అందరం పదహరే!
కొత్త సంబరం
పైలా పచ్చీసు దూకుడుకు ఇంకా టైముంది గానీ, ప్రస్తుత సహస్రాబ్ది పడుచు పదహారులో పడుతోంది. పదహారు ప్రాయం అంటే నవ యవ్వన వనాన్ని తొలకరి పలకరించే పడుచుప్రాయం. పదహారు ప్రాయంలో ఇటు బాల్యచాపల్యాలూ ఉంటాయి, అటు యవ్వనోద్రేకాలూ ఉంటాయి. పదహారు ప్రాయంలో పడుతున్న ఇరవై ఒకటో శతాబ్ది... ఇక బాల్యావస్థను అధిగమిస్తున్నట్లే లెక్క! ఆకు రాలు కాలం వెళ్లిపోతూ యవ్వన వనానికి వసంతం విచ్చేస్తున్నట్లే లెక్క!
పదహారేళ్ల ప్రాయం అంటే కలలు కనే ప్రాయం. కలల సాకారానికి ప్రయత్నాలు సాగించే ప్రాయం. లోకం పోకడకు ఎదురీదే తెగువ మొలకెత్తే ప్రాయం. భవిష్యత్తు మీద అందమైన ఆశలు రేకెత్తే ప్రాయం.
పదహారేళ్ల ప్రాయం అంటే ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునే ప్రాయం. ఆకర్షణల వలయంలో పరిభ్రమించే ప్రాయం. కష్టాలను, కన్నీళ్లను తేలికగా తుడిచిపెట్టేసే టేకిటీజీ ప్రాయం. సంతోషాలను, సంబరాలను పదిమందికీ పంచిపెట్టే సందడి ప్రాయం.
పదహారేళ్ల వయసులో ఊహలు నింగిలో విహరిస్తుంటాయి. నిశిరాత్రి వేళ అక్కడ మెరిసే చుక్కల్లా మెరుస్తుంటాయి. ఆ వయసులో ఉన్న వాళ్ల కళ్లలో కనిపించేది ఆ మెరుపే! పడుచు పదహారులో కొత్త కొత్త ఆశలు చిగురిస్తూ ఉంటాయి. అందుకే ఆ వయసులోని వాళ్లంతా నడిచొచ్చే వసంతాల్లా ఉల్లాసంగా ఉంటారు. పచ్చిక మీదుగా వీచే నులివెచ్చని పైరగాలిలా తాజా తాజాగా ఉంటారు.
నిన్నకు సెలవిచ్చేసి, నేటిలో జీవిస్తూ, రేపటివైపు సుస్పష్టంగా చూపు సారించే శక్తి పదహారేళ్ల కుర్రకారుకు మాత్రమే ఉంటుంది. జీవితంలోని చేదును చెరిపేసి, బతుకు తీపిని ఆస్వాదించే సత్తా కూడా వాళ్లకు మాత్రమే ఉంటుంది. అందుకే స్వీట్ సిక్స్‌టీన్‌లో ఉన్నవాళ్లు ముందుతరం దూతలు.
ఇదిగిదిగో! ఈ సహస్రాబ్ది కుర్రకారులో పడుతోంది. ఉరకలెత్తే ఉత్సాహమే ఊపిరిగా ముందుకు సాగబోతోంది. ఆకు రాలు లోకంలోకి ఆశలు మోసుకొస్తూ ఆమని రుతు రాగాన్ని ఆలపించబోతోంది.
ఇదిగిదిగో! ఈ సహస్రాబ్ది పసితనాన్ని వీడి పడుచుప్రాయంలోకి అడుగిడుతోంది. ఊహల ఉత్తేజంతో రెక్కలు విచ్చుకుని వినువీధిలో విహంగంలా విహరించబోతోంది. ఇదివరకు శరవేగానికే జనం అబ్బురపడేవాళ్లు. వేగమే వేదంగా మొదలైన ఈ సహస్రాబ్ది, పదహారు ప్రాయంలో మనోవేగాన్ని అధిగమిస్తుందేమో చూడాలి.
ఈ సహస్రాబ్ది వేకువలో పుట్టిన వాళ్లందరూ స్వీట్ సిక్స్‌టీన్‌లోకి అడుగుపెట్టే తరుణం ఇది. స్వీట్ థాట్స్ తెచ్చిపెట్టే ఉల్లాసోత్సాహాలన్నీ వాళ్ల సొంతం. మాజీ యువకులందరూ స్వీట్ మెమొరీస్‌ను నెమరు వేసుకునే తరుణం కూడా ఇది. గతానుభవాలతో పోగు చేసుకున్న పరిణతితో కూడిన నిండుతనం వాళ్ల సొంతం. ఆశయాలకు అనుభవం తోడై, ఈ సహస్రాబ్ది ఆశించిన లక్ష్యాలను చేరుకుంటుందనే ఆశిద్దాం.
అడుగులు తడబడే పసిప్రాయంలో తప్పటడుగులు సహజమే! పడుచు ప్రాయం వాటిని దిద్దుకుంటుందనే ఆశిద్దాం. పట్టుదల పెంపొందే పదహారు వయసులో భావి లక్ష్యాలను నిర్దేశించుకుంటుందనే ఆకాంక్షిద్దాం. సహస్రాబ్ది అడుగిడుతున్న పడుచు పదహారును మనసారా స్వాగతిద్దాం.
- పన్యాల జగన్నాథ దాస్