తెలుగు స్త్రీలకు వెలుగునిచ్చిన విద్యాలయం | Sharada Niketan School In Guntur For Women Education | Sakshi
Sakshi News home page

తెలుగు స్త్రీలకు వెలుగునిచ్చిన విద్యాలయం

Published Mon, Nov 28 2022 1:41 AM | Last Updated on Mon, Nov 28 2022 1:41 AM

Sharada Niketan School In Guntur For Women Education - Sakshi

20వ శతాబ్దం ప్రారంభం నాటికి అవిద్య, బాల్య వివాహాలు, నిర్బంధ వైధవ్యం వంటి అనేక సమస్యలతో భారత స్త్రీలు కొట్టుమిట్టాడుతుండేవారు. ఇంటి నాలుగు గోడల మధ్య బందీలై, బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియని స్థితి వారిది. దీనికి తోడు ఆనాటికి ప్రబలి ఉన్న మూఢ విశ్వాసాలు వారికి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టేవి. ఈ స్థితిలో స్త్రీలను ఉద్ధరించడానికి కందుకూరి వీరేశలింగం వంటివారు నడుం బిగించారు. ఆ కోవకు చెందినవారే ఉన్నవ లక్ష్మీనారాయణ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ దంపతులు కూడా. వారు స్త్రీవిద్య కోసం గుంటూరులో ‘శారదా నికేతనం’ స్థాపించారు. దానికి నూరు వసంతాలు నిండాయి.


ఉన్నవ లక్ష్మీనారాయణ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ 

ఉన్నవ దంపతులు గుంటూరు కేంద్రంగా జాతీయోద్యమం, స్త్రీ జనోద్ధరణ, సంస్కరణోద్యమాలకు తమ జీవితాలను అంకితం చేసి చరితార్థులయ్యారు. స్త్రీలకై ఒక విద్యాలయం నడపాలని భావించిన వారి ఆశయ ఫలితంగా... గుంటూరు గాంధీపేటలో సనాతన ధర్మమండలి హాలులో 1922 నవంబరు 22న, దేశో ద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ప్రారంభకులుగా ‘శారదా నికేతనము’ స్థాపితమైంది. స్త్రీలలో జాతీయ భావాన్ని రేకెత్తించే పద్ధతులను అనుసరించి విద్య నేర్పటానికి ఏర్పాటైన ‘శారదా నికేతనము’లో సంస్కృతము, తెలుగు, హిందీ, సంగీ తము, చిత్ర లేఖనము, నూలు వడకుట, నేత, కుట్టు పని మొద లగు వృత్తి విద్యలు ప్రవేశపెట్టారు. విద్యార్థినులకు వసతి గృహం కూడా ఏర్పాటు అయింది.

1922లో గుంటూరు అరండల్‌పేటలో ప్రారంభించిన శారదా నికేతనము... తరువాతి సంవత్సరంలో మునగాల జమీందారు నాయని వెంకట రంగారావు, బ్రాడీపేట 2వ లైనులో కొండా వెంక టప్పయ్య నివాసానికి (దేశభక్త భవనము) చేరువలో విరాళంగా ఇచ్చిన రెండు ఎకరాల స్థలం స్థలంలోకి మార్చబడింది. ఇప్పటికీ అదే స్థలంలో ఈ నికేతనం కొనసాగుతోంది. శారదా నికేతనంలో ఆంధ్రదేశం నలుమూలల నుండేకాక, దక్షిణాఫ్రికా, రంగూన్, ఖరగ్పూర్, హైదరాబాదు వంటి పలు నగరాల నుండి తెలుగు విద్యార్థినులు ఇక్కడికి వచ్చి గురుకుల వాసం చేస్తూ విద్యాభ్యాసం చేసేవారు. 

ఈ విద్యాలయం రెండు స్థాయుల్లో కోర్సులను నిర్వహించేది. మొత్తం ఎనిమిదేళ్ల కాల వ్యవధి. మొదటి 5 ఏళ్లూ సాహితీ ప్రకరణమనీ, మిగిలిన 3 ఏళ్లూ విదుషీ ప్రకరణమనీ విభజిం చారు. బాగా చదవటం, రాయటం వచ్చి ప్రైమరీ తరగతి వరకు చదివిన బాలికలను 5 ఏళ్ల సాహితీ ప్రకరణ కోర్సులో చేర్చుకునేవారు. 5 సంవత్సరాలు పూర్తి అయేసరికి బాలికలకు సంస్కృతాంధ్రాలలో కొంత కావ్యజ్ఞానం అలవడి, సంగీత – చిత్రలేఖనాలలో ఒకదానిలో మంచి జ్ఞానం సంపాదించేవారు. అలాగే చేతిపనులలో ఒకటి నేర్చుకుని, భూగోళము, వైద్యము, చరిత్రలో మంచి పరిచయం పొందేవారు. ఈ పరీక్షలలో ఉత్తీర్ణులయిన వారు ‘సాహితీ’ బిరుదమును పొందేవారు. తరువాతి 3 ఏళ్లు సంస్కృతాంధ్ర భాషలలో ఒకటీ, ఆంగ్ల, హిందీ భాషలలో ఒకటీ అభిమాన భాషలుగా చదివి పరీక్షలో ఉత్తీర్ణులయినవారు ‘విదుషీ’ పట్టభద్రులు అయ్యేవారు. గవర్న మెంటు వారి పరీక్షలతో గానీ, పర్యవేక్షణతోగానీ సంబంధం లేకుండా విద్యాలయం వారే తరగతులన్నిటికీ వార్షిక పరీక్షలు జరిపి, పట్టాలను ఇచ్చేవారు.

బాలికలకు విద్యా బోధనతో పాటూ... అనాథలకు, బాల వితంతువులకు, వితంతువులకు, భర్త వదిలి పెట్టినవారికి ఉచి తంగా భోజన వసతి, వస్త్ర సదు పాయాలు కల్పించి; అభాగ్య స్త్రీల పాలిట ఆశ్రిత కల్పవక్షంగా శారదా నికేతనం పేరు ప్రఖ్యాతులు పొందింది. 1927 ఏప్రిల్‌ 17వ తేదీన గాంధీమహాత్ముడు ఈ సంస్థని దర్శించి, ఇటువంటి సంస్థ ఆంధ్రదేశంలోనే కాదు, యావద్భారత దేశంలోనే లేదని ప్రశంసించారు. పూరిపాకలలోను, చెట్ల నీడలోను ప్రారంభంలో తరగతులు నిర్వహించినా... కాలక్రమంలో స్త్రీ విద్యాభిమానులయిన వదా న్యుల సహకారంతో సొంత భవనాలను, భూమి తదితర స్థిరాస్తులను సంపాదించుకోగలిగింది. ఆంధ్రదేశంలోని మున్సి పాలిటీలు, తాలూకా బోర్డులు, జిల్లా బోర్డులు తగిన విధంగా ఈ విద్యాలయానికి ఆర్థిక సహకారం అందించేవి. 1937లో ఆంధ్ర విశ్వ విద్యాలయం వారిచే ఈ సంస్థలోని సంస్కృతాంధ్రశాఖ– ‘ప్రాచ్య భాషాకళాశాల’గా గుర్తింపునొందింది.

తరువాత కాలంలో ఇందలి పారిశ్రామిక శాఖను ప్రత్యేక పాఠశాలగా గవర్నమెంటు గుర్తించింది. ఒక స్వతంత్ర సంస్థగా రిజిష్టరైన ‘శ్రీశారదా నికేతన్‌’ ప్రయివేటు యాజమాన్యంలో ప్రధా నంగా ఉన్నవ దంపతులచే నిర్వహింపబడింది. 1955లో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ దేవాదాయ, ధర్మాదాయశాఖ అధీనంలోకి తీసు కునేవరకూ ఈ సంస్థకు ముఖ్యదాత అయిన మునగాల జమిం దారు రాజా నాయని వెంకట రంగారావు బహద్దరు అధ్యక్షులుగా కొనసాగారు. ప్రస్తుతం ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ నియ మించిన కార్య నిర్వహణాధికారి ఆధ్వర్యంలో శారదా నికేతనం విద్యాసంస్థల నిర్వహణ సాగుతోంది.

దరిశి అన్నపూర్ణమ్మ (గదర్‌ విప్లవ వీరుడు దరిశి చెంచయ్య భార్య), సంగెం లక్ష్మీబాయమ్మ (నిజామాబాద్‌ బాన్సువాడ నియోజకవర్గం నుండి గెలుపొంది, విద్యాశాఖ ఉప మంత్రిగా బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో పనిచేసిన ప్రథమ తెలంగాణ మహిళ), బొందలపాటి శకుంతలాదేవి (త్రిపురనేని గోపీచంద్‌ భార్య), భారతీదేవి (ఆచార్య ఎన్‌.జి.రంగా భార్య) వంటి పేరెన్నికగన్న స్త్రీ మూర్తులు శ్రీశారదా నికేతనం పూర్వ విద్యార్థినులే. ఇంతటి చరిత్ర గలిగిన శారదానికేతనం 2022 నవంబరు 22 తేదీన వందేళ్లు పూర్తి చేసుకుంది. 

ప్రస్తుతం శారదానికేతనంలో– ప్రాథమిక పాఠశాల (బాల బాలికలకు), ఉన్నత పాఠశాల (బాలికలకు), ఓరియంటల్‌ డిగ్రీ కళాశాల(బాలికలకు) నిర్వహిస్తున్నారు. ఈ మూడింటా సుమారు 500 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. తెలుగు ఆడపడుచులకు విద్యా, విజ్ఞానాలను అందించి వారి కాళ్లపై వారు నిలబడ గలమనే ధైర్యాన్ని నింపిన శారదా నికేతన్‌... ఒక చారిత్రక పాత్ర పోషించిందనడంలో అతిశయోక్తి లేదు. దాని స్ఫూర్తిని అందు కోవలసిన బాధ్యత మన తరానిదే!

ఎమ్‌.వి.శాస్త్రి వ్యాసకర్త సింగరేణి కాలరీస్‌ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ (రిటైర్డ్‌)
మొబైల్‌: 94413 42999 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement