సాక్షి, తెనాలి(గుంటూరు) : తెనాలిలోని ఓ బ్యాంకు శాఖ...కంప్యూటర్‌లోకి చూస్తున్న ఉద్యోగి, కౌంటరు దగ్గరకు వచ్చిన ఓ వ్యక్తి, తన వెనుక తదేకంగా చూస్తుండటాన్ని కళ్లజోడులోంచి గమనించాడు. వెనక్కి చూస్తే, గోడకు తగిలించిన 2018 క్యాలెండర్ కనిపించింది. అందులో కనిపిస్తున్న ఫొటోను చూస్తున్న ఆ వ్యక్తి, ‘సార్ ఆ క్యాలెండరు ఇవ్వగలరా’ అంటూ అభ్యర్థించాడు. ‘దానికేం...పాతదే కదా!’ అంటూ తీసిచ్చాడు. అపురూపంగా పట్టుకుని తీసుకెళుతున్న అతడిని ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు. మరో రెండురోజులకు ఇంటికొచ్చిన అతడి సోదరుడి కోసమని మరొకటి సంపాదిద్దామని, క్యాలెండరులోని ఫోను నెంబర్లను సంప్రదించారు. ‘పోయినేడాది క్యాలెండరు ఎందుకండీ...ఎవరు మీరు?’ అన్న ప్రశ్నకు, ‘మా నాన్న శారద ఫొటో కోసమండీ’ అన్న సమాధానం...! వినగానే సంబ్రమాశ్చర్యం...! శారద మరణతో ఆయన కుటుంబం జాడ ఎవరికీ తెలీదు. గత 64 ఏళ్లుగా సాహితీ ప్రపంచానికి ప్రశ్న మినహా ఇప్పటికీ సమాధానం లేదు. కేవలం క్యాలెండరులోని శారద బొమ్మతో ఇప్పటికి వెలుగులోకి వచ్చారు. ఆ వివరాలతో ప్రత్యేక కథనం.
శారద (ఎస్.నటరాజన్) గురించి...
‘వాస్తవానికి వీసమెత్తు మారకుండా, మారినట్టు కనిపించే కుంభకోణమే ఈ శతాబ్దంలోని విశిష్టత. ఆపడానికి ఇష్టంలేని యుద్ధానికి సంవత్సరాల తరబడి సమాలోచనలు..దూరపుకొండలైన ‘శాంతి’కి సంతకాల సంరంభం..స్వంతాన కథ లేనివాడికి పాతపత్రికలు శరణ్యం...సరుకు లేని పత్రిక్కి మెరిసే ముఖచిత్రం...’ ఇలాంటి మాటలతో సాహిత్య విస్ఫోటనం చేసిన శారద అసలు పేరు ఎస్.నటరాజన్. పూర్తిపేరు సుబ్రమ్మణ్యయ్యరు నట రాజన్. తెలుగు సాహిత్యంలో కొత్త వెలుగులు కురిపించిన తమిళ నటరాజన్ కవి, కథకుడు, నవలా రచయిత, నాటక రచయిత, వ్యాస రచయిత, లిఖిత పత్రికా సంపాదకుడు. 1937లో బతుకుదెరువు కోసం తండ్రితో కలిసి తెనాలి చేరిన నటరాజన్, హోటల్ కార్మికుడిగా చాలీచాలని సంపాదనతో తండ్రిని సాకుతూ జీవితం ఆరంభించారు. పదిహేనేళ్ల వయసులో తండ్రి పోవటంతో క్షోభతో మూర్ఛరోగానికి గురయ్యాడు. హోటల్ వృత్తిలో వుంటూనే తెలుగు నేర్చాడు. నాటి తెలంగాణ పోరాటం, ఆర్థికమాంద్యం, సామాజిక సంక్షోభాలు, కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలతో ఆయన సాహిత్య సృజన వేయిరేకులై వికసించింది. భౌతికజీవితం 30 ఏళ్లయితే సాహిత్యజీవితం ఏడేళ్లు మాత్రమే. ఆ వ్యవధిలోనే శారద కలంపేరుతో నూరుకు పైగా కథలు, ఆరేడు నవలలూ రాశారు. ఆయన రచనలు ‘మంచీచెడూ’, ‘అపస్వరాలు’, ‘ఏది సత్యం’ సంచలనం రేకెత్తించాయి. దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తూ శారద కన్నుమూశారు.
తెనాలిలోనే స్థిరనివాసం..
తెనాలిలోని పాండురంగపేటలో 1955 ఆగస్టు 17న శారద కన్నుమూశారు. భార్య అన్నపూర్ణ. నిండు గర్భిణి. అప్పటికే ఇద్దరు కొడుకులున్నారు. భర్త పోయిన నెలరోజులకు జన్మించిన ఆడశిశువుకు తన భర్త పేరిట ‘శారద’గా నామకరణం చేశారు. ఊహ తెలీని చిన్న కొడుకు రాధాకృష్ణమూర్తిని ఇక్కడే తెలిసినావిడకు దత్తతనిచ్చారు. శారద రచనలు, అసంపూర్తి రచనలు, ఉత్తరాలతో సహా ఆయన స్నేహితుడైన ఆలూరి భుజంగరావుకు అప్పగించారు. భర్త ఉన్నపుడే దుర్భర దారిద్య్రంలో మగ్గిన ఆ కుటుంబం, ఆయన పోయాక ఎలా వుంటుందో చెప్పేదేముంది? పెద్దకొడుకు సుబ్రహ్మణ్యం, కుమార్తె శారదతో పట్టణం వదిలి వెళ్లిపోయారు. కట్‌చేస్తే...ప్రస్తుతం అన్నపూర్ణ భౌతికంగా లేరు. పెద్దకొడుకు నందిరాజు సుబ్రహ్మణ్యం తిరుపతిలో వుంటున్నారు. రెండో కుమారుడు నూతలపాటి రాధాకృష్ణమూర్తి తెనాలిలో నివసిస్తున్నారు. జంపని చక్కెర ఫ్యాక్టరీలో ఉద్యోగిగా చేస్తూ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. చివరి బిడ్డ కడమేరి శారద కూడా చిన్న అన్నయ్యకు దగ్గరగా తెనాలిలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. సోదరుడు రాధాకృష్ణమూర్తి రెండో కుమార్తె శ్రీలక్ష్మికి తన కొడుకు రఘుబాబుతో వివాహం చేసి అన్నాచెల్లెలు వియ్యంకులయ్యారు. శారద బిడ్డల సంతానం, అంటే మనుమ సంతానం ప్రైవేటు/ ప్రభుత్వ ఉద్యోగాల్లో సెటిలయ్యారు. కష్టాలకు దూరంగా ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. జీవనం కోసం నందిరాజు ఉమామహేశ్వరరావును అన్నపూర్ణ రెండో వివాహం చేసుకున్నారు. పోలీసు ఉద్యోగం, హోటల్ వ్యాపారంతో సహా జీవనోపాధి కోసం ఆయన రకరకాల పనులు చేశారు. కొంతకాలం ప్రకాశం జిల్లా కామేపల్లి, గుంటూరు జిల్లా రేపల్లె, తర్వాత తెలంగాణలో వుండిపోయారు. ‘రెండో పెళ్లితో ‘మొదటి భర్త శారదతో కథ సమాప్తం’...అన్నట్టుగా మా తల్లిగారు గతంలోని విషయాలేవీ ప్రస్తావించేవారు కాదు...తమ్ముడిని తెనాలిలో దత్తత ఇచ్చినట్టు ఊహ ఉన్నందున వయసుకొచ్చాక, వెతుక్కుంటూ తెనాలి వచ్చి కలుసుకున్నా’నని సుబ్రహ్మణ్యం చెప్పారు.
అప్పుడప్పుడు కలుస్తుంటాం..
‘భర్త పోవటంతో మా తల్లిగారు ఆర్థికంగా నానా బాధలు పడ్డారు. బంధువులు పట్టించుకోలేదు. పెద్దమ్మ భర్త గంగానమ్మగుడి దగ్గర కొబ్బరికాయల కొట్ల బజారులో హోటల్ పెట్టించారు. అప్పుడప్పుడు సరుకులు ఇస్తుండేవారు. వేరే పెళ్లిచేసుకున్నాక అవికూడా మానేశారు..విధిలేని స్థితిలోనే తల్లిగారు ఊరొదిలి వెళ్లారు’ అని సుబ్రహ్మణ్యం చెప్పారు. ఆయన్ను చేసుకోవటంతో శారద తరపు అందరితోనూ సంబంధాలు బంద్ అయ్యాయి. రాకపోకలు, పలకరింపులు లేకుండా ఒంటరిగాళ్లమయ్యామని చెప్పారు. పెద్దయ్యాక ఎవరి బతుకులు వారివి అయ్యాయి. తల్లి కాలం చేయటంతో ఎవరితో ఏ సంబంధాలు లేకుండా ఈ ముగ్గురు తరచూ కలుసుకుంటూ బంధుత్వం కూడా కలుపుకొని ఆత్మీయంగా ఉంటున్నారు. ‘మగపిల్లలు చదువుల్లేకుండా తిరుగుతుంటే చెడిపోతారు...ఎవరికైనా ఇస్తే బాగుపడతాడని దత్తతనిచ్చా’నని అమ్మ చెప్పిందనీ, పెద్దవాడిని పెద్దగా చదివించే శక్తి లేకుండా పోయిందని నాకు చెప్పి ఏడ్చేది’ అని తల్లి గురించి కుమార్తె శారద గుర్తుచేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment