ధనిష్ఠ 3,4 పాదములు (గుూ, గే)
శతభిషం 1,2,3,4 పాదములు (గొ, సా, సీ, సు)
పూర్వాభాద్ర 1,2,3 పాదములు (సే, సొ, దా)
ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (జన్మం)లోను తదుపరి మీనం (ద్వితీయం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్ 28 వరకు మరలా జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (వ్యయం)లోను మిగిలిన కాలం అంతా కుంభంలో సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (చతుర్థం) కేతువు వృశ్చికం (దశమం)లోను తదుపరి రాహువు మేషం (తృతీయం) కేతువు తుల (నవమం)లో సంచరిస్తారు.
2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (చతుర్థం)లో స్తంభన. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా చిత్ర విచిత్రమైన జీవనశైలితో కాలం నడుస్తుంది. గురువు అనుకూలంగా ఉన్న కారణంగా ధన కుటుంబ ఆరోగ్య విషయాల్లో వచ్చే సమస్యలకు వెంటనే పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఆగస్టు నుంచి కుజస్తంభన దృష్ట్యా ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. అలాగే తరచుగా అయిష్టమైన కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనవలసి రావడం, బంధువులతో కలహాలు ఉంటాయి. శని సంచారం అనుకూలంగా ఉన్నట్లే చెప్పాలి. మకర కుంభ సంచారాలలో ఈ రాశివారికి శని చెడు పెద్దస్థాయిలో ఉండదు.
అయితే పనులు మందకొడిగా సాగడం, ముఖవర్చస్సు తగ్గడం, చెప్పుకోలేని బాధలు ఉన్న భావన కలుగుతాయి. భోజన వసతికి ఇబ్బంది రాగలదు. కుటుంబసభ్యులు బాగా సహకారంగా ఉన్నా, ఏదో తెలియని అవగాహన లోపంతో ముందుకు సాగుతారు. గతం కంటే ఈ సంవత్సరం బాగానే ఉన్నా, అసంతృప్తితో కాలక్షేపం చేస్తారు. ఆర్థిక వనరులు బాగా సమకూరుతాయి. అదే రీతిగా ధనవ్యయం ఎక్కువగా ఉంటుంది. కావలసిన సమయానికి ఋణాలు అందుతాయి.
పాత ఋణాలు తీర్చుకోవడానికి మార్గం సుగమమవుతుంది. తరచుగా గురువులను పూజ్యులకు సందర్శించుకుంటారు. ఏలినాటి శని ప్రభావం చేత కార్మికుల సమస్య ఇబ్బందికరంగా ఉండి వ్యాపారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేరు. వ్యాపారులకు సంవత్సరం అంతా శ్రమ, చికాకు తప్పదు. సీజన్‌లకు తగిన రీతిగా స్పందించి వ్యాపారం చేయలేరు. ఉద్యోగులకు విచిత్రమైన సమస్యలు ఎదురవుతాయి. అధికారుల సహకారం లేకపోవడం, తోటివారి నుంచి సమస్యలు రావడం జరుగుతుంది. సుఖంగా పనులు సాగవు. ఆరోగ్యపరంగా బాగా జాగ్రత్తలు పాటించాలి. పెద్దగా యిబ్బందులు ఉండవు కానీ తరచుగా సమస్యలు ఎదురుకాగలవు. నరాలు, రక్త సంబంధ అనారోగ్యం ఉన్నవారు ఎక్కువ ఇబ్బందికి గుురవుతారు. ఆరోగ్యరీత్యా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో అవరోధాలు ఎదురైనా, శ్రమతో పనులు పూర్తవుతాయి.
నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి పనులు ఇబ్బందికరమే అయినా ఫలితం సానుకూలం. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు చేసేవారికి ఖర్చు అధికంగా ఉన్నా, కార్యసాఫల్యం జరుగుతుంది. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులకు విద్యావ్యాసంగం బాగా సాగుతుంది. ఊహాతీతంగా చాలా మంచి ఫలితాలను అందుకుంటారు. రైతులకు శ్రమ ఎక్కువగా ఉన్నా, చివరకు మంచి ఫలితాలు అందుతాయి. గర్భిణీ స్త్రీలు అనవసర విషయాలపై ఆలోచనలు విరమించుకోడం శ్రేయస్కరం.
ధనిష్ఠ నక్షత్రం వారికి కుటుంబసభ్యుల సహకారం ఈ సంవత్సరం శ్రీరామరక్ష అనే చెప్పాలి. ఉద్యోగంలో మీరు కార్యనిర్వహణ చాలా వికృతంగా చేయడం. సమయపాలన లేకుండా ప్రవర్తించడం వంటివి చేస్తారు. అయితే ఏదో తెలియని అద్భుతశక్తి మిమ్మల్ని రక్షిస్తుంది.
శతభిష నక్షత్రం వారికి విచిత్రమైన స్థితి వుంటుంది. తరచుగా అన్ని పనులూ మందగించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అంతా లాభదాయకం అనుకునే సందర్భంలో పనులు వెనక్కు మళ్లే అవకాశం వుంటుంది. పనులు విజయవంతంగా పూర్తి చేసుకోవాలనుకుంటే, మీరు స్వయంగా శ్రమించాలి.
పూర్వాభాద్ర నక్షత్రం వారికి విశేషమైన కాలమనే చెప్పాలి. పూర్తిగా స్వేచ్ఛగా జీవిస్తారు. భారంగా వుండే పనులు చేయకుండా సరళంగా వుండే పనులు మాత్రమే చేసుకుంటూ కాలక్షేపం చేస్తారు. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తరచుగా శుభకార్యాల్లో పాల్గొంటారు.
శాంతి: శని రాహు కుజులకు జపం, దానం చేయించడం మంచిది. ప్రతిరోజూ ఆంజనేయస్వామికి ‘శ్రీరామశ్శరణం మమ’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయడం మంచిది. ఆరు ముఖముల రుద్రాక్షధారణ శ్రేయస్కరం.
ఏప్రిల్: శనిగ్రహ శాంతి చేయించండి. వరుసగా మూడు మాసములు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని వ్యవహారాలూ మందకొడిగా నడుస్తాయి. అయితే ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న చికాకులు తప్పక ఉంటాయి. ప్రయాణాలు విరమించండి.
మే: శని కుజుల కుంభరాశి సంచారం చాలా ఇబ్బందికరం. మూడవ వారంలో బాగా చికాకులు రాగలవు. ఆర్థిక వెసులుబాటు చికాకులు కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలను సరిచేయగలుగుతారు. ఋణ విషయాల్లో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం బహు జాగ్రత్తగా చూసుకోవాలి. దూర ప్రయాణాలు చేయవద్దు.
జూన్: చెప్పుకోదగిన ఇబ్బందులు ఉండవు. ప్రత్యేక లాభములు ఉండవు. ప్రతి పనీ స్వయంగా చేసుకొని లబ్ధి పొందుతారు. ఆర్థిక వెసులుబాటు, ఋణ సౌకర్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం అద్భుతంగా ఉంటుంది. అన్ని విషయాల్లోనూ చక్కగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు.
జూలై: శ్రద్ధతో ప్రవర్తించి కార్యజయం సాధిస్తారు. అంతటా విజయావకాశాలు ఉన్నాయి. కాలం వృథా చేయకుండా గత సమస్యల పరిష్కారం, భవిష్య ప్రణాళికలు, దీర్ఘకాలిక కార్యక్రమాల మీద దృష్టి సారించాలి. కుటుంబపరంగా కాలం అనుకూలం. ఆర్థిక, ఋణ విషయాలు బాగుంటాయి.
ఆగస్టు: ఏలినాటి శని అర్ధాష్టమ కుజుడు షష్ఠ శుక్రుడు ప్రభావంగా మీరు ఈ నెలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో అసౌకర్యం. అవగాహన లోపాలు ఎక్కువవుతాయి. ఉద్యోగ అంశాలు స్వయంగా చూసుకోండి. వ్యాపార విషయంలో మీకు తోటివారు, సిబ్బంది చికాకులు సృష్టిస్తారు.
సెప్టెంబర్: పూర్తి అనుకూల వాతావరణం ఉండదు అలాగని నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. అనవసర విషయాలలో భయాందోళనలు ఎక్కువవుతాయి. జీర్ణ సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో వస్తువులు చోరీకి గురవుతాయి. విధి నిర్వహణలో జాగ్రత్తపడండి.
అక్టోబర్: సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం అవుతుంది. 15వ తేదీ వరకు అన్ని పనులూ ఒత్తిడిగా ఉంటాయి. ప్రత్యేకంగా కొత్త వ్యవహారాల జోలికి వెళ్ళవద్దు. రోజువారీ పనులతో కాలక్షేపం శ్రేయస్కరం. కోర్టు వ్యవహారాలు, ఋణ వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం. పెద్దల ఆరోగ్య విషయం జాగ్రత్త.
నవంబర్: చాలా విచిత్రమైన కాలం. క్రమంగా కార్యసానుకూలత పెరుగుతుంది. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం పెద్దగా ఉండదనే చెప్పాలి. మాసారంభంలో శుక్రుడు, ద్వితీయార్ధంలో రవి అనుకూలిస్తారు. పనులు వాయిదా వేసే ఆలోచనలను విరమిస్తే విజయం మీతో ప్రయాణం చేస్తుంది. అన్ని విషయాల్లోనూ సహనంతో వ్యవహరిస్తారు.
డిసెంబర్: ఒక కోణంలో మీరు ఈనెలలో అదృష్టవంతులనే చెప్పాలి. శ్రమతో కూడుకున్న పనులను ముందుగానే గుర్తించి, వాటి జోలికి వెళ్ళకుండా ప్రశాంతంగా చేయగలిగిన పనులు మాత్రమే చేసుకుంటూ ముందుకు వెడతారు. అందరి సహకారం బాగుంటుంది. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. అన్ని విషయాల్లోనూ ప్రత్యేక శ్రద్ధ ప్రదర్శిస్తారు.
జనవరి: గురుబలం ఈ నెల విశేషం. ప్రయాణ విçఘ్నాలు ఉంటాయి. తరచుగా వస్తువులు పనులు మరచిపోయే అవకాశం ఉంది. 15వ తేదీ వరకు రవి అనుకూలత దృష్ట్యా వృత్తిలో సమస్యలను దాటవేయగలుగుతారు. మూడవవారం అన్నింటా చికాకులు ఉంటాయి. చివరి వారంలో శుక్ర సంచారం అనుకూలత వల్ల సమస్యలను దాటగలరు.
ఫిబ్రవరి: రవి కుజ శని సంచారం బాగులేదు. ప్రధానంగా ఆదాయం ఒత్తిడిగా అందుతుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. తరచుగా దుర్వార్తలు వినవలసి వస్తుంది. బంధువుల అనారోగ్య వార్తలు మానసిక ఇబ్బందులకు గురి చేస్తాయి. పనులు బాగా ఆలస్యం అవుతాయి.
మార్చి: ప్రతి పనిలో ఆలస్యం ఎదురైనా, సానుకూలంగా పూర్తవుతాయి. కొత్త ప్రయోగాలు చేయవద్దని సూచన. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు సానుకూలం. ఖర్చులు నియంత్రించడం ద్వారా ఈ నెల అంతా సుఖంగా జీవనం సాగుతుంది.
మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి గోచారానికి పోలిక చేసి ఫలితాలు తెలుసుకోండి.
శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2022 – 23: మీ రాశిఫలాలు కోసం క్లిక్ చేయండి..
Comments
Please login to add a commentAdd a comment