సోనూ భాయ్‌కే పన్నులు కట్టేద్దాం! | Social Media Applauds Actor Sonu Sood Services To Needy | Sakshi
Sakshi News home page

సినీ, రాజకీయ ప్రముఖులే జలసీ ఫీలయ్యేంత..

Published Mon, Jul 27 2020 9:41 AM | Last Updated on Mon, Jul 27 2020 1:18 PM

Social Media Applauds Actor Sonu Sood Services To Needy - Sakshi

యావత్‌ భారతం సోనూ సూద్‌ అని నినదిస్తోంది. ఇచ్చిన హామీలు ఇంత త్వరగా నిజ రూపం దాల్చడం అద్భుతం

ముంబై: ఆపదల్లో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా సాగుతున్న నటుడు సోనూ సూద్‌ను దేశమంతా రియల్‌ హీరో అంటూ కీర్తిస్తోంది. ఆయన మేలు పొందినవారు, అభిమానులు సోనూను దేవదూతగా అభివర్ణిస్తున్నారు. మార్చిలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను బస్సుల్లో ఇళ్లకు చేర్చే సేవలకు ఆయన శ్రీకారం చుట్టారు. అక్కడితో ఆగకుండా తర్వాత రైళ్లలో కార్మికుల స్వస్థలాల తరలింపునకు నడుం బిగించారు. తాజాగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సొంత ఖర్చులతో స్వదేశానికి రప్పిస్తూ ఆదర్శవంతంగా నిలుస్తున్నారు.

సినీ, రాజకీయ ప్రముఖులు కూడా జలసీగా ఫీలయ్యేంత పేరు గడించారు. ఎప్పటికప్పుడు తన సేవలను సోషల్‌ మీడియాలో వెల్లడి చేస్తూ ఆర్థులకు చేయూత నిచ్చేందుకు  మరింత మంది ముందుకు వచ్చేలా చేస్తున్నారు. ఇక ఈ రియల్‌ హీరో గొప్ప మనసుపై సోషల్‌ మీడియాలో ప్రశంసలు వర్షం కురుస్తోంది. ‘యావత్‌ భారతం సోనూ సూద్‌ అని నినదిస్తోంది. ఇచ్చిన హామీలు ఇంత త్వరగా నిజ రూపం దాల్చడం అద్భుతం’ అని ఒకరు..‌ ‘ఇంత మందికి, ఇన్ని రకాల సేవలు చేస్తూ ఆదుకుంటున్న సోనూ భాయ్‌కే మనమంతా పన్నులు చెల్లిస్తే బాటుంటుంది కదా!’ అని మరొకరు‌ తమ అభిమానాన్ని చాటుకున్నారు. (చదవండి: ఇష్టపడిన వ్యక్తితో కోర్టులో వివాహం.. వన్‌ సెకన్‌!)

దూరమెంతో లేదుగా..
తాజాగా కిర్గిస్థాన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను స్వదేశానికి రప్పిస్తానని సోనూ మాటిచ్చారు. సోమవారం (జులై 27) బిష్కేక్‌ నుంచి ఢిల్లీకి మీరంతా చేరుకుంటారని ట్విటర్లో వెల్లడించారు. ఇప్పటికే కిర్గిస్థాన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను వారణాసి, విశాఖపట్నానికి సొంత విమాన ఖర్చులతో ఆయన రప్పించారు. తాజాగా ఫిలిప్పీన్స్‌లో చిక్కుకున్న వారిని కూడా భారత్‌కు రప్పిస్తానని సోనూ తెలిపారు. ‘మీరంతా త్వరలో భారత్‌లో ఉంటారు. దిగులు పడొద్దు’అని ట్వీట్‌ చేశారు. ఫిలిప్పీన్స్‌ మనకు దగ్గరేగా అని భరోసా నిచ్చారు.

గంటల్లోనే నిజమయ్యే మాటలు
ఇక చిత్తూరు జిల్లాకు చెందిన నాగేశ్వరరావు అనే రైతు, అతని భార్యాబిడ్డలు పడుతున్న కష్టం చూసి చలించిన సోనూ వారికి ట్రాక్టర్‌ అందించి ఆదుకున్నారు. హామీ ఇచ్చిన గంటల వ్యవధిలోనే సోనూ సూద్‌ సాయం చేయడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. దీంతోపాటు లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్‌వేర్‌ శారద కథనంపై స్పందించిన సోనూ సూద్‌ ఆమె ఫోన్‌ నెంబర్‌ కనుక్కుని, ఆమె కుటుంబానికి వ్యక్తిగతంగా సాయం చేస్తానని ప్రకటించారు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన శాంతా బాలు పవార్‌ (85)కు అండగా ఉంటానని సోనూ ప్రకటించారు. మహిళలకు ఆత్మరక్షణా టెక్నిక్‌లు నేర్పించేందుకు బామ్మతో ఓ ట్రైనింగ్‌ స్కూల్‌ను పెట్టిస్తానని తెలిపారు. పొట్టకూటి కోసం కర్రసాము చేసిన బామ్మ వీడియో ఇటీవల వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement