విజయవాడలో ఈ నెల 18న ఒక చెత్తకుండీలో స్థానికులకు దొరికిన ఆడశిశువు
నా పేరు చెత్తకుండీ. మనుషులు నాలో చెత్తను పారేస్తారు. నా చెత్తను రీసైకిల్ చేసి బంగారంగా మార్చే వాళ్లున్నారు. కాని ఈ తెలివైన మనుషులే ఒక్కోసారి నా కడుపులో బంగారమే పారేసి పోతారు. అప్పుడు నాకు అనుమానం వేస్తుంది... చెత్తకుండీ నేనా? సమాజమా అని... నా పేరు సమాజం. చెత్తకుండీ అనేది కొద్దివరకు నిజమే కావచ్చు కాని... ఒక తల్లి బిడ్డను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఆమె కష్టం ఎంత పెద్దది కాకపోతే బిడ్డను పారేసి పోతుంది? అయినా సమాజాన్ని మించిన తల్లి లేదని... నేను ఎప్పుడూ నిరూపించుకుంటూనే ఉన్నాను. పేగు తెంచుకుంటేనే తల్లి కాదు... ఇంటి పేరు పంచుకుంటే కూడా తల్లి కావచ్చు...
- రామ్
ఎడిటర్,ఫీచర్స్
ఒక తల్లి పారేసుకుంది. కాని వేయిమంది తల్లులు చేతులు సాచారు. ఒక నిర్దయ వద్దనుకుంది. కాని లక్ష గుండెలు అక్కున జేర్చుకున్నాయి. కడుపున పుట్టిన బిడ్డను ఆ తల్లి వద్దనుకోవడానికి కారణాలు ఏమిటో ఎవరికి తెలుసు. ఆమె ఎదుర్కొంటున్న పరిస్థితుల నుంచి చూస్తే తప్ప ఆమె చేసింది మంచో చెడో తేల్చలేము. కాని విజయవాడలో జరిగిన ఆ సంఘటన మాత్రం ఒక విషయాన్ని నిర్థారిస్తోంది. అది- ఈ సమాజం ఒక దయగల అమ్మ అని, దానికి అమ్మతనం నిండుగా ఉంది అని.
తేది: జూన్ 18, 2015.
సమయం: తెల్లవారుజాము
ప్రాంతం: విజయవాడ
వర్షం కురుస్తోంది. జనసంచారం పలుచగా ఉంది. వీధులు ఊడ్చే రాజేశ్వరికి దూరం నుంచి పసిపాప ఏడుపు వినిపిస్తూ ఉంది. ఎక్కడి నుంచి ఆ ఏడుపు? చుట్టుపక్కల ఇళ్లలో ఎవరో తల్లి పిల్లకు పాలు ఇవ్వడం ఆలస్యం చేస్తున్నట్టుగా భావించింది. ఐదు నిమిషాలు... పది నిమిషాలు... ఏడుపు ఆగడం లేదు. రాజేశ్వరి పరీక్షగా చూసింది. ఆమె గుండె గుభిల్లుమంది. ఆ ఏడుపు వినిపిస్తున్నది ఇళ్ల నుంచి కాదు... దూరంగా ఉన్న చెత్తకుండీ నుంచి.
ఒక్క ఉదుటున చీపురు పారేసి అక్కడకు పరిగెత్తింది. ఆమె శరీరం ఒణికింది. కళ్లల్లో నీళ్లు ఉబికాయి. అక్కడొక శిశువు. అప్పుడే పుట్టింది. ఇంకా బొడ్డు పేగు రక్తపు చారలు కూడా ఆరలేదు. తల్లి ఒడిలో వెచ్చగా పడుకుని స్తన్యం అందుకోవాల్సిన ప్రాణం... ఇక్కడ ఆర్తనాదాలు చేస్తూ ఉంది.... వెంటనే ఒడిలోకి తీసుకుంది. ఊరుకోబెట్టింది. సాటి మనిషి స్పర్శ సోకడంతో పాప ఏడుపు ఆపింది.
వేయి చేతులు....
ఆనోటా... ఈ నోటా... చుట్టుపక్కల వారందరికీ ఈ సంగతి తెలిసింది. జనం పోగయ్యారు. తల్లికి దూరమైన పాప దైవంతో సమానం. అందరూ మాకు కావాలి మాకు కావాలి అని చేతులు సాచారు. పోలీసులు వచ్చారు. ఎవరికి ఇస్తే ఎటువంటి ఇబ్బందులు వస్తాయోనని పోలీసులు సమగ్ర శిశు అభివృద్ధి కేంద్రానికి అప్పగించారు. ఈతల్లులే కాదు వేలాది లక్షలాది మంది తల్లులు తమకు పిల్లలు ఉన్నా లేకపోయినా ఇలాంటి పసికందులను దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే దానికో పద్ధతి ఉంటుంది. నియమ నిబంధనలు ఉంటాయి. అవి పాటించి పాపను చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలి. లేకుంటే మున్ముందు సమస్యలు వస్తాయి. దొరికిన పాపను పెంచుకుంటే కొన్నాళ్లకు ఆ పాప సంబంధీకులు వచ్చి తీసుకువెళితే అప్పటి వరకూ పెంచుకున్న మమకారం వల్ల క్షోభ పడాల్సి వస్తుంది.
శిశుగృహ నుంచి ఈ పిల్లలను దత్తత తీసుకోవాలంటే...
♦ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాకు ఒక శిశుగృహ కేంద్రం ఉంటుంది. వీరిని నేరుగా సంప్రదించి, దరఖాస్తు చేసుకోవచ్చు.
♦ www.adoptionindia.nic.in కూడా లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవచ్చు.
♦ ఏడాది లోపు వయసున్న పిల్లలు కావాలంటే దంపతులిద్దరికీ కలిపి 90 ఏళ్ల లోపు వయసుండాలి. దంపతుల వయసు పెరిగే కొద్ది దత్తత పిల్లల వయసు కూడా పెరుగుతుంది.
చెత్తకుండీల్లో, ముళ్ల పొదల్లో, రోడ్డు వెంబడి, ఆసుపత్రులలో... రోజుల శిశువులను ఎవరైనా వదిలేసి వెళితే, వారిని తీసుకెళ్లి పెంచుకోకూడదు. ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలి. పోలీసులు, సీడీపీవో అధికారులు వెంటనే ఆ శిశువును స్థానిక శిశు గృహకు తరలించి, అన్ని సదుపాయాలను కల్పిస్తారు. అలాగే.. సీడీపీవో, పోలీసులు ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయేమో తెలుసుకుంటూ ఉండాలి. వెంటనే స్పందించాలి.
♦ దరఖాస్తు చేసుకునే దంపతులు తమ ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలియజేస్తూ ప్రభుత్వాసుపత్రి వైద్యుడితో ధృవీకరణ పత్రం తీసుకొని, ఇవ్వాలి.
♦ దంపతులు ఇరువురూ విడివిడిగా నాలుగు పాస్ పోర్ట్ సైజు ఫొటోలు, ఇద్దరూ కలిపి దిగినవి నాలుగు ఫొటోలు ఇవ్వాలి.
♦ వివాహ పత్రం (పెళ్లి కార్డు) జిరాక్స్ కాపీ, పెళ్లి సమయంలో ఇద్దరూ కలిసి దిగిన పోస్ట్ కార్డ్ సైజ్ ఫొటో ఇవ్వాలి.
♦ ఉద్యోగస్తులైతే జీతం సర్టిఫికెట్ ఇవ్వాలి. లేకుంటే నెలకు రూ. 6 వేల చొప్పున ఏడాదికి రూ. 72 వేలు ఆదాయం తగ్గకుండా ఉండాలి. వారు నివసించే ప్రాంతంలోని తహశీల్దార్ నుంచి ఆదాయ ధృవీకరణ పత్రం తీసుకోవాలి.
♦ ఉద్యోగస్తులైతే బ్యాంక్ స్టేట్‌మెంట్ ఒరిజినల్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ కాపీ ఇవ్వాలి.
♦ ఆస్తికి సంబంధించిన పత్రాల జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించి ఇవ్వాలి.
♦ చదువుకున్న వారైతే పదో తరగతి మార్కుల జాబితా అటెస్టేషన్ చేసి ఇవ్వాలి. చదువుకోని వారయితే రేషన్ కార్డు, ఓటర్ కార్డు జిరాక్స్ కాపీ ఇవ్వాలి.
♦ పిల్లలు కలిగే అవకాశం లేదని లేడీ డాక్టర్ నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్ ఇవ్వాలి.
♦ దరఖాస్తు చేసిన దంపతులు వారికి తెలిసిన ఇద్దరు వ్యక్తుల నుంచి వీరిద్దరూ భార్య భర్తలేనని, దత్తత తీసుకునే బిడ్డకు మంచి తల్లిదండ్రులుగా ఉంటారని, బిడ్డకు మంచి భవిష్యత్తు అందిస్తారని తెలియజేస్తూ సిఫార్సు లేఖలు ఇవ్వాలి.
♦ దరఖాస్తు చేసుకున్న వారు తమ పరిధిలోని పోలీస్‌స్టేషన్ నుంచి వెరిఫికేషన్ సర్టిఫికెట్ తీసుకురావాలి.
♦ రూ.6 వేల విలువ గల బ్యాంక్ డి.డిని అందజేయాలి.
♦ ఇవన్నీ పరిశీలించి, నిర్ధారించడంతో పాటు ముందుగా వచ్చిన దరఖాస్తుకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు.
- జి.పి. వెంకటేశ్వర్లు, సాక్షి ప్రతినిధి, విజయవాడ
రిజిస్ట్రేషన్ తప్పనిసరి
బంధువుల పిల్లలనైనా సరే దత్తతు తీసుకోవాలనుకుంటే ‘అడాప్షన్ డీడ్’ను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అన్ని పత్రాలు ఉండాలి. లేదంటే భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశాలు అధికం. రిజిస్ట్రేషన్ చేయకుండానే దత్తతు తీసుకున్న తల్లిదండ్రులు చనిపోతే, ఆ తర్వాత ఆస్తుల విషయంలో పిల్లలకు అన్యాయం జరిగే అవకాశాలు ఎక్కువ. చట్టబద్ధంగా దత్తతు వెళ్లిన పిల్లలకు సొంత తల్లిదండ్రుల ఆస్తిలో వాటా వర్తించదు.
- హజీమ్‌ఖాన్, న్యాయవాది