జాడీ నం.1 | Aavakaaya special stories | Sakshi
Sakshi News home page

జాడీ నం.1

Published Sun, May 24 2015 3:48 AM | Last Updated on Mon, Jul 29 2019 7:41 PM

జాడీ నం.1 - Sakshi

జాడీ నం.1

కర్షకుడి చద్దిమూటలో కార్మికుడి లంచ్ డబ్బాలో ఆఫీసర్‌గారి క్యారియర్‌లో అమ్మాయి స్కూల్ టిఫిన్ బాక్స్‌లో స్టీల్ కంచంలో, పింగాణి ప్లేట్‌లో దర్శనమిచ్చే ఆవకాయ... చందమామ లాంటి అన్నంలో ఉదయిస్తున్న సూరీడులా ఉంటుంది! ఆకలిని బజ్జోపెట్టే అమ్మలా క్రాంతిని మేల్కొలిపే నాన్నలా అవ్వాతాతల వారసత్వంలా చల్లగా, నిప్పులా, నిజాయితీగా అనిపిస్తుంది. నిలవ ఉంచుకోవచ్చు. నిమిషంలో పంచేయవచ్చు.
 రామ్,ఎడిటర్, ఫీచర్స్
 

ఆవకాయ్... తెలుగువారికి ఎలా ప్రత్యేకమో, హీరోయిన్లలో స్వాతి అంత ప్రత్యేకం. మిరపకాయలు చిటా పటామన్నట్టు, మాటలు పేల్చడంలో స్వాతి దిట్ట. అష్టాచెమ్మా, అనంతపురం, స్వామి రారా, కార్తికేయ... ఆమె నటించిన కమ్మని సినిమాలు. తెలుగు టాలెంట్ తమిళ, మలయాళ భాషల్లో స్వాతి వల్లే తెలుస్తోంది. అక్కడ కూడా తను పాపులర్ హీరోయిన్. ఈ ఆవకాయ సీజన్లో ‘సాక్షి’ కోసం స్వాతి కలిపిన మాటలివి...
     
సమ్మర్ ఎలా ఉంది?
నీ పని చెప్తా అన్నట్టు ఉంది. ఎండలు విజృంభిస్తున్నాయ్. ఇంకో నెలరోజులు అవస్థ తప్పదు. అయినా ఎండల్ని తిట్టుకోవాల్సిన పని లేదు. మల్లెల్ని, కొత్త ఆవకాయల్ని తీసుకొచ్చే సీజన్ కదా!
     
ఆవకాయ్ ఇష్టమేనా?
ఓ... ఏడాది పొడవునా తినమన్నా తినేస్తాను.
     
పచ్చడి తయారు చేసేటప్పుడు దగ్గరుండి చూస్తుంటారా?
వైజాగ్‌లో మా అమ్మమ్మ, నాన్నమ్మ ఇద్దరూ తయారు చేసేవాళ్లు. ఆవకాయ్ తయారు చేయడం అనేది మాకో చిన్న సైజ్ పండగలా అనిపించేది. మామిడికాయలు కొనడం, వాటిని కడగడం,  తుడిచి ముక్కలు కొట్టి, మొత్తం పచ్చడి తయారయ్యేవరకూ నేను, మా అన్నయ్య దగ్గరుండి చూసేవాళ్లం. నానమ్మ కత్తిపీట మీద కూర్చుని ముక్కలు కోసేది.

అన్నయ్య ఒక్కో మామిడికాయ కత్తి కింద పెడితే ఆవిడ కోసేది. ఓసారి ఎటో చూస్తూ, ముక్కకి బదులు అన్నయ్య వేలి మీద కత్తి వేసింది. వేలి నుంచి బాగా రక్తం కారడం, అన్నయ్యేమో ఇల్లు పీకి పందిరేసినంత పని చేస్తూ, గట్టిగా ఏడవడం, తనని ఓదార్చడం... బాగా గుర్తు. అప్పుడు అందరూ అన్నయ్యను బాగా గారం చేశారు. దాంతో ‘సచ్చినోడా’ అని ఉక్రోషంగా తిట్టుకున్నా (నవ్వుతూ).
 
పచ్చడి పాళ్లు మీకు తెలుసా?
అంత తెలియదు కానీ, ఏయే దినుసులు కావాలో తెలుసు. నాకైతే ముక్క మాత్రమే కాదు.. పచ్చడిలో వేసే మెంతులు, వెల్లుల్లిపాయ కూడా ఇష్టమే. మా అమ్మా, నాన్న, నేనూ భోజనం చేస్తున్నప్పుడు మెంతులూ, వెల్లుల్లిపాయలూ ఏరి నా ప్లేట్లో వేస్తారు. ఎప్పుడైనా హోటల్ నుంచి బిర్యానీ తెప్పించుకుని, టీవీ చూస్తూ తింటుంటాను. అప్పుడు బిర్యానీ రుచిగా లేకపోతే, ఓ ఆవకాయ ముక్క పెట్టుకుని తినేస్తాను.
     
మామిడికాయల వల్ల మొహం మీద గడ్డలు వస్తాయనీ, పచ్చళ్లు శరీర బరువుని పెంచుతాయంటారు కదా?
నాకలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. బరువు గురించి కూడా అస్సలు ఆలోచించను. కమ్మని ఆవకాయ్ తినని జీవితం ఎందుకండీ?
     
షూటింగ్స్ కోసం దేశ, విదేశాలు తిరుగుతుంటారు కదా.. ఎక్కడికెళ్లినా ఆవకాయ్ దొరుకుతుందా?
మన తెలుగువాళ్ల గొప్పదనం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా తమతో పాటు ఆవకాయ ఉంచుకుంటారు. చెన్నయ్‌లో షూటింగ్ అనుకోండి, అక్కడ వడ్డించే పచ్చళ్లల్లో మన ఆవకాయ్ ఉంటుంది. విదేశాల్లోని సూపర్ మార్కెట్స్‌లో, తెలుగు హోటల్స్‌లో కూడా దొరుకుతుంది.
     
అవునూ.. మీ ఇంట్లో పచ్చడి జాడీలున్నాయా?
ఉన్నాయి. అప్పట్లో అమ్మమ్మ, నాన్నమ్మ పచ్చడిని జాడీలో పెట్టి, జాడీ మూతకు తెల్లటి గుడ్డ కట్టి, భద్రపరిచేవారు. అది చూడ్డానికే ఎంతో బాగుండేది.
- డి.జి. భవాని
 
చరిత్ర అడగొదు
ఆదియందు అక్షరమే తప్ప ఆవకాయ లేకపోవచ్చు. వేదము వలె ఆవకాయ సత్య సనాతనమైనది కాకపోవచ్చు. అయినా, ఆవకాయ కూడా వేదం వలెనే అపౌరుషేయం. శాకాహార, మాంసాహార పదార్థాలను ఎక్కువకాలం నిల్వ చేసేందుకు ఊరవేసే ప్రక్రియ దాదాపు నాలుగువేల ఏళ్ల కిందటే మొదలైనట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రాచ్య, అప్రాచ్య దేశాలలో కూరగాయ ముక్కలను, మాంసం ముక్కలను ఉప్పునీటిలో లేదా వెనిగర్‌లో ఊరవేసేవారు. అంతకంటే పెద్దగా కష్టపడేవారు కాదు, కొత్తగా ఆలోచించేవారు కాదు. అవన్నీ ఆదిమ పద్ధతుల్లో తయారయ్యే ఊరగాయలు! దే ఆర్ వెరీ ప్రిమిటివ్ పికిల్స్! వాటి తయారీ పద్ధతిలో నేటికీ పెద్దగా మెరుగుదల లేదు. ఆవకాయ రుచి ఎరుగని అమాయకులు పాపం వాటితోనే నెట్టుకొచ్చేస్తున్నారు.
 
ఆవకాయ ఆవిర్భావాన్ని గురించి మనకు ఇదమిత్థమైన పౌరాణిక, ఐతిహాసిక ఆధారాలేవీ లభించడం లేదు. నానా రుచులను నోరారా వర్ణించిన కవిసార్వభౌముడు శ్రీనాథుడి కావ్యాలలో సైతం ఆవకాయ ప్రస్తావన లేదు. అంటే, ఆవకాయ నిస్సందేహంగా శ్రీనాథుడి తర్వాతి కాలం నాటి ఆవిష్కరణే. ఆవకాయ పెట్టడానికి మామిడికాయలు, ఆవాలు, మిరపకాయలు, ఉప్పు, నూనె కావాలి. మామిడి, ఆవాలు, ఉప్పు, నూనె వాడుక మన దేశంలో క్రీస్తుపూర్వం నుంచే ఉండేది.

ఆవకాయ ఘాటులో, ఎర్రని రంగులో కీలక పాత్ర పోషించే మిరపకాయలు మాత్రం క్రీస్తుశకం 15-16 శతాబ్దాల మధ్యకాలంలో విదేశీ వర్తకుల ద్వారా మన దేశానికి వచ్చాయి. కొలంబస్ రాక తర్వాత.. అంటే 1492 తర్వాత మిరపకాయలు ఇక్కడకు చేరాయి. పోర్చుగీసు, డచ్ వర్తకుల ప్రోత్సాహంతో మిరపకాయల సాగు నెమ్మదిగా విస్తరించింది. వారి ప్రాబల్యంతోనే తెలుగువారు ఎగుమతుల కోసం తయారుచేసే మామిడి ఊరగాయకు మిరపపొడిని జోడించడం మొదలుపెట్టారు.

మన తెలుగువారికి ఆమాత్రం ప్రోత్సాహం దొరకాలే గానీ, ఇక ఆగుతారా..? మనవాళ్లవి అసలే క్రియేటివ్ బ్రెయిన్స్! ప్రయోగాల మీద ప్రయోగాలు సాగించి, సాగించి, చివరకు ఆవకాయ ఫార్ములాను సాధించారు. మిరపపొడి ధాటికి మనకంటూ ఓ ఫైర్‌బ్రాండ్ నిల్వపచ్చడి తయారైంది. రుచి అమోఘం మాత్రమే కాదు, రంగు కూడా అత్యంత ఆకర్షణీయం.. కంచంలో వేడివేడి అన్నం వడ్డించుకుని, కొత్తావకాయ కలుపుకుంటేనా..! ఆ దృశ్యాన్ని చూస్తేనే చాలు, కంచంలో మర్డర్ జరిగినట్లుంటుంది..

ఇదీ మన తెలుగోళ్ల కలాపోసన! ఆవకాయ ఫార్ములా కనిపెట్టాక, ఒకే రకమైన మూసపద్ధతిలోనే మనవాళ్లు ఆగిపోలేదు. సామవేద పారంగతులైన విద్వద్వరేణ్యులు చిన్న చిన్న స్వరభేదాలతో అద్భుత, అమోఘ, అపురూప రాగాలను సృష్టించిన రీతిలోనే, చిన్న చిన్న రుచిభేదాలతో చవులూరించే రకరకాల ఆవకాయలను సృష్టించారు. ఆవకాయ సృష్టికర్త ఎవరో, పేరేమిటో చరిత్రకెక్కలేదు.

ఆవకాయను ఆత్మగౌరవ చిహ్నంగా మార్చుకున్న ఆంధ్రులు.. ఆవకాయ సృష్టికర్తకు ఆజన్మాంతం రుణగ్రస్తులై ఉంటారు. అయితే, ప్రాతఃస్మరణీయుడై, పూజలందుకోవలసిన ఆవకాయ సృష్టికర్తను విస్మరించినందుకు మాత్రం మన తెలుగువాళ్లను చరిత్ర క్షమించదు!
 - పన్యాల జగన్నాథదాసు
 
తెలంగాణ ఆవకాయ
కావలసినవి: మామిడికాయ ముక్కలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో, ఆవపిండి - అరకిలో, వెల్లుల్లి రెబ్బలు - 100 గ్రా., మెంతులు - 100 గ్రా., నూనె - 2 కిలోలు, ఆవాలు - 50 గ్రా, జీలకర్ర - 50 గ్రా, కరివేపాకు - 1 కట్ట
తయారీ: మెంతుల్ని నూనె లేకుండా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఓ బేసిన్లో మామిడి ముక్కలు, కారం, ఉప్పు, ఆవపిండి వేసి బాగా కలపాలి. మొత్తం నూనెను వేడి చేసి, అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయాలి. వేగిన తర్వాత దించేసి చల్లార్చుకోవాలి. వేడి లేదని నిర్ధారించుకున్నాక ముక్కల మిశ్రమంలో వేసి బాగా కలపాలి. తర్వాత పచ్చడిని జాడీలో వేసి, మూడు రోజుల పాటు ఊరనివ్వాలి.
 
బెల్లం ఆవకాయ
కావలసినవి: 
మామిడికాయ ముక్కలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో, ఆవపిండి - అరకిలో, బెల్లం - 1 కిలో, నూనె - తగినంత
తయారీ: బెల్లాన్ని తురుముకోవాలి. మామిడి ముక్కల్లో కారం, ఉప్పు, ఆవపిండి, బెల్లం తురుము వేసి బాగా కలపాలి. ముక్కలు తడిసేలా కొద్దిగా నూనె కూడా వేసి కలపాలి. తర్వాత ఈ ముక్కల్ని ఎండలో పెట్టాలి. రెండు రోజుల్లో ముక్కలకు పట్టిన బెల్లం పాకంలాగా తయారవుతుంది. అప్పుడు ముక్కల్ని జాడీలో వేసి, మునిగేవరకూ నూనె వేసి మూత పెట్టెయ్యాలి. మగ్గిన తర్వాత తీసుకోవాలి. కొందరు తాలింపు కూడా వేసుకుంటారు. నచ్చితే వేసుకోవచ్చు. లేదంటే మామూలుగా కూడా బాగుంటుంది.
 
ఆంధ్ర ఆవకాయ
కావలసినవి:
మామిడికాయ ముక్కలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో, ఆవపిండి - అరకిలో, వెల్లుల్లి రెబ్బలు - 100 గ్రా., మెంతులు - 100 గ్రా., నూనె - తగినంత
తయారీ:  ఓ బేసిన్లో మామిడి ముక్కలు, కారం, ఉప్పు, ఆవపిండి వేసి బాగా కలపాలి. జాడీ తీసుకుని... కాసిని మామిడి ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కాసిన్ని మెంతులు... ఇలా పొరలుగా వేసుకోవాలి. చివరగా ముక్కలు మునిగేవరకూ నూనె వేసి మూత పెట్టెయ్యాలి. మూడు రోజుల తర్వాత మూత తీసి, ఒకసారి కలిపి మళ్లీ మూత పెట్టెయ్యాలి. రెండు మూడు రోజుల్లో ఆవకాయ రెడీ అయిపోతుంది.
 
నువ్వు ఆవకాయ
కావలసినవి:
మామిడికాయ ముక్కలు - 2 కిలోలు, నువ్వులు - అరకిలో, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో, అల్లం వెల్లుల్లి ముద్ద - అరకప్పు, ఆవపిండి - 100 గ్రా., జీలకర్ర పొడి - 50 గ్రా., మెంతి పొడి - 2 చెంచాలు, ఇంగువ - చిటికెడు, పసుపు - 2 చెంచాలు, ఆవాలు - 3 చెంచాలు, జీలకర్ర - 3 చెంచాలు
తయారీ: నువ్వులను దోరగా వేయించి, మెత్తగా పొడి చేసుకోవాలి. ఓ గిన్నెలో నువ్వుల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, మెంతిపొడి, పసుపు, ఆవపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. కొద్దిగా నూనె వేడి చేసి... జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేసి వేయించాలి. చల్లారిన తర్వాత కలిపి పెట్టుకున్న పొడుల మిశ్రమంలో వేయాలి. తర్వాత వీటన్నిటినీ మామిడి ముక్కల్లో వేసి బాగా కలపాలి. కొన్ని నువ్వుల్ని దోరగా వేయించి వాటిని కూడా కలిపి, తర్వాత జాడీలో వేసి నిండుగా నూనె వేయాలి.
 
ఆత్రేయపురం రండి...
ఆత్రేయపురం పూతరేకులు ఎంత ఫేమస్సో, పచ్చళ్లూ అంతే ఫేమస్. మా ఊళ్లో చాలా కుటుంబాలు పచ్చళ్ల వ్యాపారం మీదే ఆధారపడి జీవిస్తున్నాయి. దాదాపు మూడు వేల కుటుంబాలు రుణాలు తెచ్చుకుని మరీ పచ్చళ్లు తయారు చేస్తున్నాం. యేటా దాదాపు వంద కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతాయి ఇక్కడ.  సీజన్‌కి తగ్గట్టుగా పచ్చళ్లు చేసినా, వేసవిలో పని మరింత ఎక్కువ ఉంటుంది. మేం తయారు చేసిన పచ్చళ్లు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి.
- పెన్నాడ గాంధీ, పచ్చళ్ల వ్యాపారస్తుడు, ఆత్రేయపురం
 

జబ్బ బలం... కాయ ఖతం
పదిహేనేళ్లుగా ముక్కలు కొట్టే పని చేస్తున్నాను. యేటా మే నెల నుంచి జూన్ మొదటి వారం వరకూ చేతి నిండా పని ఉంటుంది. చాలామంది వచ్చి మామిడి కాయలు కట్ చేయించుకుని వెళ్తుంటారు. కాయకి మూడు నుంచి ఐదు రూపాయల వరకూ తీసుకుంటాను. మరీ అంత తీసుకుంటే ఎలా అని కొందరు అంటుంటారు. కానీ ఏం చేస్తాం? ముక్కలు కొట్టడం అంత తేలికైన పనేమీ కాదు. చాలా బలం ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ మాత్రం తీసుకోకపోతే గిట్టుబాటు కాదు కదా!
- అబ్దుల్, మెహదీపట్నం రైతుబజార్
 

గుంటూరుతో గేమ్స్ వద్దు
ఆవకాయ అనగానే అందరికీ గుర్తొచ్చేది గుంటూరే. పల్నాడు ప్రాంతంలో పండే మిరపతో పెట్టే ఆవకాయ రుచి మరి దేనికీ రాదన్నది అందరూ అనేమాట. ఇక్కడ ఏ యేటికా ఏడు వ్యాపారం పెరుగుతూ ఉండటానికి కారణం ఆ నమ్మకమే. ఆ నమ్మకాన్ని పాడు చేయకూడదని పూర్వం నుంచి పెద్దవాళ్లు పాటించిన విధానాలనే మేము ఇప్పటికీ పాటిస్తున్నాం. రెడీమేడ్ పొడులు వాడం. మేమే ఇళ్లలో పొడులు తయారు చేసుకుంటాం. నాణ్యమైన నువ్వుల నూనె వాడుతున్నాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఇప్పటికీ మా పచ్చళ్లకు ఆదరణ తగ్గలేదు. మా జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి.
- పొదిలే రమాదేవి, అతిథిగృహ ఫుడ్స్, గుంటూరు
 
జాడీ... మామిడీ... మేలైన జోడీ...
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పచ్చళ్ల వ్యాపారం పెద్ద స్థాయిలో జరుగుతుంది. దాన్ని ఆధారంగా చేసుకునే రాజమండ్రి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో జాడీలు తయారు చేసే ఫ్యాక్టరీలు చాలా ఏర్పడ్డాయి. వీటి నుంచి వేల సంఖ్యలో జాడీలు రవాణా అయ్యేవి. అయితే ప్లాస్టిక్ డబ్బాల వాడకం పెరిగాక జాడీలు కొనేవాళ్లు తగ్గారు. దాంతో 42 యూనిట్లలో కేవలం మూడు మాత్రమే మిగిలాయి. పచ్చడి నిల్వ ఉండటానికి, ఆరోగ్యానికి హాని జరక్కుండా ఉండటానికి జాడీలే మంచివని ఎంత చెప్పినా ఎవరూ వినిపించుకోవడం లేదు.
- గొర్రిపాటి అప్పల్రాజు, తూ.గో. జిల్లా సెరామిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు
 
గోంగూర ఆవకాయ
కావలసినవి:
గోంగూర - 20 కట్టలు, నూనె - 1 కిలో, వెల్లుల్లి రెబ్బలు - 100 గ్రా., ఆవపిండి - 1 కప్పు, ఉప్పు - 1 కప్పు, కారం - 1 కప్పు, ఆవాలు - 4 చెంచాలు, మెంతిపిండి - 2 చెంచాలు
 తయారీ: గోంగూర ఆకుల్ని కాడల్నుంచి వేరు చేసి శుభ్రంగా కడగాలి. తర్వాత తడి పోయేలా నీడలో ఆరబెట్టాలి. ఆపైన నూనెలో వేయించి తీయాలి. ఆవాలు, వెల్లుల్ని రెబ్బల్ని కూడా నూనెలో వేయించి తీయాలి. ఓ గిన్నెలో గోంగూర, కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి వేసి బాగా కలపాలి. తర్వాత ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కలిపి జాడీలో వేయాలి. చివరగా నూనె పోసి మూత పెట్టాలి. కావాలంటే తాలింపులో వేరుశెనగలు, జీలకర్ర, ఇంగువ వంటివి కూడా వాడుకోవచ్చు.
 
ఉసిరి ఆవకాయ
కావలసినవి:
ఉసిరికాయలు - 2 కిలోలు, నూనె - 2 కిలోలు, కారం - అరకిలో, ఆవపిండి - అరకిలో, ఉప్పు - అరకిలో, మెంతులు - 50 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు - 100 గ్రా.
 తయారీ: మెంతుల్ని నూనె లేకుండా వేయించి పక్కన పెట్టాలి. ఉసిరికాయల్ని కడిగి, గాట్లు పెట్టి, తడి లేకుండా తుడిచి ఆరబెట్టాలి. తర్వాత వీటిని నూనెలో వేయించి తీయాలి. వీటిలో ఉప్పు, కారం, ఆవపిండి వేసి బాగా కలపాలి. తర్వాత మెంతులు, వెల్లుల్లి కూడా కలిపి జాడీలో వేయాలి. ముక్కలు మునిగేదాకా నూనె పోసి మూత పెట్టాలి.
 
మునగావకాయ
కావలసినవి:
మునక్కాయ ముక్కలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో, ఆవపిండి - అరకిలో, చింతపండు గుజ్జు - 1 కప్పు,  ఇంగువ - చిటికెడు, మెంతిపిండి - 4 చెంచాలు, జీలకర్ర పొడి - 2 చెంచాలు, వెల్లుల్లి రెబ్బలు - 50 గ్రా., నూనె - తగినంత, కరివేపాకు - 4 రెమ్మలు, ఆవాలు - 2 చెంచాలు, జీలకర్ర - 2 చెంచాలు
తయారీ: మునక్కాయ ముక్కల్ని కడిగి ఆరబెట్టాలి. తర్వాత వాటిని నూనెలో వేయించుకోవాలి. చల్లారిన తర్వాత కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ఆవపిండి వేసి కలిపి జాడీలో పెట్టెయ్యాలి. ముక్కలు మునిగేవరకూ నూనె పోసి మూత పెట్టాలి. రెండు రోజుల తర్వాత కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువతో పోపు పెట్టి పచ్చడిలో కలపాలి. మళ్లీ మూత పెట్టేసి రెండు రోజులు ఊరనిస్తే ఆవకాయ రెడీ.
 
కాలీఫ్లవర్ ఆవకాయ
కావలసినవి:
కాలీఫ్లవర్ ముక్కలు - 4 కప్పులు, నూనె - 2 కప్పులు, వెల్లుల్లి రెబ్బలు - అరకప్పు, కారం - 1 కప్పు, ఉప్పు - 1 కప్పు, ఆవపిండి - 1 కప్పు, పసుపు - 2 చెంచాలు
తయారీ: కాలీఫ్లవర్స్ ముక్కల్ని వేడి నీటిలో వేసి రెండు నిమిషాలు ఉంచి తీస్తే పురుగులు ఏమైనా ఉంటే పోతాయి. తర్వాత ఈ ముక్కల్ని ఎండలో ఆరబెట్టాలి. ఆపైన నూనెలో దోరగా వేయించి తీసేయాలి. ఈ ముక్కల్లో ఉప్పు, ఆవపిండి, కారం, పసుపు వేసి బాగా కలపాలి. చివరగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి, జాడీలో పెట్టి, నూనె పోసి మూత పెట్టెయ్యాలి. ఇష్టమైతే తాలింపు వేసుకోవచ్చు.
 
నిమ్మ ఆవకాయ
కావలసినవి:
నిమ్మకాయలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఆవపిండి - 50 గ్రా., మెంతిపిండి - 6 చెంచాలు, ఉప్పు - అరకిలో, నూనె - సరిపడా, ఆవాలు - 4 చెంచాలు, ఎండు మిరపకాయలు - 15, కరివేపాకు - 1 కట్ట, వెల్లుల్లి రెబ్బలు - 1 కప్పు
తయారీ: నిమ్మకాయల్ని నాలుగు బద్దలుగా నిలువుగా కోసుకోవాలి. జాడీలో ఓ పొర నిమ్మకాయ ముక్కలు, ఓ పొర ఉప్పు... ఇలా పొరలు పొరలుగా వేసుకుని మూత పెట్టేయాలి. మూడు రోజుల తర్వాత ముక్కల్ని తీసి ఎండలో పెట్టాలి. నిమ్మరసం ఊరి జాడీలో పడుతుంది. దాన్ని కూడా ఎండలో పెట్టాలి.

ఎండ తగ్గాక తీసి రెండిటినీ జాడీలో వేసి మూత పెట్టాలి. మూడు రోజుల పాటు ఇలానే చేయాలి. తర్వాత ముక్కల్ని ఓ బేసిన్‌లో వేసుకుని.. ఆవపిండి, మెంతిపిండి, కారం కలిపి మళ్లీ జాడీలో పెట్టి, నిండా నూనె వేయాలి. మూడు రోజుల తర్వాత తీసి... ఎండుమిర్చి ముక్కలు, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు నూనెలో వేయించి, ఆ తాలింపును నిమ్మకాయ మిశ్రమంలో కలపాలి.
 
కాకర ఆవకాయ
కావలసినవి: కాకరకాయ ముక్కలు - 2 కిలోలు, ఉప్పు - అరకిలో, చింతపండు - పావుకిలో, కారం - అరకిలో, ఆవపిండి - 4 చెంచాలు, నూనె - తగినంత, ఆవాలు - 4 చెంచాలు, జీలకర్ర - 4 చెంచాలు, కరివేపాకు - 2 రెమ్మలు
తయారీ: కాకరకాయల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి, ముక్కలుగా కోసుకోవాలి. చింతపండులో నీళ్లుపోసి స్టౌమీద పెట్టాలి. మెత్తగా ఉడికాక దించేసి చల్లారబెట్టి, మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి, కాకరకాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. తర్వాత ఈ ముక్కల్లో చింతపండు గుజ్జు, కారం, ఆవపిండి, ఉప్పు వేసి కలిపి జాడీలో పెట్టి నూనె పోయాలి. రెండు రోజుల తర్వాత... జీలకర్ర, ఆవాలు, కరివేపాకుతో తాలింపు పెట్టి, ఆ తాలింపును పచ్చడిలో వేసి కలపాలి.
 
పెసర ఆవకాయ
కావలసినవి:
మామిడికాయ ముక్కలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో, పెసర పిండి - అరకిలో (రెడీమేడ్ కంటే పెసల్ని కాస్త వేయించుకుని, పిండి పట్టించి వాడుకుంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది), వెల్లుల్లి రెబ్బలు - 100 గ్రా., మెంతులు - 100 గ్రా.
తయారీ: మెంతుల్ని నూనె లేకుండా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఓ బేసిన్లో మామిడి ముక్కలు, కారం, ఉప్పు,పెసరపిండి వేసి బాగా కలపాలి. జాడీ తీసుకుని... కొన్ని ఆవకాయ ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కాసిన్ని మెంతులు... ఇలా పొరలుగా వేసుకోవాలి. చివరగా ముక్కలు మునిగేవరకూ నూనె వేసి మూత పెట్టెయ్యాలి. మూడు రోజుల తర్వాత మూత తీసి, ఒకసారి కలిపి మళ్లీ మూత పెట్టెయ్యాలి. రెండు మూడు రోజుల్లో ఆవకాయ రెడీ అయిపోతుంది.
 
టొమాటో ఆవకాయ
కావలసినవి:
టొమాటోలు - 2 కిలోలు, ఉప్పు - అరకిలో, కారం - అరకిలో, ఆవపిండి - 50 గ్రా., వెల్లుల్లి రెబ్బలు - 50 గ్రా., నూనె - సరిపడా, చింతపండు - పావుకప్పు, కరివేపాకు - 1 కట్ట, ఆవాలు - 6 చెంచాలు, ఎండుమిర్చి - 15
తయారీ: టొమాటోలను ముక్కలుగా కోసుకోవాలి. వీటికి ఉప్పు చేర్చి జాడీలో పెట్టాలి. మూడో రోజు తీసి ఎండలో పెట్టాలి. జాడీలోకి ఊరిన టొమాటో రసాన్ని కూడా ఎండలో పెట్టాలి. మళ్లీ సాయంత్రం రెండిటినీ కలిపి జాడీలో పెట్టేయాలి. మూడు రోజులు అలా ఎండబెట్టిన తర్వాత... టొమాటో ముక్కలు, రసం, చింతపండు కలిపి మిక్సీ పట్టాలి. మరీ పేస్ట్‌లా అవ్వకుండా కొంచెం ముక్కలుగా ఉండేలా చూసుకోవాలి. ఈ మిశ్రమానికి ఆవపిండి, ఉప్పు, కారం బాగా పట్టించి జాడీలో పెట్టి, మునిగేవరకూ నూనె పోయాలి. రెండు రోజుల తర్వాత  కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలను నూనెలో వేయించి పచ్చడిలో కలపాలి.
 
అల్లం ఆవకాయ
కావలసినవి:
మామిడికాయ ముక్కలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో, ఆవపిండి - అరకిలో, అల్లం - 200 గ్రా., వెల్లుల్లి రెబ్బలు - 200 గ్రా., మెంతులు - 25 గ్రా., జీలకర్ర - 25 గ్రా., ఎండుమిర్చి - 10, ఆవాలు - 2 చెంచాలు, నూనె - తగినంత
 తయారీ: అల్లం, వెల్లుల్లి రెబ్బల్ని శుభ్రం చేసి... నీళ్లు కలపకుండా మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. మెంతులు, జీలకర్రను వేయించి పొడి చేసుకోవాలి. ఈ పొడితో పాటు ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద మామిడి ముక్కల్లో వేసి కలపాలి. తగినంత నూనె వేసి కలిపి జాడీలో పెట్టాలి. మూడు రోజుల తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి పోపు పెట్టి, దాన్ని పచ్చడిలో కలపాలి.
 
డాక్టర్ ఆవకాయ!
 
 పచ్చిమామిడిలో విటమిన్ ‘బి’తో పాటు విటమిన్ ‘సి’ కూడా ఎక్కువ. ఈ రెండు విటమిన్ల కారణంగా మామిడికాయ పచ్చడితో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మన శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో ఈ రెండు విటమిన్లు తోడ్పడతాయి.
ఆవపిండిలో మినరల్స్ ఎక్కువ. పైగా క్యాన్సర్‌తో పోరాడే శక్తి ఉంటుంది. అలాగే మెంతిపిండిలో ప్రోటీను, విటమిన్ సి, నియాసిన్, పొటాషియమ్, ఐరన్ ఉంటాయి. ఫలితంగా శరీరానికి అవసరమైన కీలక పోషకాలు, మైక్రోన్యూట్రియెంట్స్ లభ్యమవుతాయి. మామిడిలోని పీచుతో పాటు, మెంతిలోని పీచు కలిసి శరీరానికి అవసరమైన ఫైబర్‌ని సమకూరుస్తాయి. ఇక మెంతుల్లో కొలెస్ట్రాల్ తగ్గించే గుణం ఉండటం వల్ల గుండెజబ్బుల ఆస్కారం తగ్గుతుంది.
ఆవకాయలో ఉపయోగించే వెల్లుల్లిలో యాంటీక్యాన్సర్ గుణాలు ఉండటం వల్ల ఇది క్యాన్సర్‌ను నిరోధించడంతో పాటు, కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తుంది.
నువ్వుల నూనెలో మెగ్నీషియమ్ పుష్కలంగా ఉంటుంది. దానిలో రక్తపోటును తగ్గించే గుణాలతో పాటు, డయాబెటిస్‌నూ నివారించే గుణాలున్నాయి. ఈ రెండు గుణాలూ కలగలసి ఉండటం వల్ల గుండెజబ్బులూ తగ్గుతాయి. కాబట్టి ఆవకాయలో నువ్వుల నూనెను ఉపయోగించడం ఎంతైనా ఉత్తమం.
కొందరు ఆవకాయలో పల్లీల నూనె (వేరుశెనగనూనె)ను వాడతారు. పల్లీ నూనె మంచిదే. దీనివల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఎందుకంటే 100 గ్రాముల నూనెలో 884 క్యాలరీల శక్తి ఉంటుంది. పల్లీ నూనెలోని ఒమెగా - 6 ఫ్యాటీ ఆసిడ్స్ శరీరానికి మంచి పోషకాలు ఇస్తాయి.పైగా ఇందులోని యాంటీఆక్సిడెంట్లు వయసు తగ్గినట్లు కనిపించడానికి సాయం చేస్తాయి. అలాగే ఎన్నో క్యాన్సర్లను, ఆల్జైమర్స్ వంటి కొన్ని వ్యాధులను సమర్థంగా నివారించేందుకు పోరాడతాయి. (ఆవకాయలో నువ్వుల నూనె లేదా పల్లీల నూనె ఉపయోగించడం వ్యక్తిగత అభిరుచిమీద ఆధారపడి ఉంటుంది.  పల్లీల నూనెతో రుచి ఎక్కువ. నువ్వుల నూనెలో పోషకాలు ఎక్కువ).
 
మితిమీరితే అనర్థమే...
పోషకగుణాలు ఉన్నప్పటికీ కొత్త ఆవకాయతో అనర్థాలూ ఉన్నాయి.   పచ్చడి చెడిపోకుండా ఉండేందుకు ఉప్పును ఎక్కువగా వేసి ప్రిజర్వేటివ్‌లా ఉపయోగిస్తారు. దాని వల్లబీపీ పెరిగే అవకాశాలు ఎక్కువ  ఇక పచ్చడిలో కారంపాళ్లు అధికంగా ఉండటం వల్ల కడుపులో ఏవైనా పుండ్లు, అల్సర్లు ఉంటే అవి మరింతగా మంట పుట్టించవచ్చు  నూనెలో ఉండే కొవ్వు పదార్థాలు ఆలస్యంగా జీర్ణమయ్యే గుణాలను కలిగి ఉంటాయి. దాంతో కొందరిలో పచ్చడి తిన్నప్పుడు జీఈఆర్‌డీ (గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్) లక్షణాలు కనిపిస్తూ, ఛాతిలో మంట (హార్ట్‌బర్న్) అనిపిస్తుంటుంది. కాబట్టి పచ్చడి వేసుకునే సమయంలో నూనెను తక్కువగానే వేసుకోవాలి. పైగా నూనెలోని కొవ్వులు గుండెకు అంత మేలు కూడా కాదు.  
 - సుజాత స్టీఫెన్, న్యూట్రిషనిస్టు
 
పికిల్ ప్రికాషన్స్
పచ్చడి పెట్టేముందు కాయల ముచికలు కోసేసి, ఒకట్రెండు గంటల పాటు నీటిలో వేసి ఉంచాలి. దానివల్ల సొన అంతా కారిపోతుంది. తర్వాత కాయల్ని శుభ్రంగా కడిగి, తుడిచి, తడి ఆరాక కోసుకోవాలి.
వాడే పాత్రలు, గరిటెలు, నిల్వ చేసే జాడీలు అన్నీ శుభ్రంగా కడిగి, తడి లేకుండా ఆరబెట్టాలి.
పచ్చడి జాడీలో వేసిన తర్వాత గుడ్డ చుడతారు. ఆ గుడ్డ కచ్చితంగా శుభ్రమైనదై ఉండాలి.
స్టీలు, రాగి, ప్లాస్టిక్ డబ్బాల్లో పచ్చడిని భద్రపర్చకూడదు.
ఒకవేళ చేతితో కలుపుతుంటే చేతికి తడి లేకుండా చూసుకోవాలి. గరిటెతో కలపాలి అనుకుంటే చెక్క గరిటెతో కలపడం మంచిది. అలాగే పచ్చడి జాడీలోంచి తీసుకున్న ప్రతిసారీ తడి గానీ, చల్లని గాలి గానీ తగలకుండా జాగ్రత్తపడాలి.
పచ్చడి జాడీలో వేశాక ఊరేలోపు అప్పుడప్పుడూ చెక్ చేసుకోవాలి. నూనె సరిపోకపోతే వెంటనే నూనె వేసుకోవాలి. లేకపోతే బూజు వచ్చేస్తుంది.
పచ్చడికి ఏ నూనె పడితే ఆ నూనె వాడకూడదు. మంచి వేరుశెనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగుంటుంది.
వీలైనంత వరకూ రెడీమేడ్ పిండి కాకుండా ఇంట్లో తయారు చేసుకున్న ఆవపిండి, మెంతిపిండి వాడితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
 
పదార్థాల్లో శార్దూలం
 సీ. మామిళ్లముక్కపై మమకారమున్ జల్లి అందింపంగా జిహ్వ ఆవకాయ
 ఎండకాలమునందు ఎండిపోయిన గుండెకు అభినందనము దెల్పు నావకాయ
 కూరలే లేనిచో కోమలి వేయుచో అనురాగమున్ జూపు నావకాయ
 చీకుచున్నను గాని పీకుచున్నను గాని ఆనందమే ఇచ్చు నావకాయ
 
 ఆపదల నాదుకొను కూర ఆవకాయ
 అతివ నడుమైన జాడీయె ఆవకాయ
 ఆంధ్రమాత సింధూరమ్మె ఆవకాయ
 ఆంధ్రదేశమ్మె తానొక్క ఆవకాయ
 - మహాసహస్రావధాని డా. గరికపాటి నరసింహారావు
 
ముక్క మహత్తరి
మామిడి, ఆవాలు, మిరపకాయలు అని ఆవకాయలో మూడు ద్రవ్యాలుంటాయి. వాటిలో ఆవాలతో సర్షప హోమం, మిర్చితో ప్రత్యంగిరా హోమం, మామిడి ముక్కలు, కారంతో భగళాముఖి హోమం చేస్తారు. చూతవృక్షం అంటే మామిడి చెట్టు దైవవృక్షం. అంచేతనే సంప్రదాయ కుటుంబాలలో ఆవకాయను మడిగా పెడతారు. దానిని మడిగా కొయ్యజాడీలలో పెట్టి అటకెక్కిస్తారు. కావలసినప్పుడల్లా మడిగానే తీసుకుని వాడుకుంటారు. ఇక మాగాయ పచ్చడి గురించి పోతన భాగవతంలో పద్యాలు కూడా ఉన్నాయి. దానిని శ్రీకృష్ణుడికి నివేదన ద్రవ్యంగా వాడతారు. కొన్ని గిరిజన కుటుంబాలలో ఇప్పటికీ కూడా తమ దేవతకు పెరుగన్నంలో ఆవకాయ వేసి నివేదన చేస్తుంటారు. అంటే ఆవకాయ ఇప్పటిది కాదు.. ఎప్పటినుంచో ఉందన్నమాటేగా!
- డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు, పౌరాణిక పండితులు
 
ఎర్రగా నవ్వండి

భర్త: ఇవాళ ఏం వండావ్..?
భార్య: ఆవకాయ.. మీకిష్టమే కదా!

సేల్స్‌మేన్: ‘స్వచ్ఛభారత్’ సబ్బు తీసుకుంటారా..?
కస్టమర్: దీని స్పెషాలిటీ ఏంటి..?
సేల్స్‌మేన్: ఆవకాయ మరకల్ని కూడా ఇట్టే వదిలిస్తుంది.
 
పనిమనిషి: అమ్మా! కంచాలన్నీ శుభ్రంగా కడిగేసినట్లున్నారు.. నేనేం కడగాలి..?
ఆండాళు: కొత్తావకాయ వడ్డించా..! అందరూ శుభ్రంగా నాకేశారు. వాటినింకా కడగలేదు..
 
డోసుబాబుని నెలాఖర్లో మందుపార్టీకి ఆహ్వానించాడు గ్లాసుబాబు
డోసుబాబు: మందులోకి మంచింగ్ ఏంట్రా..?
గ్లాసుబాబు: ఓన్లీ ఆవకాయ్.. మన్దసలే బడ్జెట్ పార్టీ కదా..
 
మటన్ ఆవకాయ
కావలసినవి: మటన్ - 2 కిలోలు, కారం - కిలోన్నర, ఆవపిండి - 10 చెంచాలు, జీలకర్ర పొడి - 10 చెంచాలు, మెంతిపిండి - 10 చెంచాలు, ఆమ్‌చూర్ పౌడర్ - 10 చెంచాలు, పసుపు - 2 చెంచాలు, ఉప్పు - 1 కిలో, నూనె - తగినంత
తాలింపు కోసం:  ఎండుమిర్చి - 10, వెల్లుల్లి రెబ్బలు - పావుకిలో, కరివేపాకు - 4 రెమ్మలు, జీలకర్ర - 2 చెంచాలు, ఆవాలు - 2 చెంచాలు
తయారీ: మటన్‌ను ముక్కలుగా కోసి శుభ్రంగా కడగాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి ఉడికించి కాసేపు ఎండబెట్టాలి. తర్వాత వాటిని నూనెలో వేయించాలి. చల్లారాక మెంతిపిండి, ఆవపిండి, కారం, జీలకర్ర పొడి, ఆమ్‌చూర్ పౌడర్ వేసి బాగా కలపాలి. కొద్దిగా నూనె వేడిచేసి... కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలతో తాలింపు పెట్టాలి. ఈ తాలింపును మటన్ ముక్కల్లో వేసి కలిపి, మూత బిగుతుగా ఉండే జాడీలో వేయాలి. పచ్చడి అంతా మునిగేవరకూ నూనె పోసి మూత పెట్టెయ్యాలి. మూడు నాలుగు రోజులు ఊరిన తర్వాత తింటే బాగుంటుంది.
 
ఫిష్ ఆవకాయ
కావలసినవి:
చేపముక్కలు - 2 కిలోలు, కారం - 1 కిలో, అల్లం తురుము - పావుకప్పు, వెల్లుల్లి తురుము - పావుకప్పు, నల్ల మిరియాల పొడి - 4 చెంచాలు, వెనిగర్ - 5 చెంచాలు, పసుపు - 2 చెంచాలు, ఉప్పు - అరకిలో, నూనె - తగినంత
తయారీ: చేపముక్కలకు పసుపు, మిరియాల పొడి, ఉప్పు కలిపి అరగంట పాటు ఉంచాలి. తర్వాత ఈ ముక్కల్ని నూనెలో ఎరుపు రంగు వచ్చేవరకూ వేయించాలి. తర్వాత మరో గిన్నె స్టౌ మీద పెట్టి నూనె వేయాలి. వేడెక్కాక అల్లం తురుము, వెల్లుల్లి తురుము వేసి వేయించాలి. వీటిని చేపముక్కల్లో వేసి కలపాలి. కారం, వెనిగర్ కూడా వేసి కలిపి జాడీలో వేయాలి. ముక్కలు మునిగేవరకూ నూనె పోసి మూత బిగించాలి. ఒకట్రెండు రోజులు ఊరనిస్తే పచ్చడి రెడీ అవుతుంది. కావాలంటే ముల్లు తీసేసి, మెత్తని భాగాన్ని ముక్కలుగా చేసుకుని కూడా పచ్చడి పెట్టుకోవచ్చు.
 
చికెన్ ఆవకాయ
కావలసినవి:
బోన్‌లెస్ చికెన్ - 2 కిలోలు, కారం - కిలోన్నర, ఆవపిండి - 10 చెంచాలు, జీలకర్ర పొడి - 10 చెంచాలు, మెంతిపిండి - 10 చెంచాలు, ఆమ్‌చూర్ పౌడర్ - 10 చెంచాలు, పసుపు - 2 చెంచాలు, ఉప్పు - 1 కిలో, నూనె - తగినంత
 తాలింపు కోసం:  ఎండుమిర్చి - 10, వెల్లుల్లి రెబ్బలు - పావుకిలో, కరివేపాకు - 4 రెమ్మలు, జీలకర్ర - 2 చెంచాలు, ఆవాలు - 2 చెంచాలు
తయారీ: చికెన్‌ను ముక్కలుగా కోసి శుభ్రంగా కడగాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి ఉడికించి ఓ రోజంతా ఎండబెట్టాలి. తర్వాతి రోజు ఈ ముక్కల్లో మెంతిపిండి, ఆవపిండి, కారం, జీలకర్ర పొడి, ఆమ్‌చూర్ పౌడర్ వేసి బాగా కలపాలి. కొద్దిగా నూనె వేడిచేసి... కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలతో తాలింపు పెట్టాలి. ఈ తాలింపును మటన్ ముక్కల్లో వేసి కలిపి, మూత బిగుతుగా ఉండే జాడీలో వేయాలి. పచ్చడి అంతా మునిగేవరకూ నూనె పోసి మూత పెట్టెయ్యాలి. మూడు నాలుగు రోజులు ఊరిన తర్వాత తింటే బాగుంటుంది.
 
రొయ్యల ఆవకాయ
కావలసినవి:
రొయ్యలు - 2 కిలోలు, నూనె - 2 కిలోలు, కారం - 1 కిలో, ఉప్పు - ముప్పావు కిలో, లవంగాల పొడి - 4 చెంచాలు, వెల్లుల్లి పేస్ట్ - 4 చెంచాలు, నిమ్మకాయలు - 5
తయారీ: రొయ్యల్ని శుభ్రం చేసి, ఐదు నిమిషాల పాటు వేడి నీటిలో వేసి ఉంచాలి. తర్వాత నీళ్లు తీసేసి, ఆరబెట్టాలి. తడి పోయిన తర్వాత నూనెలో వేయించుకోవాలి. తర్వాత వీటిలో లవంగాల పొడి, కారం, ఉప్పు, వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి నిమ్మరసం పిండాలి. తర్వాత పచ్చడిని జాడీలో వేసి, నూనె పోసి మూత పెట్టెయ్యాలి. నాలుగు రోజులు ఊరిన తర్వాత తీసుకుని తినవచ్చు.
 
జ్ఞాపకం
 
అప్పు చేసైనా ఆవకాయ పెట్టాల్సిందే!
ఇప్పుడంటే ఏ కాయ పడితే ఆ కాయతో ఏదో ఆవకాయ పెట్టామని పించుకుంటున్నాం కానీ, మా తాతయ్య హయాంలో మాత్రం ఆవకాయ పెట్టడమంటే ఓ వైభోగమే. వేసవి వచ్చీ రాగానే తాతయ్య ఆవకాయ, మాగాయ ఎట్లా పెట్టించాలా అని హడావుడి పడేవారు. మాది పెద్ద కుటుంబం కావడాన కనీసం వంద కాయలకు తక్కువ కాకుండా ఆవకాయ, అంతకు ఓ పాతిక ముప్పై కాయల పెచైర్ల మాగాయా పెట్టేవాళ్లు. ముందు సన్న ఆవాలు తెప్పించి, వాటిని చెరిగి, ఎండబెట్టి, ఆవపిండి కొట్టించేవారు.

బళ్లారి మిరపకాయలు కొనుక్కొచ్చి, తొడిమలు తీయించి ఎండబెట్టి, కారం కొట్టించేవారు. ఉప్పూ, పప్పునూనే ముందే సిద్ధంగా ఉండేవి. ఆనక తోటకు వెళ్లి, కాయలు కోయించి, గోతాల్లో తెచ్చి, మా మామ్మ ముందు పోసేవారు. ఆమె, అమ్మ, పిన్నులు, నాన్నగారి మేనత్తలు... అందరూ కలిసి తలా ఓ కత్తిపీట ముందేసుకుని కాయలన్నింటికీ ముచికలు తీసి, నీళ్లతొట్లో వేసేవారు. సొన అంతా పోయాక, వాటిని తీసి, బట్టతో శుభ్రంగా తుడిచిపెట్టేవాళ్లు. మా నాన్న, బాబాయిలు ముక్కలు కొట్టేవారు.

అంతసేపూ ‘టెంక చెదిరిపోతోంది, ముక్క నలిగిపోతోంది, కొంచెం పెద్ద ముక్కలు కొట్టండర్రా ... అలాగని మరీ పెద్దగా కాదు... వేళ్లు జాగర్త...’’ అంటూ తెగ హడావుడి పెట్టేవారు తాతయ్య. రాసులుగా తరిగిపోసిన మామిడికాయ ముక్కలు, ఉప్పు, ఆవపిండి, కారం, నూనె.. అన్నింటినీ  పెద్ద పెద్ద బేసిన్లలో పోసి, చేత్తోనే కలిపేసేది మామ్మ. మా ప్రభాతత్త రుచులు చూడటంలో స్పెషలిస్టు. తనకి నచ్చితే... అందరికీ నచ్చి తీరేది!
 
పచ్చడి కలిపిన బేసిన్‌లోనే మరో నాలుగ్గరిటెల ఆవకాయ వేసి, వేడి వేడి అన్నం అందులో దిమ్మరించి, ఆపైన ఆరారగా నెయ్యి వేసి, మా అందరికీ కలిపి ముద్దలు పెట్టేది మామ్మ. అప్పుడే కలిపిన ఆవఘాటుకి, కారానికి ముక్కుల్లోనుంచి, ఆ రుచికి కళ్లల్లోంచి నీళ్లు కారేవి అందరికీ. ఆ తర్వాత పచ్చడిని జాగ్రత్తగా చిన్న, పెద్ద జాడీల్లో వేసి, వాటి మూతికి వాసెన కట్టి పెట్టేది మామ్మ. ఓ రెండు మూణ్ణెల్లపాటు ఇంటికి బంధువులెవరొచ్చినా... ‘‘కొత్తావకాయ రుచి చూపించి కానీ పంపేవారు కాదు.

బాగా బతికినప్పుడు వంద, రెండువందల కాయలకు తక్కువ కాకుండా పచ్చడి పెట్టించిన తాతయ్య, చితికి పోయిన తర్వాత కూడా పచ్చళ్ల విషయంలో రాజీ పడలేదు. అప్పు చేసైనా సరే, ఆవకాయ పెట్టించి అందరికీ  రుచి చూపించేవారు. అందుకే పచ్చళ్ల సీజన్ వచ్చిందంటే మామ్మా తాతయ్యా కళ్ల ముందు మెదులుతూనే ఉంటారు.
- బాచి
 
మాగాయ
కావలసినవి:
మామిడికాయ ముక్కలు - 1 కిలో, కారం - పావు కిలో, ఉప్పు - పావుకిలో, మెంతిపిండి - 4 చెంచాలు, ఆవపిండి - 4 చెంచాలు, ఇంగువ - చిటికెడు, ఎండుమిర్చి - 10, పసుపు - చిటికెడు, ఆవాలు - 4 చెంచాలు, జీలకర్ర - 2 చెంచాలు
తయారీ: మామిడికాయలు చెక్కు తీసి, సన్నగా తరగాలి. వీటిలో ఉప్పు కలిపి రెండు రోజులు ఉంచాలి. ఈలోపు రసం బాగా ఊరుతుంది. రెండు రోజుల తర్వాత రసంలోంచి ముక్కలు వేరు చేసి ఎండబెట్టాలి. రసాన్ని కూడా కాసేపు ఎండలో ఉంచి తర్వాత  ఆవపిండి, మెంతిపిండి, కారం వేసి కలపాలి. తర్వాత ఇందులో ముక్కలు కూడా వేసి కలపాలి. చివరగా నూనె వేడిచేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువతో తాలింపు వేసి పచ్చడిలో కలపాలి. వెంటనే కాకుండా ఒకట్రెండు రోజుల తర్వాత తింటే బాగుంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement