వృశ్చిక రాశివారు... స్వేచ్ఛాప్రియులు
ఆస్ట్రోఫన్‌డా: వృశ్చికం
రాశిచక్రంలో వృశ్చికం ఎనిమిదో రాశి. ఇది సరి రాశి. జలతత్వం, శీతల స్వభావం. బ్రాహ్మణ జాతి, క్రూర రాశి. రంగు ఎరుపు. శరీరంలో రహస్యాంగాలను, హృదయాన్ని, తొడలను సూచిస్తుంది. ఇది స్థిర రాశి, స్త్రీ రాశి. దిశ ఉత్తరం. ఇందులో విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు పూర్తిగా ఉంటాయి. దీని అధిపతి కుజుడు. ఇనుము, చెరకు, పంచదార, బెల్లం, కందులు, దూది, వక్కలు, ఆవాలు వంటి ద్రవ్యాలను సూచిస్తుంది. ఈ రాశి నార్వే, మొరాకో, వాషింగ్టన్ పరిసర ప్రాంతాలపై ప్రభావం కలిగి ఉంటుంది.
- పన్యాల జగన్నాథ దాసు
వృశ్చికరాశిలో జన్మించిన వారికి ధైర్యసాహసాలు ఎక్కువగా ఉంటాయి. పర్యవసానాలను పట్టించుకోని దూకుడు వీరి సహజ లక్షణం. మొండితనం కూడా వీరికి ఎక్కువే! విధి నిర్వహణలో నిజాయితీ, అంకితభావం, చిత్తశుద్ధి కలిగి ఉంటారు. ప్రథమకోపంతో వీరు సమస్యలను కొని తెచ్చుకుంటారు. రహస్య పరిశోధనలపై వీరికి ఆసక్తి ఎక్కువ. అతీంద్రియ శక్తులు, మార్మిక విషయాలపై అమితాసక్తి చూపుతారు. సంప్రదాయాలను గౌరవిస్తారు. చురుకైన తెలివితేటలు వీరి సొంతం. ఆసక్తి కలిగితే ఎలాంటి క్లిష్టమైన విషయాలనైనా ఇట్టే ఆకళింపు చేసుకోగలరు.
ఎంతటి ఒత్తిడినైనా తట్టుకొనే శక్తి వీరి సొంతం. దార్శనికత, వ్యూహరచనా చాతుర్యం వీరి తిరుగులేని బలాలు. గ్రహగతులు అనుకూలిస్తే ఈ లక్షణాలతోనే వీరు ఉన్నత స్థానాలను అందుకోగలరు. స్వతంత్రాభిలాష వీరికి ఎక్కువ. అందువల్ల స్వతంత్ర వృత్తులు, వ్యాపారాలలో బాగా రాణించగలరు. స్వతంత్ర అధికారాలు గల ఉద్యోగాల్లో సత్తా చూపగలరు. వైద్య, విద్యా, న్యాయవాద, వ్యాయామ, పోరాట విద్యలలో చక్కగా రాణించగలరు. సైనిక, పోలీసు, గూఢచర్య సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లోనైనా, వృత్తి ఉద్యోగాల్లోనైనా వీరు పోటీని ఇష్టపడతారు.
గట్టి పోటీ ఎదురైనప్పుడు సవాలుగా తీసుకుని, సత్తా చాటుకుంటారు. గ్రహగతులు ప్రతికూలిస్తే, వీరు ఇతరులపై అకారణంగా అనుమానం, ఈర్ష్య పెంచుకుని, వారికి హాని తలపెట్టేందుకైనా వెనుకాడరు. విమర్శలను, ఓటమిని సహించలేక వ్యసనాలకు లోనవుతారు. అనుకున్నది సాధించడానికి అపమార్గాలు తొక్కుతారు. ప్రేమ వ్యవహారాల్లో విఫలమై, ప్రతీకారేచ్ఛతో రగిలిపోతారు. ఫలితంగా మానసిక వ్యాధులకు, నాడీ సమస్యలకు, గుండెజబ్బులకు లోనవుతారు.
- వృశ్చిక రాశిలో పుట్టిన బాలీవుడ్ నటి మల్లికా శెరావత్