మాట నేర్పరితనం వీరి సొంతం | Word of their own ability | Sakshi
Sakshi News home page

మాట నేర్పరితనం వీరి సొంతం

Published Sun, Jul 5 2015 1:01 AM | Last Updated on Wed, Apr 3 2019 9:02 PM

మాట నేర్పరితనం వీరి సొంతం - Sakshi

మాట నేర్పరితనం వీరి సొంతం

ఆస్ట్రోఫన్‌డా
రాశిచక్రంలో తుల ఏడో రాశి. ఇది బేసి రాశి, వాయుతత్వం, శీతల స్వభావం, సౌమ్య రాశి,శూద్ర జాతి, రంగు ఆకుపచ్చ, శరీరంలో నాభిని, నడుమును ఈ రాశి సూచిస్తుంది. ఇది చర రాశి, పురుష రాశి. దిశ దక్షిణం. ఇందులో చిత్త 3, 4, స్వాతి పూర్తిగా, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. దీని అధిపతి శుక్రుడు. నువ్వులు, గోధుమలు, బియ్యం, శనగలు, దూది, ఆముదం మొదలైన ద్రవ్యాలను సూచిస్తుంది. ఆస్ట్రియా, పోర్చుగల్, జపాన్, బర్మా, టిబెట్, అర్జెంటీనా తదితర ప్రాంతాలపై ప్రభావం కలిగి ఉంటుంది.
 
తులరాశిలో జన్మించిన వారు సంయమనానికి, సహనానికి మారుపేరుగా ఉంటారు. వీరికి లౌక్యం, వాక్చాతుర్యం కూడా ఎక్కువే. నిత్యం జనాల మధ్య గడపటానికే ఇష్టపడతారు. ఒంటరిగా ఏమాత్రం ఉండలేరు. జనాలను ఇట్టే ఆకట్టుకుంటారు. కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యమిస్తారు. అతిథులను బాగా ఆదరిస్తారు. ఎన్ని కష్టాల్లో ఉన్నా, శ్రద్ధగా అలంకరించుకుంటారు. గడ్డు సమస్యలను సైతం తేలికగా పరిష్కరించగలరు. చర్చలను, వాదనలను ఇష్టపడతారు. ఎదుటివారు చెప్పే విషయాన్ని శ్రద్ధగా వింటారు. ఎక్కడకు వెళ్లినా తేలికగా కొత్త కొత్త స్నేహాలను ఏర్పరచుకోగలరు.

ప్రతి విషయంలోనూ ఆచి తూచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. తమ చుట్టూ ఉండేవారిని ప్రభావితం చేస్తారు. వీరికి సౌందర్య దృష్టి, కళలపై ఆసక్తి, విలాసాలపై మక్కువ ఉంటాయి. శాంతి సామరస్యాలను కోరుకునే వీరు హింసను, దండనను ఇష్టపడరు. సాధ్యమైనంత వరకు ఎలాంటి సమస్యలనైనా మాటలతో పరిష్కరించుకోవచ్చని నమ్ముతారు. నాయకులుగా తమ బృందానికి చక్కని దిశానిర్దేశం చేయగలరు. దౌత్యవేత్తలుగా, రాయబారులుగా, తీర్పరులుగా రాణించగలరు.

స్వల్ప కృషితోనే సమాజంలో మేధావులుగా గుర్తింపు పొందగలరు. అయితే, చొరవ చూపి సత్వర నిర్ణయాలు తీసుకోవలసిన సందర్భాల్లో సైతం చర్చోపచర్చలతో కాలయాపన చేయడం వీరి బలహీనత. వీరు న్యాయ సంబంధిత వృత్తి ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. దౌత్యవేత్తలుగా, పాత్రికేయులుగా, మధ్యవర్తులుగా అందరి మన్నన పొందుతారు. అలంకరణలు, లోహాలు, ఔషధాలు, మద్యం, వస్త్ర వినోద వ్యాపారాలు వీరికి లాభసాటిగా ఉంటాయి.

పర్యాటక, ఆతిథ్య రంగాలు కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి. గ్రహగతులు అనుకూలించకుంటే వీరు తమ తాత్సార ధోరణి వల్ల జీవితంలో మంచి మంచి అవకాశాలను కోల్పోతారు. పగటి కలల్లో విహరిస్తూ కాలహరణం చేస్తారు. తమను తాము ప్రేమైక జీవులుగా భావించుకొని, ప్రేమ వ్యవహారాల్లో భంగపాట్లు చవిచూస్తారు.
- తులారాశికి చెందిన బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్ కపూర్
- పన్యాల జగన్నాథ దాసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement