విజయవాడ, సాక్షి: అధికారంలో ఉన్నా పదవి ఉంటేనే ఏదైనా చెల్లుతుందని, ఆ పదవి లేకనే తాను ఏం చేయలేకపోతున్నానంటూ టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకల్లో ఆయన ప్రసంగం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
‘‘పదవి లేక పోవడంతో నన్ను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేక పోతున్నా. సీఐల ట్రాన్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గింది. ఎమ్మెల్యే ఎవరిని అడిగితే వారిని సీఐలుగా నియమించారు. నా మాట చెల్లలేదు. చాలా ఆవేదనగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఇతరుల మీద ఆధారపడ్డాను. నన్ను నమ్ముకున్న వారికి నేనేం చేస్తాను. నన్ను కార్యకర్తలు క్షమించాలి..
.. 2024 ఎన్నికల సందర్భంలో రక్తంతో చంద్రబాబు నాయుడు చిత్రపటం కాళ్ళు కడిగా. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా బాధపడలేదు. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వచ్చినోళ్లను నేను అడ్డుకున్నా. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు అప్పుడెవరు వచ్చారో చెప్పాలి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు.. అందులోని వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని, విజయ్ సాయి రెడ్డి లాంటి వాళ్లను తిట్టా. టీడీపీ కోసం ఎంతో చేశా.
.. నా మీద మొత్తం 37 కేసులు ఉన్నాయి. కేవలం టీడీపీ కోసమే ఆ 37 కేసులు పెట్టించుకున్నా. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు న్యాయం జరగలేదని భావిస్తున్నా. ఈ మాట ఆవేదనతోనే చెబుతున్నా తప్ప వ్యతిరేకతతో కాదు. గత ఎన్నికల్లో ఎంతోమంది పోరాటం చేసి, ఎదురు తిరిగి టీడీపీలో టికెట్లు పొందారు. నాకు టికెట్ ఇవ్వకపోయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశా..
.. ఎమ్మెల్యే పదవి ఉంటేనే ఏమైనా మాట చెల్లుతుందని 2024 ఎన్నికల్లో తెలుసుకున్నా. నా కార్యకర్తలకు టీటీడీ లెటర్లు కూడా ఇప్పించలేని దుస్థితిలో నేను ఉన్నా. 2029 ఎన్నికల్లో పోరాటం చేసి అయినా టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్టు సాధిస్తా.. ఎమ్మెల్యేగా గెలుస్తా. చచ్చేంతవరకు టీడీపీలోనే ఉంటా. నా ఆవేదనను ఎంపీ కేశినేని చిన్ని టిడిపి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి అని బుద్దా వెంకన్న అన్నారు.
బుద్దా ప్రసంగం ముగిసిన వెంటనే ఎంపీ కేశినేని చిన్ని మైక్ అందుకున్నారు. ‘‘పొత్తుల్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. ఆ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నారనే విషయం నాకు తెలుసు. దీన్ని అధిష్టానం దృష్టికి సాధ్యమైనంత త్వరగా తీసుకువెళతా. కార్యకర్తలు నాయకులు ఏమాత్రం అధైర్యపడొవద్దు. త్వరలోనే బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలకు కూడా మంచి పదవులు వస్తాయి అని బుద్దాను సముదాయించే మాటలు చెప్పారు.
ఇదిలా ఉంటే.. సీఐల బదిలీలే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చిచ్చు రాజేసినట్లు స్పష్టమవుతోంది. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరికి, టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందనే ప్రచారం ఉంది. అయితే.. ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకల సాక్షిగా అది నిజమని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment