ఉత్తరాషాఢ 2,3,4 పాదములు (బొ, జా, జీ)
శ్రవణం 1,2,3,4 పాదములు (జే, జో, ఖా, ఖొ)
ధనిష్ఠ 1,2 పాదములు (గా, గి)
ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (ద్వితీయం)లోను తదుపరి మీనం (తృతీయం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్ 28 వరకు మరలా జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం(జన్మం)లోను మిగిలినకాలం అంతా కుంభంలోను సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (పంచమం) కేతువు వృశ్చికం (లాభం)లోను తదుపరి రాహువు మేషం (చతుర్థం) కేతువు తుల (దశమం)లో సంచరిస్తారు.
2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (పంచమం)లో స్తంభన. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా ఏలినాటి శని, అర్ధాష్టమ రాహువు, తృతీయ గురువులలో ఎవరూ అనుకూలించే గ్రహాలు కాదు. కానీ ఇతర గ్రహాలు ప్రతినెలలోను ఏదో ఒక గ్రహం ఎక్కువ కాలం పాటు సంతృప్తికర ఫలితాలు అందిస్తున్న కారణంగా విజయపథంలోనే ముందుకు వెడతారు. గత సంవత్సరం కంటే ఎక్కువ రోజులు ఎక్కువ శాతం మంచి ఫలితాలు అందుకుంటారు. దీర్ఘకాలికమైన పనులను ఈ సంవత్సరం పెట్టుకోవద్దు. భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆదాయం తగుమాత్రంగా ఉన్నా, అవసర సమయాల్లో డబ్బు తగిన రీతిగా సర్దుబాటు కాకపోవడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. పాత ఋణాలు తీర్చే విషయంలో అనుకూలత తక్కువగా వున్నందున ఆర్థిక ఒడంబడికలకు దూరంగా ఉండండి. మితభాషణ శ్రేయస్కరం. కుటుంబసభ్యుల ద్వారా కొన్ని విషయాలలో అనుకూల వాతావరణం. కొన్ని ఆర్థిక వ్యాపార శుభ వ్యవహారాల్లో మంచి ఫలితాలు దక్కుతాయి. పిల్లల అభివృద్ధి వార్తలు, పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉందనే వార్తలు తరచుగా వింటారు. స్థానచలనం, ప్రమోషన్ వంటి అంశాలు ఈ సంవత్సరం మీ తెలివి తక్కువతనంతో ఇబ్బందికరం కాగలవు.
మందకొడి ఆలోచనలు, ప్రవర్తనలతో వ్యాపార నిర్ణయాలు సరిగా చేయలేరు. అందువల్ల వ్యాపారులకు సంవత్సరం అంతా సామాన్య ఫలితాలు మాత్రమే ఉంటాయి. కార్మికులతో సమస్యలు తప్పవు. ఉద్యోగులు నమ్మకూడని వ్యక్తులను ఆశ్రయించి, వారి సలహాలను అమలు చేసి, మీ అభివృద్ధికి మీరే అవరోధాలు సృష్టించుకుంటారు. అనవసర సమస్యలను కొని తెచ్చుకుంటారు. నిర్లక్ష్యం వల్ల ఆరోగ్య ఇబ్బందులను ఎదుర్కొంటారు. సుగర్, బీపీ ఉన్నవారు మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తి కొనుగోలు పనులు వేగంగా సాగవు.
నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేవారు దూకుడు ఆలోచనలు ప్రమాదకరం అని గమనించాలి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి విద్యాపరంగా కార్యానుకూలత ఉంది. ఉద్యోగరీత్యా అనుకూలత లేదు. షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు తరచుగా కొత్త కొత్త సమస్యలు వస్తుంటాయి. కంగారు పడనవసరం లేదు. విద్యార్థులకు విద్యా వ్యాసంగం సామాన్యంగా ఉంటుంది. కొత్త ప్రయోగాలు చేసే ఆసక్తి తగ్గుతుంది. రైతులకు శ్రమ ఎక్కువ అయినా, ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. మంచి ఫలితాలు ఆలస్యంగా అందుతాయి. గర్భిణిలు ఎటువంటి ఒత్తిడికి లోనవకుండా ఉంటారు. కాలం అనుకూలమే అని చెప్పాలి.
ఉత్తరాషాఢ నక్షత్రం వారు తరచుగా పూజలు, వ్రతాలు, నోములు వంటి పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ధైర్యంగా తెలివిగా ఎంతటి కార్యాన్నయినా విజయవంతం చేసుకునే అవకాశం వుంటుంది. మౌనంగా వుంటూనే ప్రతి పనినీ సాధించుకోవడంలో కృతకృత్యులవుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
శ్రవణ నక్షత్రం వారికి మానసిక అలజడి ఎక్కువగా వుంటుంది. సాంఘిక కార్యక్రమాలకు వీలయినంత దూరంగా వుండడం శ్రేయస్కరం. ఇతరులకు సహకరించాలనే మీ మంచితనం ఈ సంవత్సరం మీ పాలిట శాపంగా మారే అవకాశం వున్నది. ప్రయాణాలు ఒంటరిగా చేయవద్దు.
ధనిష్ఠా నక్షత్రం వారికి కాలం చాలావరకు అనుకూలమనే చెప్పాలి. ప్రతిపనీ అతి శ్రమతో పూర్తవుతుంది. గతకాలం కంటే చాలావరకు సానుకూలం అనే చెప్పాలి. ఆగస్టు తరువాత తల్లి తరఫులేదా భార్యాతరఫు బంధువుల వల్ల మంచి సహకారం లభించి కొన్ని సమస్యలను పరిష్కరించుకునే అవకాశం వుంటుంది.
శాంతి: అవకాశం ఉన్నప్పుడు శని రాహు శాంతి చేయించండి. రోజూ శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దుర్గా సప్తశ్లోకి 11 సార్లు పారాయణం చేయడం, ‘గౌరీశంకర’ రుద్రాక్ష ధరించడం శ్రేయస్కరం.
ఏప్రిల్: ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆర్థిక సౌకర్యం చాలా తక్కువ. ప్రయాణాల్లో చికాకులు ఉంటాయి. ఇతరులను నమ్మి పనులు ప్రారంభించవద్దు. ఋణ విషయాల్లో అనుకూలత తక్కువ. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి పనీ స్వయంగా చేసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం తక్కువ.
మే: చాలా అంశాలలో అనుకూల స్థితి ఉంటుంది. క్రమంగా ఒక్కో పని వేగం పుంజుకుంటుంది. అందరూ సహకరిస్తారు. 15వ తేదీ తరువాత తరచుగా ఉష్ణప్రకోపం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా పెద్దస్థాయి ఇబ్బందులు ఉండవు. స్నేహపూర్వక వాతావరణంలో చాలా వ్యవహారాలను సానుకూలం చేసుకుంటారు. కుటుంబ వ్యవహారాలు అనుకూలం.
జూన్: ఆలోచనలు వేగంగా ఉంటాయి. పనులు వేగంగా చేస్తారు. ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. ప్రత్యేకంగా వచ్చే లాభాలు కూడా చాలా సానుకూలంగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం అద్భుతంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్య విషయంలో మంచి వార్తలు వింటారు. పిల్లల అభివృద్ధి వార్తలు బాగుంటాయి. అందరి నుంచి సహాయ సహకారాలు అందుతాయి.
జూలై: ఏలినాటి శని ఉన్నా, ఈ నెలలో పనులు చక్కగా పూర్తవుతుంటాయి. ప్రధానంగా పుణ్యకార్య, శుభకార్య ప్రయత్నాలలో కాలక్షేపం జరుగుతుంది. అందరూ మీకు సహకరిస్తారు. అందరికీ మీరు సహకరిస్తారు. డబ్బు వెసులుబాటు బాగుంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలం. షేర్ వ్యాపారులకు కలసివచ్చే కాలం.
ఆగస్టు: సాధారణ స్థాయి ఫలితాలు మాత్రమే ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో తెలివిగా ప్రవర్తించి లబ్ధి పొందుతారు. ప్రయాణాలు అధికంగా చేస్తుంటారు. ఋణ సంబంధ లావాదేవీల్లో ఎవరికీ ఎటువంటి హామీలు ఇవ్వవద్దని ప్రత్యేక సూచన.
సెప్టెంబర్: కొన్ని పనులు సానుకూలంగానూ, కొన్ని పనులు ఇబ్బందికరంగానూ కావడంతో మిశ్రమ ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. చివరి వారంలో పనులు వేగంగా సాగుతాయి. పిల్లలతో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. విద్యా, విజ్ఞాన, పుణ్యకార్యాలపై దృష్టి కేంద్రీకరించలేక ఒత్తిడికి లోనవుతారు.
అక్టోబర్: ఏలినాటి శని ఉన్నా, గ్రహచారం ఇబ్బంది లేకుండా మీ పనులు సాగించుకునే రీతిగా యోగిస్తుంది. చాలాకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నాలు ఈ నెల విజయవంతమవుతాయి. ప్రధానంగా ఆర్థిక వెసులుబాటు తృప్తినిస్తుంది. అలాగే కుటుంబ వ్యవహారాల్లో ఒక్కో కోణంలో ఒక్కో రకంగా లాభం చేకూరుతుంది.
నవంబర్: ఏలినాటి ఉన్నప్పటికీ మిగిలిన గ్రహాలు అనుకూలంగా ఉన్నందున అన్ని అంశాలూ సానుకూలంగా ఉంటాయి. పనుల్లో ఆలస్యం జరిగినా, సానుకూలంగా పూర్తవుతాయి. వాత సంబంధ, జీర్ణ సంబంధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం చికాకు పడతారు. ప్రధానంగా ఆర్థికంగా కుటుంబపరంగా సౌఖ్యం ఉంటుంది.
డిసెంబర్: ప్రతిపనీ కూడా చాలా శ్రమతో పూర్తవుతుంది. వాహనాలు తరచుగా రిపేర్‌లకు వస్తాయి. ఖర్చులు ఎక్కువ అవుతాయి. ప్రత్యేకించి శుభ కార్యాలు, పుణ్యకార్యాలు, సామాజిక కార్యక్రమాల్లో ఆటంకాలు, చికాకులు ఎక్కువ అవుతాయి. ఇతరుల విషయంలో కలగజేసుకోవద్దు. దూరప్రాంత ప్రయాణాలు విరమించమని సూచన.
జనవరి: రవి శని బుధ గ్రహదోషంతో నెలంతా ఇబ్బందికరమే. కేవలం శుక్రసంచారం ఒక్కటే అనుకూలంగా ఉంది. ప్రశాంతత తగ్గుతుంది. తెలివిగా ప్రవర్తించి సమస్యలను అధిగమిస్తారు. వృత్తి విషయంలో ఒత్తిడి పెరుగుతుంది. అధికారులతో కలహం రాకుండా జాగ్రత్తపడండి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగానే ఉన్నా, ఖర్చులు పెరుగుతాయి.
ఫిబ్రవరి: ఏలినాటి శని ఉన్నా, మిగిలిన గ్రహాల అనుకూలతతో సాధారణ జీవనానికి ఇబ్బంది లేకుండా సాగిపోతుంది. అందరితో స్నేహపూర్వకంగా మెలగడానికి ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు గత సమస్యలు పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది. మీ తెలివి కొన్నిసార్లు పని చేయని స్థితి ఉంటుంది. ఆర్థిక మాంద్యం తప్పదు.
మార్చి: గ్రహచారం అనుకూలంగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంటారు. ప్రతి పనిలోనూ వేగంగా పనులు చేయడం, వేగంగా ఫలితాలు అందుకోవడం జరుగుతుంది. ప్రధానంగా వృత్తి విషయాలు అనుకూలంగా ఉంటాయి. రోజూ కొత్త కొత్త వ్యవహారాలు చేస్తారు. ఇబ్బందిలేని కుటుంబ, ఆరోగ్య జీవనం ఈ నెలలో బహు అనుకూలం.
మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి.
శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2022 – 23: మీ రాశిఫలాలు కోసం క్లిక్ చేయండి..
Comments
Please login to add a commentAdd a comment