సాక్షి, అమరావతి: దేశంలో బీజేపీ ప్రతిష్ట బాగా దెబ్బతింటోందని, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఆ పార్టీకి మెజార్టీ కూడా బాగా తగ్గిపోతుందని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఆ పార్టీ గెలిచే అవకాశాలున్నా 2014లో వచ్చినంత మెజార్టీ రాకపోవచ్చన్నారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ రాజీలేని పోరాటం చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని, రాష్ట్ర అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని చెబితేనే దానికి అంగీకరించామని చెప్పారు. ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరుతున్నామని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చెప్పారు. ప్రత్యేక హోదాతోపాటు మిగిలిన 18 అంశాలను సాధించడమే లక్ష్యంగా టీడీపీ పోరాటం చేస్తోందన్నారు.
బీజేపీ నాయకులు రోడ్లపై తిరగలేరు : బుద్ధా వెంకన్న
రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న మాపై చులకనగా మాట్లాడితే సహించేది లేదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే బీజేపీ నాయకులు వారి నియోజకవర్గాల్లో కూడా తిరగలేరని, రాష్ట్ర బీజేపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. చీఫ్ విప్ పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ కూడా మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment