ రాజు తెరకెక్కిస్తున్న ‘నెట్రిక్కన్’లో కళ్లు కనిపించని అమ్మాయిగా చేస్తున్నారు నయన. ‘నెట్రిక్కన్’ అంటే మూడో కన్ను అని అర్థం. ఈ సినిమాలో నగరంలో వరుసగా అమ్మాయిలు కనిపించకుండా పోతుంటారు. ఈసారి నయనతార వంతు వస్తుంది. మరి ఆ చిక్కుల్లో నుంచి చూపులేకున్నా ఈ అమ్మాయి ఎలా తప్పించుకుందన్నది కథ.
కమల్ హాసన్ సూపర్‌హిట్ సినిమాల్లో ‘రాజపార్వై’ (తెలుగులో ‘అమావాస్య చంద్రుడు’) ఒకటి. అందులో కమల్ అంధుడిగా నటించారు. ఇప్పుడు అదే టైటిల్‌తో వరలక్ష్మి ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వరలక్ష్మి కూడా అంధురాలిగా నటిస్తున్నారు. హిందీ వైపు వెళ్తే... క్రైమ్‌ని కనిపెట్టడానికి కళ్లు అంత ముఖ్యమా? కామన్‌సెన్స్ చాలు అంటున్నారు సోనమ్ కపూర్. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్లైండ్’. ఈ చిత్రంలో ఓ సైకో కిల్లర్‌ను పట్టుకునే కళ్లు కనిపించని పోలీసాఫీసర్‌గా సోనమ్ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సోమవారం స్కాట్‌ల్యాండ్‌లో ప్రారంభం అయింది.
ఈ చూపులేని పాత్రల్లో తారలందరూ ఆడియన్స్ చూపు తిప్పుకోలేని పర్ఫార్మెన్స్ ఇచ్చి, అలరిస్తారని ఊహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment