ఒక భాషలో విజయం సాధించిన చిత్రాలు మరో భాషలో రీమేక్ కావడం సాధారణమే. అయితే పాన్ ఇండియా ఫార్ములా వచ్చిన తర్వాత కూడా రీమేక్ మంత్రం వెండితెరపై వినిపిస్తోంది కొందరు తారలు రీమేక్ చిత్రాలను చేసేందుకు రెడీ అవుతున్నారు. రీమేక్ చిత్రాలవైపు ఓ చూపు చూస్తున్న ఆ స్టార్స్‌పై ఓ లుక్ వేయండి.
మలయాళ హిట్ ‘లూసీఫర్’ తెలుగు రీమేక్ ‘గాడ్‌ఫాదర్’లో ఇటీవల చిరంజీవి నటించిన విషయం తెలిసిందే. మరో రీమేక్ ‘బోళా శంకర్’లో కనిపించనున్నారాయన. ఇందులో చిరంజీవి సరసన హీరోయిన్‌గా తమన్నా, చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకుడు. 2015లో అజిత్ హీరోగా నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘వేదాళం’కు రీమేక్‌గా ‘బోళా శంకర్’ తెరకెక్కుతోందని తెలిసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలను కుంటున్నారు.
మరోవైపు మలయాళంలో వచ్చిన సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25’ (2019) తెలుగు రీమేక్ రైట్స్‌ను దక్కించుకున్నారు హీరో–నిర్మాత మంచు విష్ణు. మోహన్‌బాబు మెయిన్ లీడ్ రోల్‌లో ఈ సినిమా తెరకెక్క నుందని సమాచారం. అలాగే మరో మలయాళ చిత్రం ‘పొరింజు మరియం జోస్’ (2019) తెలుగులో రీమేక్ కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నాగార్జున హీరోగా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి బెజవాడ ప్రసన్నకుమార్ దర్శకత్వం వహిస్తారట. ఇక హీరో పవన్ కల్యాణ్ కెరీర్‌లోని రీమేక్ చిత్రాల్లో తమిళ చిత్రం ‘తేరి’ కూడా చేరనుందని టాక్.
ఈ సినిమాకు దర్శకుడిగా తొలుత సుజిత్ పేరు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల హిట్ సాధించిన తమిళ చిత్రాల్లో ఒకటైన ‘మానాడు’ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ దగ్గర ఉన్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తారని ప్రచారం జరిగినా, ఆ తర్వాత రవితేజ, సిద్ధు జొన్నలగడ్డల పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ నిర్మాణ భాగస్వామిగా ‘లక్కీ కీ’ అనే సౌత్ కొరియన్ మూవీ తెలుగు తెరపైకి రానుంది. ఇందులో సమంత ఓ లీడ్ రోల్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఇంకా మలయాళ హిట్ ఫిల్మ్ ‘హెలెన్’ తెలుగులో ‘బుట్ట బొమ్మ’గా రూపొందుతోంది. అనిఖా సురేంద్రన్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ హీరోలుగా నటిస్తున్నారు. శౌరి చంద్ర శేఖర్ రమేష్ ఈ సినిమాకు దర్శకుడు. ఇంకా తమిళ హిట్ ఫిల్మ్ ధనుష్ ‘కర్ణన్’ తెలుగులో రీమేక్ కానున్నట్లు, ఇందులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటించ నున్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ చిత్రాలతో పాటు మలయాళ చిత్రాలు ‘నాయట్టు’, ‘డ్రైవింగ్ లైసెన్స్’, ‘బ్రో డాడీ’, తమిళ చిత్రం ‘వినోదాయ చిత్తమ్’, హిందీ ‘డ్రీమ్ గాళ్’, ‘దే దే ప్యార్ దే’ ‘బదాయీ దో’ వంటివి కూడా తెలుగులో రీమేక్ అయ్యే అవకాశం ఉంది. ఇవే కాదు.. ఈ రీమేక్ జాబితాలో మరికొన్ని చిత్రాలు చేరతాయి.
Comments
Please login to add a commentAdd a comment