Yearly Horoscope 2023: Check All 12 Zodiac Signs Predictions In Telugu - Sakshi
Sakshi News home page

Yearly Horoscope: రాశి ఫలాలు- 2023.. పూర్తి వివరాలు

Published Mon, Jan 2 2023 7:25 PM | Last Updated on Tue, Jan 3 2023 8:56 AM

Yearly Horoscope 2023: Check All 12 Zodiac Signs Predictions - Sakshi

రాశి ఫలాలు- 2023.. పూర్తి వివరాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించి స్త్రీలకు, పురుషులకు ఈ సంవత్సరం బాగుంది. సులువుగా అవుతాయనుకున్న వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వైరాగ్యం, వేదాంతం చోటు చేసుకుంటాయి. సంతానం వల్ల ప్రఖ్యాతి లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి. వాహనం మార్పు చేయాలన్ని ఆలోచనలు బలపడతాయి. సఖ్యతలేని వ్యక్తుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలతో విసిగి పోతారు.

ఆదాయ, వ్యయాలు ప్రధానాంశాలవుతాయి. కొన్ని విషయాలలో మొండిగా ప్రవర్తిస్తారు. వస్త్రాలను సౌందర్య సాధక సామాగ్రిని కొనుగోలు చేస్తారు. మీకు మేలు చేకూర్చే ఉత్తర్వులలో జాప్యం చోటు చేసుకుంటుంది. అష్టమూలికా తైలంతో లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయండి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇబ్బందులను అధిగమించి, విద్యారంగంలో అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. శత్రువర్గంపైన విజయం సాధిస్తారు.

విదేశీయాన సంబంధమైన విషయాలు, శుభకార్యాలు ముడిపడతాయి. జీవితశాయాన్ని నెరవేర్చుకో గలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రజాసంబంధాలు, రాజకీయ విషయాలు బాగుండవు. డబ్బులతో అన్నీ సాధించలేమని గుర్తిస్తారు. మీ వ్యూహానికి ప్రత్యర్థులు అంతకంటే గొప్ప వ్యూహాన్నే రచించి అమలు చేస్తారు. పోటీపరీక్షలన్నింటిలో అనుకూల ఫలితాలు వస్తాయి. మధ్యవర్తిత్వం అంగీకరించరు. ఇందువల్ల ఇరువర్గాలకు దూరమవుతారు.

అదే సమయంలో ఇంట్లోవాళ్ళు సన్నిహితమవుతారు. ప్రతిరోజూ హనుమాన్‌ సింధూర్‌ నుదుటన ధరించండి. రాజకీయాలలో రాణిస్తారు. నూతన వ్యాపారం లాభిస్తుంది. స్పెక్యులేషన్‌ ఎగుమతి, దిగుమతికి సంబంధించిన వ్యవహారాలలో కొంత మెలకువ అవసరం. క్రెడిట్‌ కార్డులు, బ్యాంకు వ్యవహారాలూ, పొదుపు డిపాజిట్‌లు తదితర వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎటువంటి బెట్టింగ్‌లలో పాల్గొనవద్దు, నష్టపోతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ద అవసరం. 
ఆదాయం 5; వ్యయం 5; రాజపూజ్యం 3; అవమానం 1

వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు చాలా బాగుంది. ఆర్థికంగా కొంత పురోభివృద్ధిని సాధించగలుగుతారు. ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయడానికి గాను ముందు చూపుతో వ్యవహరిస్తారు. జమాఖర్చులు, పద్దులు రొటీన్‌ సంతకాల విషయంలో మెలకువగా వ్యవహరించండి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల పరంగా సానుకూల ఫలితాలను సాధించగలుగుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి.

ప్రత్యర్థి వర్గంలోని కొందరు మీతో స్నేహ బంధాలను పెంచుకుంటారు. ఈ పరిణామం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలలో మీ మాటను అందరూ గౌరవిస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకుంటారు. మీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలని గట్టి పట్టుదలతో ఉంటారు, మంచి ఫలితాలు సాధిస్తారు.

పూజలలో, శుభకార్యాలలో సుగంధసిద్ధగంధాక్షింతలను ఉపయోగించండి. విలువైన స్థిరాస్థులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. శుభకార్యాలు ముడిపడతాయి, మంచి సంబంధం కుదురుతుంది. సంతానపరమైన విషయంలో కొంత ఇబ్బంది వున్నా, ద్వితీయార్ధంలో సంతానం పరిస్థితి బాగుంటుంది. విద్యారంగంలో పిల్లలు మంచి విజయాలు సాధిస్తారు. వాహనాల విషయంలో జాగ్రత్తలు అవసరం.

ప్రజల అభిమానంతో ముడిపడిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. ఆర్థికక్రమశిక్షణ బాగా పాటిస్తారు. పూజలలో హరిచందనం ఉపయోగించండి. కళా, సాహిత్య, రాజకీయరంగాలలో రాణిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. మీ జీవితాశయం నెరవేర్చుకుంటారు. సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టగలుగుతారు. అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలలో మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ఋణాలు ఇవ్వడం తీసుకోవడం తగ్గించండి. ఇటువంటి లావాదేవీలు మీకు అనుకూలించవు. 
ఆదాయం 14; వ్యయం 11; రాజపూజ్యం 6; అవమానం 1

మిధున రాశి
ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. వివాదాస్పద అంశాలు సానుకూల పడతాయి. సంస్థలను విస్తరింప చేసుకునే యత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్‌ లేక అనుకూలమైన బదిలీ సూచనలు గోచరిస్తున్నాయి. అయితే మితిమీరిన ఆత్మ విశ్వాసం వల్లచిక్కులు రాకుండా జాగ్రత్తలు వహించండి.

వ్యక్తిగత గౌరవానికి విశేష ప్రాముఖ్యతనిస్తారు. మీరు అడక్కుండానే తమకు తాముగా సలహాలు, సూచనలు ఇచ్చే వారు అధికమవుతారు. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పూజించండి. పాతఋణాలను చాలా వరకు తీర్చి వేస్తారు. ఏమాత్రం పరిచయం లేని వారి వలన లాభపడగలగడం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజకీయ, సినీ, కళారంగాలలోని వారికి కాలం అనుకూంగా ఉంది.

విద్యాసంబంధమైన విషయాలు, సాంకేతికవిద్యకు సంబంధించిన అంశాలు, గణిత విద్యకు సంబంధించిన అంశాలు బాగున్నాయి. మెడిసిన్‌ సీటు లభిస్తుంది. సినిమావ్యాపారం కలిసి వస్తుంది. ఫ్యాక్టరీ, దాల్‌మిల్స్, రైస్‌మిల్స్, షుగర్‌ ఫ్యాక్టరీల వ్యాపార విషయాలు బాగున్నాయి. అక్వారంగంలో, పౌల్ట్రీరంగంలో కలిసిరాదు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. విద్య, ఉద్యోగ అవకాశాలు దూరప్రాంతంలో మీరు కోరుకున్న విధంగా లభిస్తాయి.

పోటీపరీక్షలోలలో విజయం సాధిస్తారు. కళాసాంస్కృతిక రంగాలలో ఉన్నవారికి కీర్తిప్రతిష్ఠలు, అవార్డులు వస్తాయి. పూజలలో, అభిషేకాలలో జువ్వాదిని ఉపయోగించండి. పలుకుబడి ఉపయోగించి ఈ అవార్డులు సంపాదించారని మీపై దుష్ప్రచారం జరుగుతుంది. స్త్రీ సంతానం పట్ల విశేషమైన ప్రేమతో విలువైన బహుమతులను కొనిస్తారు.

ఆహారం విషయంలో నియమాలు పాటించండి. మీ సిద్ధాంతాలకు, అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ప్రయోజనాల పరిరక్షణ కోసం కొన్ని అమలు చేయమని మీ ఆత్మీయవర్గం ఒత్తిడి చేస్తారు. ప్రయోజనాలను వదులుకుంటారు కానీ మనస్సాక్షికి విరుద్ధంగా ఏ పనీ చేయరు. పనిలో పనిగా మీ వైరీవర్గానికి బెదిరింపు సంకేతాలు పంపిస్తారు. మీరంటే భయం, గౌరవం ఏర్పడే విధంగా పరిస్థితులను మార్చుకుంటారు. 
ఆదాయం 2; వ్యయం 11; రాజపూజ్యం 2; అవమానం 4

కర్కాటక రాశి
ఆదాయం 11; వ్యయం 8; రాజపూజ్యం 5; అవమానం 4
కర్కాటకరాశిలో జన్మించిన స్త్రీలకు, పురుషులకు ఈ సంవత్సరం బాగుంటుంది. కార్యా లయాలలో స్వయంకృతాపరాధాలు చోటు చేసుకున్నప్పటికీ చెప్పుకోదగిన ఒడిదుడుకులేవీ ఏర్పడవు. ఆదాయ, వ్యయాలలో సమతుల్యత లోపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. పొదుపుపైన దృష్టిని సారిస్తారు. సంతాన పురోభివృద్ధి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.

శుభవార్తాశ్రవణం చేస్తారు. అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ మానసిక సంఘర్షణ చోటు చేసుకుంటుంది. సామాజిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులలోని ఒక వర్గంతో సత్సంబధాలను మరింత బలపరచుకుంటారు. మీ సహాయసహకారాలతో ఉన్నతపదవిని అలంకరించిన వారు కీలక సమయంలో కొద్దిపాటి సహాయం మాత్రమే చేస్తారు. మీకు కోపం, ఆశ్చర్యం రెండూ కలుగుతాయి.

ఏరు దాటి తెప్పను తగలేసే వ్యక్తులు ఈ సంవత్సరం ఇబ్బంది పెడతారు. మీ మనోవేదనకు కారణం అవుతారు. ఎవరిని నమ్మాలన్న భయం కలుగుతుంది. మెడిసిన్‌ సీటు వస్తుంది. భగవంతునిపై భారం వేసి చాలా కార్యక్రమాలు చేస్తారు. సర్పదోషనివారణా చూర్ణములో సర్వరక్షా చూర్ణాన్ని కలిపి స్ననం చేయండి (తలస్నానం చేయరాదు). పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. ఉద్యోగం చేసే చోట వాతావరణం కలుషితం అవుతుంది.

కుల, మత, వర్గ, ప్రాంతీయ రాగద్వేషాలు చోటు చేసుకుంటాయి. జీవితంలోకి ఆహ్వానిద్దాం అన్న వ్యక్తి కొన్ని కారణాల వల్ల ఆహ్వానించలేడు. కొత్తకొత్త రంగాలలో ఉన్న నైపుణ్యాన్ని తెలుసుకుంటారు. వైద్యవిద్య, సాంకేతిక విద్య, చార్టెడ్‌ అకౌంటెంట్‌ ఇలాంటివన్నీ కూడా కలిసొస్తాయి. విదేశీయాన సంబంధిత విషయాలు లాభిస్తాయి. విదేశాలలో ఉద్యోగం చేయాలన్న కోరిక నెరవేరుతుంది. అవివాహితులైన వారికి వివాహప్రాప్తి.

సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. గైనిక్‌ ప్రాబ్లవ్‌సును అధిగమిస్తారు. సంతానం క్రమశిక్షణ తప్పడం కొద్దికాలం ఆందోళనకు కారణం అవుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆర్థికపరిస్థితులు మెరుగుపడతాయి. చాలా శ్రమించి ఎన్నోబాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి వస్తారు.

సింహ రాశి
ఆదాయం 14; వ్యయం 2; రాజపూజ్యం 1; అవమానం 7
ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ పరంగా అధికంగా శ్రమించినప్పటికీ అంతంతమాత్రపు ఫలితాలతో సరిపుచ్చుకోవలసి ఉంటుంది. అడ్వాన్స్‌ ఇచ్చి రిజిష్ట్రేషన్‌ చేయించుకున్న ఓ ఆస్తి వల్ల పరోక్షంగా లాభపడతారు. కోర్టు కేసులు వాయిదాలలో ఉంటాయి. కొంత ఆత్మనూన్యతాభావానికి లోనవుతారు.

ఒక సందర్భంలో స్వయం కృతాపరాధాల వలన తాత్కాలిక ఇబ్బందులను ఎదుర్కొన వలసి వస్తుంది. శుభవార్తలను వింటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీ సలహాలు, సూచనలు అందరి మన్ననలు అందుకుంటాయి. ప్రతిరోజూ నుదుటన నాగసింధూరం ధరించండి. పనులలో చురుకుదనం లోపిస్తుంది. ఆధ్యాత్మిక గ్రంధాలను కొనుగోలు చేస్తారు. రాజకీయరంగ ప్రవేశం చేయాలనే ఆలోచనలు బలపడతాయి.

కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీరు అనుకున్న పనులు కాస్త అటు–ఇటుగా పూర్తవుతాయి. సాంకేతికవిద్యలో రాణిస్తారు. ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలో సీటు డొనేషన్‌ ప్రాతిపదికన లభిస్తుంది. ఆర్థికసంస్థలలో పనిచేస్తున్న వారు ప్రతివిషయంలోనూ జాగ్రత్త వహించాలి.ఉద్యోగంలో ప్రమోషన్‌ లభిస్తుంది. బదిలీ వేటు తప్పకపోవచ్చు. ఏ దేవుడికైనా, దేవతకైనా పూజ చేసేటప్పుడు అభిషేకంలో మహాతీర్థం పొడిని ఉపయోగించండి.

గతంలో చేసినటువంటి పొదుపు పథకాలు ఎంతగానో అక్కరకు వస్తాయి. ప్రభుత్వపరంగా, ఆర్థికంగా మంచి మేలును పొందగలుగుతారు. నిర్మాణ సంబంధమైన పనులు చురుకుగా సాగటం వల్ల ఆర్థికపరిస్థితి ఓ దారిన పడుతుంది. లైసెన్సులు, లీజులు పొడిగింపబడతాయి. ఉన్నతాధికారులు, ఉన్నతస్థాయిలో ఉన్న స్నేహితుల వల్ల మేలును పొందగలుగుతారు. కుటుంబంలోని వారి ఆరోగ్యవిషయమై ప్రత్యేక శ్రద్ధ, ఖర్చులు సూచిస్తున్నాయి.

మీ కష్టానికి తగిన ఫలితం కొన్ని సందర్భాలలో లభిస్తుంది. కీర్తిప్రతిష్టలు కూడా దక్కుతాయి. మీకు లభించిన స్థానానికి సంతోషించలేని పరిస్థితిగా పరిణమిస్తుంది. పలురంగాలలో మీరు చేసిన కృషికి, చేస్తున్న కృషికి తగిన గుర్తింపు గౌరవం లభిస్తాయి. ఈ సంవత్సరం మీ జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారపరంగా భాగస్వాములతో అప్రమత్తంగా మెలగండి.  

కన్యా రాశి
ఆదాయం 2; వ్యయం 11; రాజపూజ్యం 4; అవమానం 7
ఈ రాశిలో జన్మించిన పురుషులకు స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. స్థిరాస్తిని వృద్ధి చేసుకోవడానికి గాను ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ఇందుకు గాను అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సానుకూల ఫలితాలను కూడా సాధించగలుగుతారు. అయితే ప్రతివిషయం కొంత నిదానంగా సాగినప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. జీవిత భాగస్వామితో స్వల్పమైన భేదాభిప్రాయాలను గ్రహస్థితి సూచిస్తోంది, జాగ్రత్తలు వహించండి.

వృత్తి, ఉద్యోగాలపరంగా బరువుబాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను, శుభకార్యాలను నిర్నిఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. క్రయవిక్రయాలు లాభిస్తాయి. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మీరు ఇతరులకు ఇచ్చిన వాగ్ధానాలను సకాలంలో నిలబెట్టుకోగలుగుతారు. ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని పూజించండి. రాజకీయంగా కలిసివస్తుంది. పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి.

వృత్తి–ఉద్యోగాలలో మంచి పురోగతి కలిగి ఉంటారు. సాంకేతిక, న్యాయసంబంధిత, యంత్ర సంబంధిత ఉద్యోగ, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. గనుల వ్యాపారం, నూనెల వ్యాపారం లాభిస్తాయి. ప్రింటింగ్, చిట్‌ఫండ్స్‌ వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి. పాడిపరిశ్రమలో నూతన ప్రయోగాలు లాభిస్తాయి. ఎందరికో ఉపాధి కల్పిస్తారు. కుటుంబంలో ఐక్యత, ప్రశాంతత ఉన్నంతవరకూ బైట అన్ని విషయాలను విజయపథంలో నడిపించగలరు. పోటీపరీక్షలలో మీరుపడ్డ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మీవల్ల కాదని అందరూ అనుకున్న సీటు మీకు లభిస్తుంది.

అదే కోణంలో మీవల్ల కాదని అందరూ భావించిన కొన్ని కార్యక్రమాలని మీరు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. పూజలలో మరియు ఇంట్లో నాగబంధం అనే కుంకుమను ఉపయోగించండి. లీజులు, లైసెన్స్‌లు, రెన్యువల్స్‌ మీకు అనుకూలంగా మారుతాయి. జ్యేష్ఠ సంతాన విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచవలసి వస్తుంది. మొండివాళ్ళను సరైన దారిలో పెట్టవలసిన బాధ్యత మీపై పడుతుంది. ఎంతోకాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి కలుగుతుంది. స్వంత ఇంటి కల నెరవేరుతుంది. ఉద్యోగపరంగా ప్రమోషన్‌ లభిస్తుంది. 

తులారాశి
ఆదాయం 14; వ్యయం 11; రాజపూజ్యం 7; అవమానం 7
ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. ఆర్థికాభివృద్ధిని సాధించడానికి గాను వినూత్నమైన ఆలోచనలు సాగిస్తారు. కార్యరూపంలో కూడా అమలు పరుస్తారు. సమర్ధవంతమైన పనివారిని సమకూర్చుకోవడం వలన వ్యాపారస్తులు లాభపడగలుగుతారు. స్త్రీలతో ఏర్పడ్డ విభేదాలు తొలగి పోవడం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయండి. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. పాత శత్రువులే నూతన కోణంలో తారసపడతారు, వారిని ఎదుర్కొవలసిన పరిస్థితి ఉంటుంది శత్రువర్గానికి బలమైన అండదండలు ఉండవు, ఇది మీకు లాభించే అంశం. స్త్రీలతో వైరానికి ముందుకు దూకవద్దు. సాధ్యమైనంత వరకు చర్చలు వాయిదా వేయడం, తప్పుకోవడం మంచిది.

వివాదస్పద విషయాలన్ని మధ్యవర్తుల సహాయసహకారాలతో, రాజకీయ పరపతితో పరిష్కారం అవుతాయి. మహోన్నతమైన ఆశయాలను అమలు చేసి మంచి ఫలితాలను సాధించడానికి ఉన్నతస్థాయి వ్యక్తులే కాక, సామాన్య జనం వల్ల కూడా సాధించవచ్చు అని నిరూపిస్తారు. సంతాన క్రమశిక్షణ విషయంలో సంవత్సర ద్వితీయార్థంలో కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు ఏర్పడుతాయి. మీ తెలివితేటలతో, నైపుణ్యంతో వాటిని సరిదిద్దగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, మీ వ్యాపారాలు విస్తరణ చెందుతాయి.

ఆరావళి కుంకుమ, లక్ష్మీచందనంతో మహాలక్ష్మీదేవికి పూజ చేయండి. విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. మంచి మార్కులు వస్తాయి. పోటీపరీక్షలలో విజయం సాధించినా, ఇంటర్వ్యూలలో మాత్రం చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఎట్టకేలకు మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. స్వయం శక్తితో కష్టించి ఉద్యోగం సాధిస్తారు. స్వయంశక్తితో స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన విషయాలలో ఆశాభంగం కలుగుతుంది. క్రీడా సాహిత్య సాంస్కృతిక రంగాలలో మంచి రాణింపు ఉంటుంది. ఖచ్చితమైన ఆదాయమార్గం దొరుకుతుంది.

వృశ్చిక రాశి
ఆదాయం 5; వ్యయం 5; రాజపూజ్యం 3; అవమానం 3
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు, పురుషులకు ఈ సంవత్సరం బాగుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. శ్రమకు తగిన ప్రతిఫం ప్రతిపనిలోనూ ఎంతోకొంత అంది వస్తుంది. మంచి వ్యక్తిగా ముద్రవేసుకోవడానికి అన్ని రకాలుగా కృషి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితులను కలుపుకుని నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనే మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇవ్వగలుగుతారు.

నాగసింధూరం ప్రతిరోజూ నుదుటన ధరించడం వలన నరదిష్టి, నరఘోష తొలగిపోతుంది. జీవిత భాగస్వామి సలహాలను, సంప్రదింపులను పాటిస్తారు. సమాజంలో మీ ప్రతిష్ఠ పెంచే విధంగా ఓ మంచి అవకాశం వస్తుంది. ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. స్థిరచరాస్తులు వృద్ధి చెందుతాయి. సంతానపరంగా చిక్కులు ఏర్పడినా వాటిని అధిరోహించగలుగుతారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది.

ఇందుకు సంబంధించి రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతంది. అడిగి అడగకుండానే ఋణాలు లభిస్తాయి. ఏ దేవుడికైనా, దేవతకైనా పూజ చేసేటప్పుడు అభిషేకంలో మహాతీర్థం పొడిని ఉపయోగించండి. పేరుప్రఖ్యాతులు, దూరప్రాంతం నుండి ఆర్థిక సహాయం లభిస్తాయి. వీలైనంత వరకు వివాదాలకు, వివాదస్పద చర్చలకు దూరంగా ఉండండి.

అనువంశిక ఆస్తుల విషయమైన డాక్యుమెంట్స్‌లో ఉన్న విషయాలు అస్పష్టంగా ఉండడంతో విభేదాలకు, వివాదాలకు దారితీస్తుంది. డాక్యుమెంట్స్‌లో స్పష్టత ఉండదు, ఇదీ సమస్య. చెవి, ముక్కు, గొంతు సంబంధమైన అనారోగ్యాలు బాధిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో అయినవాళ్ళను, బంధువులను దూరంగా ఉంచి లాభపడతారు.

ఆర్థిక ప్రయోజనాలను బంధుత్వాలను వేరువేరుగా చూస్తారు. సాంకేతికపరమైన విద్యారంగంలో రాణిస్తారు. అత్యున్నత సాంకేతిక విద్యను అభ్యసించడానికి అవకాశాలు కలిసివస్తాయి. సినీ,కళా, పరిశ్రమలో ఉన్నవారికి పరిస్థితులు అంత అనుకూలంగా ఉన్నాయి.

ధనుస్సు రాశి
ఆదాయం 8; వ్యయం 11; రాజపూజ్యం 6; అవమానం 3
ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలక ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో ఐకమత్యత బాగున్నప్పటికీ కార్యాలయాలు, వ్యాపార కేంద్రాలలో స్వల్పమైన ఒడిదుడుకులేర్పడతాయి. సమస్యలు పరిష్కారానికి గాను చేసే చర్చలు చర్చలుగానే మిగులుతాయి. నిర్మాణాత్మక వ్యవహారాలలో స్వల్పమైన పురోభివృద్ధి కనబడుతుంది. సంతాన విషయమై ప్రత్యేక శ్రద్ధ కనబరచవలసి వస్తుంది.

జీవితశాయం నెరవేర్చుకోవడానికి మీరు చేసే ప్రతిప్రయత్నం సఫలీకృతమవుతుంది. స్వగృహ యోగం ఏర్పర్చుకోగలుగుతారు. నూతన వ్యాపారం మొదలుపెట్టడం కోసం మీరు చేసే ప్రయత్నాలు మంచిఫలితాలను ఇస్తాయి. వ్యాపారాభివృద్ధి కోసం మీరు ప్రయత్నాలు, ప్రయాణాలు సఫలీకృతమవుతాయి. నూతనమైన అగ్రిమెంట్స్‌ను చేసుకుంటారు. కాంట్రాక్టులు, బిల్స్, క్లైవ్‌సు మొదలయినవి మొత్తం చేతికందివస్తాయి.

స్త్రీలతో విభేదాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది. దూరప్రాంతయత్నాలు, విదేశాలలో ఉద్యోగ, విద్య యత్నాల కొరకు మీరు చేసే ప్రయత్నాలు రెండవ ప్రయత్నంలో ఫలిస్తాయి. విలువైన వస్తువుల భద్రత గురించి జాగ్రత్త వహించండి. ఇన్సూరెన్స్‌ సేవలను ఉపయోగించుకోండి. రాజకీయంగా, ఉన్నతస్థానాలలో ఉన్నవారు, ముఖ్యమైన అధికారులు మిమ్ములను ఆదరిస్తారు.

వైరివర్గానికి చెందిన రహస్య సమాచారం మీకు తెలుస్తుంది. తద్వారా లాభపడతారు. ప్రింట్‌ మీడియా వల్ల ఎలక్ట్రానిక్‌ మీడియా వల్ల చేదు అనుభవాలు ఎదురవుతాయి. నానారకాలు అరిష్టాలు, చికాకులు పోవడానికి, శత్రుబాధలు, బాధలు నశించడానికి త్రిశూల్‌ని ఉపయోగించండి. ఇది అత్యంత శక్తివంతమైనది. ఆరోగ్యపరమైన విషయాలలో స్వల్ప జాగ్రత్తలు అవసరము.

తల్లిదండ్రులతో, పెద్దలతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. ప్రజాసంబంధాలు పెంచుకోవడానికి చేయవలసిన ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు. నిష్కారణమైన ఈర్షాద్వేషాలు, విమర్శలు ఎదురవుతాయి. అనవసరమైన విషయాలను పట్టించుకోవడం మానేస్తారు. అవసరమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. 

మకర రాశి
ఆదాయం 11; వ్యయం 5; రాజపూజ్యం 2; అవమానం 6
ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులు, అధికారుల అండదండలు లభిస్తాయి. సమాజం పోకడ మీద నమ్మకం పోతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం అత్యంత కష్టమైన పని అవుతుంది. ఆప్యాయతలు, అనుబంధాలు, స్నేహాలు, బంధుత్వాలు ఇవన్నీ డబ్బుల ముందు ఎందుకూ కొరగానివని తెలుసుకుంటారు.

సంతాన పురోగతి బాగుంటుంది. సంతాన విద్యా విషయమై శక్తికి మించి ఖర్చు చేస్తారు. కాంట్రాక్టులు, లీజులు మీకు లాభిస్తాయి. విద్యార్థినీవిద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం, సరస్వతీ తిలకాన్ని నుదుటన ధరించడం, మేధాదక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. కృషికి తగిన విధంగా ఫలితాలు వస్తాయి. వృత్తి,ఉద్యోగాలపరంగా అభివృద్ధి కనిపిస్తుంది.

రావాల్సిన ధనం వసూలు అవుతుంది. అన్యభాషలను నేర్చుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతవిద్యను అభ్యసిస్తారు. కొన్ని సందర్భాలలో చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. ఈ రాశికి చెందిన భార్యాభర్తల మధ్య ఓర్పు, సహనం చాలా అవసరం. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పరస్పరం అర్థం చేసుకునే పరిస్థితి నెలకొల్పుకోవాలి. ఐ.ఐ.టి, మెడిసిన్, సాంకేతికరంగం, సివిల్‌ సర్వీస్‌లు, గ్రూప్‌ సర్వీస్‌లు మొదలైనవి మీకు అనుకూలిస్తాయి.

ప్రతివిషయంలోను బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. సెల్ఫ్‌డ్రైవింగ్, స్విమ్మింగ్, జ్యోతిష్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. నేర్చుకునే ప్రయత్నాలు చేస్తారు. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు వస్తాయి. ఉద్యోగం చేస్తారు. అయితే మానసిక సంతృప్తి ఉండదు. మీరు నిర్ణయం తీసుకుని సంతకం చేసేటప్పుడు ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి సంతకం చేయండి. ఫర్నిచర్‌ వ్యాపారం, ఫాస్ట్‌ఫుడ్‌ వ్యాపారం, బేకరీలు, హాస్టల్‌ మొదలైనవి అనుకూలంగా ఉంటాయి. మ్యారేజ్‌ బ్యూరోలు నడిపే వారికి కాలం అనుకూలంగా వుంది. చిట్టీల వల్ల, ఫైనాన్స్‌ వ్యాపారాల వల్ల నష్టపోతారు. 

కుంభ రాశి
ఆదాయం 11; వ్యయం 2; రాజపూజ్యం 5; అవమానం 6
ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం చాలా బాగుంది. సమాజంలోని ఉన్నత స్థాయి వారితోటి స్నేహసంబంధాలను బలపరచుకుంటారు. ఒకానొక అనుకూలమైన అధికార పత్రం ద్వారా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ లాభపడతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు సానుకూల పడతాయి. మీ మాటకు వక్రభాష్యాలు చెప్పేవారు అధికమవుతారు.

దూరప్రాంత ప్రయాణాలు ఒకే సమయంలో అనేక పనులను సానుకూల పరచుకోవలసి రావడం వంటి అంశాలు వత్తిడికి గురి చేస్తాయి. దైవం మీద భారం వేసి మీ శక్తికి మించి పెట్టుబడులను పెడతారు. సంతాన పురోగతిపై దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఏర్పడుతుంది. స్త్రీలతో విభేదాలు సంవత్సర ద్వితీయార్థంలో సమసిపోతాయి. పూజలలో, అభిషేకాలలో హరిచందనం ఉపయోగించండి.

బంధువర్గంలో, సమాజంలో ప్రతిష్ఠ కాపాడుకోవడానికి చాలా శ్రమిస్తారు. భాగస్వాములు, సన్నిహిత సహచరులు మీ విజయంలో, అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు దగ్గరవుతారు. వైరివర్గం వల్ల వృత్తి,ఉద్యోగాల పరంగా చికాకులు సంభవిస్తాయి. శుభకార్యాల నిర్వహణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు.

ఇందుకు సంబంధించి, అంతిమ నిర్ణయాలు చేసే అవకాశం లభించదు. మీ వాదనలను, అభిప్రాయాలను ఆత్మీయులు తిరస్కరిస్తారు. రాజకీయ పదవులకు నామినేట్‌ అవడం రాజకీయ అధికారగణానికి దగ్గరవ్వడం సంభవం. సౌకర్యవంతమైన వస్తువులను, అధునాతన సామాగ్రిని కొనుగోలు చేస్తారు. ప్రభుత్వపరంగా ప్రైవేట్‌ పరంగా రావాల్సిన పెండింగ్‌ బిల్స్‌ ఓ దారికి వస్తాయి. విలువైన వస్తువులను, గృహాన్ని ఏర్పర్చుకోగలుగుతారు.

కొన్ని సందర్భాలలో ఆధ్యాత్మిక విషయాల పట్ల కూడా నైరాశ్యం, నిరాశ, కోపం కలుగుతాయి. వీటిని అదుపులో ఉంచండి. తప్పక దైవానుగ్రహం లభిస్తుంది. విదేశాలలో ఉన్నవారికి గ్రీన్‌ కార్డు లభిస్తుంది. ప్రత్యక్షంగా లేక పరోక్షంగా కుటుంబానికి సహాయపడతారు. మీ సంపాదనలో కొంత భాగం దుబారాగా ఖర్చు అవుతుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళనొప్పులు బాధిస్తాయి.

మీన రాశి
ఆదాయం 8; వ్యయం 11; రాజపూజ్యం 1; అవమానం 2
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు, పురుషులకు ఈ సంవత్సరం చాలా బాగుంది. గృహ, నిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో చర్చలు ఫలిస్తాయి. జీవిత స్థిరత్వం ఏర్పడుతుంది.

సంతానంనాకు నూతన అవకాశాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. పారిశ్రామిక, కళా రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు. సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు.

హనుమాన్‌ వత్తులును అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం వలన సమస్యలు కొంత వరకు తీరుతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. ఇంతకాలం పడ్డ శ్రమ ఫలిస్తుంది. కళా, సాహిత్య రంగాలలో మంచిగా రాణిస్తారు. అవార్డులు, రివార్డులు వస్తాయి. విలువైన బహుమతులు లభిస్తాయి. అనుకూలమైన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు.

పూజలలో ప్రథమతాంబూలాన్ని వాడండి. పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి, గ్రీన్‌ కార్డు కోసం ప్రయత్నించే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. జ్యేష్ఠ కుమార్తె విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీ జ్ఞాపకశక్తి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనస్సు కష్టపడటానికి ఈ జ్ఞాపకశక్తే కారణమవుతుంది. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు కలిసివస్తాయి.

కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని మీ సౌఖ్యాన్ని, సౌకర్యాలని తగ్గించుకుంటారు. అధికారంలో ఉన్న స్త్రీలకు మంచి అడ్మినిస్ట్రేటర్‌గా పేరు వస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా మందికి ఉద్యోగపరంగా ప్రయోజనం కలుగుతుంది. రాజకీయరంగంలో రాణిస్తారు. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమవుతుంది. ఆర్థికభారం తేలికవుతుంది. ప్రభుత్వపరంగా, ఆర్థికంగా మంచి మేలును పొందగలుగుతారు. అధికారులతో మంతనాలు, రాజకీయ పైరవీలు లాభిస్తాయి. కోర్టుతీర్పులు అనుకూలంగా వస్తాయి.  
-పంచాంగకర్త: శ్రీమతి ములుగు శివజ్యోతి (కీ.శే. శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాదు సిద్ధాంతి గారి కుమార్తె)
సంగ్రహణ: సాక్షి క్యాలెండర్‌ 2023. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement