
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన తర్వాత 6 నెలల పాటు అద్దె చెల్లించనవసరం లేని నివాస వసతిని కేంద్రం సమకూర్చనుంది. సుప్రీంకోర్టు జడ్జీలకు పదవీ విరమణ చేసిన నాటి నుంచి ఏడాదిపాటు 24 గంటల వ్యక్తిగత భద్రతా సౌకర్యం ఏర్పాటు చేయనుంది. వీరికి డ్రైవర్ సౌకర్యం, సెక్రటేరియల్ అసిస్టెంట్‌ను పొడిగించనుంది. న్యాయశాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ సవరించిన నిబంధనలతో ఈ మేరకు మంగళవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి, లేదా న్యాయమూర్తులు విమానాశ్రయాల్లోని లాంజ్‌లలో ప్రోటోకాల్ ప్రకారం గౌరవమర్యాదలు అందుతాయి.
వీరి వాహన డ్రైవర్‌కు ఇతర ఉద్యోగులకు మాదిరిగా పూర్తి వేతనం, ఇతర అలవెన్సులను సుప్రీంకోర్టు/హైకోర్టు నిధుల నుంచి చెల్లిస్తారు. వీరికి కేటాయించే సెక్రటేరియల్ అసిస్టెంట్ స్థాయి సుప్రీంకోర్టు బ్రాంచ్ ఆఫీసర్‌తో సమానంగా ఉంటుంది. రిటైర్డు ప్రధాన న్యాయమూర్తి/ న్యాయమూర్తులకు వ్యక్తిగత భద్రతతోపాటు వీరి నివాసాలకు ఏడాదిపాటు పూర్తి స్థాయిలో భద్రత సమకూరుస్తారు. రిటైర్డు సీజేఐకి ఢిల్లీలో ఉచిత టైప్–7 భవన వసతిని పదవీ విరమణ చేసిన నాటి నుంచి ఆరు నెలలపాటు కల్పిస్తారు. ఇటీవల జరిగిన ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సదస్సు సందర్భంగా సంబంధించిన పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయని అధికార వర్గాలు తెలిపాయి.