అశ్వని 1,2,3,4 పాదములు (చూ, చే, చో, లా)
భరణి 1,2,3,4 పాదములు (లీ, లూ, లే, లో)
కృత్తిక 1వ పాదము (ఆ)
ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (లాభం)లోను తదుపరి మీనం (వ్యయం)లోను సంచరిస్తారు. శని ఏప్రిల్ 28 వరకు జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (దశమం)లోనూ మిగిలినకాలం అంతా కుంభంలోనూ సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (ద్వితీయం) కేతువు వృశ్చికం (అష్టమం)లోను తదుపరి రాహువు మేషం (జన్మం) కేతువు తుల (సప్తమం)లో సంచరిస్తారు. 2022 ఆగుస్టు 10 నుండి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (ద్వితీయం)లో స్తంభనం. మొత్తం మీద ఈ గోచారం సంవత్సరం అంతా ప్రోత్సాహకరంగానే ఉంటుంది. గతంలో కంటే ఎక్కువ అనుకూల పరిస్థితులు ఉంటాయి. శని మకరంలో ఉన్నప్పటి కంటే కుంభంలో సంచరించే సమయంలో బాగా అనుకూలిస్తాడు. శుభకార్యముల నిమిత్తం తరచుగా ధనవ్యయం అవుతుంటుంది. ఇతరుల మీద ఆధారపడని వారికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన సలహాలు తీసుకొని, చికాకులు పడుతుంటారు.
అందువలన ఈ సంవత్సరం ప్రతిపనీ స్వయంగా చేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో నష్టాలు ఉండవుగాని, మనస్పర్థలకు అవకాశం ఎక్కువ. ఆర్థిక వనరులు వచ్చే మార్గం చిన్నదిగాను ఖర్చు అయ్యే మార్గం పెద్దదిగా ఉన్న కారణం చేత ఆర్థిక వ్యవహారాల్లో చికాకులు పడతారు. ఎక్కువగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలాకాలం పుణ్యకార్యాచరణ లేదా పుణ్యక్షేత్ర సందర్శన మీద దృష్టి ఉంచే అవకాశం ఉంటుంది. దైనందిన కార్యకలాపాలు అస్తవ్యస్తంగా పూర్తి అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో నమ్మకద్రోహానికి గురవుతారు. ఉద్యోగంలో స్థానచలన ప్రయత్నాలలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. వ్యాపారులకు సంవత్సరం అంతా హెచ్చుతగ్గులు తప్పవు. లాభాలు తక్కువ.
ఉద్యోగాల్లో స్థిరం తగ్గుతుంది. ప్రమోషన్‌లు దగ్గరకు వచ్చి మిస్ అవుతాయి. మీకు శ్రమకు తగిన లాభం, శ్రమకు తగిన గుర్తింపు అందవు. అధికారుల నుంచి సహకారం తక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులేవీ ఉండవు. అయితే మానసిక రుగ్మతలు ఉన్నవారు తరచుగా యిబ్బందులకు లోనవుతారు. మిగిలిన వారు గురువు వ్యయం దృష్ట్యా స్వల్ప జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటింపకపోతే మోసపోయే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగకపోవడం వల్ల నిరుత్సాహ పడతారు.
విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి చాలా ఇబ్బందులతో పనులు పూర్తి అవుతాయి. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు ఈ సంవత్సరం మే నుంచి చాలా చికాకులు ఎదురవుతాయి. విద్యార్థులకు విద్యావ్యాసంగం కంటే ఇతర వ్యవహారాలు ఎక్కువై విద్యాభంగం పొందుతారు. రైతులకు శ్రమ ఎక్కువ అవుతుంది. గర్భిణీస్త్రీలు మే నెల నుంచి బహు జాగ్రత్తలు పాటించాలి. ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఎక్కువ.
అశ్వినీ నక్షత్రం వారికి శుభపరిణామాలు ఎక్కువ. బాగా కృషి చేస్తారు. వృత్తిపరంగా మంచి ఫలితాలు అందుకుంటారు. జన్మ రాహువు, వ్యయ గురువుల ప్రభావం ఈ నక్షత్రం మీద తక్కువ అనే చెప్పాలి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందరికీ సాయం చేస్తూ మంచి ఫలితాలు, కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు.
భరణీ నక్షత్రం వారికి అనవసర ఆలోచనలు, వృథా కాల క్షేపాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. రాహువు భరణీలో సంచారం వల్ల మానసిక రుగ్మతలు తలెత్తుతాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు వుంటాయి. ధనవ్యయం ఎక్కువగా వుంటుంది.
కృత్తికా నక్షత్రం వారు ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభించి, వేగంగా పూర్తి చేసుకుంటారు. అన్ని అంశాలలోనూ అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగంలో చికాకులు వుంటాయి. తెలివిగా సరి చేసుకుంటారు. వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పదిమందికీ సాయంచేసి సంఘంలో మంచిపేరు తెచ్చుకుంటారు.
శాంతి : ఏప్రిల్ 12 తరువాత రాహు, కేతు గురువులకు శాంతి చేయించండి. రోజూ ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణలు చేసి దుర్గా సప్తశ్లోకీ 11 సార్లు పారాయణ చేయడం వలన చాలావరకు దుష్ఫలితాలు తొలగుతాయి. పంచముఖ రుద్రాక్షలు ధరించడం శ్రేయస్కరం.
ఏప్రిల్: ఆర్థిక వెసులుబాటు తగ్గుతుంది. కుటుంబ విషయాల్లో మంచి పరిణామములు చోటు చేసుకుంటాయి. అలంకరణ వస్తువుల కొనుగోలు, ప్రయణాల కోసం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రాహుకేతు శాంతి చేయించండి. ఉద్యోగం ఒత్తిడితో ఉంటుంది. దైనందిన కార్యకలాపాలు అస్తవ్యస్తంగా ఉంటాయి.
మే: క్రమక్రమంగా పని ఒత్తిడి పెరుగుతుంది. శుక్రుడు వ్యయంలో ఉన్న కారణంగా ప్రయాణ అసౌకర్యాలు ఎక్కువ అవుతాయి. అలంకరణ వస్తువులు కొనుగోలు విషయంలో ధనవ్యయం ఎక్కువవుతుంది. అధికారులతో ఒత్తిడి పెరుగుతుంది. అనవసర విషయాల వలన మానసిక చికాకులు ఉంటాయి. కొత్త ప్రయోగాలు ఏమీ చేయవద్దని సూచన.
జూన్: సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహిస్తారు. కుటుంబ విషయాలు చాలావరకు మంచి ఫలితాలతో ఉంటాయి. ఖర్చులను నియంత్రించగలుగుతారు. ఉద్యోగం, వ్యాపారం అంతా సాధారణ స్థాయి ఫలితాలతో ఉంటాయి. అభివృద్ధిపథంలో ప్రయాణం సాగుతుందనే చెప్పాలి.
జూలై: ఎంత లాభదాయకంగా ఉన్నా, లేకున్నా వ్యాపారులు చాలా జాగ్రత్తలు వహిస్తూ వ్యాపారాలు చేయాలి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి తరచుగా చికాకులు వస్తుంటాయి. మితభాషణ మంచిది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఖర్చులు నియంత్రించలేని స్థితి ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.
ఆగస్టు: చాలావరకు సానుకూల వాతావరణం ఉంటుంది. కొత్త ప్రయోగాలేవీ చేయవద్దని సూచన. శుభ వార్తలు వింటారు. అందరి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభ కార్యాలు, పుణ్యకార్యాల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు.
సెప్టెంబర్: చాలా ప్రశాంతంగా ఉంటుంది. 15వ తేదీ నుంచి 24 వరకు కాలం మరింత అనుకూలం. అందరూ బాగా గౌరవిస్తారు. ధనవ్యయం అధికంగానే ఉన్నా, అవసరానికి తగిన ఋణం లభిస్తుంటుంది. కుటుంబం, ఉద్యోగం రెండు అంశాలనూ చాలా ఓర్పుగా నేర్పుగా సాగించుకుంటూ ముందుకు వెడతారు.
అక్టోబర్: గురు, బుధ, శుక్ర సంచారం అనుకూలం తక్కువ. ప్రయాణాలలో వస్తువులు పోగొట్టుకోవడం జరుగుతుంది. బంధు మిత్రులు కలిసినప్పుడు వ్యవహార విషయాల మీద చర్చలు చేయవద్దు. ఆర్థిక లావాదేవీలు సరిగా సాగవు. అలంకరణ వస్తువుల కొనుగోలులో ధనవ్యయం అధికం అవుతుంది. వృత్తి సౌఖ్యం బాగానే ఉంటుంది.
నవంబర్: కనబడుతున్న అన్ని అంశాలూ నిజం కాదు అని గ్రహించండి. ప్రతి విషయంలోనూ స్వయం శోధన అవసరం. ఈ నెలలో వృత్తి వ్యవహారాలు జాగ్రత్తగా చేసుకోవాలి. ఇతరుల మీద ఆధారపడితే ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో కలహం పెరిగినా వారితోనే ఎక్కువ సమయం కేటాయించండి.
డిసెంబర్: క్రమంగా చాలా మంచి ఫలితాలు అందుకుంటారు. ప్రతిరోజూ అధిక శ్రమ ఉంటుంది. అయితే శ్రమకు తగినట్లు లాభదాయకంగా ఉంటుంది. ప్రధానంగా మీ విజ్ఞానం మీకు గౌరవం తెచ్చి పెడుతుంది. మిత్రలాభం చేకూరుతుంది. అనుకోని లాభాలు ఉంటాయి. దూర ప్రయాణాలు, అలంకరణ వస్తువుల కొనుగోలులో ఖర్చు పెరుగుతుంది.
జనవరి: శుభ పరిణామాలు ప్రారంభమవుతాయి. వృత్తిరీత్యా ఇబ్బందులు వుండవు. అన్ని వ్యవహారాల్లోనూ మీకు అందరూ సహకరిస్తారు. ధనం వెసులుబాటు బాగుంటుంది. ప్రత్యేక జాగ్రత్తలతో కాలం సానుకూలం చేసుకుంటారు. ఎవరి మీదా ఆధారపడకుండా చేసే పనులు మిమ్మల్ని విజయపథంలోకి తీసుకువెడతాయి.
ఫిబ్రవరి: చాలా మంచి కాలం. క్రమంగా ఓర్పుతో సర్వకార్యసాధన చేస్తారు. ప్రధానంగా కుటుంబ విషయంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయి. రాహు, కేతు, గురువులు బాగాలేని ఈ కాలంలో కూడా మిగిలిన గ్రహాల అనుకూలత దృష్ట్యా ఆర్థిక, ఆరోగ్య విషయాలలో మంచి అనుకూలస్థితి సాధిస్తారు. ఋణ సదుపాయం బాగుంటుంది.
మార్చి: పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, కుటుంబ విషయాలకు సమన్యాయం చేయలేక బాగా చికాకుకు గురి అవుతారు. బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా ఏ సలహాలూ తీసుకోవద్దు. ఓర్పు చాలా అవసరం. ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల వ్యవహారాల్లోనూ కలుగజేసుకోవద్దని ప్రత్యేక సూచన.
మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి.
శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2022 – 23: మీ రాశిఫలాలు కోసం క్లిక్ చేయండి..
Comments
Please login to add a commentAdd a comment