రాజీ పడరు...వెనకడుగు వేయరు...
ఆస్ట్రోఫన్‌డా
రాశిచక్రంలో పదో రాశి మకరం.. ఇది సరి రాశి. పృథ్వీతత్వం, వైశ్య జాతి, సౌమ్య రాశి, పింగళ వర్ణం. శరీరంలో ఇది మోకాళ్లను, పిక్కలను సూచిస్తుంది. ఇది చర రాశి, స్త్రీ రాశి, దీని దిశ దక్షిణం. ఇందులో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం పూర్తిగా, ధనిష్ఠ 1, 2 పాదాలు ఉంటాయి. ఈ రాశి అధిపతి శని. ఇనుము, సీసం, తగరం, కంచు, రాగి, బొగ్గు, చెరకు వంటి ద్రవ్యాలను సూచిస్తుంది. ఈ రాశి అల్బీనియా, బల్గేరియా, బంగ్లాదేశ్, పంజాబ్ తదితర ప్రాంతాలపై ప్రభావం కలిగి ఉంటుంది.
మకర రాశిలో పుట్టినవారు క్రమశిక్షణకు, కఠిన పరిశ్రమకు, విశ్వసనీయతకు మారుపేరుగా ఉంటారు. చాలా నిరాడంబరంగా కనిపిస్తారు. ప్రతి పనిలోనూ ఆచి తూచి వ్యవహరిస్తారు. పురోగతికి కఠిన పరిశ్రమ మాత్రమే ఏకైక మార్గమని నమ్ముతారు. ఎలాంటి వ్యవహారంలోనైనా రాజీ పడటాన్ని ఏమాత్రం ఇష్టపడరు. ఓపిక, సహనం వీరి తిరుగులేని బలాలు. ఏమాత్రం ఆత్రపడకుండా నిదానంగా పనిచేస్తున్నట్లే కనిపిస్తారు. ఓర్పు, సహనాలతో ఎంతటి ఉన్నత లక్ష్యాలనైనా సాధిస్తారు. కార్యాచరణలో ప్రాక్టికల్‌గా వ్యవహరించే వీరికి సెంటిమెంట్లు ఉండవని ఇతరులు అపోహ పడతారు. అయితే, తమ పట్ల ఇతరులు చూపే ప్రేమాభిమానాలకు సానుకూలంగా స్పందిస్తారు. ఎంతటి బాధ్యతనైనా అంకితభావంతో నెరవేరుస్తారు. ఎక్కువగా పనిలో నిమగ్నమై ఉండేందుకే ఇష్టపడతారు.
బద్ధకం, క్రమశిక్షణరాహిత్యం వీరికి అసలు గిట్టదు. తమ పద్ధతులకు భిన్నంగా అలసత్వం చూపేవారి పట్ల కఠినంగా ఉంటారు. సంపదను, పేరు ప్రఖ్యాతులను కష్టపడి సాధిస్తారు. ఎక్కువగా ఏకాంతాన్ని ఇష్టపడతారు. తమను నమ్ముకున్న వారికి నమ్మకమైన ఆసరాగా ఉంటారు. పోటీల జోలికి వెళ్లేందుకు పెద్దగా ఇష్టపడరు గానీ, లక్ష్యసాధనలో మాత్రం వెనుకంజ వేయరు. సివిల్, మెకానికల్, ఐటీ ఇంజనీరింగ్ విభాగాల్లో, అకౌంటింగ్, కార్మిక వ్యవహారాలు, ఖజానా పర్యవేక్షణ, నిఘా, పోలీసు, సైనిక ఉద్యోగాల్లో వీరు బాధ్యతాయుతంగా రాణించగలరు. వైద్య, బోధన, గృహనిర్మాణ, రాజకీయ, మెకానిక్, అకౌంటింగ్ వృత్తులు వీరికి అనుకూలంగా ఉంటాయి. గ్రహగతులు అనుకూలించకుంటే, కఠిన క్రమశిక్షణ, రాజీపడని మొండివైఖరి కారణంగా శత్రువులను కొనితెచ్చుకుంటారు. అలర్జీలు, రక్తపోటు, వెన్నెముకకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు.
మకర రాశిలో పుట్టిన బాలీవుడ్ నటి దీపికా పదుకొనె