సీఎం సభకు భారీ బందోబస్తు
♦ సిబ్బందికి వర్సిటీలో వసతిసౌకర్యం
♦ ఏర్పాట్లపై హోంమంత్రి సమీక్ష
ఏఎన్‌యూ : యూనివర్సిటీ ఎదురుగా ఈనెల 8వ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి సభకు పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఏఆర్, స్పెషల్ విభాగాలకు చెందిన పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. సభావేదిక, హెలీప్యాడ్, ముఖ్యమంత్రి, వీవీఐపీలు విశ్రాంతి తీసుకునే ప్రాంతాలు, వీఐపీ గ్యాలరీ, సభాప్రాంగణం, వాహనాల పార్కింగ్, జాతీయ రహదారిపై రాకపోకల నియంత్రణ తదితర అంశాలను పోలీసు సిబ్బంది నిర్వహించనున్నారు.
వీటికి సంబంధించిన విధులను సంబంధిత అధికారులు శాఖల వారీగా పోలీసు సిబ్బందికి కేటాయిస్తున్నారు. సీఎం భద్రతా విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బంది, అధికారులకు ఏఎన్‌యూ అతిథి గృహం, ఇంజినీరింగ్ బాలుర, బాలికల వసతి గృహాలు, ఇంజినీరింగ్ కళాశాల భవనాల్లో వసతి కల్పించారు. వీఐపీలకు పార్కింగ్ కోసం యూనివర్సిటీలోని ఇంజినీరింగ్, ఫార్మసీ క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేశారు.
సభ ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం సమీక్ష
యూనివర్సిటీ ఎదురుగా ఈనెల 8న జరుగనున్న ముఖ్యమంత్రి సభకు సంబంధించిన ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం, జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప శనివారం రాత్రి యూనివర్సిటీ గెస్ట్‌హౌస్‌లో సమీక్ష నిర్వహించారు. సాధ్యమైనంత ఎక్కువమంది సభకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాస్‌ల పేరుతో సభకు హాజరయ్యే వారిని ఇబ్బందులకు గురి చేయవద్దని, వీలైనంత ఎక్కువ పాస్‌లు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి సభ విజయవంతం చేయాలని జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు ఆదేశించారు. సభా ప్రాంగణంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఒక గేటు, ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీలకు ఒక గేటు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలకు ఒకగేటును, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులకు ఒక గేటును ఏర్పాటు చేయాలని సూచించారు.
3500 వాహనాలు
సభ ఏర్పాట్లను జిల్లా శాఖల ఉన్నతాధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. సభకు జనాన్ని సమీకరించేందకు సుమారు 800 బస్‌లు, 1150 టాటాఏస్‌లు, 800 కాలేజ్ బస్‌లు, 300 ప్రైవేట్ బస్‌లు కలిపి 4 వేల వాహనాలు వాడుతున్నామని డిప్యూటీ సీఎంకు వివరించారు. సభాప్రాంగణం, పరిసరాల్లో భద్రతా చర్యలను అర్బన్, రూరల్ ఎస్పీలు త్రిపాఠి, నారాయణ నాయక్ వివరించారు.
సమావేశంలో జిల్లా మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, కలెక్టర్ కాంతిలాల్ దండే, జేసీ చెరుకూరి శ్రీధర్, గుంటూరు కమిషనర్ కన్నబాబు, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, మోదుగుల వేణుగోపాల రెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, కొమ్మాలపాటి శ్రీధర్, యరపతినేని శ్రీనివాసరావు, నక్కాఆనందబాబు, అనగాని సత్యప్రసాద్, తెనాలి శ్రావణ్‌కుమార్, ఎమ్మెల్సీ రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, మంగళగిరి చైర్మన్ గంజి చిరంజీవి, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.