Panyala jagannath das
-
మనశ్శాంతి ఉండడం లేదా?
సంపద, హోదా వంటివి ఎన్ని ఉన్నా, ఇంట్లో పరిస్థితులు ప్రశాంతంగా లేకపోతే ఏమాత్రం మనశ్శాంతి ఉండదు. దంపతుల మధ్య తరచు తగవులు, మనస్పర్థలు తలెత్తుతున్నట్లయితే, ఎంత సంపద ఉన్నా, జీవితంలో సంతృప్తి కొరవడుతుంది. ఇలాంటి పరిస్థితిని అధిగమించాలంటే.. ♦ ప్రతిరోజూ ఉదయం గోవులకు, శునకాలకు గోధుమలతో తయారు చేసిన రొట్టెలను ఆహారంగా పెట్టండి. పక్షులకు ఆహారంగా జొన్న గింజలు వేయండి ♦ సాయంత్రం వేళ పడక గదిలో కర్పూరం వెలిగించండి. పడక గదికి తెలుపు, లేత నీలం, లేత గులాబి రంగులు మాత్రమే ఉపయోగించండి. పడక గది గోడలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపు, పసుపు కలగలసిన రంగులను ఉపయోగించకండి. ♦ఆలయాలు సందర్శించేటప్పుడు ఎవరైనా వృద్ధ దంపతులు కనిపిస్తే, పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు పొందండి. ♦ దుస్తులు, పరిమళ ద్రవ్యాలు, అలంకరణ వస్తువులు వంటివి కొనాలనుకుంటే, వీలైనంత వరకు వాటిని శుక్రవారం రోజున కొనండి. ♦ ఏదైనా శుక్రవారం రోజున శివాలయాన్ని దర్శించి, ఆలయ పూజారికి కిలోన్నర బొబ్బర్లు, కిలోన్నర పంచదార, తెల్లని పంచె దానం చేయండి. – పన్యాల జగన్నాథదాసు -
భయంగా ఉంటోందా?
జీవితంలో కొన్ని సమస్యలు చెప్పుకోవడానికి చాలా చిన్నవిగానే అనిపిస్తాయి. అనుభవించిన వాళ్లకు మాత్రమే వాటి బాధ అర్థమవుతుంది. తరచుగా అలాంటి చిన్నా చితకా సమస్యలు ఎదురవుతూ ఉన్నట్లయితే ఈ పరిహారాలను పాటించండి.ఆర్థిక ఇక్కట్లు, ఆరోగ్య బాధలు లేకపోయినా, ఒక్కోసారి ఏదో తెలియని భయం వెంటాడుతుంటుంది. అప్పుడు అశ్వగంధ వేరును బూడిదరంగు దారంలో కట్టి మెడలో వేసుకోండి. అలాగే, అశ్వగంధాది లేహ్యాన్ని రెండుపూటలా సేవించండి. కొందరికి సాధారణ సమయాల్లో మామూలుగానే ఉన్నా, ప్రయాణాలు చేసే సందర్భాల్లో తెలియని భయాలు కలుగుతుంటాయి. అలాంటప్పుడు ప్రయాణానికి బయలుదేరే ముందు కాలభైరవుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించండి. కొందరు విద్యార్థులు బాగానే చదివినా పరీక్షలంటే తగని భయం ఏర్పడుతుంది. పరీక్షల పట్ల విపరీతమైన భయంతో ఇబ్బంది పడే విద్యార్థులకు తల్లి చేతుల మీదుగా మెడలో వెండి హారాన్ని ధరింపజేయాలి. అలాగే, పరీక్షలంటే భయపడే విద్యార్థులు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. కొందరికి తరచుగా పీడకలలు వస్తుటాయి. కలల్లో తరచుగా క్రూరమృగాలు, పాములు, భూతప్రేత పిశాచాదులు కనిపించి ఉలిక్కిపడి నిద్రలేస్తుంటారు. ఆ తర్వాత భయంతో ఒక పట్టాన నిద్రపట్టదు. పీడకలలు భయపెడుతున్నట్లయితే, సంజీవని పర్వతం మోస్తున్న ఆంజనేయుడి బొమ్మ గల వెండి లేదా రాగి లాకెట్‌ను ఎర్రతాడుతో మెడలో వేసుకోండి. ప్రతి మంగళవారం ఉదయం ఆంజనేయ ఆలయంలో దర్శనం చేసుకుని, ఆలయం వెలుపల ఉండే యాచకులకు అరటిపండ్లు పంచిపెట్టండి. – పన్యాల జగన్నాథ దాసు -
రుణబాధలు పీడిస్తున్నాయా?
నిత్యం కొందరికి ఆదాయానికీ వ్యయానికీ పొంతన ఉండదు. ఏదో ఒక ఇబ్బంది ముంచుకొస్తూ అప్పుల ఊబిలోకి నెట్టేసే పరిస్థితులు ఎదువుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యను అధిగమించాలంటే... ► ప్రతిరోజూ అంగారక స్తోత్రాన్ని పఠించాలి. మంగళవారం రోజున పురోహితులకు ఏడు కిలోల కందులు, ఒకటిన్నర కిలోల బెల్లం, ఎర్రని వస్త్రాలు తగిన దక్షిణతో కలిపి దానంగా ఇవ్వాలి ► సోమవారం ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్లి, శివలింగానికి వరిపిండితో అభిషేకం చేయించాలి. లేదా ఇంట్లోనే పూజామందిరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి వరిపిండితో అభిషేకం చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని కనీసం పదకొండు వారాలు పాటించాల్సి ఉంటుంది ►శ్రీ లక్ష్మీనృసింహ రుణ విమోచన స్తోత్రాన్ని అనుదినం పఠిం చాలి. వీలుంటే నారసింహ క్షేత్రాన్ని దర్శించుకుని, స్వామివారికి చందనం. పూలు, పాలు, తేనె, పానకం సమర్పించాలి ► శుక్రవారం రోజున ఆకలితో ఉన్నవారు తారసపడితే వారికి తృప్తిగా భోజనం పెట్టండి. కనీసం ఐదు ఆదివారాలు ఆవుకు బెల్లం కలిపి చేసిన రొట్టెలు స్వయంగా తినిపించండి ►ఇంట్లో నగదు, విలువైన వస్తువులను భద్రపరచే బీరువా, క్యాష్‌బాక్స్ వంటి వాటిలో చిన్న సైజులో ఉండే చింతచెట్టు కొమ్మను కూడా ఉంచండి. బీరువా, క్యాష్బాక్స్లలో ఏడు డేగ ఈకలను ఉంచినా ఫలితం ఉంటుంది. – పన్యాల జగన్నాథ దాసు -
ఇంట్లో తరచు చికాకులా..?
అన్నీ ఉన్నా కొందరికి అల్లుడి నోట్లో శని అన్నట్లు... కొందరి ఇంట్లో నిత్యం ఏవేవో చికాకులు. ఎవరికీ మనశ్శాంతి ఉండదు, అనారోగ్యాలు, అనవసర కోపతాపాలు వంటివి నిత్యకృత్యంగా కొనసాగుతూ ఉంటాయి. ప్రతికూల గ్రహస్థితులు, ప్రతికూల గ్రహాల దశలు జరిగే సమయంలో ఇలాంటి ఇబ్బందులు పట్టి పీడిస్తాయి. అలాంటి వాటి నుంచి ఉపశమనం పొందాలంటే... ♦ చీమలకు ఆహారంగా చీమల పుట్టల వద్ద పంచదార వేయండి. వీలు కుదిరినప్పుడల్లా ఆడపిల్లలకు మిఠాయిలు తినిపించండి. ఈ పనులకు వారం వర్జ్యాలు చూసుకోవాల్సిన అవసరం లేదు. ♦ కుంకుమ, కర్పూరం పొట్లంగా కట్టి, నిద్రించేటప్పుడు తలదిండు కింద పెట్టుకోవడం వల్ల కొంత వరకు చికాకులు తొలగుతాయి. ♦శివాలయంలో నమక చమక పారాయణం చేస్తూ శివలింగానికి జలాభిషేకం చేయండి. ఇలా కనీసం ఇరవై ఒక్క సోమవారాలు కొనసాగిస్తే ఫలితం ఉంటుంది. ♦ఆంజనేయ ఆలయంలో మంగళవారం సిందూరాన్ని, ఎరుపు రంగు వస్త్రాన్ని దానం చేయండి. ఆలయం బయట ఉండే పేదలకు అరటిపండ్లు పంచిపెట్టండి. ♦ బాగా నూనె ఓడుతూ ఉండే పదార్థాలను తినడం పూర్తిగా మానేయండి. ఇంటి ప్రవేశద్వారానికి పసుపురంగు కర్టెన్లు వాడండి. ♦ ప్రతి శనివారం చందనం కలిపిన నలుగుపిండితో స్నానం చేయండి. తర్వాత ఆంజనేయ ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆలయం వద్ద పేదలకు నువ్వుండలను పంచిపెట్టండి. – పన్యాల జగన్నాథదాసు -
అందరం పదహరే!
కొత్త సంబరం పైలా పచ్చీసు దూకుడుకు ఇంకా టైముంది గానీ, ప్రస్తుత సహస్రాబ్ది పడుచు పదహారులో పడుతోంది. పదహారు ప్రాయం అంటే నవ యవ్వన వనాన్ని తొలకరి పలకరించే పడుచుప్రాయం. పదహారు ప్రాయంలో ఇటు బాల్యచాపల్యాలూ ఉంటాయి, అటు యవ్వనోద్రేకాలూ ఉంటాయి. పదహారు ప్రాయంలో పడుతున్న ఇరవై ఒకటో శతాబ్ది... ఇక బాల్యావస్థను అధిగమిస్తున్నట్లే లెక్క! ఆకు రాలు కాలం వెళ్లిపోతూ యవ్వన వనానికి వసంతం విచ్చేస్తున్నట్లే లెక్క! పదహారేళ్ల ప్రాయం అంటే కలలు కనే ప్రాయం. కలల సాకారానికి ప్రయత్నాలు సాగించే ప్రాయం. లోకం పోకడకు ఎదురీదే తెగువ మొలకెత్తే ప్రాయం. భవిష్యత్తు మీద అందమైన ఆశలు రేకెత్తే ప్రాయం. పదహారేళ్ల ప్రాయం అంటే ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునే ప్రాయం. ఆకర్షణల వలయంలో పరిభ్రమించే ప్రాయం. కష్టాలను, కన్నీళ్లను తేలికగా తుడిచిపెట్టేసే టేకిటీజీ ప్రాయం. సంతోషాలను, సంబరాలను పదిమందికీ పంచిపెట్టే సందడి ప్రాయం. పదహారేళ్ల వయసులో ఊహలు నింగిలో విహరిస్తుంటాయి. నిశిరాత్రి వేళ అక్కడ మెరిసే చుక్కల్లా మెరుస్తుంటాయి. ఆ వయసులో ఉన్న వాళ్ల కళ్లలో కనిపించేది ఆ మెరుపే! పడుచు పదహారులో కొత్త కొత్త ఆశలు చిగురిస్తూ ఉంటాయి. అందుకే ఆ వయసులోని వాళ్లంతా నడిచొచ్చే వసంతాల్లా ఉల్లాసంగా ఉంటారు. పచ్చిక మీదుగా వీచే నులివెచ్చని పైరగాలిలా తాజా తాజాగా ఉంటారు. నిన్నకు సెలవిచ్చేసి, నేటిలో జీవిస్తూ, రేపటివైపు సుస్పష్టంగా చూపు సారించే శక్తి పదహారేళ్ల కుర్రకారుకు మాత్రమే ఉంటుంది. జీవితంలోని చేదును చెరిపేసి, బతుకు తీపిని ఆస్వాదించే సత్తా కూడా వాళ్లకు మాత్రమే ఉంటుంది. అందుకే స్వీట్ సిక్స్‌టీన్‌లో ఉన్నవాళ్లు ముందుతరం దూతలు. ఇదిగిదిగో! ఈ సహస్రాబ్ది కుర్రకారులో పడుతోంది. ఉరకలెత్తే ఉత్సాహమే ఊపిరిగా ముందుకు సాగబోతోంది. ఆకు రాలు లోకంలోకి ఆశలు మోసుకొస్తూ ఆమని రుతు రాగాన్ని ఆలపించబోతోంది. ఇదిగిదిగో! ఈ సహస్రాబ్ది పసితనాన్ని వీడి పడుచుప్రాయంలోకి అడుగిడుతోంది. ఊహల ఉత్తేజంతో రెక్కలు విచ్చుకుని వినువీధిలో విహంగంలా విహరించబోతోంది. ఇదివరకు శరవేగానికే జనం అబ్బురపడేవాళ్లు. వేగమే వేదంగా మొదలైన ఈ సహస్రాబ్ది, పదహారు ప్రాయంలో మనోవేగాన్ని అధిగమిస్తుందేమో చూడాలి. ఈ సహస్రాబ్ది వేకువలో పుట్టిన వాళ్లందరూ స్వీట్ సిక్స్టీన్లోకి అడుగుపెట్టే తరుణం ఇది. స్వీట్ థాట్స్ తెచ్చిపెట్టే ఉల్లాసోత్సాహాలన్నీ వాళ్ల సొంతం. మాజీ యువకులందరూ స్వీట్ మెమొరీస్‌ను నెమరు వేసుకునే తరుణం కూడా ఇది. గతానుభవాలతో పోగు చేసుకున్న పరిణతితో కూడిన నిండుతనం వాళ్ల సొంతం. ఆశయాలకు అనుభవం తోడై, ఈ సహస్రాబ్ది ఆశించిన లక్ష్యాలను చేరుకుంటుందనే ఆశిద్దాం. అడుగులు తడబడే పసిప్రాయంలో తప్పటడుగులు సహజమే! పడుచు ప్రాయం వాటిని దిద్దుకుంటుందనే ఆశిద్దాం. పట్టుదల పెంపొందే పదహారు వయసులో భావి లక్ష్యాలను నిర్దేశించుకుంటుందనే ఆకాంక్షిద్దాం. సహస్రాబ్ది అడుగిడుతున్న పడుచు పదహారును మనసారా స్వాగతిద్దాం. - పన్యాల జగన్నాథ దాస్ -
క్రీస్తుపూర్వమే సెన్సార్షిప్
ప్రజలు ఏది చూడాలో, ఏది చదవాలో, ఏది వినాలో ప్రభుత్వాలు నిర్ణయించే పద్ధతి ఈనాటిది. రోమన్ సామ్రాజ్యంలో క్రీస్తుకు శతాబ్దాల పూర్వమే ఇలాంటి పద్ధతి ఉండేది. ప్రజల నైతిక వర్తనను నియంత్రించేందుకు రోమన్ ప్రభుత్వం సెన్సార్ అధికారులను నియమించేది. వారికి ఒక ప్రత్యేక విభాగమే ఉండేది. రోమన్ రాజ్యంలో ఆ విభాగం క్రీస్తుపూర్వం 443 నుంచి క్రీస్తుపూర్వం 22 వరకు పనిచేసినట్లు ఆధారాలు ఉన్నాయి. రోమన్ రాజ్యానికి చేరువలోనే ఉన్న గ్రీకు సామ్రాజ్యంలోనూ క్రీస్తుపూర్వం 399 నాటి నుంచి సెన్సార్షిప్ అమలులోకి వచ్చింది. యువకులను చెడగొడుతున్నాడనే నెపంతో సోక్రటీసును విషమిచ్చి చంపేసిన తర్వాత, సాక్షాత్తు సోక్రటీసు శిష్యుడైన ప్లాటోనే సెన్సార్‌షిప్‌కు సానుకూల సిద్ధాంతాన్ని తెర మీదకు తెచ్చాడు. పిల్లలు ఏది చూడాలో, ఏది వినాలో, ఏది చదవాలో నియంత్రించడం సమాజానికి గల నైతిక బాధ్యత అని తన గ్రంథం ‘ద రిపబ్లిక్’లో ప్రకటించాడు. ఇక క్రీస్తుపూర్వం 213లో చైనా చక్రవర్తి కిన్ షి హువాంగ్ కఠినాతి కఠినమైన సెన్సార్షిప్ను అమలులోకి తెచ్చాడు. వ్యవసాయం, వైద్యం, మతబోధనలు మినహా మరే రకమైన పుస్తకాలను ప్రజలు చదవరాదని శాసించాడు. అంతటితో ఆగకుండా మిగిలిన పుస్తకాలన్నింటినీ వెతికించి మరీ తగులబెట్టించాడు. అంతటి దారుణమైన పరిస్థితుల్లోనూ కన్ఫూషియస్ అనుయాయులు కొందరు వీలైనంత వరకు ఆయన రచనలు నాశనం కాకుండా కాపాడగలిగారు. దురదృష్టమేమిటంటే, ప్రజాస్వామిక యుగం ఆవిర్భవించిన తర్వాత కూడా చాలా దేశాల్లో సర్కారీ సెన్సార్షిప్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కూర్పు: పన్యాల జగన్నాథ దాసు -
‘రోబోటిక్స్’ను సృష్టించిన రచయిత
పీఛేముడ్ సైన్స్ ఫిక్షన్ రచనలకు పితామహుడు అనదగ్గ రచయిత ఇసాక్ అసిమోవ్. రికార్డుల్లో ఆయన 1920 జనవరి 2న పుట్టినట్లుగా నమోదైనా, ఆయన అంతకు ముందే పుట్టి ఉండవచ్చనేది చరిత్రకారుల అంచనా. రష్యాలో పుట్టిన అసిమోవ్ బాల మేధావిగా పేరు పొందాడు. ఐదేళ్ల వయసులో స్వయంగా చదవడం నేర్చుకున్నాడు. పదిహేనేళ్ల వయసులోనే హైస్కూల్ చదువు పూర్తి చేశాడు. పంతొమ్మిదో ఏట తొలి కథను ప్రచురణకర్తలకు అమ్మాడు. శాస్త్ర సాంకేతిక రంగం అంతగా అభివృద్ధి చెందని ఇరవయ్యో శతాబ్ది తొలి రోజుల్లోనే ఎవరూ ఊహించని శాస్త్ర సాంకేతిక పరిణామాలను ఊహించాడు. న్యూయార్క్‌లో స్థిరపడి దాదాపు ఐదువందలకు పైగా పుస్తకాలను రాశాడు. వాటిలో కొన్నింటికి సంపాదకత్వం వహించాడు. సైన్స్ ఫిక్షన్ రచనలు ఆయనకు పేరు, డబ్బు తెచ్చిపెట్టినా, లిమరిక్కులు రాయడానికి ఎక్కువగా ఇష్టపడేవాడు. ‘రోబో’ల గురించి రాసిన ఒక నవలలో తొలిసారిగా ‘రోబోటిక్స్’ పదాన్ని ఉపయోగించిన ఘనత అసిమోవ్కే దక్కుతుంది. ఆయన ఆ మాట వాడిన దశాబ్దాల తర్వాత ‘రోబోటిక్స్’ ఒక ప్రత్యేక సాంకేతిక శాస్త్రంగా ఎదిగింది. విల్ స్మిత్ రూపొందించిన హాలీవుడ్ సూపర్‌హిట్ ‘ఐ, రోబో’కు అసిమోవ్ రచనే ఆధారం. అయితే, అంతరిక్షానికి సంబంధించి చాలా కాల్పనిక సాహిత్యాన్ని సృష్టించిన అసిమోవ్ తన జీవితకాలంలో రెండు సార్లు మాత్రమే విమాన ప్రయాణం చేయడం విచిత్రం. నైలు నదిని తస్కరించాలనుకున్న బ్రిటన్ ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక నదిని తస్కరించగలరా? కనీసం అలాంటి ఊహనైనా ఊహించగలరా? ‘రవి అస్తమించని’ ప్రాభవం సన్నగిల్లిన సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం అలాంటి ఆలోచన చేసింది. ఈజిప్టు నుంచి నైలు నదిని తస్కరించాలనే ప్రతిపాదనను తీవ్రంగా పరిశీలించింది. ఆ ప్రతిపాదనలో చాలా ప్రతికూలతలు ఉండటంతో విరమించుకుంది. అందువల్ల అదృష్టవశాత్తు నైలు నది ఇప్పటికీ క్షేమంగానే ఉంది. ఇంతకీ ఏం జరిగిందంటే..? 1956 నాటికి ప్రపంచంలో బ్రిటన్ ప్రాభవం దాదాపు అవసాన దశకు చేరుకుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా బ్రిటిష్ దళాలు కీలకమైన సూయజ్ కాలువపై అనధికారికంగా పెత్తనం చలాయించసాగాయి. ఈ పోకడలను అప్పటి ఈజిప్టు అధ్యక్షుడు గమాల్ అబ్దుల్ నసీర్ తీవ్రంగా వ్యతిరేకించాడు. సూయజ్ కాలువ నుంచి బ్రిటిష్ బలగాలు వెనక్కు మళ్లాల్సిందేనని కరాఖండిగా హెచ్చరించాడు. గత్యంతరం లేక బ్రిటిష్ బలగాలు వెనక్కు మళ్లాయి. సూయజ్ కాలువ నుంచి తమను వెళ్లగొట్టిన ఈజిప్టుకు బుద్ధి చెప్పాలంటే, నైలు నదిని తస్కరించడమే తగిన పని అని ఆఫ్రికాలోని బ్రిటిష్ కొలోనియల్ కార్యాలయం ప్రతిపాదనను పంపింది. నైలు నది ఆవిర్భావ ప్రాంతమైన ఉగాండా అప్పటికి ఇంకా బ్రిటన్ అధీనంలోనే ఉండేది. దానిపై బ్రిటిష్ ప్రభుత్వం డ్యాము కూడా నిర్మించింది. అక్కడి నుంచి నియంత్రిస్తే, ఈజిప్టులోకి చేరే నైలు నది నీరు దాదాపు ఎనభై శాతం వరకు తగ్గిపోతుంది. ఆ దెబ్బకు ఈజిప్టు ప్రభుత్వం దిగివస్తుందనేది ఆ ప్రతిపాదన సారాంశం. లండన్‌లోని బ్రిటిష్ పెద్దలు దీనిపై చాలా తర్జన భర్జనలు పడ్డారు. ఇలా చేస్తే ఈజిప్టు చుట్టుపక్కల మరో రెండు దేశాలకు కూడా నీరు అందకుండా పోయి అంతర్జాతీయంగా బ్రిటన్ పరువు మంటగలుస్తుందని భావించి, ఈ ప్రతిపాదనను పక్కనపెట్టారు. మందు కోసం వెర్రి పందెం పెను తుపానులు చెలరేగినప్పుడు ఎవరికి వారే సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకుంటారే తప్ప తుపానులకు ఎదురీదాలనే వెర్రి ప్రయత్నాలేవీ చేయరు. ప్రాణాలపై ఆశలు ఉన్న వాళ్లెవరైనా కనీసం అలాంటి దుస్సాహసాలను కలలోనైనా ఊహించలేరు. అయితే, బ్రిటిష్ నావికాదళంలో పనిచేసిన కల్నల్ జోసెఫ్ డక్‌వర్త్ అలాంటిలాంటి మనిషి కాదు. ‘సాహసమే నా ఊపిరి’ అనే టైపు! ఆ సంగతిని నిరూపించుకోవడానికి ఎంతటి దుస్సాహసాలకైనా తెగించేవాడు. ఇతగాడి దళం అమెరికాలో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు 1943 జూలై 27న టెక్సాస్‌లో పెనుతుపాను చెలరేగింది. విమానాలన్నింటినీ నిలిపివేశారు. అలాంటి పెను తుపానులో విమానాలు ఎగిరితే అవి గల్లంతవడం ఖాయం. సైనిక స్థావరంలో ఇదే విషయాన్ని కొందరు మాట్లాడుకోవడం విన్నాడు డక్‌వర్త్. తుపాను మీదుగా విమానాన్ని నడిపి, సురక్షితంగా రాగలనని వాళ్లకు సవాలు చేశాడు. మాటా మాటా ముదరడంతో పందెం... అంటే పందెం అనుకున్నారు. పందెం కాసిందేమీ డబ్బూదస్కం, నగానట్రా వంటి విలువైనదేదీ కాదు. కేవలం ఒక సీసా విస్కీ, దానికి అనుపానంగా తగినంత సోడా! ఏదైతేనేం... పందెమంటే పందెమే... అంటూ విమానం తీసుకుని బయలుదేరాడు డక్‌వర్త్. ఈ ఆలోచనకు అప్పటికే భయంతో బిక్కచచ్చి ఉన్న లెఫ్టినెంట్ రాల్ఫ్‌ను తనకు తోడుగా తీసుకుపోయాడు. ఈ దుస్సాహసాన్ని అందరూ కళ్లప్పగించి చూశారు. వాళ్లు చూస్తుండగానే విమానం నింగికెగసింది. తుపాను కేంద్రీకృతమై ఉన్న ప్రాంతం వైపుగా దూసుకుపోయింది. తుపాను సుడులు తిరుగుతున్న కేంద్ర ప్రాంతం మీదుగా విమానాన్ని భూమికి తొమ్మిదివేల అడుగుల ఎత్తుకు పోనిచ్చాడు డక్‌వర్త్. తుపాను తాకిడికి విమానం చిగురుటాకులా కంపించింది. తుపానును చీల్చుకుంటూ ముందుకు దూసుకుపోయింది. రెండుసార్లు తుపాను మీదుగా చక్కర్లు కొట్టిన తర్వాత తిరిగి యథాస్థానానికి చేరుకుంది. విమానం దిగిన తర్వాత డక్‌వర్త్ విజయగర్వంతో విస్కీ బాటిల్ అందుకున్నాడు. కూర్పు: పన్యాల జగన్నాథదాసు -
వీళ్లు ఎంతో సుకుమారులు...
ఆస్ట్రోఫన్డా: మీన రాశి రాశిచక్రంలో చివరి రాశి మీనం. ఇది సరి రాశి. జలతత్వం, బ్రాహ్మణ జాతి, సౌమ్య రాశి, ఉజ్వల వర్ణం. శరీరంలో కాళ్లను, పాదాలను సూచిస్తుంది. ఇది ద్విస్వభావ రాశి, స్త్రీ రాశి, దిశ ఉత్తరం. ఇందులో పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరా భాద్ర, రేవతి నక్షత్రాలు పూర్తిగా ఉంటాయి. ఈ రాశి అధిపతి గురువు. ఈ రాశి వైఢూర్యాలు, ముత్యాలు, వజ్రాలు, గోరోజనం, చేపలు, మద్యం మొదలైన ద్రవ్యాలను సూచిస్తుంది. ఇది రష్యా, ఈజిప్టు పరిసర ప్రాంతాలపై ప్రభావం కలిగి ఉంటుంది. మీనరాశిలో పుట్టినవారు కాస్త సుకుమారులు. కాస్త బద్ధకస్తులు కూడా. కఠిన శ్రమను తట్టుకోలేరు. అయితే, అద్భుతమైన సృజనాత్మకత వీరి సొంతం. సుఖలాలస ఎక్కువ. కల్లా కపటం తెలియని వీరు, ఎదుటి వారిని ఇట్టే నమ్మే స్తారు. కొన్ని సందర్భాల్లో పిరికిగా వ్యవహ రించినా, అవసరమైన సందర్భాల్లో ధైర్య సాహసాలనూ ప్రదర్శించగలరు. సరళ స్వభావం కారణంగా తేలికగా ఆకట్టు కుంటారు. నిష్పాక్షికత, సహనం, అపారమైన ఊహాశక్తి, వాక్చాతుర్యం, కార్యనిర్వహణ నైపుణ్యాల ఫలితంగా ఏ రంగంలోనైనా రాణించగలరు. రచయితలు, సినీ దర్శకులు, నటులు, వైద్యులు, రసాయన నిపుణులు, సాంకేతిక నిపుణులు, బోధకులు, సామాజిక కార్యకర్తలుగా బాగా రాణిస్తారు. ఆహార పానీయాలు, రవాణా, ముద్రణ, ప్రచురణ వంటి రంగాల్లో సొంత వ్యాపారాలు కూడా వీరికి అనుకూలం. రక్షణ, విద్య, జల వనరులు, షిప్పింగ్, రైల్వే, బ్యాంకింగ్, బీమా రంగాలలోని ఉద్యోగాల్లో కూడా రాణిస్తారు. గ్రహగతులు అనుకూలించకుంటే, స్థిరపడాల్సిన సమయంలో నిర్లక్ష్యంగా తిరుగుతారు. నిజాయితీ లేని పనులతో నిందల పాలవుతారు. మోసాలకు గురై నష్ట పోతూ ఉంటారు. బద్ధకంతో అవకాశాలను చేజార్చుకుంటారు. వ్యసనాల ద్వారా సాంత్వన పొందేందుకు ప్రయత్నిస్తారు. వీరు ఎక్కువగా జీర్ణకోశ వ్యాధులు, వాత సంబంధ సమస్యలు, చర్మవ్యాధులతో బాధపడతారు. - పన్యాల జగన్నాథ దాసు మీనరాశిలో పుట్టిన గాయని శ్రేయాఘోషల్ -
రాజీ పడరు...వెనకడుగు వేయరు...
ఆస్ట్రోఫన్డా రాశిచక్రంలో పదో రాశి మకరం.. ఇది సరి రాశి. పృథ్వీతత్వం, వైశ్య జాతి, సౌమ్య రాశి, పింగళ వర్ణం. శరీరంలో ఇది మోకాళ్లను, పిక్కలను సూచిస్తుంది. ఇది చర రాశి, స్త్రీ రాశి, దీని దిశ దక్షిణం. ఇందులో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం పూర్తిగా, ధనిష్ఠ 1, 2 పాదాలు ఉంటాయి. ఈ రాశి అధిపతి శని. ఇనుము, సీసం, తగరం, కంచు, రాగి, బొగ్గు, చెరకు వంటి ద్రవ్యాలను సూచిస్తుంది. ఈ రాశి అల్బీనియా, బల్గేరియా, బంగ్లాదేశ్, పంజాబ్ తదితర ప్రాంతాలపై ప్రభావం కలిగి ఉంటుంది. మకర రాశిలో పుట్టినవారు క్రమశిక్షణకు, కఠిన పరిశ్రమకు, విశ్వసనీయతకు మారుపేరుగా ఉంటారు. చాలా నిరాడంబరంగా కనిపిస్తారు. ప్రతి పనిలోనూ ఆచి తూచి వ్యవహరిస్తారు. పురోగతికి కఠిన పరిశ్రమ మాత్రమే ఏకైక మార్గమని నమ్ముతారు. ఎలాంటి వ్యవహారంలోనైనా రాజీ పడటాన్ని ఏమాత్రం ఇష్టపడరు. ఓపిక, సహనం వీరి తిరుగులేని బలాలు. ఏమాత్రం ఆత్రపడకుండా నిదానంగా పనిచేస్తున్నట్లే కనిపిస్తారు. ఓర్పు, సహనాలతో ఎంతటి ఉన్నత లక్ష్యాలనైనా సాధిస్తారు. కార్యాచరణలో ప్రాక్టికల్‌గా వ్యవహరించే వీరికి సెంటిమెంట్లు ఉండవని ఇతరులు అపోహ పడతారు. అయితే, తమ పట్ల ఇతరులు చూపే ప్రేమాభిమానాలకు సానుకూలంగా స్పందిస్తారు. ఎంతటి బాధ్యతనైనా అంకితభావంతో నెరవేరుస్తారు. ఎక్కువగా పనిలో నిమగ్నమై ఉండేందుకే ఇష్టపడతారు. బద్ధకం, క్రమశిక్షణరాహిత్యం వీరికి అసలు గిట్టదు. తమ పద్ధతులకు భిన్నంగా అలసత్వం చూపేవారి పట్ల కఠినంగా ఉంటారు. సంపదను, పేరు ప్రఖ్యాతులను కష్టపడి సాధిస్తారు. ఎక్కువగా ఏకాంతాన్ని ఇష్టపడతారు. తమను నమ్ముకున్న వారికి నమ్మకమైన ఆసరాగా ఉంటారు. పోటీల జోలికి వెళ్లేందుకు పెద్దగా ఇష్టపడరు గానీ, లక్ష్యసాధనలో మాత్రం వెనుకంజ వేయరు. సివిల్, మెకానికల్, ఐటీ ఇంజనీరింగ్ విభాగాల్లో, అకౌంటింగ్, కార్మిక వ్యవహారాలు, ఖజానా పర్యవేక్షణ, నిఘా, పోలీసు, సైనిక ఉద్యోగాల్లో వీరు బాధ్యతాయుతంగా రాణించగలరు. వైద్య, బోధన, గృహనిర్మాణ, రాజకీయ, మెకానిక్, అకౌంటింగ్ వృత్తులు వీరికి అనుకూలంగా ఉంటాయి. గ్రహగతులు అనుకూలించకుంటే, కఠిన క్రమశిక్షణ, రాజీపడని మొండివైఖరి కారణంగా శత్రువులను కొనితెచ్చుకుంటారు. అలర్జీలు, రక్తపోటు, వెన్నెముకకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. మకర రాశిలో పుట్టిన బాలీవుడ్ నటి దీపికా పదుకొనె -
వృశ్చిక రాశివారు... స్వేచ్ఛాప్రియులు
ఆస్ట్రోఫన్డా: వృశ్చికం రాశిచక్రంలో వృశ్చికం ఎనిమిదో రాశి. ఇది సరి రాశి. జలతత్వం, శీతల స్వభావం. బ్రాహ్మణ జాతి, క్రూర రాశి. రంగు ఎరుపు. శరీరంలో రహస్యాంగాలను, హృదయాన్ని, తొడలను సూచిస్తుంది. ఇది స్థిర రాశి, స్త్రీ రాశి. దిశ ఉత్తరం. ఇందులో విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు పూర్తిగా ఉంటాయి. దీని అధిపతి కుజుడు. ఇనుము, చెరకు, పంచదార, బెల్లం, కందులు, దూది, వక్కలు, ఆవాలు వంటి ద్రవ్యాలను సూచిస్తుంది. ఈ రాశి నార్వే, మొరాకో, వాషింగ్టన్ పరిసర ప్రాంతాలపై ప్రభావం కలిగి ఉంటుంది. - పన్యాల జగన్నాథ దాసు వృశ్చికరాశిలో జన్మించిన వారికి ధైర్యసాహసాలు ఎక్కువగా ఉంటాయి. పర్యవసానాలను పట్టించుకోని దూకుడు వీరి సహజ లక్షణం. మొండితనం కూడా వీరికి ఎక్కువే! విధి నిర్వహణలో నిజాయితీ, అంకితభావం, చిత్తశుద్ధి కలిగి ఉంటారు. ప్రథమకోపంతో వీరు సమస్యలను కొని తెచ్చుకుంటారు. రహస్య పరిశోధనలపై వీరికి ఆసక్తి ఎక్కువ. అతీంద్రియ శక్తులు, మార్మిక విషయాలపై అమితాసక్తి చూపుతారు. సంప్రదాయాలను గౌరవిస్తారు. చురుకైన తెలివితేటలు వీరి సొంతం. ఆసక్తి కలిగితే ఎలాంటి క్లిష్టమైన విషయాలనైనా ఇట్టే ఆకళింపు చేసుకోగలరు. ఎంతటి ఒత్తిడినైనా తట్టుకొనే శక్తి వీరి సొంతం. దార్శనికత, వ్యూహరచనా చాతుర్యం వీరి తిరుగులేని బలాలు. గ్రహగతులు అనుకూలిస్తే ఈ లక్షణాలతోనే వీరు ఉన్నత స్థానాలను అందుకోగలరు. స్వతంత్రాభిలాష వీరికి ఎక్కువ. అందువల్ల స్వతంత్ర వృత్తులు, వ్యాపారాలలో బాగా రాణించగలరు. స్వతంత్ర అధికారాలు గల ఉద్యోగాల్లో సత్తా చూపగలరు. వైద్య, విద్యా, న్యాయవాద, వ్యాయామ, పోరాట విద్యలలో చక్కగా రాణించగలరు. సైనిక, పోలీసు, గూఢచర్య సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లోనైనా, వృత్తి ఉద్యోగాల్లోనైనా వీరు పోటీని ఇష్టపడతారు. గట్టి పోటీ ఎదురైనప్పుడు సవాలుగా తీసుకుని, సత్తా చాటుకుంటారు. గ్రహగతులు ప్రతికూలిస్తే, వీరు ఇతరులపై అకారణంగా అనుమానం, ఈర్ష్య పెంచుకుని, వారికి హాని తలపెట్టేందుకైనా వెనుకాడరు. విమర్శలను, ఓటమిని సహించలేక వ్యసనాలకు లోనవుతారు. అనుకున్నది సాధించడానికి అపమార్గాలు తొక్కుతారు. ప్రేమ వ్యవహారాల్లో విఫలమై, ప్రతీకారేచ్ఛతో రగిలిపోతారు. ఫలితంగా మానసిక వ్యాధులకు, నాడీ సమస్యలకు, గుండెజబ్బులకు లోనవుతారు. - వృశ్చిక రాశిలో పుట్టిన బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ -
మాట నేర్పరితనం వీరి సొంతం
ఆస్ట్రోఫన్డా రాశిచక్రంలో తుల ఏడో రాశి. ఇది బేసి రాశి, వాయుతత్వం, శీతల స్వభావం, సౌమ్య రాశి,శూద్ర జాతి, రంగు ఆకుపచ్చ, శరీరంలో నాభిని, నడుమును ఈ రాశి సూచిస్తుంది. ఇది చర రాశి, పురుష రాశి. దిశ దక్షిణం. ఇందులో చిత్త 3, 4, స్వాతి పూర్తిగా, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. దీని అధిపతి శుక్రుడు. నువ్వులు, గోధుమలు, బియ్యం, శనగలు, దూది, ఆముదం మొదలైన ద్రవ్యాలను సూచిస్తుంది. ఆస్ట్రియా, పోర్చుగల్, జపాన్, బర్మా, టిబెట్, అర్జెంటీనా తదితర ప్రాంతాలపై ప్రభావం కలిగి ఉంటుంది. తులరాశిలో జన్మించిన వారు సంయమనానికి, సహనానికి మారుపేరుగా ఉంటారు. వీరికి లౌక్యం, వాక్చాతుర్యం కూడా ఎక్కువే. నిత్యం జనాల మధ్య గడపటానికే ఇష్టపడతారు. ఒంటరిగా ఏమాత్రం ఉండలేరు. జనాలను ఇట్టే ఆకట్టుకుంటారు. కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యమిస్తారు. అతిథులను బాగా ఆదరిస్తారు. ఎన్ని కష్టాల్లో ఉన్నా, శ్రద్ధగా అలంకరించుకుంటారు. గడ్డు సమస్యలను సైతం తేలికగా పరిష్కరించగలరు. చర్చలను, వాదనలను ఇష్టపడతారు. ఎదుటివారు చెప్పే విషయాన్ని శ్రద్ధగా వింటారు. ఎక్కడకు వెళ్లినా తేలికగా కొత్త కొత్త స్నేహాలను ఏర్పరచుకోగలరు. ప్రతి విషయంలోనూ ఆచి తూచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. తమ చుట్టూ ఉండేవారిని ప్రభావితం చేస్తారు. వీరికి సౌందర్య దృష్టి, కళలపై ఆసక్తి, విలాసాలపై మక్కువ ఉంటాయి. శాంతి సామరస్యాలను కోరుకునే వీరు హింసను, దండనను ఇష్టపడరు. సాధ్యమైనంత వరకు ఎలాంటి సమస్యలనైనా మాటలతో పరిష్కరించుకోవచ్చని నమ్ముతారు. నాయకులుగా తమ బృందానికి చక్కని దిశానిర్దేశం చేయగలరు. దౌత్యవేత్తలుగా, రాయబారులుగా, తీర్పరులుగా రాణించగలరు. స్వల్ప కృషితోనే సమాజంలో మేధావులుగా గుర్తింపు పొందగలరు. అయితే, చొరవ చూపి సత్వర నిర్ణయాలు తీసుకోవలసిన సందర్భాల్లో సైతం చర్చోపచర్చలతో కాలయాపన చేయడం వీరి బలహీనత. వీరు న్యాయ సంబంధిత వృత్తి ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. దౌత్యవేత్తలుగా, పాత్రికేయులుగా, మధ్యవర్తులుగా అందరి మన్నన పొందుతారు. అలంకరణలు, లోహాలు, ఔషధాలు, మద్యం, వస్త్ర వినోద వ్యాపారాలు వీరికి లాభసాటిగా ఉంటాయి. పర్యాటక, ఆతిథ్య రంగాలు కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి. గ్రహగతులు అనుకూలించకుంటే వీరు తమ తాత్సార ధోరణి వల్ల జీవితంలో మంచి మంచి అవకాశాలను కోల్పోతారు. పగటి కలల్లో విహరిస్తూ కాలహరణం చేస్తారు. తమను తాము ప్రేమైక జీవులుగా భావించుకొని, ప్రేమ వ్యవహారాల్లో భంగపాట్లు చవిచూస్తారు. - తులారాశికి చెందిన బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ - పన్యాల జగన్నాథ దాసు -
ఈ రాశి వారికి క్షమాగుణం ఎక్కువ
ఆస్ట్రోఫన్డా రాశులలో కన్యరాశి ఆరోది. ఇది సరి రాశి, వాయుతత్వం, శీతల స్వభావం, సౌమ్య రాశి,శూద్ర జాతి, రంగు ఆకుపచ్చ, శరీరంలో పొట్ట, నడుము, నరాలను ఈ రాశి సూచిస్తుంది. ఇది ద్విస్వభావ రాశి, స్త్రీరాశి, దిశ దక్షిణం. ఇందులో ఉత్తరా ఫల్గుణి 2, 3, 4 పాదాలు, హస్త నాలుగు పాదాలూ, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. దీని అధిపతి బుధుడు. నివాస స్థానం కేరళ ప్రాంతం. ఇది భారత్, బ్రెజిల్, టర్కీ పరిసర ప్రాంతాలను సూచిస్తుంది. పెసలు, బఠాణీలు, ఆముదం, పత్తి మొదలైన ద్రవ్యాలపై ప్రభావం కలిగి ఉంటుంది. కన్యరాశి వారు మృదు స్వభావులు, కాస్త సిగ్గరులు, మొహమాటస్తులు. శ్రద్ధగా తమ పని తాము చేసుకుపోవడంలో తేనెటీగలను తలపిస్తారు. అడిగినదే తడవుగా ఇతరులకు సాయం చేయడంలోనే ఆనందం వెదుక్కుంటారు. తమ మితిమీరిన పరోపకార ధోరణి గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా, తమదైన ధోరణిలోనే జీవిస్తారు. ప్రణాళికాబద్ధంగా, పూర్తి అంకిత భావంతో కష్టించి పనిచేయడంలో వీరికి సాటివచ్చే వారు అరుదు. ఎంత ఒత్తిడి ఎదురైనా సహనం కోల్పోకుండా ఉండటం వీరి ప్రత్యేకత. మొహమాటం వల్ల తమంతట తామే చొరవ తీసుకుని ఇతరులతో కలుపుగోలుగా ఉండలేరు. ఈ లక్షణం వల్ల తరచు అపార్థాలకు గురవుతారు. అయితే, ఇతరులు చొరవ తీసుకుని, వీరితో స్నేహం చేస్తే మాత్రం వారి పట్ల నమ్మకంగా ఉంటారు. వీరికి క్షమాగుణం కూడా ఎక్కువే. ఇతరులు తమ పట్ల చేసిన చిన్న చిన్న తప్పులను తేలికగా క్షమిస్తారు. చురుకైన మేధాశక్తి వీరి సొంతం. పనిభారం ఎంత ఉన్నా తొందరగా అలసిపోరు. బయటకు నిరాడంబరంగా కనిపించినా, వీరికి విలాసాలపై కూడా మక్కువ ఉంటుంది. తమ కష్టానికి ఆశించిన ఫలితం దక్కకుంటే తొందరగా నిర్వేదానికి లోనవుతారు. మానసికంగా గాయపడినప్పుడు ఇతరులను ఏమీ అనలేక ఆత్మనిందకు పాల్పడతారు. తాము ఉండే చోట అన్నీ పరిశుభ్రంగా, పద్ధతిగా ఉండాలని కోరుకుంటారు. వీరి ధోరణి ఒక్కోసారి సన్నిహితులకు చాదస్తంగా అనిపిస్తుంది. సృజనాత్మకతకు ఆస్కారం ఉండే రచన, నటన, సంగీత, నృత్య కళా రంగాల్లో వీరు బాగా రాణిస్తారు. అకౌంటింగ్, బ్యాంకింగ్, వైద్యం, సామాజిక సేవ, విదేశీ వ్యవహారాలు వంటి రంగాల్లోనూ తమ ప్రత్యేకత చాటుకుంటారు. వ్యవసాయం, పండ్లతోటల పెంపకం, పశుపోషణ వంటివి వీరికి అనుకూలిస్తాయి. బయటకు ఏదీ చెప్పుకోకుండా లోలోనే కుమిలిపోయే తత్వం వల్ల మానసిక సమస్యలతో, నాడీ సమస్యలతో బాధపడతారు. - పన్యాల జగన్నాథ దాసు -
ఈ రాశి వారు కళాభిమానులు
వృషభం: ఆస్ట్రోఫన్డా రాశులలో రెండోది వృషభం. ఇది సరి రాశి, ముఖాన్ని సూచిస్తుంది. సౌమ్య స్వభావం, స్థిరరాశి, భూతత్వం, స్త్రీ రాశి, వైశ్యజాతి. దీని దిశ దక్షిణం. ఇందులో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం నాలుగు పాదాలూ, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. దీని అధిపతి శుక్రుడు. ఈ రాశి పర్షియా, హాలండ్, రష్యా పరిసర దేశాలను సూచిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన వారు సహజంగా సహనవంతులు. సహనం నశిస్తే మాత్రం వారిని అదుపు చేయడం అంత తేలిక కాదు. కష్టపడి పనిచేసే స్వభావం ఉంటుంది. గొప్ప శారీరక దారుఢ్యం ఉంటుంది. తేలికగా అలసట చెందరు. నిదానంగా పనిచేస్తున్నట్లే కనిపిస్తారు గానీ ప్రణాళిక ప్రకారం అనుకున్న సమయానికే పనులు పూర్తి చేస్తారు. వృథా కాలక్షేపాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. లలిత కళలపై, వస్త్రాలంకరణలు, సుగంధ ద్రవ్యాలపై బాగా మక్కువ కలిగి ఉంటారు. అసాధారణమైన తెలివితేటలు, గొప్ప సంయమనం వీరి సొత్తు. ఆర్థిక వ్యవహారాలను లోపం లేకుండా బాధ్యతాయుతంగా నెరవేర్చడంలో నేర్పరులు. క్లిష్టమైన వ్యవహారాలను సైతం తేలికగా చక్కదిద్దగలరు. దౌత్యం నెరపడంలో సిద్ధహస్తులు. వృషభరాశి వారు విశ్వసనీయులుగా ఉంటారు. అవసరమైతే ఇతరుల భారాన్ని సైతం తామే భరించేందుకు సిద్ధపడతారు. నిర్భీతి, కారుణ్యం, ఓపిక సహజ లక్షణాలుగా గల వృషభరాశి జాతకులు నాయకత్వ పదవుల్లో రాణించగలరు. వాహన, వస్త్ర వ్యాపారాలు, సుగంధ ద్రవ్యాలు, ఆభరణాలు, అలంకరణలు, ప్లాస్టిక్, హోటల్, మద్యం వ్యాపారాలు వీరికి కలసి వస్తాయి. సంగీతం, రంగస్థలం, సినీ రంగాల్లోనూ వృషభరాశి జాతకులు రాణించగలరు. గ్రహగతులు సానుకూలంగా లేకుంటే మాత్రం అసూయతో రగిలిపోతూ ఇతరులను ఇబ్బందిపెడతారు. మార్పును ఒకపట్టాన అంగీకరించలేరు. మొండి వైఖరితో చిక్కుల్లో పడతారు. అంతులేని ఐశ్వర్య లాలసతో సంపాదనే వ్యసనంగా మార్చుకొని ఆరోగ్యాన్ని సైతం నిర్లక్ష్యం చేస్తారు. బద్దకంతో నిర్ణయాలను తీసుకోవడంలో జాప్యం కారణంగా శ్రమకు తగ్గ ఫలితం పొందలేకపోతారు. (వచ్చేవారం మిథునరాశి గురించి...) - పన్యాల జగన్నాథ దాసు -
మేషంలో పుట్టారా? అసహనం ఎక్కువే!
ఆస్ట్రోఫన్డా రాశుల స్వభావం, రాశిచక్రం గురించి సంక్షిప్తంగా చెప్పుకుందాం. రాశిచక్ర ప్రమాణం 360 డిగ్రీలు. ఇందులో పన్నెండు రాశులు ఉంటాయి. ఒక్కో రాశి ప్రమాణం 30 డిగ్రీలు. రాశిచక్రంలో 27 నక్షత్రాలు ఉంటాయి. ఒక్కో నక్షత్రానికి నాలుగేసి పాదాలు ఉంటాయి. అంటే, రాశిచక్రంలోని మొత్తం 108 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఒక్కో రాశిలో తొమ్మిదేసి నక్షత్ర పాదాలు ఉంటాయి. ఈ లెక్కన ఒక్కో నక్షత్ర ప్రమాణం 13 డిగ్రీల 20 మినిట్స్. ఒక్కో నక్షత్ర పాద ప్రమాణం 3 డిగ్రీల 20 మినిట్స్. రాశిచక్రంలో మొదటిది మేషరాశి. ఇందులో అశ్విని నాలుగు పాదాలు, భరణి నాలుగు పాదాలు, కృత్తిక ఒకటో పాదం ఉంటాయి. ఇది బేసి రాశి, పురుష రాశి, అగ్నితత్వం, క్షత్రియ వర్ణం, క్రూరస్వభావం కలిగిన చరరాశి. ఈ రాశి చిహ్నం మేక. ఇది వనచరం అంటే, అడవులు, పర్వతప్రాంతాలలో సంచరించేది. ఈ రాశికి అధిపతి కుజుడు. బ్రిటన్, డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్, సిరియా, పెరూ దేశాలు ఈ రాశి పరిధిలోకి వస్తాయి. ముఖం, మెదడుపై ఈ రాశి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని లోహం బంగారం, రంగు ఎరుపు, ధాన్యం కందులు. చంద్రుడు మేషంలో ఉండగా జన్మించిన వారికి మేషం జన్మరాశి అవుతుంది. మేషరాశిలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు, దూకుడు స్వభావం కలిగి ఉంటారు. స్వేచ్ఛాప్రియులు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం నిరాశకు లోనికాని ఆశావహ దృక్పథం వీరి సొంతం. వీరికి అసహనం కూడా ఎక్కువే. భావోద్వేగాలను ఏమాత్రం అదుపు చేసుకోలేరు. సవాళ్లను ఎదుర్కోవడంలో ముందంజలో ఉంటారు. త్వరగా మనుషులను ఆకట్టుకోవడంలో మేషరాశి జాతకులకు చాలా నేర్పు ఉంటుంది. తమ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారి పట్ల తేలికగా కినుకబూనుతారు. కొన్నిసార్లు ప్రతీకారేచ్ఛను కూడా పెంచుకుంటారు. ఒక్కోసారి మితిమీరిన ఆత్మవిశ్వాసం కారణంగా చిక్కుల్లో పడుతుంటారు. జాతకంలో రవి, కుజుడు, చంద్రుడు అనుకూలిస్తే కార్యనిర్వహణ రంగాల్లో చక్కగా రాణిస్తారు. పోలీసు, సైనిక ఉద్యోగాల్లో, న్యాయవాదులుగా, మేనేజర్లుగా, ఇంజనీర్లుగా, శస్త్రవైద్యులుగా ప్రత్యేకతను నిలుపుకుంటారు. లోహాలకు, కలపకు సంబంధించిన వృత్తులు, వ్యాపారాలు, పరిశ్రమలలో కూడా విజయాలు సాధిస్తారు. గ్రహస్థితి ప్రతికూలిస్తే మొండితనం, ఈర్ష్య, స్వార్థం కారణంగా ఇబ్బందులు పడతారు. నోటి దురుసుతనంతో తరచు గొడవలకు దిగుతుంటారు. తేలికగా దుర్వ్యసనాలకు లోనవుతారు. (వృషభరాశి స్వభావం గురించి వచ్చేవారం...) - పన్యాల జగన్నాథ దాసు -
జాడీ నం.1
కర్షకుడి చద్దిమూటలో కార్మికుడి లంచ్ డబ్బాలో ఆఫీసర్‌గారి క్యారియర్‌లో అమ్మాయి స్కూల్ టిఫిన్ బాక్స్‌లో స్టీల్ కంచంలో, పింగాణి ప్లేట్లో దర్శనమిచ్చే ఆవకాయ... చందమామ లాంటి అన్నంలో ఉదయిస్తున్న సూరీడులా ఉంటుంది! ఆకలిని బజ్జోపెట్టే అమ్మలా క్రాంతిని మేల్కొలిపే నాన్నలా అవ్వాతాతల వారసత్వంలా చల్లగా, నిప్పులా, నిజాయితీగా అనిపిస్తుంది. నిలవ ఉంచుకోవచ్చు. నిమిషంలో పంచేయవచ్చు. రామ్,ఎడిటర్, ఫీచర్స్ ఆవకాయ్... తెలుగువారికి ఎలా ప్రత్యేకమో, హీరోయిన్లలో స్వాతి అంత ప్రత్యేకం. మిరపకాయలు చిటా పటామన్నట్టు, మాటలు పేల్చడంలో స్వాతి దిట్ట. అష్టాచెమ్మా, అనంతపురం, స్వామి రారా, కార్తికేయ... ఆమె నటించిన కమ్మని సినిమాలు. తెలుగు టాలెంట్ తమిళ, మలయాళ భాషల్లో స్వాతి వల్లే తెలుస్తోంది. అక్కడ కూడా తను పాపులర్ హీరోయిన్. ఈ ఆవకాయ సీజన్లో ‘సాక్షి’ కోసం స్వాతి కలిపిన మాటలివి... సమ్మర్ ఎలా ఉంది? నీ పని చెప్తా అన్నట్టు ఉంది. ఎండలు విజృంభిస్తున్నాయ్. ఇంకో నెలరోజులు అవస్థ తప్పదు. అయినా ఎండల్ని తిట్టుకోవాల్సిన పని లేదు. మల్లెల్ని, కొత్త ఆవకాయల్ని తీసుకొచ్చే సీజన్ కదా! ఆవకాయ్ ఇష్టమేనా? ఓ... ఏడాది పొడవునా తినమన్నా తినేస్తాను. పచ్చడి తయారు చేసేటప్పుడు దగ్గరుండి చూస్తుంటారా? వైజాగ్‌లో మా అమ్మమ్మ, నాన్నమ్మ ఇద్దరూ తయారు చేసేవాళ్లు. ఆవకాయ్ తయారు చేయడం అనేది మాకో చిన్న సైజ్ పండగలా అనిపించేది. మామిడికాయలు కొనడం, వాటిని కడగడం, తుడిచి ముక్కలు కొట్టి, మొత్తం పచ్చడి తయారయ్యేవరకూ నేను, మా అన్నయ్య దగ్గరుండి చూసేవాళ్లం. నానమ్మ కత్తిపీట మీద కూర్చుని ముక్కలు కోసేది. అన్నయ్య ఒక్కో మామిడికాయ కత్తి కింద పెడితే ఆవిడ కోసేది. ఓసారి ఎటో చూస్తూ, ముక్కకి బదులు అన్నయ్య వేలి మీద కత్తి వేసింది. వేలి నుంచి బాగా రక్తం కారడం, అన్నయ్యేమో ఇల్లు పీకి పందిరేసినంత పని చేస్తూ, గట్టిగా ఏడవడం, తనని ఓదార్చడం... బాగా గుర్తు. అప్పుడు అందరూ అన్నయ్యను బాగా గారం చేశారు. దాంతో ‘సచ్చినోడా’ అని ఉక్రోషంగా తిట్టుకున్నా (నవ్వుతూ). పచ్చడి పాళ్లు మీకు తెలుసా? అంత తెలియదు కానీ, ఏయే దినుసులు కావాలో తెలుసు. నాకైతే ముక్క మాత్రమే కాదు.. పచ్చడిలో వేసే మెంతులు, వెల్లుల్లిపాయ కూడా ఇష్టమే. మా అమ్మా, నాన్న, నేనూ భోజనం చేస్తున్నప్పుడు మెంతులూ, వెల్లుల్లిపాయలూ ఏరి నా ప్లేట్లో వేస్తారు. ఎప్పుడైనా హోటల్ నుంచి బిర్యానీ తెప్పించుకుని, టీవీ చూస్తూ తింటుంటాను. అప్పుడు బిర్యానీ రుచిగా లేకపోతే, ఓ ఆవకాయ ముక్క పెట్టుకుని తినేస్తాను. మామిడికాయల వల్ల మొహం మీద గడ్డలు వస్తాయనీ, పచ్చళ్లు శరీర బరువుని పెంచుతాయంటారు కదా? నాకలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. బరువు గురించి కూడా అస్సలు ఆలోచించను. కమ్మని ఆవకాయ్ తినని జీవితం ఎందుకండీ? షూటింగ్స్ కోసం దేశ, విదేశాలు తిరుగుతుంటారు కదా.. ఎక్కడికెళ్లినా ఆవకాయ్ దొరుకుతుందా? మన తెలుగువాళ్ల గొప్పదనం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా తమతో పాటు ఆవకాయ ఉంచుకుంటారు. చెన్నయ్‌లో షూటింగ్ అనుకోండి, అక్కడ వడ్డించే పచ్చళ్లల్లో మన ఆవకాయ్ ఉంటుంది. విదేశాల్లోని సూపర్ మార్కెట్స్‌లో, తెలుగు హోటల్స్‌లో కూడా దొరుకుతుంది. అవునూ.. మీ ఇంట్లో పచ్చడి జాడీలున్నాయా? ఉన్నాయి. అప్పట్లో అమ్మమ్మ, నాన్నమ్మ పచ్చడిని జాడీలో పెట్టి, జాడీ మూతకు తెల్లటి గుడ్డ కట్టి, భద్రపరిచేవారు. అది చూడ్డానికే ఎంతో బాగుండేది. - డి.జి. భవాని చరిత్ర అడగొదు ఆదియందు అక్షరమే తప్ప ఆవకాయ లేకపోవచ్చు. వేదము వలె ఆవకాయ సత్య సనాతనమైనది కాకపోవచ్చు. అయినా, ఆవకాయ కూడా వేదం వలెనే అపౌరుషేయం. శాకాహార, మాంసాహార పదార్థాలను ఎక్కువకాలం నిల్వ చేసేందుకు ఊరవేసే ప్రక్రియ దాదాపు నాలుగువేల ఏళ్ల కిందటే మొదలైనట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రాచ్య, అప్రాచ్య దేశాలలో కూరగాయ ముక్కలను, మాంసం ముక్కలను ఉప్పునీటిలో లేదా వెనిగర్‌లో ఊరవేసేవారు. అంతకంటే పెద్దగా కష్టపడేవారు కాదు, కొత్తగా ఆలోచించేవారు కాదు. అవన్నీ ఆదిమ పద్ధతుల్లో తయారయ్యే ఊరగాయలు! దే ఆర్ వెరీ ప్రిమిటివ్ పికిల్స్! వాటి తయారీ పద్ధతిలో నేటికీ పెద్దగా మెరుగుదల లేదు. ఆవకాయ రుచి ఎరుగని అమాయకులు పాపం వాటితోనే నెట్టుకొచ్చేస్తున్నారు. ఆవకాయ ఆవిర్భావాన్ని గురించి మనకు ఇదమిత్థమైన పౌరాణిక, ఐతిహాసిక ఆధారాలేవీ లభించడం లేదు. నానా రుచులను నోరారా వర్ణించిన కవిసార్వభౌముడు శ్రీనాథుడి కావ్యాలలో సైతం ఆవకాయ ప్రస్తావన లేదు. అంటే, ఆవకాయ నిస్సందేహంగా శ్రీనాథుడి తర్వాతి కాలం నాటి ఆవిష్కరణే. ఆవకాయ పెట్టడానికి మామిడికాయలు, ఆవాలు, మిరపకాయలు, ఉప్పు, నూనె కావాలి. మామిడి, ఆవాలు, ఉప్పు, నూనె వాడుక మన దేశంలో క్రీస్తుపూర్వం నుంచే ఉండేది. ఆవకాయ ఘాటులో, ఎర్రని రంగులో కీలక పాత్ర పోషించే మిరపకాయలు మాత్రం క్రీస్తుశకం 15-16 శతాబ్దాల మధ్యకాలంలో విదేశీ వర్తకుల ద్వారా మన దేశానికి వచ్చాయి. కొలంబస్ రాక తర్వాత.. అంటే 1492 తర్వాత మిరపకాయలు ఇక్కడకు చేరాయి. పోర్చుగీసు, డచ్ వర్తకుల ప్రోత్సాహంతో మిరపకాయల సాగు నెమ్మదిగా విస్తరించింది. వారి ప్రాబల్యంతోనే తెలుగువారు ఎగుమతుల కోసం తయారుచేసే మామిడి ఊరగాయకు మిరపపొడిని జోడించడం మొదలుపెట్టారు. మన తెలుగువారికి ఆమాత్రం ప్రోత్సాహం దొరకాలే గానీ, ఇక ఆగుతారా..? మనవాళ్లవి అసలే క్రియేటివ్ బ్రెయిన్స్! ప్రయోగాల మీద ప్రయోగాలు సాగించి, సాగించి, చివరకు ఆవకాయ ఫార్ములాను సాధించారు. మిరపపొడి ధాటికి మనకంటూ ఓ ఫైర్‌బ్రాండ్ నిల్వపచ్చడి తయారైంది. రుచి అమోఘం మాత్రమే కాదు, రంగు కూడా అత్యంత ఆకర్షణీయం.. కంచంలో వేడివేడి అన్నం వడ్డించుకుని, కొత్తావకాయ కలుపుకుంటేనా..! ఆ దృశ్యాన్ని చూస్తేనే చాలు, కంచంలో మర్డర్ జరిగినట్లుంటుంది.. ఇదీ మన తెలుగోళ్ల కలాపోసన! ఆవకాయ ఫార్ములా కనిపెట్టాక, ఒకే రకమైన మూసపద్ధతిలోనే మనవాళ్లు ఆగిపోలేదు. సామవేద పారంగతులైన విద్వద్వరేణ్యులు చిన్న చిన్న స్వరభేదాలతో అద్భుత, అమోఘ, అపురూప రాగాలను సృష్టించిన రీతిలోనే, చిన్న చిన్న రుచిభేదాలతో చవులూరించే రకరకాల ఆవకాయలను సృష్టించారు. ఆవకాయ సృష్టికర్త ఎవరో, పేరేమిటో చరిత్రకెక్కలేదు. ఆవకాయను ఆత్మగౌరవ చిహ్నంగా మార్చుకున్న ఆంధ్రులు.. ఆవకాయ సృష్టికర్తకు ఆజన్మాంతం రుణగ్రస్తులై ఉంటారు. అయితే, ప్రాతఃస్మరణీయుడై, పూజలందుకోవలసిన ఆవకాయ సృష్టికర్తను విస్మరించినందుకు మాత్రం మన తెలుగువాళ్లను చరిత్ర క్షమించదు! - పన్యాల జగన్నాథదాసు తెలంగాణ ఆవకాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో, ఆవపిండి - అరకిలో, వెల్లుల్లి రెబ్బలు - 100 గ్రా., మెంతులు - 100 గ్రా., నూనె - 2 కిలోలు, ఆవాలు - 50 గ్రా, జీలకర్ర - 50 గ్రా, కరివేపాకు - 1 కట్ట తయారీ: మెంతుల్ని నూనె లేకుండా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఓ బేసిన్లో మామిడి ముక్కలు, కారం, ఉప్పు, ఆవపిండి వేసి బాగా కలపాలి. మొత్తం నూనెను వేడి చేసి, అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయాలి. వేగిన తర్వాత దించేసి చల్లార్చుకోవాలి. వేడి లేదని నిర్ధారించుకున్నాక ముక్కల మిశ్రమంలో వేసి బాగా కలపాలి. తర్వాత పచ్చడిని జాడీలో వేసి, మూడు రోజుల పాటు ఊరనివ్వాలి. బెల్లం ఆవకాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో, ఆవపిండి - అరకిలో, బెల్లం - 1 కిలో, నూనె - తగినంత తయారీ: బెల్లాన్ని తురుముకోవాలి. మామిడి ముక్కల్లో కారం, ఉప్పు, ఆవపిండి, బెల్లం తురుము వేసి బాగా కలపాలి. ముక్కలు తడిసేలా కొద్దిగా నూనె కూడా వేసి కలపాలి. తర్వాత ఈ ముక్కల్ని ఎండలో పెట్టాలి. రెండు రోజుల్లో ముక్కలకు పట్టిన బెల్లం పాకంలాగా తయారవుతుంది. అప్పుడు ముక్కల్ని జాడీలో వేసి, మునిగేవరకూ నూనె వేసి మూత పెట్టెయ్యాలి. మగ్గిన తర్వాత తీసుకోవాలి. కొందరు తాలింపు కూడా వేసుకుంటారు. నచ్చితే వేసుకోవచ్చు. లేదంటే మామూలుగా కూడా బాగుంటుంది. ఆంధ్ర ఆవకాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో, ఆవపిండి - అరకిలో, వెల్లుల్లి రెబ్బలు - 100 గ్రా., మెంతులు - 100 గ్రా., నూనె - తగినంత తయారీ: ఓ బేసిన్లో మామిడి ముక్కలు, కారం, ఉప్పు, ఆవపిండి వేసి బాగా కలపాలి. జాడీ తీసుకుని... కాసిని మామిడి ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కాసిన్ని మెంతులు... ఇలా పొరలుగా వేసుకోవాలి. చివరగా ముక్కలు మునిగేవరకూ నూనె వేసి మూత పెట్టెయ్యాలి. మూడు రోజుల తర్వాత మూత తీసి, ఒకసారి కలిపి మళ్లీ మూత పెట్టెయ్యాలి. రెండు మూడు రోజుల్లో ఆవకాయ రెడీ అయిపోతుంది. నువ్వు ఆవకాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - 2 కిలోలు, నువ్వులు - అరకిలో, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో, అల్లం వెల్లుల్లి ముద్ద - అరకప్పు, ఆవపిండి - 100 గ్రా., జీలకర్ర పొడి - 50 గ్రా., మెంతి పొడి - 2 చెంచాలు, ఇంగువ - చిటికెడు, పసుపు - 2 చెంచాలు, ఆవాలు - 3 చెంచాలు, జీలకర్ర - 3 చెంచాలు తయారీ: నువ్వులను దోరగా వేయించి, మెత్తగా పొడి చేసుకోవాలి. ఓ గిన్నెలో నువ్వుల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, మెంతిపొడి, పసుపు, ఆవపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. కొద్దిగా నూనె వేడి చేసి... జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేసి వేయించాలి. చల్లారిన తర్వాత కలిపి పెట్టుకున్న పొడుల మిశ్రమంలో వేయాలి. తర్వాత వీటన్నిటినీ మామిడి ముక్కల్లో వేసి బాగా కలపాలి. కొన్ని నువ్వుల్ని దోరగా వేయించి వాటిని కూడా కలిపి, తర్వాత జాడీలో వేసి నిండుగా నూనె వేయాలి. ఆత్రేయపురం రండి... ఆత్రేయపురం పూతరేకులు ఎంత ఫేమస్సో, పచ్చళ్లూ అంతే ఫేమస్. మా ఊళ్లో చాలా కుటుంబాలు పచ్చళ్ల వ్యాపారం మీదే ఆధారపడి జీవిస్తున్నాయి. దాదాపు మూడు వేల కుటుంబాలు రుణాలు తెచ్చుకుని మరీ పచ్చళ్లు తయారు చేస్తున్నాం. యేటా దాదాపు వంద కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతాయి ఇక్కడ. సీజన్‌కి తగ్గట్టుగా పచ్చళ్లు చేసినా, వేసవిలో పని మరింత ఎక్కువ ఉంటుంది. మేం తయారు చేసిన పచ్చళ్లు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి. - పెన్నాడ గాంధీ, పచ్చళ్ల వ్యాపారస్తుడు, ఆత్రేయపురం జబ్బ బలం... కాయ ఖతం పదిహేనేళ్లుగా ముక్కలు కొట్టే పని చేస్తున్నాను. యేటా మే నెల నుంచి జూన్ మొదటి వారం వరకూ చేతి నిండా పని ఉంటుంది. చాలామంది వచ్చి మామిడి కాయలు కట్ చేయించుకుని వెళ్తుంటారు. కాయకి మూడు నుంచి ఐదు రూపాయల వరకూ తీసుకుంటాను. మరీ అంత తీసుకుంటే ఎలా అని కొందరు అంటుంటారు. కానీ ఏం చేస్తాం? ముక్కలు కొట్టడం అంత తేలికైన పనేమీ కాదు. చాలా బలం ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ మాత్రం తీసుకోకపోతే గిట్టుబాటు కాదు కదా! - అబ్దుల్, మెహదీపట్నం రైతుబజార్ గుంటూరుతో గేమ్స్ వద్దు ఆవకాయ అనగానే అందరికీ గుర్తొచ్చేది గుంటూరే. పల్నాడు ప్రాంతంలో పండే మిరపతో పెట్టే ఆవకాయ రుచి మరి దేనికీ రాదన్నది అందరూ అనేమాట. ఇక్కడ ఏ యేటికా ఏడు వ్యాపారం పెరుగుతూ ఉండటానికి కారణం ఆ నమ్మకమే. ఆ నమ్మకాన్ని పాడు చేయకూడదని పూర్వం నుంచి పెద్దవాళ్లు పాటించిన విధానాలనే మేము ఇప్పటికీ పాటిస్తున్నాం. రెడీమేడ్ పొడులు వాడం. మేమే ఇళ్లలో పొడులు తయారు చేసుకుంటాం. నాణ్యమైన నువ్వుల నూనె వాడుతున్నాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఇప్పటికీ మా పచ్చళ్లకు ఆదరణ తగ్గలేదు. మా జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. - పొదిలే రమాదేవి, అతిథిగృహ ఫుడ్స్, గుంటూరు జాడీ... మామిడీ... మేలైన జోడీ... తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పచ్చళ్ల వ్యాపారం పెద్ద స్థాయిలో జరుగుతుంది. దాన్ని ఆధారంగా చేసుకునే రాజమండ్రి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో జాడీలు తయారు చేసే ఫ్యాక్టరీలు చాలా ఏర్పడ్డాయి. వీటి నుంచి వేల సంఖ్యలో జాడీలు రవాణా అయ్యేవి. అయితే ప్లాస్టిక్ డబ్బాల వాడకం పెరిగాక జాడీలు కొనేవాళ్లు తగ్గారు. దాంతో 42 యూనిట్లలో కేవలం మూడు మాత్రమే మిగిలాయి. పచ్చడి నిల్వ ఉండటానికి, ఆరోగ్యానికి హాని జరక్కుండా ఉండటానికి జాడీలే మంచివని ఎంత చెప్పినా ఎవరూ వినిపించుకోవడం లేదు. - గొర్రిపాటి అప్పల్రాజు, తూ.గో. జిల్లా సెరామిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు గోంగూర ఆవకాయ కావలసినవి: గోంగూర - 20 కట్టలు, నూనె - 1 కిలో, వెల్లుల్లి రెబ్బలు - 100 గ్రా., ఆవపిండి - 1 కప్పు, ఉప్పు - 1 కప్పు, కారం - 1 కప్పు, ఆవాలు - 4 చెంచాలు, మెంతిపిండి - 2 చెంచాలు తయారీ: గోంగూర ఆకుల్ని కాడల్నుంచి వేరు చేసి శుభ్రంగా కడగాలి. తర్వాత తడి పోయేలా నీడలో ఆరబెట్టాలి. ఆపైన నూనెలో వేయించి తీయాలి. ఆవాలు, వెల్లుల్ని రెబ్బల్ని కూడా నూనెలో వేయించి తీయాలి. ఓ గిన్నెలో గోంగూర, కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి వేసి బాగా కలపాలి. తర్వాత ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కలిపి జాడీలో వేయాలి. చివరగా నూనె పోసి మూత పెట్టాలి. కావాలంటే తాలింపులో వేరుశెనగలు, జీలకర్ర, ఇంగువ వంటివి కూడా వాడుకోవచ్చు. ఉసిరి ఆవకాయ కావలసినవి: ఉసిరికాయలు - 2 కిలోలు, నూనె - 2 కిలోలు, కారం - అరకిలో, ఆవపిండి - అరకిలో, ఉప్పు - అరకిలో, మెంతులు - 50 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు - 100 గ్రా. తయారీ: మెంతుల్ని నూనె లేకుండా వేయించి పక్కన పెట్టాలి. ఉసిరికాయల్ని కడిగి, గాట్లు పెట్టి, తడి లేకుండా తుడిచి ఆరబెట్టాలి. తర్వాత వీటిని నూనెలో వేయించి తీయాలి. వీటిలో ఉప్పు, కారం, ఆవపిండి వేసి బాగా కలపాలి. తర్వాత మెంతులు, వెల్లుల్లి కూడా కలిపి జాడీలో వేయాలి. ముక్కలు మునిగేదాకా నూనె పోసి మూత పెట్టాలి. మునగావకాయ కావలసినవి: మునక్కాయ ముక్కలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో, ఆవపిండి - అరకిలో, చింతపండు గుజ్జు - 1 కప్పు, ఇంగువ - చిటికెడు, మెంతిపిండి - 4 చెంచాలు, జీలకర్ర పొడి - 2 చెంచాలు, వెల్లుల్లి రెబ్బలు - 50 గ్రా., నూనె - తగినంత, కరివేపాకు - 4 రెమ్మలు, ఆవాలు - 2 చెంచాలు, జీలకర్ర - 2 చెంచాలు తయారీ: మునక్కాయ ముక్కల్ని కడిగి ఆరబెట్టాలి. తర్వాత వాటిని నూనెలో వేయించుకోవాలి. చల్లారిన తర్వాత కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ఆవపిండి వేసి కలిపి జాడీలో పెట్టెయ్యాలి. ముక్కలు మునిగేవరకూ నూనె పోసి మూత పెట్టాలి. రెండు రోజుల తర్వాత కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువతో పోపు పెట్టి పచ్చడిలో కలపాలి. మళ్లీ మూత పెట్టేసి రెండు రోజులు ఊరనిస్తే ఆవకాయ రెడీ. కాలీఫ్లవర్ ఆవకాయ కావలసినవి: కాలీఫ్లవర్ ముక్కలు - 4 కప్పులు, నూనె - 2 కప్పులు, వెల్లుల్లి రెబ్బలు - అరకప్పు, కారం - 1 కప్పు, ఉప్పు - 1 కప్పు, ఆవపిండి - 1 కప్పు, పసుపు - 2 చెంచాలు తయారీ: కాలీఫ్లవర్స్ ముక్కల్ని వేడి నీటిలో వేసి రెండు నిమిషాలు ఉంచి తీస్తే పురుగులు ఏమైనా ఉంటే పోతాయి. తర్వాత ఈ ముక్కల్ని ఎండలో ఆరబెట్టాలి. ఆపైన నూనెలో దోరగా వేయించి తీసేయాలి. ఈ ముక్కల్లో ఉప్పు, ఆవపిండి, కారం, పసుపు వేసి బాగా కలపాలి. చివరగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి, జాడీలో పెట్టి, నూనె పోసి మూత పెట్టెయ్యాలి. ఇష్టమైతే తాలింపు వేసుకోవచ్చు. నిమ్మ ఆవకాయ కావలసినవి: నిమ్మకాయలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఆవపిండి - 50 గ్రా., మెంతిపిండి - 6 చెంచాలు, ఉప్పు - అరకిలో, నూనె - సరిపడా, ఆవాలు - 4 చెంచాలు, ఎండు మిరపకాయలు - 15, కరివేపాకు - 1 కట్ట, వెల్లుల్లి రెబ్బలు - 1 కప్పు తయారీ: నిమ్మకాయల్ని నాలుగు బద్దలుగా నిలువుగా కోసుకోవాలి. జాడీలో ఓ పొర నిమ్మకాయ ముక్కలు, ఓ పొర ఉప్పు... ఇలా పొరలు పొరలుగా వేసుకుని మూత పెట్టేయాలి. మూడు రోజుల తర్వాత ముక్కల్ని తీసి ఎండలో పెట్టాలి. నిమ్మరసం ఊరి జాడీలో పడుతుంది. దాన్ని కూడా ఎండలో పెట్టాలి. ఎండ తగ్గాక తీసి రెండిటినీ జాడీలో వేసి మూత పెట్టాలి. మూడు రోజుల పాటు ఇలానే చేయాలి. తర్వాత ముక్కల్ని ఓ బేసిన్లో వేసుకుని.. ఆవపిండి, మెంతిపిండి, కారం కలిపి మళ్లీ జాడీలో పెట్టి, నిండా నూనె వేయాలి. మూడు రోజుల తర్వాత తీసి... ఎండుమిర్చి ముక్కలు, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు నూనెలో వేయించి, ఆ తాలింపును నిమ్మకాయ మిశ్రమంలో కలపాలి. కాకర ఆవకాయ కావలసినవి: కాకరకాయ ముక్కలు - 2 కిలోలు, ఉప్పు - అరకిలో, చింతపండు - పావుకిలో, కారం - అరకిలో, ఆవపిండి - 4 చెంచాలు, నూనె - తగినంత, ఆవాలు - 4 చెంచాలు, జీలకర్ర - 4 చెంచాలు, కరివేపాకు - 2 రెమ్మలు తయారీ: కాకరకాయల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి, ముక్కలుగా కోసుకోవాలి. చింతపండులో నీళ్లుపోసి స్టౌమీద పెట్టాలి. మెత్తగా ఉడికాక దించేసి చల్లారబెట్టి, మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి, కాకరకాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. తర్వాత ఈ ముక్కల్లో చింతపండు గుజ్జు, కారం, ఆవపిండి, ఉప్పు వేసి కలిపి జాడీలో పెట్టి నూనె పోయాలి. రెండు రోజుల తర్వాత... జీలకర్ర, ఆవాలు, కరివేపాకుతో తాలింపు పెట్టి, ఆ తాలింపును పచ్చడిలో వేసి కలపాలి. పెసర ఆవకాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో, పెసర పిండి - అరకిలో (రెడీమేడ్ కంటే పెసల్ని కాస్త వేయించుకుని, పిండి పట్టించి వాడుకుంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది), వెల్లుల్లి రెబ్బలు - 100 గ్రా., మెంతులు - 100 గ్రా. తయారీ: మెంతుల్ని నూనె లేకుండా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఓ బేసిన్లో మామిడి ముక్కలు, కారం, ఉప్పు,పెసరపిండి వేసి బాగా కలపాలి. జాడీ తీసుకుని... కొన్ని ఆవకాయ ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కాసిన్ని మెంతులు... ఇలా పొరలుగా వేసుకోవాలి. చివరగా ముక్కలు మునిగేవరకూ నూనె వేసి మూత పెట్టెయ్యాలి. మూడు రోజుల తర్వాత మూత తీసి, ఒకసారి కలిపి మళ్లీ మూత పెట్టెయ్యాలి. రెండు మూడు రోజుల్లో ఆవకాయ రెడీ అయిపోతుంది. టొమాటో ఆవకాయ కావలసినవి: టొమాటోలు - 2 కిలోలు, ఉప్పు - అరకిలో, కారం - అరకిలో, ఆవపిండి - 50 గ్రా., వెల్లుల్లి రెబ్బలు - 50 గ్రా., నూనె - సరిపడా, చింతపండు - పావుకప్పు, కరివేపాకు - 1 కట్ట, ఆవాలు - 6 చెంచాలు, ఎండుమిర్చి - 15 తయారీ: టొమాటోలను ముక్కలుగా కోసుకోవాలి. వీటికి ఉప్పు చేర్చి జాడీలో పెట్టాలి. మూడో రోజు తీసి ఎండలో పెట్టాలి. జాడీలోకి ఊరిన టొమాటో రసాన్ని కూడా ఎండలో పెట్టాలి. మళ్లీ సాయంత్రం రెండిటినీ కలిపి జాడీలో పెట్టేయాలి. మూడు రోజులు అలా ఎండబెట్టిన తర్వాత... టొమాటో ముక్కలు, రసం, చింతపండు కలిపి మిక్సీ పట్టాలి. మరీ పేస్ట్‌లా అవ్వకుండా కొంచెం ముక్కలుగా ఉండేలా చూసుకోవాలి. ఈ మిశ్రమానికి ఆవపిండి, ఉప్పు, కారం బాగా పట్టించి జాడీలో పెట్టి, మునిగేవరకూ నూనె పోయాలి. రెండు రోజుల తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలను నూనెలో వేయించి పచ్చడిలో కలపాలి. అల్లం ఆవకాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో, ఆవపిండి - అరకిలో, అల్లం - 200 గ్రా., వెల్లుల్లి రెబ్బలు - 200 గ్రా., మెంతులు - 25 గ్రా., జీలకర్ర - 25 గ్రా., ఎండుమిర్చి - 10, ఆవాలు - 2 చెంచాలు, నూనె - తగినంత తయారీ: అల్లం, వెల్లుల్లి రెబ్బల్ని శుభ్రం చేసి... నీళ్లు కలపకుండా మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. మెంతులు, జీలకర్రను వేయించి పొడి చేసుకోవాలి. ఈ పొడితో పాటు ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద మామిడి ముక్కల్లో వేసి కలపాలి. తగినంత నూనె వేసి కలిపి జాడీలో పెట్టాలి. మూడు రోజుల తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి పోపు పెట్టి, దాన్ని పచ్చడిలో కలపాలి. డాక్టర్ ఆవకాయ! పచ్చిమామిడిలో విటమిన్ ‘బి’తో పాటు విటమిన్ ‘సి’ కూడా ఎక్కువ. ఈ రెండు విటమిన్ల కారణంగా మామిడికాయ పచ్చడితో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మన శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో ఈ రెండు విటమిన్లు తోడ్పడతాయి. ⇒ ఆవపిండిలో మినరల్స్ ఎక్కువ. పైగా క్యాన్సర్‌తో పోరాడే శక్తి ఉంటుంది. అలాగే మెంతిపిండిలో ప్రోటీను, విటమిన్ సి, నియాసిన్, పొటాషియమ్, ఐరన్ ఉంటాయి. ఫలితంగా శరీరానికి అవసరమైన కీలక పోషకాలు, మైక్రోన్యూట్రియెంట్స్ లభ్యమవుతాయి. ⇒ ⇒ ⇒మామిడిలోని పీచుతో పాటు, మెంతిలోని పీచు కలిసి శరీరానికి అవసరమైన ఫైబర్‌ని సమకూరుస్తాయి. ఇక మెంతుల్లో కొలెస్ట్రాల్ తగ్గించే గుణం ఉండటం వల్ల గుండెజబ్బుల ఆస్కారం తగ్గుతుంది. ⇒ఆవకాయలో ఉపయోగించే వెల్లుల్లిలో యాంటీక్యాన్సర్ గుణాలు ఉండటం వల్ల ఇది క్యాన్సర్‌ను నిరోధించడంతో పాటు, కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. ⇒ నువ్వుల నూనెలో మెగ్నీషియమ్ పుష్కలంగా ఉంటుంది. దానిలో రక్తపోటును తగ్గించే గుణాలతో పాటు, డయాబెటిస్‌నూ నివారించే గుణాలున్నాయి. ఈ రెండు గుణాలూ కలగలసి ఉండటం వల్ల గుండెజబ్బులూ తగ్గుతాయి. కాబట్టి ఆవకాయలో నువ్వుల నూనెను ఉపయోగించడం ఎంతైనా ఉత్తమం. ⇒ కొందరు ఆవకాయలో పల్లీల నూనె (వేరుశెనగనూనె)ను వాడతారు. పల్లీ నూనె మంచిదే. దీనివల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఎందుకంటే 100 గ్రాముల నూనెలో 884 క్యాలరీల శక్తి ఉంటుంది. పల్లీ నూనెలోని ఒమెగా - 6 ఫ్యాటీ ఆసిడ్స్ శరీరానికి మంచి పోషకాలు ఇస్తాయి.పైగా ఇందులోని యాంటీఆక్సిడెంట్లు వయసు తగ్గినట్లు కనిపించడానికి సాయం చేస్తాయి. అలాగే ఎన్నో క్యాన్సర్లను, ఆల్జైమర్స్ వంటి కొన్ని వ్యాధులను సమర్థంగా నివారించేందుకు పోరాడతాయి. (ఆవకాయలో నువ్వుల నూనె లేదా పల్లీల నూనె ఉపయోగించడం వ్యక్తిగత అభిరుచిమీద ఆధారపడి ఉంటుంది. పల్లీల నూనెతో రుచి ఎక్కువ. నువ్వుల నూనెలో పోషకాలు ఎక్కువ). మితిమీరితే అనర్థమే... పోషకగుణాలు ఉన్నప్పటికీ కొత్త ఆవకాయతో అనర్థాలూ ఉన్నాయి. పచ్చడి చెడిపోకుండా ఉండేందుకు ఉప్పును ఎక్కువగా వేసి ప్రిజర్వేటివ్‌లా ఉపయోగిస్తారు. దాని వల్లబీపీ పెరిగే అవకాశాలు ఎక్కువ ఇక పచ్చడిలో కారంపాళ్లు అధికంగా ఉండటం వల్ల కడుపులో ఏవైనా పుండ్లు, అల్సర్లు ఉంటే అవి మరింతగా మంట పుట్టించవచ్చు నూనెలో ఉండే కొవ్వు పదార్థాలు ఆలస్యంగా జీర్ణమయ్యే గుణాలను కలిగి ఉంటాయి. దాంతో కొందరిలో పచ్చడి తిన్నప్పుడు జీఈఆర్డీ (గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్) లక్షణాలు కనిపిస్తూ, ఛాతిలో మంట (హార్ట్‌బర్న్) అనిపిస్తుంటుంది. కాబట్టి పచ్చడి వేసుకునే సమయంలో నూనెను తక్కువగానే వేసుకోవాలి. పైగా నూనెలోని కొవ్వులు గుండెకు అంత మేలు కూడా కాదు. - సుజాత స్టీఫెన్, న్యూట్రిషనిస్టు పికిల్ ప్రికాషన్స్ ⇒పచ్చడి పెట్టేముందు కాయల ముచికలు కోసేసి, ఒకట్రెండు గంటల పాటు నీటిలో వేసి ఉంచాలి. దానివల్ల సొన అంతా కారిపోతుంది. తర్వాత కాయల్ని శుభ్రంగా కడిగి, తుడిచి, తడి ఆరాక కోసుకోవాలి. ⇒వాడే పాత్రలు, గరిటెలు, నిల్వ చేసే జాడీలు అన్నీ శుభ్రంగా కడిగి, తడి లేకుండా ఆరబెట్టాలి. ⇒పచ్చడి జాడీలో వేసిన తర్వాత గుడ్డ చుడతారు. ఆ గుడ్డ కచ్చితంగా శుభ్రమైనదై ఉండాలి. ⇒ స్టీలు, రాగి, ప్లాస్టిక్ డబ్బాల్లో పచ్చడిని భద్రపర్చకూడదు. ⇒ఒకవేళ చేతితో కలుపుతుంటే చేతికి తడి లేకుండా చూసుకోవాలి. గరిటెతో కలపాలి అనుకుంటే చెక్క గరిటెతో కలపడం మంచిది. అలాగే పచ్చడి జాడీలోంచి తీసుకున్న ప్రతిసారీ తడి గానీ, చల్లని గాలి గానీ తగలకుండా జాగ్రత్తపడాలి. ⇒పచ్చడి జాడీలో వేశాక ఊరేలోపు అప్పుడప్పుడూ చెక్ చేసుకోవాలి. నూనె సరిపోకపోతే వెంటనే నూనె వేసుకోవాలి. లేకపోతే బూజు వచ్చేస్తుంది. ⇒పచ్చడికి ఏ నూనె పడితే ఆ నూనె వాడకూడదు. మంచి వేరుశెనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగుంటుంది. ⇒ వీలైనంత వరకూ రెడీమేడ్ పిండి కాకుండా ఇంట్లో తయారు చేసుకున్న ఆవపిండి, మెంతిపిండి వాడితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పదార్థాల్లో శార్దూలం సీ. మామిళ్లముక్కపై మమకారమున్ జల్లి అందింపంగా జిహ్వ ఆవకాయ ఎండకాలమునందు ఎండిపోయిన గుండెకు అభినందనము దెల్పు నావకాయ కూరలే లేనిచో కోమలి వేయుచో అనురాగమున్ జూపు నావకాయ చీకుచున్నను గాని పీకుచున్నను గాని ఆనందమే ఇచ్చు నావకాయ ఆపదల నాదుకొను కూర ఆవకాయ అతివ నడుమైన జాడీయె ఆవకాయ ఆంధ్రమాత సింధూరమ్మె ఆవకాయ ఆంధ్రదేశమ్మె తానొక్క ఆవకాయ - మహాసహస్రావధాని డా. గరికపాటి నరసింహారావు ముక్క మహత్తరి మామిడి, ఆవాలు, మిరపకాయలు అని ఆవకాయలో మూడు ద్రవ్యాలుంటాయి. వాటిలో ఆవాలతో సర్షప హోమం, మిర్చితో ప్రత్యంగిరా హోమం, మామిడి ముక్కలు, కారంతో భగళాముఖి హోమం చేస్తారు. చూతవృక్షం అంటే మామిడి చెట్టు దైవవృక్షం. అంచేతనే సంప్రదాయ కుటుంబాలలో ఆవకాయను మడిగా పెడతారు. దానిని మడిగా కొయ్యజాడీలలో పెట్టి అటకెక్కిస్తారు. కావలసినప్పుడల్లా మడిగానే తీసుకుని వాడుకుంటారు. ఇక మాగాయ పచ్చడి గురించి పోతన భాగవతంలో పద్యాలు కూడా ఉన్నాయి. దానిని శ్రీకృష్ణుడికి నివేదన ద్రవ్యంగా వాడతారు. కొన్ని గిరిజన కుటుంబాలలో ఇప్పటికీ కూడా తమ దేవతకు పెరుగన్నంలో ఆవకాయ వేసి నివేదన చేస్తుంటారు. అంటే ఆవకాయ ఇప్పటిది కాదు.. ఎప్పటినుంచో ఉందన్నమాటేగా! - డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు, పౌరాణిక పండితులు ఎర్రగా నవ్వండి భర్త: ఇవాళ ఏం వండావ్..? భార్య: ఆవకాయ.. మీకిష్టమే కదా! సేల్స్‌మేన్: ‘స్వచ్ఛభారత్’ సబ్బు తీసుకుంటారా..? కస్టమర్: దీని స్పెషాలిటీ ఏంటి..? సేల్స్‌మేన్: ఆవకాయ మరకల్ని కూడా ఇట్టే వదిలిస్తుంది. పనిమనిషి: అమ్మా! కంచాలన్నీ శుభ్రంగా కడిగేసినట్లున్నారు.. నేనేం కడగాలి..? ఆండాళు: కొత్తావకాయ వడ్డించా..! అందరూ శుభ్రంగా నాకేశారు. వాటినింకా కడగలేదు.. డోసుబాబుని నెలాఖర్లో మందుపార్టీకి ఆహ్వానించాడు గ్లాసుబాబు డోసుబాబు: మందులోకి మంచింగ్ ఏంట్రా..? గ్లాసుబాబు: ఓన్లీ ఆవకాయ్.. మన్దసలే బడ్జెట్ పార్టీ కదా.. మటన్ ఆవకాయ కావలసినవి: మటన్ - 2 కిలోలు, కారం - కిలోన్నర, ఆవపిండి - 10 చెంచాలు, జీలకర్ర పొడి - 10 చెంచాలు, మెంతిపిండి - 10 చెంచాలు, ఆమ్చూర్ పౌడర్ - 10 చెంచాలు, పసుపు - 2 చెంచాలు, ఉప్పు - 1 కిలో, నూనె - తగినంత తాలింపు కోసం: ఎండుమిర్చి - 10, వెల్లుల్లి రెబ్బలు - పావుకిలో, కరివేపాకు - 4 రెమ్మలు, జీలకర్ర - 2 చెంచాలు, ఆవాలు - 2 చెంచాలు తయారీ: మటన్‌ను ముక్కలుగా కోసి శుభ్రంగా కడగాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి ఉడికించి కాసేపు ఎండబెట్టాలి. తర్వాత వాటిని నూనెలో వేయించాలి. చల్లారాక మెంతిపిండి, ఆవపిండి, కారం, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్ వేసి బాగా కలపాలి. కొద్దిగా నూనె వేడిచేసి... కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలతో తాలింపు పెట్టాలి. ఈ తాలింపును మటన్ ముక్కల్లో వేసి కలిపి, మూత బిగుతుగా ఉండే జాడీలో వేయాలి. పచ్చడి అంతా మునిగేవరకూ నూనె పోసి మూత పెట్టెయ్యాలి. మూడు నాలుగు రోజులు ఊరిన తర్వాత తింటే బాగుంటుంది. ఫిష్ ఆవకాయ కావలసినవి: చేపముక్కలు - 2 కిలోలు, కారం - 1 కిలో, అల్లం తురుము - పావుకప్పు, వెల్లుల్లి తురుము - పావుకప్పు, నల్ల మిరియాల పొడి - 4 చెంచాలు, వెనిగర్ - 5 చెంచాలు, పసుపు - 2 చెంచాలు, ఉప్పు - అరకిలో, నూనె - తగినంత తయారీ: చేపముక్కలకు పసుపు, మిరియాల పొడి, ఉప్పు కలిపి అరగంట పాటు ఉంచాలి. తర్వాత ఈ ముక్కల్ని నూనెలో ఎరుపు రంగు వచ్చేవరకూ వేయించాలి. తర్వాత మరో గిన్నె స్టౌ మీద పెట్టి నూనె వేయాలి. వేడెక్కాక అల్లం తురుము, వెల్లుల్లి తురుము వేసి వేయించాలి. వీటిని చేపముక్కల్లో వేసి కలపాలి. కారం, వెనిగర్ కూడా వేసి కలిపి జాడీలో వేయాలి. ముక్కలు మునిగేవరకూ నూనె పోసి మూత బిగించాలి. ఒకట్రెండు రోజులు ఊరనిస్తే పచ్చడి రెడీ అవుతుంది. కావాలంటే ముల్లు తీసేసి, మెత్తని భాగాన్ని ముక్కలుగా చేసుకుని కూడా పచ్చడి పెట్టుకోవచ్చు. చికెన్ ఆవకాయ కావలసినవి: బోన్‌లెస్ చికెన్ - 2 కిలోలు, కారం - కిలోన్నర, ఆవపిండి - 10 చెంచాలు, జీలకర్ర పొడి - 10 చెంచాలు, మెంతిపిండి - 10 చెంచాలు, ఆమ్చూర్ పౌడర్ - 10 చెంచాలు, పసుపు - 2 చెంచాలు, ఉప్పు - 1 కిలో, నూనె - తగినంత తాలింపు కోసం: ఎండుమిర్చి - 10, వెల్లుల్లి రెబ్బలు - పావుకిలో, కరివేపాకు - 4 రెమ్మలు, జీలకర్ర - 2 చెంచాలు, ఆవాలు - 2 చెంచాలు తయారీ: చికెన్‌ను ముక్కలుగా కోసి శుభ్రంగా కడగాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి ఉడికించి ఓ రోజంతా ఎండబెట్టాలి. తర్వాతి రోజు ఈ ముక్కల్లో మెంతిపిండి, ఆవపిండి, కారం, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్ వేసి బాగా కలపాలి. కొద్దిగా నూనె వేడిచేసి... కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలతో తాలింపు పెట్టాలి. ఈ తాలింపును మటన్ ముక్కల్లో వేసి కలిపి, మూత బిగుతుగా ఉండే జాడీలో వేయాలి. పచ్చడి అంతా మునిగేవరకూ నూనె పోసి మూత పెట్టెయ్యాలి. మూడు నాలుగు రోజులు ఊరిన తర్వాత తింటే బాగుంటుంది. రొయ్యల ఆవకాయ కావలసినవి: రొయ్యలు - 2 కిలోలు, నూనె - 2 కిలోలు, కారం - 1 కిలో, ఉప్పు - ముప్పావు కిలో, లవంగాల పొడి - 4 చెంచాలు, వెల్లుల్లి పేస్ట్ - 4 చెంచాలు, నిమ్మకాయలు - 5 తయారీ: రొయ్యల్ని శుభ్రం చేసి, ఐదు నిమిషాల పాటు వేడి నీటిలో వేసి ఉంచాలి. తర్వాత నీళ్లు తీసేసి, ఆరబెట్టాలి. తడి పోయిన తర్వాత నూనెలో వేయించుకోవాలి. తర్వాత వీటిలో లవంగాల పొడి, కారం, ఉప్పు, వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి నిమ్మరసం పిండాలి. తర్వాత పచ్చడిని జాడీలో వేసి, నూనె పోసి మూత పెట్టెయ్యాలి. నాలుగు రోజులు ఊరిన తర్వాత తీసుకుని తినవచ్చు. జ్ఞాపకం అప్పు చేసైనా ఆవకాయ పెట్టాల్సిందే! ఇప్పుడంటే ఏ కాయ పడితే ఆ కాయతో ఏదో ఆవకాయ పెట్టామని పించుకుంటున్నాం కానీ, మా తాతయ్య హయాంలో మాత్రం ఆవకాయ పెట్టడమంటే ఓ వైభోగమే. వేసవి వచ్చీ రాగానే తాతయ్య ఆవకాయ, మాగాయ ఎట్లా పెట్టించాలా అని హడావుడి పడేవారు. మాది పెద్ద కుటుంబం కావడాన కనీసం వంద కాయలకు తక్కువ కాకుండా ఆవకాయ, అంతకు ఓ పాతిక ముప్పై కాయల పెచైర్ల మాగాయా పెట్టేవాళ్లు. ముందు సన్న ఆవాలు తెప్పించి, వాటిని చెరిగి, ఎండబెట్టి, ఆవపిండి కొట్టించేవారు. బళ్లారి మిరపకాయలు కొనుక్కొచ్చి, తొడిమలు తీయించి ఎండబెట్టి, కారం కొట్టించేవారు. ఉప్పూ, పప్పునూనే ముందే సిద్ధంగా ఉండేవి. ఆనక తోటకు వెళ్లి, కాయలు కోయించి, గోతాల్లో తెచ్చి, మా మామ్మ ముందు పోసేవారు. ఆమె, అమ్మ, పిన్నులు, నాన్నగారి మేనత్తలు... అందరూ కలిసి తలా ఓ కత్తిపీట ముందేసుకుని కాయలన్నింటికీ ముచికలు తీసి, నీళ్లతొట్లో వేసేవారు. సొన అంతా పోయాక, వాటిని తీసి, బట్టతో శుభ్రంగా తుడిచిపెట్టేవాళ్లు. మా నాన్న, బాబాయిలు ముక్కలు కొట్టేవారు. అంతసేపూ ‘టెంక చెదిరిపోతోంది, ముక్క నలిగిపోతోంది, కొంచెం పెద్ద ముక్కలు కొట్టండర్రా ... అలాగని మరీ పెద్దగా కాదు... వేళ్లు జాగర్త...’’ అంటూ తెగ హడావుడి పెట్టేవారు తాతయ్య. రాసులుగా తరిగిపోసిన మామిడికాయ ముక్కలు, ఉప్పు, ఆవపిండి, కారం, నూనె.. అన్నింటినీ పెద్ద పెద్ద బేసిన్లలో పోసి, చేత్తోనే కలిపేసేది మామ్మ. మా ప్రభాతత్త రుచులు చూడటంలో స్పెషలిస్టు. తనకి నచ్చితే... అందరికీ నచ్చి తీరేది! పచ్చడి కలిపిన బేసిన్లోనే మరో నాలుగ్గరిటెల ఆవకాయ వేసి, వేడి వేడి అన్నం అందులో దిమ్మరించి, ఆపైన ఆరారగా నెయ్యి వేసి, మా అందరికీ కలిపి ముద్దలు పెట్టేది మామ్మ. అప్పుడే కలిపిన ఆవఘాటుకి, కారానికి ముక్కుల్లోనుంచి, ఆ రుచికి కళ్లల్లోంచి నీళ్లు కారేవి అందరికీ. ఆ తర్వాత పచ్చడిని జాగ్రత్తగా చిన్న, పెద్ద జాడీల్లో వేసి, వాటి మూతికి వాసెన కట్టి పెట్టేది మామ్మ. ఓ రెండు మూణ్ణెల్లపాటు ఇంటికి బంధువులెవరొచ్చినా... ‘‘కొత్తావకాయ రుచి చూపించి కానీ పంపేవారు కాదు. బాగా బతికినప్పుడు వంద, రెండువందల కాయలకు తక్కువ కాకుండా పచ్చడి పెట్టించిన తాతయ్య, చితికి పోయిన తర్వాత కూడా పచ్చళ్ల విషయంలో రాజీ పడలేదు. అప్పు చేసైనా సరే, ఆవకాయ పెట్టించి అందరికీ రుచి చూపించేవారు. అందుకే పచ్చళ్ల సీజన్ వచ్చిందంటే మామ్మా తాతయ్యా కళ్ల ముందు మెదులుతూనే ఉంటారు. - బాచి మాగాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - 1 కిలో, కారం - పావు కిలో, ఉప్పు - పావుకిలో, మెంతిపిండి - 4 చెంచాలు, ఆవపిండి - 4 చెంచాలు, ఇంగువ - చిటికెడు, ఎండుమిర్చి - 10, పసుపు - చిటికెడు, ఆవాలు - 4 చెంచాలు, జీలకర్ర - 2 చెంచాలు తయారీ: మామిడికాయలు చెక్కు తీసి, సన్నగా తరగాలి. వీటిలో ఉప్పు కలిపి రెండు రోజులు ఉంచాలి. ఈలోపు రసం బాగా ఊరుతుంది. రెండు రోజుల తర్వాత రసంలోంచి ముక్కలు వేరు చేసి ఎండబెట్టాలి. రసాన్ని కూడా కాసేపు ఎండలో ఉంచి తర్వాత ఆవపిండి, మెంతిపిండి, కారం వేసి కలపాలి. తర్వాత ఇందులో ముక్కలు కూడా వేసి కలపాలి. చివరగా నూనె వేడిచేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువతో తాలింపు వేసి పచ్చడిలో కలపాలి. వెంటనే కాకుండా ఒకట్రెండు రోజుల తర్వాత తింటే బాగుంటుంది. -
విశ్వమంతటి విశ్వాసం జ్యోతిషం
అర్థార్జనే సహాయః పురుషాణా మాపదార్ణవే పోతః యాత్రాసమయే మంత్రీ జాతకమపహాయ నాస్త్యపరః - జాతక సారావళి జ్యోతిశ్శాస్త్రం ధన సంపాదన వ్యవహారాల్లో ఉపకరిస్తుంది. ఆపదల సముద్రంలో చిక్కుకున్నప్పుడు ఓడలా ఒడ్డుకు చేరుస్తుంది. యాత్రలకు వెళ్లేటప్పుడు మంత్రిలా తగిన సలహాలిస్తుంది. జ్యోతిషం భారతదేశానికి మాత్రమే పరిమితమైన శాస్త్రం కాదు. ఇది ఏదో ఒక మతానికి మాత్రమే పరిమితమైనది కూడా కాదు. ప్రాక్పశ్చిమ దేశాలలో వివిధ మతాలకు చెందిన పండితులు ఎవరి పద్ధతుల్లో వారు జ్యోతిషాన్ని అధ్యయనం చేశారు, అభివృద్ధి చేశారు. జాతక రచన చేశారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి పురాణ పురుషులకు జాతకాలు ఉన్నాయి. దేశ దేశాలను ఏలిన చక్రవర్తులకు, మహారాజులకు జాతకాలు ఉన్నాయి. మన దేశాన్ని ఏలిన మొఘల్ చక్రవర్తులు, బ్రిటిష్ పాలకులు సైతం జ్యోతిషాన్ని ఆదరించిన దాఖలాలు ఉన్నాయి. జహంగీరు ఆస్థానంలో జగన్నాథ సమ్రాట్, కృష్ణ దైవజ్ఞ అనే జ్యోతిష సిద్ధాంతులు ఉండేవారు. షాజహాన్ కొడుకు షుజా ప్రాపకంలో పనిచేసిన బలభద్రుడనే జ్యోతిషుడు హోరారత్నం అనే జ్యోతిష గ్రంథాన్ని రాశాడు. బ్రిటిష్ చక్రవర్తి ఐదో జార్జి తన భారతదేశ పట్టాభిషేకం కోసం తొలుత 1911 నవంబర్ 9న గురువారం ప్రయాణమవుదామనుకున్నా, ఆరోజు తండ్రి పుట్టినరోజు కావడంతో తల్లి ఆజ్ఞ మేరకు ప్రయాణాన్ని విరమించుకున్నాడు. మరుసటి రోజు శుక్రవారం నావికులకు అనుకూలమైన రోజు కానందున జ్యోతిషుల సూచన మేరకు నవంబర్ 11న అభిజిర్లగ్నంలో బయలుదేరాడు. డిసెంబర్ 12న మంగళవారం అభిజర్లగ్న ముహూర్తాన ఢిల్లీలో పట్టాభిషిక్తుడయ్యాడు. జ్యోతిషంపై ప్రపంచవ్యాప్తంగా గల విశ్వాసానికి ఇవి కొన్ని ఉదాహరణలు. జ్యోతిష శాస్త్రాన్ని ప్రాచీనులు ప్రధానంగా రెండు భాగాలుగా విభజించారు. ఒకటి సిద్ధాంత భాగం (అస్ట్రానమీ), రెండు జాతక భాగం (అస్ట్రాలజీ). అస్ట్రానమీనే ఖగోళశాస్త్రం అంటున్నాం. ఆధునిక కాలంలో ఖగోళశాస్త్రం బాగా అభివృద్ధి చెందింది. గ్రహాంతర పరిశోధనలు ఊపందుకున్నాయి. గ్రహగతులను తెలుసుకోవడానికి సిద్ధాంత భాగం ఉపయోగపడుతుంది. గ్రహగతుల ఆధారంగానే కాల విభజన, భూత భవిష్యత్ వర్తమాన ఫలితాలను జాతక విభాగం విపులీకరిస్తుంది. ఈ ఫలితాలను తెలుసుకోవడానికి ‘భ చక్రం’ అని పిలుచుకొనే రాశిచక్రమే కీలకం. మేషం నుంచి మీనం వరకు పన్నెండు రాశులుగా విభజించుకున్న ఈ చక్రంలో ఒక్కొక్క రాశికి నిర్దిష్టమైన లక్షణాలు ఉంటాయి. రాశుల లక్షణాల గురించి వచ్చేవారం... - పన్యాలజగన్నాథ దాసు -
దొరకునా... ఇటువంటి జాబు..!
ఇదీ విషయం రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా ఏం లాభం..? జస్ట్ హ్యాండ్ టు మౌత్.. బతుకు గానుగెద్దులా గడిచిపోతోంది. తలలు బద్దలు కొట్టుకుంటున్నా ఏం ఉపయోగం... వచ్చే శాలరీతో జేబు నిండటమే గగనం... అవసరాలు తీరేదెలా అని వగచే సగటు జీవులు మన సమాజంలో తక్కువేమీ కాదు. ఇలాంటి సగటు జీవుల దీనగాథలు వింటూ, దుర్భర జీవితాలను కళ్లారా కంటూ ఎదిగే యువతరంలో కొందరు జ్ఞానోదయం పొందిన వారై, బాదరబందీలేవీ పట్టని బద్ధకస్తులుగా పరిణమించడం కద్దు. శుభ్రంగా తిని నిద్రపోవడంలో కుంభకర్ణుడే వాళ్లకు ఆదర్శం. ఎదిగిన కుర్రాళ్లు చురుగ్గా, చొరవగా, కూసింత దూకుడుగా ఉండాలని ఆశించే తల్లిదండ్రులకు బద్దకిష్టి సుపుత్రులు ఒక పట్టాన కొరుడుకు పడరు. కూచుని తింటే కొండలైనా కరిగిపోతాయి.. వంటి సూటిపోటి మాటల తూటాలకు వారు ఎంతమాత్రం చలించరు. విజ్ఞులైన వారు లోకుల మాటలను చెవిన పెట్టి మనసు పాడుచేసుకోరనే సూత్రం వారికి బాగానే తెలుసు. అందుకే, ఎవరేమన్నా పట్టించుకోకుండా, మెలకువగా ఉన్నప్పుడు ముప్పూటలా భోంచేసి, మిగిలిన సమయాల్లో ముసుగు తన్నేసి ధ్యానముద్రలోకి జారుకుంటారు. కుంభకర్ణుడితో పోటీపడే ఇలాంటి బద్ధకస్తులకు ఉద్యోగాలెలా దొరకుతాయోనంటూ వారి తల్లిదండ్రులు బెంగపెట్టేసుకుని బీపీ, సుగర్.. వగైరా వగైరా జబ్బులు తెచ్చిపెట్టుకుంటుంటారు. అయితే, బద్ధకస్తులకు, వారి భవితవ్యం గురించి దిగులుపడి కుంగి కృశించిపోయే వారి తల్లిదండ్రులకు ఓ శుభవార్త! మరేం ఫర్వాలేదు. ఎలాంటి దిగుళ్లూ, గుబుళ్లూ అవసరం లేదు. ఎవ్రీ డాగ్ హాజ్ ఇట్స్ ఓన్ డే అన్నట్లుగానే ఎవ్రీ కౌచ్పొటాటో హాజ్ హిజ్ ఓన్ జాబ్ అనే రోజులొచ్చేశాయి. బద్ధకస్తులకు ఉద్యోగాలేమిట్రా నాయనా..! అని ఆశ్చర్యపోతున్నారా..? అలాగని అట్టే నోరు తెరిచిపెట్టుకోకండి.. ఈగలు జొరబడగలవు! బద్ధకస్తులకు ఓ బ్రహ్మాండమైన జాబ్ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ చేస్తున్నదేమీ ఆషామాషీ సంస్థ కాదు, సాక్షాత్తు అమెరికా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’. పని చేయకుండా పైసలిస్తారేంటి..? అనే అనుమానాలే వద్దు. ఇందులో చేరితే శుభ్రంగా బబ్బోవడం తప్ప వేరే పనేం చేయాల్సిన అవసరం లేదు. వ్యోమగాముల కోసం చేపడుతున్న పరీక్షల్లో భాగంగా ‘నాసా’ ఈ బెడ్‌రెస్ట్ ప్రాజెక్టు చేపట్టింది. తల కాస్త దిగువగా ఉంచి, కాళ్లు పైకి చాపి ఏకధాటిగా 70 రోజులు బజ్జుంటే, ఏకంగా 18 వేల డాలర్లు ఇస్తారు. ఇదీ సంగతి. దొరకునా.. ఇటువంటి జాబు..! - పన్యాల జగన్నాథ దాసు -
గరిటెడైనను చాలు ఖరము పాలు...
కవర్ స్టోరీ ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు’ అంటూ వేమన గాడిద పాలను తృణీకరించాడు గానీ, గాడిద పాలకు గ్లోబల్ మార్కెట్లో గిరాకీ అంతకంతకూ పెరుగుతోంది. పాపం వేమన! గాడిద పాలను సరిగా విలువ కట్టలేకపోయాడు. ఇప్పటి పరిస్థితులను అంచనా వేసి ఉన్నట్లయితే, ‘గరిటెడైనను చాలు ఖరము పాలు’ అంటూ పద్యాన్ని తిరగ రాసేవాడేమో! ఎందుకంటే, గరిటెడు గాడిద పాల ధర కడివెడు గంగిగోవు పాల ధర కంటే ఎక్కువే మరి. మన దేశంలో గాడిద పాల వినియోగం చాలాకాలం నుంచే ఉన్నా, పాల కోసం గాడిదల పెంపకం పారిశ్రామిక స్థాయికి ఇంకా చేరుకోలేదు. ఆఫ్రికా, పశ్చిమాసియా, ఉపఖండ ప్రాంతాలను విడిచిపెడితే, ప్రపంచంలో మిగిలిన చాలా దేశాల్లో గాడిద పాల వినియోగం పారిశ్రామిక స్థాయికి చేరుకుంది. వయసు మళ్లే ప్రక్రియను గాడిద పాలు ఆలస్యం చేస్తాయనే నమ్మకం క్రీస్తుపూర్వం నాటి నుంచే ఉండేది. గాడిద పాల ఔషధ లక్షణాలపై తాజా వైద్య పరిశోధనల ఫలితాలు ఆ నమ్మకాన్ని బలపరుస్తున్నాయి. - పన్యాల జగన్నాథ దాసు చిన్నప్పుడు తాను గాడిద పాలనే తాగి పెరిగానని పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల చెప్పడంతో కొద్ది రోజులుగా అంతర్జాతీయ మీడియాలో గార్ధభ క్షీర మహాత్మ్యం గురించి కథనాలు వెలువడుతున్నాయి. పోప్ ఫ్రాన్సిస్ లాటిన్ అమెరికన్ దేశమైన అర్జెంటీనాలో పుట్టిపెరిగారు. లాటిన్ అమెరికన్ దేశాలకు, భారత ఉపఖండానికి చాలా సారూప్యతలు ఉన్నాయి. సంచారజాతుల వారు గాడిదలను తోలుకుంటూ వీధుల్లో తిరుగుతూ, వాటి పాలను అమ్మడం భారత్‌లోనే కాదు, అర్జెంటీనా, చిలీ వంటి లాటిన్ అమెరికా దేశాల్లోనూ మామూలే. ఉబ్బసంతో బాధపడే చిన్న పిల్లలకు గాడిద పాలు పట్టడం మన దేశంలో చాలాకాలంగా కొనసాగుతున్న పద్ధతి. గాడిద పాలు తాగే పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే నమ్మకం కూడా ఉంది.గాడిద పాల ఔషధ విలువలపై జనంలో బాగా నమ్మకం ఉండటంతో వీటి ధర చాలా ఎక్కువ. లీటరు గాడిద పాల ధర దాదాపు రెండువేల రూపాయల వరకు ఉంటుంది. ఔషధప్రాయమైన వినియోగం కోసం సుమారు 25-30 మిల్లీలీటర్ల మోతాదుల చొప్పున అమ్ముతుంటారు. ఒక్కో మోతాదు ధర రెండువందల రూపాయలకు పైమాటే. మన దేశంలో గాడిద పాలను ఔషధప్రాయంగా మాత్రమే వినియోగిస్తారు. లాటిన్ అమెరికన్ దేశాల్లోనైతే ఔషధంగా మాత్రమే కాదు, తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా కూడా పిల్లలకు పడతారు. మనదేశంలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల వారే గాడిద పాలను వినియోగిస్తారు. నగరాల్లోని సంపన్న వర్గాల వారు, చదువుకున్న మధ్యతరగతి వారు గాడిద పాలను పెద్దగా పట్టించుకోరు. గాడిద పాలతో వ్యాధులు నయమవుతాయనే వాదనను మూఢనమ్మకంగా కూడా కొట్టిపారేస్తారు. అందుకేనేమో! మన దేశంలో గాడిద పాల వినియోగం పారిశ్రామిక స్థాయికి ఇంకా ఎదగలేదు. పోప్ ఫ్రాన్సిస్‌కు కానుకగా గార్ధభాలు గత క్రిస్మస్కు కొద్దిరోజుల ముందు ఇటలీలోని ‘యూరోలాక్టిస్’ కంపెనీ పోప్ ఫ్రాన్సిస్‌కు నోవా, థెయా అనే రెండు గాడిదలను కానుకగా ఇచ్చింది. గాడిద పాలతో తయారు చేసిన రెండు బాస్కెట్ల మిల్క్ పౌడర్‌ను కూడా ఇచ్చింది. రోమ్‌లోని బాంబి జేసు (బాల ఏసు) చిన్నారుల ఆస్పత్రికి కూడా కొన్ని గ్యాలన్ల గాడిద పాలను విరాళంగా అందజేసింది. యూరోలాక్టిస్ వ్యవస్థాపకుడు పీర్లుగి ఒరునేసు నుంచి వీటిని స్వీకరించే సమయంలోనే పోప్ ఫ్రాన్సిస్ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు తనకు తల్లిపాలు చాలకపోతే, తన తల్లి తనకు గాడిద పాలు పట్టేదని, బాల్యంలో చాలాకాలం గాడిదపాలు తాగి పెరిగానని చెప్పారు. గాడిదపాలతో పలు ఉత్పత్తులను తయారుచేసే ‘యూరోలాక్టిస్’ కంపెనీకి పోప్ మాటలతో ఒక్కసారిగా విస్తృత ప్రచారం లభించింది. ‘యూరోలాక్టిస్’ మాత్రమే కాదు, ‘డాంకీ మిల్క్ బ్యూటీ’, ‘డాంకీస్ అండ్ కో’ వంటి కంపెనీలు గాడిదపాలతో సౌందర్య సాధనాలు మొదలుకొని, నవయవ్వన ఔషధాల వరకు నానా ఉత్పత్తులను తయారు చేస్తూ మార్కెట్‌ను విస్తృతం చేసుకుంటున్నాయి. మిల్క్‌పౌడర్, సబ్బులు, ఫేస్‌క్రీములు, కాన్సంట్రేటెడ్ యాంటీ ఆక్సిడెంట్ క్యాప్సూల్స్, ‘నేచురల్ వయాగ్రా’ వంటి ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. యూరోపియన్ దేశాలతో పాటు చైనా, జపాన్, కొరియా వంటి ప్రాచ్య దేశాలు కూడా గాడిద పాల ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. చరిత్రలో గార్ధభ క్షీర వైభవం ఈజిప్టును ఏలిన క్లియోపాత్రా దీర్ఘయవ్వనం కోసం, మిలమిలలాడే చర్మసౌందర్యం కోసం గాడిద పాలతో స్నానం చేసేది. ఆమె స్నానక్రతువు కోసం రోజూ కనీసం ఏడువందల గాడిదల నుంచి సేకరించిన పాలు సరఫరా అయ్యేవి. రోమ్ చక్రవర్తి నీరో రెండో భార్య పాపీ సబీనా కూడా క్లియోపాత్రా ఒరవడిలోనే గాడిద పాలలో జలకాలాడేది. ఆమె ఎక్కడికైనా ప్రయాణాలకు బయలుదేరిందంటే, ఆమె వెనుక గాడిదల మంద అనుసరించాల్సిందే. ఫ్రెంచి సైనిక పాలకుడు నెపోలియన్ చెల్లెలు పాలిన్ కూడా చర్మ సౌందర్యం కోసం గాడిద పాలు వాడేది. వారి కంటే ముందే వైద్య పితామహుడు హిప్పోక్రాట్స్ గాడిదపాల ప్రాశస్త్యాన్ని గుర్తించాడు. హిప్పోక్రాట్స్ క్రీస్తుపూర్వం 460లోనే వివిధ రోగాలకు, పాముకాటు వంటి సమస్యలకు గాడిదపాలతో చికిత్స చేసేవాడు. ప్రాచీన ఈజిప్టు, రోమన్, గ్రీకు రాజ్యాలలో 5500 ఏళ్ల కిందటే గాడిద పాలను వివిధ ప్రయోజనాల కోసం వాడేవారు. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల్లో కూడా గాడిదపాల ప్రస్తావన ఉంది. గాడిదపాలు చలవ చేస్తాయని, శరీరంలోని వేడిని తగ్గిస్తాయని, చర్మవ్యాధులను, శ్వాసకోశ వ్యాధులను నియంత్రిస్తాయని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. మధ్యయుగంలో ఉన్నత వర్గాల వారి పానీయంగా గాడిద పాలు గౌరవం పొందేవి. నిజానికి ఇరవయ్యో శతాబ్ది ప్రారంభం వరకు దాదాపు ప్రపంచవ్యాప్తంగా గాడిదపాల వినియోగం విరివిగానే ఉండేది. ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాల్లో కూడా సంచార జాతుల వారు వీధుల్లో తిరుగుతూ ఇంటింటికీ వెళ్లి గాడిదపాలు అమ్మేవారు. విక్టోరియన్ కాలంలో బ్రిటన్‌లోనూ గాడిద పాల వినియోగం విరివిగానే ఉండేది. ఆధునిక వైద్యం వేళ్లూనుకుంటున్న కాలంలో గాడిదపాలలోని పోషక, రోగ నిరోధక విలువలపై పరిశోధనలు కూడా జరిగాయి. ఇరవయ్యో శతాబ్ది తొలినాళ్లలో విలియమ్ బుచన్ తన ‘డొమెస్టిక్ మెడిసిన్’ పుస్తకంలో గాడిద పాలలోని పోషక విలువలను విపులీకరించాడు. పారిస్‌లోని చిన్నారుల ఆస్పత్రికి చెందిన వైద్య బృందం గాడిద పాలపై సాగించిన పరిశోధన సారాంశాన్ని ‘లండన్ గ్లోబ్ అండ్ ద న్యూయార్క్ టైమ్స్’ 1882 అక్టోబర్ సంచికలో ప్రచురించింది. ఆవు పాలు, మేక పాలు, బర్రె పాలు, గొర్రె పాల కన్నా గాడిద పాలే మేలైనవని ఆ పరిశోధన తేల్చింది. పారిశ్రామిక విప్లవానికి ముందు వరకు చాలా దేశాల్లో గాడిదలను దాదాపు ఇంటింటా పెంచేవారు. రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత గాడిద పాల వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. నాగరికత వేగవంతం కావడంతో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో గాడిద పాల వినియోగం దాదాపు కనుమరుగైంది. అయితే, కొద్ది సంవత్సరాలుగా సాగుతున్న వైద్య పరిశోధనల్లో గాడిద పాలలోని పోషక విలువలపై సానుకూల ఫలితాలు వెలువడుతుండటంతో వినియోగం క్రమంగా పుంజుకుంటోంది. తాజా పరిశోధనల్లో తేలిన విశేషాలు పోషక విలువల ప్రకారం తల్లిపాలకు దగ్గరగా ఉండేవి గాడిద పాలేనని ఆధునిక పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా గాడిద పాలలో లాక్టోజ్ దాదాపు తల్లిపాలకు సమానంగా ఉంటుందని, కొవ్వుశాతం చాలా తక్కువని పరిశోధకులు చెబుతున్నారు. స్థూలకాయం నుంచి బయటపడేందుకు కూడా గాడిదపాల వినియోగం శ్రేయస్కరమని వారు సూచిస్తున్నారు. జనాభాలో దాదాపు 2-6 శాతం ప్రజలకు ఆవుపాలు సరిపడవని, ఆవు పాల వల్ల వారు అలెర్జీలతో బాధపడుతున్నారని, అలాంటి వారికి గాడిద పాలు మేలు చేస్తాయని ఐక్యరాజ్య సమితి అధ్యయనం తేల్చింది. గాడిద పాలలో విటమిన్-సి, బి, డి-12, ఇ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఆవుపాలతో పోలిస్తే, గాడిద పాలలో విటమిన్-సి అరవై రెట్లు ఎక్కువగా ఉంటుంది. కీలకమైన ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు కూడా పుష్కలంగా ఉంటాయని తాజా పరిశోధనల్లో తేలింది. గాడిద పాల వినియోగం ఫలితంగా ఉబ్బసం, సొరియాసిస్, ఎగ్జిమా వంటి వ్యాధులు నయమైనట్లు ఇటీవల సైప్రస్ వర్సిటీ శాస్త్రవేత్త, డెయిరీ సైన్స్ లెక్చరర్ డాక్టర్ ఫోటిస్ పాపడెమాస్ నిర్వహించిన పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. సైప్రస్‌తో పాటు ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ, స్పెయిన్, హాలండ్, సెర్బియా, బోస్నియా వంటి దేశాల్లో పాల కోసం గాడిదల పెంపకం పరిశ్రమ స్థాయిలో కొనసాగుతోంది. యూరోప్‌లో సేకరించిన గాడిద పాలలో దాదాపు సగానికి సగం సౌందర్య పోషణకు ఉపయోగపడే ఉత్పత్తుల తయారీకే తరలిపోతోంది. ఈ దేశాల్లో గాడిద పాలను నేరుగా తాగడంతో పాటు వివిధ ఆహార ఉత్పత్తులనూ తయారు చేస్తున్నారు. సైప్రస్‌లోనైతే గాడిద పాలతో మధువును కూడా తయారు చేస్తున్నారు. యూరోపియన్ దేశాల్లో గాడిద పాలతో తయారయ్యే చీజ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. దీని కిలో ధర 1350 డాలర్ల వరకు ఉంటుంది. అంటే, రూ.85 వేల పైమాటే. గాడిద పాలతో చీజ్ తయారు చేయాలంటే, ఒక కిలో చీజ్‌కు దాదాపు వంద కిలోల పాలు అవసరమవుతాయని స్విస్ షెఫ్ జీన్ మైకేల్ ఎవెక్వోజ్ చెబుతున్నారు. వయసు మళ్లిన వారికి గాడిద పాలు బలవర్ధకమైన ఆహారంగా ఉపయోగపడతాయని ఒక పరిశోధనలో తేలిన విషయాన్ని ‘ఇంటర్నేషనల్ డెయిరీ జర్నల్’ వెల్లడించింది. అంత విస్తృతంగా కాకపోయినా, మన దేశంలోనూ గాడిద పాల గుణగణాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. గాడిద పాలలో యాంటీ-కేన్సర్ లక్షణాలు, లైంగిక సామర్థ్యాన్ని పెంచే లక్షణాలు ఉన్నాయని లక్నో యూనివర్సిటీ పరిశోధకులు కొద్ది సంవత్సరాల కిందటే వెల్లడించినా, పెద్దగా ప్రచారం లభించలేదు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహకారంతో డాక్టర్ అయినాక్షి ఖరే నేతృత్వంలో లక్నో వర్సిటీ బృందం గాడిద పాలపై పరిశోధనలు సాగిస్తోంది. గాడిద పాలు ఎయిడ్స్‌ను పూర్తిగా నయం చేయలేకపోయినా, రోగుల జీవితకాలాన్ని పొడిగించేందుకు గణనీయంగా దోహదపడగలవని లక్నో వర్సిటీ పరిశోధకుడు దేశ్ దీపక్ చెబుతున్నారు. నవయవ్వన సాధనం! గాడిదపాలు నవయవ్వన సాధనం కాగలదా? అంటే, ఇప్పటి వరకు వెలువడిన తాజా పరిశోధనలు ఔననే అంటున్నాయి. అంతేకాదు, గాడిదపాలతో దీర్ఘాయువు కూడా సాధ్యమేనంటున్నారు. ఈక్వెడార్‌లో దాదాపు ఏడేళ్ల కిందట మారియా ఎస్తర్ డి కాపోవిల్లా అనే మహిళ తన 116 ఏళ్ల వయసులో మరణించింది. బాల్యం నుంచి ఆమె రోజూ గాడిద పాలే తాగేది. కాపోవిల్లా మృతి దరిమిలా శాస్త్రవేత్తలు గాడిద పాలలో దీర్ఘాయువు కలిగించే లక్షణాలపై సాగించిన పరిశోధనల్లోనూ ఆశాజనకమైన ఫలితాలే వచ్చాయి. గాడిద పాలలో ఇన్ని విశేషాలు ఉన్నా, మన దేశంలో గాడిద పాల ఉత్పత్తి పారిశ్రామిక స్థాయికి చేరుకోకపోవడం గమనార్హం. -
వివక్ష ముసుగు తొలగించిన రచయిత్రి
హైదరాబాదీ, అనీస్ జంగ్ వివాదాల జోలికి వెళ్లలేదు కాబట్టి ఆమె పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. అలాగని, సమాజంలోని దాష్టీకాల పట్ల మౌనం దాల్చి, ఊహాత్మక కథలు రాసుకునే కాలక్షేపం రచయిత్రేమీ కాదామె. దేశంలోని మహిళల పట్ల వివక్ష ముసుగు తొలగించిన నిర్భీకత అనీస్ జంగ్ సొంతం. ఆమె పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఆమె తండ్రి ప్రముఖ కవి, పండితుడు నవాబ్ హోషియార్ జంగ్. చివరి నిజాం ప్రభువుకు సలహాదారుగా పనిచేశారు. అనీస్ జంగ్ తల్లి, సోదరుడు కూడా కవులే. సంపన్న కుటుంబంలో పుట్టిపెరిగినా, అనీస్ సమాజాన్ని నిశితంగా పరిశీలించేది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశాక, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. మిషిగాన్ వర్సిటీ నుంచి సోషియాలజీ, అమెరికన్ స్టడీస్‌లో మాస్టర్ డిగ్రీలు చేసింది. భారత్ తిరిగి వచ్చాక జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించింది. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ప్రచురణ అయిన ‘యూత్ టైమ్స్’కు ఎడిటర్‌గా 1976-79 కాలంలో పనిచేసింది. తర్వాత క్రిస్టియన్ సైన్స్ మానిటర్, ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రికల్లో పనిచేసింది. ఢిల్లీలో స్థిరపడిన అనీస్, కొంతకాలానికి పూర్తిస్థాయి రచయితగా మారింది. జాతీయ, అంతర్జాతీయ పత్రికలకు వ్యాసాలు, కాలమ్స్ రాస్తూనే, స్వతంత్ర రచనల ద్వారా పేరు ప్రఖ్యాతులు సాధించింది. నివురుగప్పిన నిప్పు.. ‘అన్‌వీలింగ్ ఇండియా’ అనీస్ జంగ్ అనుభవాల సారాంశం. దేశంలోని పలు నగరాల్లోనే కాదు, మారుమూల గ్రామాల్లోనూ తనకు ఎదురైన అనుభవాలన్నింటినీ గుదిగుచ్చి తెచ్చిన ఈ పుస్తకంతోనే ఆమె దేశ విదేశాల్లో విమర్శకుల ప్రశంసలు పొందింది. నిలకడగా, నిశ్శబ్దంగా కనిపించే అనీస్ జంగ్ నిజానికి నివురుగప్పిన నిప్పు. మహిళల హక్కులకు సంబంధించి ఆమెది రాజీలేని మార్గం. ఆమె రచనల్లోనూ, ప్రసంగాల్లోనూ ఈ విషయం ప్రస్ఫుటమవుతుంది. సంప్రదాయబద్ధమైన సంపన్న ముస్లిం కుటుంబంలో పర్దా మాటున పెరిగిన ఆమె, ఆ ముసుగు తొలగించుకుని బయటకు వచ్చింది. వివాహ బంధంలో చిక్కుకోవడం ఇష్టంలేక ఒంటరిగానే మిగిలిపోయింది. స్వానుభవాల నేపథ్యంలో సమాజాన్ని తనదైన దృష్టితో పరిశీలించిన ఆమె, దేశంలోని వివక్ష ముసుగును నిర్మొహమాటంగా తొలగించింది. ‘అన్‌వీలింగ్ ఇండియా’కు అనీస్ జంగ్ కొనసాగింపు ‘బియాండ్ ద కోర్ట్‌యార్డ్’. ఆడశిశువుల భ్రూణహత్యలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, సంప్రదాయాల పేరిట కొనసాగుతున్న మహిళల అణచివేత వంటి సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేసే అనీస్‌కు, మహిళల సంఘటిత శక్తిపై అపారమైన నమ్మకం ఉంది. ఇతర రచనలు.. వెన్ ఏ ప్లేస్ బికమ్స్ ఏ పర్సన్, నైట్ ఆఫ్ ద న్యూ మూన్: ఎన్కౌంటర్స్ విత్ ముస్లిం విమెన్ ఇన్ ఇండియా, సెవెన్ సిస్టర్స్, బ్రేకింగ్ ద సెలైన్స్, ఫ్లాష్ పాయింట్స్: పోయెమ్స్ ఇన్ ప్రోజ్, ద సాంగ్ ఆఫ్ ఇండియా, లాస్ట్ స్ప్రింగ్: స్టోరీస్ ఆఫ్ స్టోలెన్ చైల్డ్‌హుడ్ వంటి రచనల్లో అనీస్ జంగ్ సమాజంలోని అట్టడుగు వర్గాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను, వాటిపై తనదైన విశ్లేషణను పాఠకుల ముందుంచారు. వెట్టిచాకిరిలో వెతలు పడుతున్న బాలకార్మికుల గురించి, తాగుబోతు తండ్రుల గురించి, బాల్య వివాహాలు, లైంగిక వేధింపుల వల్ల ఛిద్రమైపోతున్న బాలికల బతుకుల గురించి అరమరికలు లేకుండా రాశారు. ‘లాస్ట్ స్ప్రింగ్’లోని కొన్ని కథలు పలు పాఠశాలల సిలబస్‌లోనూ చోటు పొందాయి. - పన్యాల జగన్నాథదాసు -
అభాగ్యుల పాలిటి అపర ధన్వంతరి
హైదరాబాదీ నవాబ్ అరస్తు యార్ జంగ్ అభాగ్యుల పాలిటి అపర ధన్వంతరి ఆయన. రోగులకు వైద్యం చేయడమే కాదు, నిరుపేద రోగులకు తన నివాస ప్రాంగణంలోనే ఉచిత వసతి సౌకర్యాలను సమకూర్చే ఉదారుడు. పంతొమ్మిదో శతాబ్ది చివరికాలంలో హైదరాబాద్‌లో ప్లేగు మహమ్మారి విజృంభించినప్పుడు పరిస్థితిని చక్కదిద్దడంలో నిరుపమానమైన కృషి చేసిన వైద్యుడు నవాబ్ అరస్తు యార్ జంగ్. ఆయన అసలు పేరు అబ్దుల్ హుస్సేన్. హైదరాబాద్‌లో 1858 జూన్ 10న జన్మించారు. నిజాం రాజ్యంలో తొలి శస్త్రవైద్యుడు ఆయనే. ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ అసఫ్ జా వద్ద ప్రధాన వైద్యునిగా, వైద్య సలహాదారుగా పనిచేశారు. మెడికల్ స్కూల్లో వైద్య విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాక, హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో ప్రాక్టీసు ప్రారంభించారు. కొంతకాలానికి ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో వైద్యుడిగా నియమితుడవడమే కాకుండా, ఆ ఆస్పత్రికి తొలి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ అబ్దుల్ హుస్సేన్ సేవలకు మెచ్చిన ఆరవ నిజాం ఆయనకు ‘అరస్తు యార్ జంగ్’ బిరుదు ఇచ్చారు. నిజాం ప్రభువుకు నమ్మకమైన రాచవైద్యునిగా పనిచేసినా, ఆయన ఏనాడూ సామాన్యులకు దూరం కాలేదు. ఎలాంటి సమయంలోనైనా ఆయన పేదసాదలకు అందుబాటులో ఉండేవారు. నిరుపేద రోగులకు ఉచితంగా చికిత్స చేసేవారు. అవసరమైతే, ఏ వేళలో పిలిచినా రోగుల వద్దకు స్వయంగా వెళ్లేవారు. తన నివాస ప్రాంగణంలో నిర్మించిన ప్రత్యేక గృహాల్లో రోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా వసతి సౌకర్యాలు, ఉచిత భోజనం కల్పించేవారు. ఉన్నత విద్యావ్యాప్తికి అవిరళ కృషి బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతంతో పోలిస్తే, ఉన్నత విద్యారంగంలో వెనుకబడి ఉన్న హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నత విద్యావ్యాప్తి కోసం నవాబ్ అరస్తు యార్ జంగ్ అవిరళంగా కృషి చేశారు. ముల్లా మహమ్మద్ భాయ్ తదితర మత పెద్దలతో కలసి యువకులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించే ట్రస్టులకు ఆర్థికంగా చేయూతనందించారు. తన కొడకులందరినీ ఉన్నత చదువులు చదివించారు. వారిలో కొందరిని ఉన్నత చదువుల కోసం బ్రిటన్, అమెరికా తదితర విదేశాలకు సైతం పంపారు. అరస్తు యార్జంగ్ వారసుల్లో పలువురు బ్రిటన్, అమెరికా, కెనడా, కువైట్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాల్లో స్థిరపడ్డారు. ఆయన వంశానికి చెందిన ఆరు తరాల వారసుల సంఖ్య ప్రస్తుతం దాదాపు వెయ్యికి పైగానే ఉంటుంది. దాతృత్వంలోనూ ఉదాత్తుడు అరస్తు యార్ జంగ్ విరివిగా దాన ధర్మాలు చేసేవారు. ముఖ్యంగా విద్యా కార్యక్రమాలకు, ధార్మిక సంస్థలకు విరాళాలు ఇచ్చేవారు. ‘కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియనివ్వరాద’నే ఖురాన్ వాక్కుకు అనుగుణంగా ఆయన లెక్కలేనన్ని గుప్తదానాలు చేసినట్లు ప్రతీతి. హుస్సేనీ ఆలం మసీదు నిర్మాణానికి షేక్ మొహసిని, సయ్యద్ తాహెర్ సైఫుద్దీన్లతో కలసి కృషి చేశారు. ఇప్పటికీ ఈ మసీదు వాడుకలో ఉంది. ప్రస్తుతం బుర్హానీ మసీదుగా పిలుస్తున్న ఈ మసీదు, అంజుమన్-ఏ-తహెరీ జమాత్‌లో భాగంగా ఉంది. దీనిని 2003లో వారసత్వ కట్టడంగా ప్రకటించారు. అరస్తు యార్ జంగ్ 1940 మార్చి 25న మరణించగా, ఈ మసీదు సమీపంలోనే ఆయనను సమాధి చేశారు. - పన్యాల జగన్నాథదాసు -
భాగ్యనగర గంధర్వుడు.. తలత్ అజీజ్
బాలీవుడ్లో పాశ్చాత్య సంగీత ప్రభావం పెరుగుతున్న కాలమది. సినీ సంగీతంలో మెలొడీ మనుగడ సందిగ్ధంలో పడ్డ కాలమది. శ్రోతలను ఉర్రూతలూపేసి, కిర్రెక్కించే పాటల జోరు పెరుగుతున్న కాలమది. అలాంటి కాలంలో ‘జిందగీ జబ్ భీ తేరీ బజ్మ్ మే...’ అంటూ ఒక సుతిమెత్తని గొంతు సంగీతాభిమానులకు వీనుల విందు చేసింది. ఆ పాట ‘ఉమ్రావ్ జాన్’లోనిది. పాడిన గాయకుడు తలత్ అజీజ్. మన హైదరాబాదీ కుర్రాడు. అప్పటికే సుప్రసిద్ధులైన ఘజల్ గాయకులందరూ అతడిని ఆదరించి, ప్రోత్సహించారు. సినిమాల్లో అవకాశం దొరికింది కదా అని తలత్ అజీజ్ కూడా ట్రెండ్‌లో పడి కొట్టుకుపోలేదు. తనదైన శైలికే కట్టుబడ్డాడు. సూపర్ స్టార్లెవరికీ పాడక పోయినా, ‘ఘజల్ కింగ్’గా గుర్తింపు పొందాడు. ఈ ప్రత్యేకతకు అతడి కుటుంబ నేపథ్యమే కారణం. తలత్ తండ్రి ప్రసిద్ధ ఉర్దూ కవి అబ్దుల్ అజీమ్‌ఖాన్, తల్లి సాజిదా అబిద్. హైదరాబాద్‌లో వారి ఇల్లు కళలకు నిలయంగా ఉండేది. నిరంతరం కళాకారులు, కవులు, గాయకుల రాకపోకలతో కళకళలాడేది. మెహఫిల్లు, ముషాయిరాలు తరచూ జరిగేవి. బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ తండ్రి నిసార్ అక్తర్, ఘజల్ గంధర్వుడు జగ్జిత్ సింగ్ వంటి ప్రముఖులు వారి ఇంటికి వచ్చేవారు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన తలత్ బాల్యంలోనే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నాడు. హిందుస్థానీ సంగీత విద్వాంసులు ఉస్తాద్ సమద్ ఖాన్, ఉస్తాద్ ఫయాజ్ అహ్మద్‌ల వద్ద కిరానా ఘరానా సంప్రదాయంలో సంగీతం నేర్చుకున్నాడు. హైదరాబాద్‌లోని కింగ్‌కోఠీలో తొలిసారిగా బహిరంగ వేదికపై కచేరీ చేశాడు. హైదరాబాదీ కవులు రాసిన ‘కైసే సుకూన్ పావూ...’ వంటి ఘజల్స్ పాడి శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశాడు. మేలి మలుపు... హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఐఎస్సీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కామర్స్ నుంచి బీకామ్ (ఆనర్స్) పూర్తిచేశాక, అవకాశాల కోసం తలత్ అందరు గాయకుల మాదిరిగానే బాంబే చేరుకున్నాడు. కుటుంబ స్నేహితుడైన జగ్జిత్ సింగ్ ప్రోత్సాహంతో 1978లో ఘజల్ సమ్రాట్ మెహదీ హసన్ వద్ద శిష్యరికం ప్రారంభించాడు. తొలి ఆల్బం ‘జగ్జిత్ సింగ్ ప్రెజెంట్స్ తలత్ అజీజ్’ను జగ్జిత్ సింగ్ చేతుల మీదుగా విడుదల చేశాడు. ‘ఉమ్రావ్‌జాన్’, ‘బాజార్’ వంటి సినిమాల్లో కొన్ని ఘజల్స్ పాడినా, తొలినాళ్లలో కష్టాలు తప్పలేదు. ఈలోగా బుల్లితెర పుంజుకోవడంతో తలత్‌కు టీవీ అవకాశాలు పెరిగాయి. సాహిల్, మంజిల్, దిల్ అప్నా ప్రీత్ పరాయా, నూర్జహాన్ వంటి సీరియల్స్‌తో ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. ఒకవైపు టీవీ చానళ్లకు పనిచేస్తూనే, పలు ఘజల్ ఆల్బమ్స్ విడుదల చేశాడు. పలు దేశాల్లో కచేరీలు చేశాడు. సంగీత రంగంలోకి అడుగుపెట్టి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా 2004లో ముంబైలో జరుపుకొన్న రజతోత్సవ కార్యక్రమంలో మెహదీ హసన్, లతా మంగేష్కర్ సహా సంగీతరంగంలోని దిగ్గజాలందరూ పాల్గొన్నారు. ఆర్జేగా ఘజల్స్‌కు ప్రాచుర్యం... సినిమాలకు పాడినా, టీవీ చానళ్లకు పాడినా తలత్ అజీజ్ ఎన్నడూ మెలొడీ బాటను వీడలేదు. తాజాగా 92.7 బిగ్ ఎఫ్ఎం రేడియో చానల్ ద్వారా ఆర్జే పాత్రలో ఘజల్స్‌కు ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ‘కరవానే ఘజల్’ పేరిట ఆయన నిర్వహిస్తున్న కార్యక్రమం ప్రతి ఆదివారం రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య దేశవ్యాప్తంగా 45 నగరాల్లో ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం కోసం ప్రతివారం ఆసక్తిగా ఎదురుచూసే అభిమానుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ‘ఫేస్బుక్’, ‘ట్విట్టర్’లలో కూడా తలత్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. - పన్యాల జగన్నాథదాసు - తలత్ అజీజ్