విశ్వమంతటి విశ్వాసం జ్యోతిషం
అర్థార్జనే సహాయః పురుషాణా మాపదార్ణవే పోతః
యాత్రాసమయే మంత్రీ జాతకమపహాయ నాస్త్యపరః
- జాతక సారావళి
జ్యోతిశ్శాస్త్రం ధన సంపాదన వ్యవహారాల్లో ఉపకరిస్తుంది. ఆపదల సముద్రంలో చిక్కుకున్నప్పుడు ఓడలా ఒడ్డుకు చేరుస్తుంది. యాత్రలకు వెళ్లేటప్పుడు మంత్రిలా తగిన సలహాలిస్తుంది. జ్యోతిషం భారతదేశానికి మాత్రమే పరిమితమైన శాస్త్రం కాదు.
ఇది ఏదో ఒక మతానికి మాత్రమే పరిమితమైనది కూడా కాదు. ప్రాక్పశ్చిమ దేశాలలో వివిధ మతాలకు చెందిన పండితులు ఎవరి పద్ధతుల్లో వారు జ్యోతిషాన్ని అధ్యయనం చేశారు, అభివృద్ధి చేశారు. జాతక రచన చేశారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి పురాణ పురుషులకు జాతకాలు ఉన్నాయి. దేశ దేశాలను ఏలిన చక్రవర్తులకు, మహారాజులకు జాతకాలు ఉన్నాయి. మన దేశాన్ని ఏలిన మొఘల్ చక్రవర్తులు, బ్రిటిష్ పాలకులు సైతం జ్యోతిషాన్ని ఆదరించిన దాఖలాలు ఉన్నాయి. జహంగీరు ఆస్థానంలో జగన్నాథ సమ్రాట్, కృష్ణ దైవజ్ఞ అనే జ్యోతిష సిద్ధాంతులు ఉండేవారు.
షాజహాన్ కొడుకు షుజా ప్రాపకంలో పనిచేసిన బలభద్రుడనే జ్యోతిషుడు హోరారత్నం అనే జ్యోతిష గ్రంథాన్ని రాశాడు. బ్రిటిష్ చక్రవర్తి ఐదో జార్జి తన భారతదేశ పట్టాభిషేకం కోసం తొలుత 1911 నవంబర్ 9న గురువారం ప్రయాణమవుదామనుకున్నా, ఆరోజు తండ్రి పుట్టినరోజు కావడంతో తల్లి ఆజ్ఞ మేరకు ప్రయాణాన్ని విరమించుకున్నాడు. మరుసటి రోజు శుక్రవారం నావికులకు అనుకూలమైన రోజు కానందున జ్యోతిషుల సూచన మేరకు నవంబర్ 11న అభిజిర్లగ్నంలో బయలుదేరాడు. డిసెంబర్ 12న మంగళవారం అభిజర్లగ్న ముహూర్తాన ఢిల్లీలో పట్టాభిషిక్తుడయ్యాడు. జ్యోతిషంపై ప్రపంచవ్యాప్తంగా గల విశ్వాసానికి ఇవి కొన్ని ఉదాహరణలు.
జ్యోతిష శాస్త్రాన్ని ప్రాచీనులు ప్రధానంగా రెండు భాగాలుగా విభజించారు. ఒకటి సిద్ధాంత భాగం (అస్ట్రానమీ), రెండు జాతక భాగం (అస్ట్రాలజీ). అస్ట్రానమీనే ఖగోళశాస్త్రం అంటున్నాం. ఆధునిక కాలంలో ఖగోళశాస్త్రం బాగా అభివృద్ధి చెందింది. గ్రహాంతర పరిశోధనలు ఊపందుకున్నాయి. గ్రహగతులను తెలుసుకోవడానికి సిద్ధాంత భాగం ఉపయోగపడుతుంది. గ్రహగతుల ఆధారంగానే కాల విభజన, భూత భవిష్యత్ వర్తమాన ఫలితాలను జాతక విభాగం విపులీకరిస్తుంది. ఈ ఫలితాలను తెలుసుకోవడానికి ‘భ చక్రం’ అని పిలుచుకొనే రాశిచక్రమే కీలకం. మేషం నుంచి మీనం వరకు పన్నెండు రాశులుగా విభజించుకున్న ఈ చక్రంలో ఒక్కొక్క రాశికి నిర్దిష్టమైన లక్షణాలు ఉంటాయి. రాశుల లక్షణాల గురించి వచ్చేవారం...
- పన్యాలజగన్నాథ దాసు