హాస్యప్రియులే !
మిథునం: ఆస్ట్రోఫన్‌డా
రాశులలో మిథునం మూడోది. ఇది బేసి రాశి, క్రూర స్వభావం, వైశ్యజాతి, రంగు ఆకుపచ్చ, ఛాతీని సూచిస్తుంది. ద్విస్వభావ రాశి, పురుష రాశి, దీని దిశ పశ్చిమం.
ఇందులో మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర నాలుగు పాదాలూ, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. దీని అధిపతి బుధుడు. అమెరికా, ఉత్తరాఫ్రికా, బెల్జియం, వేల్స్ ప్రాంతాలను సూచిస్తుంది.
మిథున రాశిలో జన్మించిన వారు సున్నిత మనస్కులు, చురుకైన తెలివితేటలు, హాస్యప్రియులు, కించిత్ చాపల్యం గలవారు. కళాభిరుచి, వాక్చాతుర్యంతో ఇతరులను త్వరగా ఆకట్టుకుంటారు. వీరి ఆలోచనలకు, ఆచరణకు వ్యత్యాసం ఉంటుంది. ఒక పనిని మధ్యలోనే విడిచిపెట్టి మరో పనిని మొదలుబెడతారు. పలు విద్యలు, కళలలో నైపుణ్యం కలిగి ఉంటారు. వీరు సాధారణంగా సహనవంతులు. గొడవలకు దూరంగా ఉంటారు. క్లిష్టమైన వివాదాలను చాకచక్యంగా పరిష్కరించి, అందరి మెప్పు పొందగలరు.
అపారమైన ఊహాశక్తి, సృజనాత్మకత, వాదనా పటిమ వీరి సొంతం. తరచు మార్పును కోరుకుంటారు. గ్రహగతులు అనుకూలంగా లేకుంటే, వీరు తమ తెలివి తేటలను వికృత ప్రయోజనాల కోసం వాడుకుంటారు. మితిమీరిన స్వార్థంతో మోసాలకు, ద్రోహాలకు, కుంభకోణాలకు పాల్పడేందుకు కూడా వెనుకాడరు. తరచు మాట మార్చే లక్షణం వల్ల నిందలకు గురవుతారు. స్థిరత్వం లేని చేష్టల వల్ల ఆత్మీయులు సైతం వీరి పట్ల సహనాన్ని కోల్పోయే పరిస్థితులు తలెత్తుతాయి.
(వచ్చేవారం కర్కాటక రాశి గురించి...)