amavasya chandrudu
-
కనబడుట లేదు.. భారీ హిట్‌కి గురి
అవును... మన స్టార్స్‌కి కనబడట్లేదు. కథలో దమ్ము కనిపించేసరికి స్క్రీన్ మీద తమ పాత్రకు కళ్లు కనిపించకపోయినా ఫర్వాలేదంటున్నారు. క్యారెక్టర్‌కి కొత్త షేడ్ వస్తుందంటే.. సినిమా మొత్తం షేడ్స్ (కళ్ల జోడు) పెట్టుకొనే ఉండటానికి రెడీ అంటున్నారు. స్క్రీన్‌పై అంధులుగా నటిస్తూ.. బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్‌కి గురి పెట్టారు. అంధ పాత్రలను ఓ చూపు చూస్తున్నారు. ప్రస్తుతం అంధ పాత్రలో నటిస్తున్న స్టార్స్‌పై ఓ లుక్కేద్దాం.. ‘అంధా ధున్’ హిందీలో పెద్ద హిట్. ఈ సినిమా ఇప్పుడు తెలుగు, తమిళంలో రీమేక్ అవుతోంది. తెలుగు రీమేక్‌లో నితిన్ హీరోగా నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే దుబాయ్‌లో ప్రారంభం అయింది. ఇందులో నితిన్ అంధ పియానో ప్లేయర్ పాత్రలో కనిపిస్తారు. తమిళ రీమేక్ విషయానికి వస్తే.. ప్రశాంత్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ను జనవరి 1న ప్రకటిస్తున్నట్టు చిత్రబృందం పేర్కొంది. జేజే ఫ్రెడ్రిక్ దర్శకుడు. ఈ సినిమాలో పియానో వాద్యకారుడిగా నటించడానికి లాక్డౌన్లో రోజుకి రెండు గంటల చొప్పున పియానో నేర్చుకున్నారట ప్రశాంత్. ‘అంధా ధున్’ మలయాళంలోనూ రీమేక్ కాబోతుందనే వార్త కూడా ఉంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ లీడ్ రోల్ చేస్తారట. లేడీ సూపర్‌స్టార్ నయనతార కొత్త సినిమా కోసం అంధురాలిగా మారారు. మిలింద్ రాజు తెరకెక్కిస్తున్న ‘నెట్రిక్కన్’లో కళ్లు కనిపించని అమ్మాయిగా చేస్తున్నారు నయన. ‘నెట్రిక్కన్’ అంటే మూడో కన్ను అని అర్థం. ఈ సినిమాలో నగరంలో వరుసగా అమ్మాయిలు కనిపించకుండా పోతుంటారు. ఈసారి నయనతార వంతు వస్తుంది. మరి ఆ చిక్కుల్లో నుంచి చూపులేకున్నా ఈ అమ్మాయి ఎలా తప్పించుకుందన్నది కథ. కమల్ హాసన్ సూపర్‌హిట్ సినిమాల్లో ‘రాజపార్వై’ (తెలుగులో ‘అమావాస్య చంద్రుడు’) ఒకటి. అందులో కమల్ అంధుడిగా నటించారు. ఇప్పుడు అదే టైటిల్‌తో వరలక్ష్మి ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వరలక్ష్మి కూడా అంధురాలిగా నటిస్తున్నారు. హిందీ వైపు వెళ్తే... క్రైమ్‌ని కనిపెట్టడానికి కళ్లు అంత ముఖ్యమా? కామన్సెన్స్ చాలు అంటున్నారు సోనమ్ కపూర్. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్లైండ్’. ఈ చిత్రంలో ఓ సైకో కిల్లర్‌ను పట్టుకునే కళ్లు కనిపించని పోలీసాఫీసర్‌గా సోనమ్ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సోమవారం స్కాట్‌ల్యాండ్‌లో ప్రారంభం అయింది. ఈ చూపులేని పాత్రల్లో తారలందరూ ఆడియన్స్ చూపు తిప్పుకోలేని పర్ఫార్మెన్స్ ఇచ్చి, అలరిస్తారని ఊహించవచ్చు. -
అమావాస్య చందమామ!
కథానాయికలు కేవలం గ్లామర్‌కి మాత్రమే అంటే అస్సలు ఒప్పుకోరు వరలక్ష్మీ శరత్ కుమార్. ఎప్పటికప్పుడు చాలెంజింగ్ రోల్స్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారామె. ఇందులో భాగంగా ఇటీవల అంధురాలిగా నటించడానికి కూడా ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘రాజపార్వై’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు చిత్రబృందం. 1981లో వచ్చిన కమల్ హాసన్ సినిమా టైటిల్ ఇది కావడం విశేషం. ‘రాజపార్వై’ సినిమా ‘అమావాస్య చంద్రుడు’ టైటిల్‌తో తెలుగులో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అంటే వరలక్ష్మీ అమావాస్య చందమామగా కనిపించబోతోందా?. చూపు లేని అమ్మాయిగా కనిపించడానికి వరలక్ష్మీ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారట. అంధురాలిగా నటించడం ఓ సవాల్ అంటే.. ఈ చిత్రంలో ఫైట్స్ కూడా చేస్తారు వరలక్ష్మీ. అందుకోసం కూడా ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారట. పాత్ర పట్ల తనకున్న డెడికేషన్ అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రస్తుతం తమిళ హీరోయిన్స్‌లో ఫుల్ బిజీ యాక్టర్ కూడా వరలక్ష్మీనే. సుమారు 4–5 సినిమాలతో బిజీగా ఉన్నారు. -
స్మార్ట్ దుష్ప్రభావం!
కేతన, ప్రాచిలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ సింగిల్ మ్యాన్ మూవీస్ పతాకంపై స్వీయదర్శకత్వంలో బి.ఎస్.ఆర్ రూపొందిస్తోన్న చిత్రం ‘అమావాస్య చంద్రులు’. 73% యూత్ అన్నది ఉపశీర్షిక. దర్శక–నిర్మాత మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెర కెక్కుతోన్న చిత్రమిది. స్మార్ట్ ఫోన్, వైఫై, ఇంటర్నెట్ వల్ల నేటి యువతరం ఎలా చెడిపోతోంది? వాటి వల్ల కలిగే దుష్ప్రభావం ఏంటి? అని చూపించనున్నాం. కేవలం యూత్ మాత్రమే కాకుండా కుటుంబ ప్రేక్షకులూ చూసే అంశాలు కూడా ఉంటాయి’’ అన్నారు. గుర్రపు విజయ్‌కుమార్, సంతోషిని, అస్మితా ఖాన్, కడప జ్యోతి, లావణ్య తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ,మాటలు: బి.ఎస్.వాసు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: గుర్రపు విజయ్‌కుమార్.