Astrophanda
-
వీళ్లు ఎంతో సుకుమారులు...
ఆస్ట్రోఫన్డా: మీన రాశి రాశిచక్రంలో చివరి రాశి మీనం. ఇది సరి రాశి. జలతత్వం, బ్రాహ్మణ జాతి, సౌమ్య రాశి, ఉజ్వల వర్ణం. శరీరంలో కాళ్లను, పాదాలను సూచిస్తుంది. ఇది ద్విస్వభావ రాశి, స్త్రీ రాశి, దిశ ఉత్తరం. ఇందులో పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరా భాద్ర, రేవతి నక్షత్రాలు పూర్తిగా ఉంటాయి. ఈ రాశి అధిపతి గురువు. ఈ రాశి వైఢూర్యాలు, ముత్యాలు, వజ్రాలు, గోరోజనం, చేపలు, మద్యం మొదలైన ద్రవ్యాలను సూచిస్తుంది. ఇది రష్యా, ఈజిప్టు పరిసర ప్రాంతాలపై ప్రభావం కలిగి ఉంటుంది. మీనరాశిలో పుట్టినవారు కాస్త సుకుమారులు. కాస్త బద్ధకస్తులు కూడా. కఠిన శ్రమను తట్టుకోలేరు. అయితే, అద్భుతమైన సృజనాత్మకత వీరి సొంతం. సుఖలాలస ఎక్కువ. కల్లా కపటం తెలియని వీరు, ఎదుటి వారిని ఇట్టే నమ్మే స్తారు. కొన్ని సందర్భాల్లో పిరికిగా వ్యవహ రించినా, అవసరమైన సందర్భాల్లో ధైర్య సాహసాలనూ ప్రదర్శించగలరు. సరళ స్వభావం కారణంగా తేలికగా ఆకట్టు కుంటారు. నిష్పాక్షికత, సహనం, అపారమైన ఊహాశక్తి, వాక్చాతుర్యం, కార్యనిర్వహణ నైపుణ్యాల ఫలితంగా ఏ రంగంలోనైనా రాణించగలరు. రచయితలు, సినీ దర్శకులు, నటులు, వైద్యులు, రసాయన నిపుణులు, సాంకేతిక నిపుణులు, బోధకులు, సామాజిక కార్యకర్తలుగా బాగా రాణిస్తారు. ఆహార పానీయాలు, రవాణా, ముద్రణ, ప్రచురణ వంటి రంగాల్లో సొంత వ్యాపారాలు కూడా వీరికి అనుకూలం. రక్షణ, విద్య, జల వనరులు, షిప్పింగ్, రైల్వే, బ్యాంకింగ్, బీమా రంగాలలోని ఉద్యోగాల్లో కూడా రాణిస్తారు. గ్రహగతులు అనుకూలించకుంటే, స్థిరపడాల్సిన సమయంలో నిర్లక్ష్యంగా తిరుగుతారు. నిజాయితీ లేని పనులతో నిందల పాలవుతారు. మోసాలకు గురై నష్ట పోతూ ఉంటారు. బద్ధకంతో అవకాశాలను చేజార్చుకుంటారు. వ్యసనాల ద్వారా సాంత్వన పొందేందుకు ప్రయత్నిస్తారు. వీరు ఎక్కువగా జీర్ణకోశ వ్యాధులు, వాత సంబంధ సమస్యలు, చర్మవ్యాధులతో బాధపడతారు. - పన్యాల జగన్నాథ దాసు మీనరాశిలో పుట్టిన గాయని శ్రేయాఘోషల్ -
తొణకరు... బెణకరు!
ఆస్ట్రోఫన్డా : కుంభంరాశి రాశిచక్రంలో పదకొండో రాశి కుంభం. ఇది బేసి రాశి. వాయుతత్వం, వైశ్య జాతి, క్రూర రాశి, కృష్ణ వర్ణం. తొడలు, కన్ను, శ్వాస, రక్త ప్రసరణ వ్యవస్థలను సూచిస్తుంది. స్థిర రాశి, పురుష రాశి. దిశ దక్షిణం. ఇందులో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం పూర్తిగా, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలుంటాయి. అధిపతి శని. శంఖం, గవ్వలు, బొగ్గు, మినుములు, ఇనుము, నువ్వులు, పట్టు మొదలైన ద్రవ్యాలను సూచి స్తుంది. అబిసీనియా, స్వీడన్, సూడాన్ తది తర ప్రాంతాలపై ప్రభావం కలిగి ఉంటుంది. కుంభరాశిలో పుట్టినవారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తొణకరు. సంప్రదాయాలకు విలువనిస్తూనే, ఆధునికతను స్వాగతించే విశాల దృక్పథం వీరిది. మానవతా దృక్ప థంతో వ్యవహరిస్తారు. ఆత్మసాక్షి మేరకు నడుచు కుంటారు. క్రియాశీలత, స్వేచ్ఛాకాంక్ష, నిష్పాక్షికత వీరి సహజ లక్షణాలు. న్యాయం విషయంలో తనపర భేదాలు పాటించకపోవడం వల్ల అయినవారి నుంచి వ్యతిరేకత ఎదుర్కొనే సందర్భాలూ ఉంటాయి. గొప్ప జిజ్ఞాసులు, చింతనా పరులు. శాస్త్ర పరిశోధనల పట్ల ఆసక్తి ఎక్కువ. తెలివితేటలు, విశ్లేషణాత్మక శక్తి, సున్నితత్వం, ఔదార్యం వంటి లక్షణాలు వీరికి గుర్తింపు తెచ్చిపెడతాయి. ఎట్టి పరిస్థితు ల్లోనూ తమ అభిప్రాయాలను మార్చుకోవ డానికి ఇష్టపడరు. సహనం ఎక్కువే అయినా, సహనం నశిస్తే కోపతాపాలను తారస్థాయిలో ప్రదర్శిస్తారు. ఏకాంతాన్ని కోరుకుంటారు. స్వేచ్ఛకు భంగం కలిగే పరిస్థితులలో ఇమడ లేరు. ఆధ్యాత్మిక చింతన, మార్మిక విద్యలపై ఆసక్తి ఎక్కువ. శాస్త్ర, కళా రంగాలలో అద్భు తాలను సాధించగలరు. గ్రహగతులు ప్రతి కూలిస్తే, స్వేచ్ఛాభిలాషతో అయినవారిని వదులుకునేందుకు సైతం సిద్ధపడతారు. వెటకారాన్ని తట్టుకోలేరు. చిన్న చిన్న కారణాలకే శత్రుత్వాన్ని కొనితెచ్చుకుంటారు. ఆందోళనను తట్టుకోలేక వ్యసనాలకు లోనవు తారు. రక్త పోటు, నాడి, గుండె, కంటి, జీర్ణకోశ సమస్యలతో బాధపడతారు. - పన్యాల జగన్నాథ దాసు -
వృశ్చిక రాశివారు... స్వేచ్ఛాప్రియులు
ఆస్ట్రోఫన్డా: వృశ్చికం రాశిచక్రంలో వృశ్చికం ఎనిమిదో రాశి. ఇది సరి రాశి. జలతత్వం, శీతల స్వభావం. బ్రాహ్మణ జాతి, క్రూర రాశి. రంగు ఎరుపు. శరీరంలో రహస్యాంగాలను, హృదయాన్ని, తొడలను సూచిస్తుంది. ఇది స్థిర రాశి, స్త్రీ రాశి. దిశ ఉత్తరం. ఇందులో విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు పూర్తిగా ఉంటాయి. దీని అధిపతి కుజుడు. ఇనుము, చెరకు, పంచదార, బెల్లం, కందులు, దూది, వక్కలు, ఆవాలు వంటి ద్రవ్యాలను సూచిస్తుంది. ఈ రాశి నార్వే, మొరాకో, వాషింగ్టన్ పరిసర ప్రాంతాలపై ప్రభావం కలిగి ఉంటుంది. - పన్యాల జగన్నాథ దాసు వృశ్చికరాశిలో జన్మించిన వారికి ధైర్యసాహసాలు ఎక్కువగా ఉంటాయి. పర్యవసానాలను పట్టించుకోని దూకుడు వీరి సహజ లక్షణం. మొండితనం కూడా వీరికి ఎక్కువే! విధి నిర్వహణలో నిజాయితీ, అంకితభావం, చిత్తశుద్ధి కలిగి ఉంటారు. ప్రథమకోపంతో వీరు సమస్యలను కొని తెచ్చుకుంటారు. రహస్య పరిశోధనలపై వీరికి ఆసక్తి ఎక్కువ. అతీంద్రియ శక్తులు, మార్మిక విషయాలపై అమితాసక్తి చూపుతారు. సంప్రదాయాలను గౌరవిస్తారు. చురుకైన తెలివితేటలు వీరి సొంతం. ఆసక్తి కలిగితే ఎలాంటి క్లిష్టమైన విషయాలనైనా ఇట్టే ఆకళింపు చేసుకోగలరు. ఎంతటి ఒత్తిడినైనా తట్టుకొనే శక్తి వీరి సొంతం. దార్శనికత, వ్యూహరచనా చాతుర్యం వీరి తిరుగులేని బలాలు. గ్రహగతులు అనుకూలిస్తే ఈ లక్షణాలతోనే వీరు ఉన్నత స్థానాలను అందుకోగలరు. స్వతంత్రాభిలాష వీరికి ఎక్కువ. అందువల్ల స్వతంత్ర వృత్తులు, వ్యాపారాలలో బాగా రాణించగలరు. స్వతంత్ర అధికారాలు గల ఉద్యోగాల్లో సత్తా చూపగలరు. వైద్య, విద్యా, న్యాయవాద, వ్యాయామ, పోరాట విద్యలలో చక్కగా రాణించగలరు. సైనిక, పోలీసు, గూఢచర్య సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లోనైనా, వృత్తి ఉద్యోగాల్లోనైనా వీరు పోటీని ఇష్టపడతారు. గట్టి పోటీ ఎదురైనప్పుడు సవాలుగా తీసుకుని, సత్తా చాటుకుంటారు. గ్రహగతులు ప్రతికూలిస్తే, వీరు ఇతరులపై అకారణంగా అనుమానం, ఈర్ష్య పెంచుకుని, వారికి హాని తలపెట్టేందుకైనా వెనుకాడరు. విమర్శలను, ఓటమిని సహించలేక వ్యసనాలకు లోనవుతారు. అనుకున్నది సాధించడానికి అపమార్గాలు తొక్కుతారు. ప్రేమ వ్యవహారాల్లో విఫలమై, ప్రతీకారేచ్ఛతో రగిలిపోతారు. ఫలితంగా మానసిక వ్యాధులకు, నాడీ సమస్యలకు, గుండెజబ్బులకు లోనవుతారు. - వృశ్చిక రాశిలో పుట్టిన బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ -
మాట నేర్పరితనం వీరి సొంతం
ఆస్ట్రోఫన్డా రాశిచక్రంలో తుల ఏడో రాశి. ఇది బేసి రాశి, వాయుతత్వం, శీతల స్వభావం, సౌమ్య రాశి,శూద్ర జాతి, రంగు ఆకుపచ్చ, శరీరంలో నాభిని, నడుమును ఈ రాశి సూచిస్తుంది. ఇది చర రాశి, పురుష రాశి. దిశ దక్షిణం. ఇందులో చిత్త 3, 4, స్వాతి పూర్తిగా, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. దీని అధిపతి శుక్రుడు. నువ్వులు, గోధుమలు, బియ్యం, శనగలు, దూది, ఆముదం మొదలైన ద్రవ్యాలను సూచిస్తుంది. ఆస్ట్రియా, పోర్చుగల్, జపాన్, బర్మా, టిబెట్, అర్జెంటీనా తదితర ప్రాంతాలపై ప్రభావం కలిగి ఉంటుంది. తులరాశిలో జన్మించిన వారు సంయమనానికి, సహనానికి మారుపేరుగా ఉంటారు. వీరికి లౌక్యం, వాక్చాతుర్యం కూడా ఎక్కువే. నిత్యం జనాల మధ్య గడపటానికే ఇష్టపడతారు. ఒంటరిగా ఏమాత్రం ఉండలేరు. జనాలను ఇట్టే ఆకట్టుకుంటారు. కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యమిస్తారు. అతిథులను బాగా ఆదరిస్తారు. ఎన్ని కష్టాల్లో ఉన్నా, శ్రద్ధగా అలంకరించుకుంటారు. గడ్డు సమస్యలను సైతం తేలికగా పరిష్కరించగలరు. చర్చలను, వాదనలను ఇష్టపడతారు. ఎదుటివారు చెప్పే విషయాన్ని శ్రద్ధగా వింటారు. ఎక్కడకు వెళ్లినా తేలికగా కొత్త కొత్త స్నేహాలను ఏర్పరచుకోగలరు. ప్రతి విషయంలోనూ ఆచి తూచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. తమ చుట్టూ ఉండేవారిని ప్రభావితం చేస్తారు. వీరికి సౌందర్య దృష్టి, కళలపై ఆసక్తి, విలాసాలపై మక్కువ ఉంటాయి. శాంతి సామరస్యాలను కోరుకునే వీరు హింసను, దండనను ఇష్టపడరు. సాధ్యమైనంత వరకు ఎలాంటి సమస్యలనైనా మాటలతో పరిష్కరించుకోవచ్చని నమ్ముతారు. నాయకులుగా తమ బృందానికి చక్కని దిశానిర్దేశం చేయగలరు. దౌత్యవేత్తలుగా, రాయబారులుగా, తీర్పరులుగా రాణించగలరు. స్వల్ప కృషితోనే సమాజంలో మేధావులుగా గుర్తింపు పొందగలరు. అయితే, చొరవ చూపి సత్వర నిర్ణయాలు తీసుకోవలసిన సందర్భాల్లో సైతం చర్చోపచర్చలతో కాలయాపన చేయడం వీరి బలహీనత. వీరు న్యాయ సంబంధిత వృత్తి ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. దౌత్యవేత్తలుగా, పాత్రికేయులుగా, మధ్యవర్తులుగా అందరి మన్నన పొందుతారు. అలంకరణలు, లోహాలు, ఔషధాలు, మద్యం, వస్త్ర వినోద వ్యాపారాలు వీరికి లాభసాటిగా ఉంటాయి. పర్యాటక, ఆతిథ్య రంగాలు కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి. గ్రహగతులు అనుకూలించకుంటే వీరు తమ తాత్సార ధోరణి వల్ల జీవితంలో మంచి మంచి అవకాశాలను కోల్పోతారు. పగటి కలల్లో విహరిస్తూ కాలహరణం చేస్తారు. తమను తాము ప్రేమైక జీవులుగా భావించుకొని, ప్రేమ వ్యవహారాల్లో భంగపాట్లు చవిచూస్తారు. - తులారాశికి చెందిన బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ - పన్యాల జగన్నాథ దాసు -
హాస్యప్రియులే !
మిథునం: ఆస్ట్రోఫన్డా రాశులలో మిథునం మూడోది. ఇది బేసి రాశి, క్రూర స్వభావం, వైశ్యజాతి, రంగు ఆకుపచ్చ, ఛాతీని సూచిస్తుంది. ద్విస్వభావ రాశి, పురుష రాశి, దీని దిశ పశ్చిమం. ఇందులో మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర నాలుగు పాదాలూ, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. దీని అధిపతి బుధుడు. అమెరికా, ఉత్తరాఫ్రికా, బెల్జియం, వేల్స్ ప్రాంతాలను సూచిస్తుంది. మిథున రాశిలో జన్మించిన వారు సున్నిత మనస్కులు, చురుకైన తెలివితేటలు, హాస్యప్రియులు, కించిత్ చాపల్యం గలవారు. కళాభిరుచి, వాక్చాతుర్యంతో ఇతరులను త్వరగా ఆకట్టుకుంటారు. వీరి ఆలోచనలకు, ఆచరణకు వ్యత్యాసం ఉంటుంది. ఒక పనిని మధ్యలోనే విడిచిపెట్టి మరో పనిని మొదలుబెడతారు. పలు విద్యలు, కళలలో నైపుణ్యం కలిగి ఉంటారు. వీరు సాధారణంగా సహనవంతులు. గొడవలకు దూరంగా ఉంటారు. క్లిష్టమైన వివాదాలను చాకచక్యంగా పరిష్కరించి, అందరి మెప్పు పొందగలరు. అపారమైన ఊహాశక్తి, సృజనాత్మకత, వాదనా పటిమ వీరి సొంతం. తరచు మార్పును కోరుకుంటారు. గ్రహగతులు అనుకూలంగా లేకుంటే, వీరు తమ తెలివి తేటలను వికృత ప్రయోజనాల కోసం వాడుకుంటారు. మితిమీరిన స్వార్థంతో మోసాలకు, ద్రోహాలకు, కుంభకోణాలకు పాల్పడేందుకు కూడా వెనుకాడరు. తరచు మాట మార్చే లక్షణం వల్ల నిందలకు గురవుతారు. స్థిరత్వం లేని చేష్టల వల్ల ఆత్మీయులు సైతం వీరి పట్ల సహనాన్ని కోల్పోయే పరిస్థితులు తలెత్తుతాయి. (వచ్చేవారం కర్కాటక రాశి గురించి...) -
జ్యోతిషం ఏం చెబుతోంది?
ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోతుంటారు. అంటే వారందరి ఆయుష్షు అదే రోజు ముగుస్తోందనా? అస్ట్రో‘ఫన్’డా ఉపద్రవాలు సంభవించకముందే పండితులు అప్రమత్తమై, అమాయకుల ప్రాణాలను కాపాడవచ్చు కదా... అనుకుంటారు. కానీ, విధి బలీయమైనది. విధిని తప్పించే శక్తి జ్యోతిషానికి లేదు. జ్యోతిష శాస్త్రాన్ని ఔపోసన పట్టిన పండితులకూ లేదు. ⇒ ఆకాశంలో ఎగురుతున్న విమానం గమ్యం చేరకముందే కుప్పకూలిపోతుంది. అందులో ప్రయాణిస్తున్న వారంతా ఒకేసారి ప్రాణాలు పోగొట్టుకుంటారు. ⇒ ముందస్తు సూచనేదీ లేకుండానే ఎక్కడో ఒకచోట పెనుభూకంపం కుదిపేస్తుంది. పెద్దసంఖ్యలో జనం మరణిస్తారు. మరికొందరు క్షతగాత్రులవుతారు. ⇒ ఇంకెక్కడో ఒకచోట అగ్రరాజ్య సైన్యాలకు, ఉగ్రవాదులకు భీకర పోరాటం జరుగుతుంది. తూటాల వర్షం కురుస్తుంది, బాంబుల మోత మార్మోగుతుంది, భారీ స్థాయిలోనే జనహననం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలన్నింటిలోనూ ఏకకాలంలోనే చాలామంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు. ఎందుకలా జరిగి ఉంటుంది? వాళ్లందరికీ ఒక్కసారే ఆయుర్దాయం తీరిపోయి ఉంటుందా? వందలాది మందికి, ఒక్కోసారి వేలాది మందికి సామూహిక మారకం (మరణయోగం) ఏదైనా ఏర్పడి ఉంటుందా? జ్యోతిషాన్ని నమ్మేవాళ్లకు, జ్యోతిషాన్ని నమ్మాలా వద్దా తేల్చుకోలేని సందిగ్ధజీవులకు సహజంగానే సందేహం తలెత్తుతుంది. జననకాల, జనన ప్రదేశాల ఆధారంగా ఎవరి జాతక ఫలితాలు వారివేనని, ఎవరి యోగావయోగాల పర్యవసానాలు వారివేనని పండితులు చెబుతారు కదా, అలాంటప్పుడు వేర్వేరు స్థల, కాలాలలో జన్మించిన వారంతా మూకుమ్మడిగా ఒకేసారి ప్రాణాలు కోల్పోయే సంఘటనలను ఎలా అర్థం చేసుకోవాలి? అందరికీ ఏకకాలంలో మారకం ఏర్పడటం దాదాపు అసాధ్యం. అయితే, ఒకేచోట గుమిగూడిన జనసమూహంలో ఎక్కువమందికి మారక స్థితి ఏర్పడితే, అదే సమూహంలో ఉన్న మిగిలిన వారికి కొంత ఆయుర్దాయం ఉన్నప్పటికీ, వారు కూడా ఆ సమూహంతో పాటు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తప్పదని జ్యోతిషవేత్తలు చెబుతారు. ముందే హెచ్చరించలేరా..? అలాగైతే, జ్యోతిషులెవరైనా ఇలాంటి ఉపద్రవాలు సంభవించక ముందే తగిన హెచ్చరికలు చేసి జనాన్ని అప్రమత్తం చేయవచ్చు కదా, చాలామంది అమాయకులు అపమృత్యువును తప్పించుకోగలుగుతారని చాలామంది అనుకుంటారు. కానీ, విధి బలీయమైనది. విధిని తప్పించే శక్తి జ్యోతిషానికి లేదు. జ్యోతిష శాస్త్రాన్ని ఔపోసన పట్టిన పండితులకూ లేదు. ఇలాంటి సూచనలను ముందుగానే తెలుసుకున్న జ్యోతిషులు మాత్రం అపమృత్యువు నుంచి సురక్షితంగా బయటపడిన ఉదంతాలు లేకపోలేదు. అందుకు సుప్రసిద్ధ ఐరిష్ హస్తసాముద్రికుడు కీరో ఉదంతమే ఉదాహరణ. కీరో ఎలా తప్పించుకున్నాడు..? ఒకసారి రైలులో ప్రయాణిస్తున్న కీరో కాలక్షేపానికి తన బోగీలో ఉన్న తోటి ప్రయాణికుల చేతులు పరిశీలించాడు. వారిలో ఎక్కువ మంది చేతుల్లో ఆయుర్దాయ రేఖ పొట్టిగా కనిపించింది. ప్రమాదాన్ని పసిగట్టిన కీరో, తాను చేరాల్సిన చోటు కాకపోయినా తర్వాతి స్టేషన్లోనే రైలు దిగిపోయాడు. ముందుకు సాగిన ఆ రైలు కొంతదూరం వెళ్లాక ప్రమాదానికి గురైంది. పెద్దసంఖ్యలో ప్రయాణికులు మరణించారు. జ్యోతిష, సాముద్రికాలకు సంబంధించి చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ప్రాచీన విద్యలపై ఆధునిక కోర్సులు.. జ్యోతిషం, హస్తసాముద్రికం, శరీరసాముద్రికం సహా పలు అతీంద్రియ విద్యలు ప్రాచీనకాలం నాటి నుంచే వివిధ ప్రాంతాల్లో వివిధ పద్ధతుల్లో ఉనికిలో ఉన్నాయి. ప్రాక్పశ్చిమ భేదాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా వీటిపై అపార విశ్వాసం గలవారు అసంఖ్యాకంగానే ఉన్నారు. వీటి శాస్త్రీయతను కొట్టిపారేసే హేతువాదులూ ఉన్నారు. జ్యోతిష, సాముద్రికాలను కాలక్షేపంగా పరిగణించేవారు, వీటిని నమ్మాలా, వద్దా తేల్చుకోలేని వారు కూడా ఉన్నారు. ఎవరెలా ఉన్నా, మనదేశంలో పలు విశ్వవిద్యాలయాలు జ్యోతిషాన్ని బోధిస్తున్నాయి. జ్యోతిషం కోర్సులకు ప్రభుత్వ గుర్తింపు కూడా ఉంది. గ్రహ నక్షత్ర గమనాలు, స్థల కాలాల ఆధారంగానే జ్యోతిష శాస్త్రం భవిష్యత్తుపై అంచనాలను చెబుతుంది. భూత వర్తమానాలనూ విశ్లేషిస్తుంది. భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకోవాలనే ఆసక్తి మనుషులకు సహజంగానే ఉంటుంది. ఏటా ఉగాది రోజున పంచాంగ శ్రవణాలకు హాజరై వార్షిక గోచార ఫలితాలు తెలుసుకోవడం, పత్రికల్లో, టీవీ చానళ్లలో వచ్చే వారఫలాలు, దినఫలాలను చూడటంతోనే సరిపెట్టుకుంటారు. జ్యోతిషాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నా, చాలామంది దానిని అధ్యయనం చేసే ప్రయత్నం చేయరు. ఎందుకంటే, జ్యోతిష గ్రంథాలు, పంచాంగాలు దాదాపు ఒకే మూసలో ఉంటాయి. వాటిలోని భాష ఒక పట్టాన కొరుకుడు పడదు. పంచాంగాలైన తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు, నవగ్రహాలు, ద్వాదశ రాశులు, వాటిలోని ఇరవై ఏడు నక్షత్రాలు, వాటి లక్షణాలు, ప్రభావాలు, వివిధ యోగాలు, అవయోగాలు, లగ్నం, హోర తదితర కాల విభాగాలు వంటి అంశాలపై ప్రాథమిక సమాచారం ఎక్కడా తేలికగా అర్థమయ్యే రీతిలో కనిపించదు. జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ప్రాథమిక అంశాలు అందరికీ తేలికగా అర్థమయ్యేలా వివరించడానికి ఓ చిరుప్రయత్నం.. అస్ట్రో‘ఫన్’డా... ఇక నుంచి వారం వారం మీ కోసం... - కీరో, హస్తసాముద్రిక నిపుణుడు