అభాగ్యుల పాలిటి అపర ధన్వంతరి | hyderabadi Arras Nawab Yar Jung | Sakshi
Sakshi News home page

అభాగ్యుల పాలిటి అపర ధన్వంతరి

Published Thu, Dec 11 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM

అభాగ్యుల పాలిటి అపర ధన్వంతరి

అభాగ్యుల పాలిటి అపర ధన్వంతరి

హైదరాబాదీ
నవాబ్ అరస్తు యార్ జంగ్


అభాగ్యుల పాలిటి అపర ధన్వంతరి ఆయన. రోగులకు వైద్యం చేయడమే కాదు, నిరుపేద రోగులకు తన నివాస ప్రాంగణంలోనే ఉచిత వసతి సౌకర్యాలను సమకూర్చే ఉదారుడు. పంతొమ్మిదో శతాబ్ది చివరికాలంలో హైదరాబాద్‌లో ప్లేగు మహమ్మారి విజృంభించినప్పుడు పరిస్థితిని చక్కదిద్దడంలో నిరుపమానమైన కృషి చేసిన వైద్యుడు నవాబ్ అరస్తు యార్ జంగ్. ఆయన అసలు పేరు అబ్దుల్ హుస్సేన్.

హైదరాబాద్‌లో 1858 జూన్ 10న జన్మించారు. నిజాం రాజ్యంలో తొలి శస్త్రవైద్యుడు ఆయనే. ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ అసఫ్ జా వద్ద ప్రధాన వైద్యునిగా, వైద్య సలహాదారుగా పనిచేశారు. మెడికల్ స్కూల్‌లో వైద్య విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాక, హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో ప్రాక్టీసు ప్రారంభించారు. కొంతకాలానికి ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో వైద్యుడిగా నియమితుడవడమే కాకుండా, ఆ ఆస్పత్రికి తొలి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టారు.

డాక్టర్ అబ్దుల్ హుస్సేన్ సేవలకు మెచ్చిన ఆరవ నిజాం ఆయనకు ‘అరస్తు యార్ జంగ్’ బిరుదు ఇచ్చారు. నిజాం ప్రభువుకు నమ్మకమైన రాచవైద్యునిగా పనిచేసినా, ఆయన ఏనాడూ సామాన్యులకు దూరం కాలేదు. ఎలాంటి సమయంలోనైనా ఆయన పేదసాదలకు అందుబాటులో ఉండేవారు. నిరుపేద రోగులకు ఉచితంగా చికిత్స చేసేవారు. అవసరమైతే, ఏ వేళలో పిలిచినా రోగుల వద్దకు స్వయంగా వెళ్లేవారు. తన నివాస ప్రాంగణంలో నిర్మించిన ప్రత్యేక గృహాల్లో రోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా వసతి సౌకర్యాలు, ఉచిత భోజనం కల్పించేవారు.
 
ఉన్నత విద్యావ్యాప్తికి అవిరళ కృషి
బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతంతో పోలిస్తే, ఉన్నత విద్యారంగంలో వెనుకబడి ఉన్న హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నత విద్యావ్యాప్తి కోసం నవాబ్ అరస్తు యార్ జంగ్ అవిరళంగా కృషి చేశారు. ముల్లా మహమ్మద్ భాయ్ తదితర మత పెద్దలతో కలసి యువకులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించే ట్రస్టులకు ఆర్థికంగా చేయూతనందించారు. తన కొడకులందరినీ ఉన్నత చదువులు చదివించారు.

వారిలో కొందరిని ఉన్నత చదువుల కోసం బ్రిటన్, అమెరికా తదితర విదేశాలకు సైతం పంపారు. అరస్తు యార్‌జంగ్ వారసుల్లో పలువురు బ్రిటన్, అమెరికా, కెనడా, కువైట్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాల్లో స్థిరపడ్డారు. ఆయన వంశానికి చెందిన ఆరు తరాల వారసుల సంఖ్య ప్రస్తుతం దాదాపు వెయ్యికి పైగానే ఉంటుంది.
 
దాతృత్వంలోనూ ఉదాత్తుడు
అరస్తు యార్ జంగ్ విరివిగా దాన ధర్మాలు చేసేవారు. ముఖ్యంగా విద్యా కార్యక్రమాలకు, ధార్మిక సంస్థలకు విరాళాలు ఇచ్చేవారు. ‘కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియనివ్వరాద’నే ఖురాన్ వాక్కుకు అనుగుణంగా ఆయన లెక్కలేనన్ని గుప్తదానాలు చేసినట్లు ప్రతీతి.   హుస్సేనీ ఆలం మసీదు నిర్మాణానికి షేక్ మొహసిని, సయ్యద్ తాహెర్ సైఫుద్దీన్‌లతో కలసి కృషి చేశారు. ఇప్పటికీ ఈ మసీదు వాడుకలో ఉంది. ప్రస్తుతం బుర్హానీ మసీదుగా పిలుస్తున్న ఈ మసీదు, అంజుమన్-ఏ-తహెరీ జమాత్‌లో భాగంగా ఉంది. దీనిని 2003లో వారసత్వ కట్టడంగా ప్రకటించారు. అరస్తు యార్ జంగ్ 1940 మార్చి 25న మరణించగా, ఈ మసీదు సమీపంలోనే ఆయనను సమాధి చేశారు.
- పన్యాల జగన్నాథదాసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement