మేషంలో పుట్టారా? అసహనం ఎక్కువే! | Aries born? More embarrassed! | Sakshi
Sakshi News home page

మేషంలో పుట్టారా? అసహనం ఎక్కువే!

Published Sun, May 24 2015 6:17 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM

మేషంలో పుట్టారా? అసహనం ఎక్కువే!

మేషంలో పుట్టారా? అసహనం ఎక్కువే!

ఆస్ట్రోఫన్‌డా
రాశుల స్వభావం, రాశిచక్రం గురించి సంక్షిప్తంగా చెప్పుకుందాం.
రాశిచక్ర ప్రమాణం 360 డిగ్రీలు. ఇందులో పన్నెండు రాశులు ఉంటాయి. ఒక్కో రాశి ప్రమాణం 30 డిగ్రీలు. రాశిచక్రంలో 27 నక్షత్రాలు ఉంటాయి. ఒక్కో నక్షత్రానికి నాలుగేసి పాదాలు ఉంటాయి. అంటే, రాశిచక్రంలోని మొత్తం 108 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఒక్కో రాశిలో తొమ్మిదేసి నక్షత్ర పాదాలు ఉంటాయి. ఈ లెక్కన ఒక్కో నక్షత్ర ప్రమాణం 13 డిగ్రీల 20 మినిట్స్. ఒక్కో నక్షత్ర పాద ప్రమాణం 3 డిగ్రీల 20 మినిట్స్.


రాశిచక్రంలో మొదటిది మేషరాశి. ఇందులో అశ్విని నాలుగు పాదాలు, భరణి నాలుగు పాదాలు, కృత్తిక ఒకటో పాదం ఉంటాయి. ఇది బేసి రాశి, పురుష రాశి, అగ్నితత్వం, క్షత్రియ వర్ణం, క్రూరస్వభావం కలిగిన చరరాశి. ఈ రాశి చిహ్నం మేక. ఇది వనచరం అంటే, అడవులు, పర్వతప్రాంతాలలో సంచరించేది. ఈ రాశికి అధిపతి కుజుడు. బ్రిటన్, డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్, సిరియా, పెరూ దేశాలు ఈ రాశి పరిధిలోకి వస్తాయి. ముఖం, మెదడుపై ఈ రాశి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

దీని లోహం బంగారం, రంగు ఎరుపు, ధాన్యం కందులు. చంద్రుడు మేషంలో ఉండగా జన్మించిన వారికి మేషం జన్మరాశి అవుతుంది. మేషరాశిలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు, దూకుడు స్వభావం కలిగి ఉంటారు. స్వేచ్ఛాప్రియులు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం నిరాశకు లోనికాని ఆశావహ దృక్పథం వీరి సొంతం. వీరికి అసహనం కూడా ఎక్కువే. భావోద్వేగాలను ఏమాత్రం అదుపు చేసుకోలేరు. సవాళ్లను ఎదుర్కోవడంలో ముందంజలో ఉంటారు.

త్వరగా మనుషులను ఆకట్టుకోవడంలో మేషరాశి జాతకులకు చాలా నేర్పు ఉంటుంది. తమ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారి పట్ల తేలికగా కినుకబూనుతారు. కొన్నిసార్లు ప్రతీకారేచ్ఛను కూడా పెంచుకుంటారు. ఒక్కోసారి మితిమీరిన ఆత్మవిశ్వాసం కారణంగా చిక్కుల్లో పడుతుంటారు. జాతకంలో రవి, కుజుడు, చంద్రుడు అనుకూలిస్తే కార్యనిర్వహణ రంగాల్లో చక్కగా రాణిస్తారు. పోలీసు, సైనిక ఉద్యోగాల్లో, న్యాయవాదులుగా, మేనేజర్లుగా, ఇంజనీర్లుగా, శస్త్రవైద్యులుగా ప్రత్యేకతను నిలుపుకుంటారు.

లోహాలకు, కలపకు సంబంధించిన వృత్తులు, వ్యాపారాలు, పరిశ్రమలలో కూడా విజయాలు సాధిస్తారు. గ్రహస్థితి ప్రతికూలిస్తే మొండితనం, ఈర్ష్య, స్వార్థం కారణంగా ఇబ్బందులు పడతారు. నోటి దురుసుతనంతో తరచు గొడవలకు దిగుతుంటారు. తేలికగా దుర్వ్యసనాలకు లోనవుతారు.
(వృషభరాశి స్వభావం గురించి వచ్చేవారం...)    
- పన్యాల జగన్నాథ దాసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement