సాక్షి, విశాఖపట్నం : తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్)లో తాజాగా ఖాళీ అయిన ఔట్‌సోర్సింగ్ పోస్టులపై తెలుగు తమ్ముళ్ల కన్నుపడింది. జూనియర్ లైన్‌మన్(జేఎల్‌ఎం) పోస్టుల్ని అమ్ముకోవడానికి అవకాశం కుదరకపోవడంతో ఇప్పుడు ఆ స్థానంలో ఖాళీ అయిన షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టుల్ని వేలానికి పెట్టారు. నేరుగా ముఖ్యమంత్రి పేషీ నుంచే నియోజకవర్గాల వారీ ఈ ఖాళీల జాబితా కోసం ఈపీడీసీఎల్‌కు సోమవారం ఆదేశాలొచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు జాబితాను సిద్ధం చేసి అధికారులు తాజాగా ప్రభుత్వానికి
నివేదించినట్టు సమాచారం.
ఒక్కో పోస్టుకు రూ.4 లక్షల నుంచి 5 లక్షలు : 2006 తర్వాత జేఎల్‌ఎం నియామకాలు ఈ ఏడాది చేపట్టారు. ఈపీడీసీఎల్ పరిధిలో 937 పోస్టుల్ని భర్తీ చేశారు. నియామకాల్లో అక్రమాలకు తావులేకుండా ఎప్పటికప్పుడు మార్కులు, రోస్టరుతో సహా వెబ్‌సైట్లో వివరాలు పొందుపరచడం, ఇంటర్వ్యూల్లేకపోవడంతో చాలా వరకు పారదర్శకంగానే నియామకాలు జరిగాయి. సబ్‌స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్లుగా ఔట్‌సోర్సింగ్‌పై పనిచేస్తున్న(ఇన్‌సర్వీస్) వారికి 20 శాతం వెయిటేజీ ఇవ్వడంతో ఏకంగా 394 పోస్టులకు వారే ఎంపికయ్యారు.
జేఎల్‌ఎం పోస్టులు ఇప్పిస్తామని కొంద రు నిరుద్యోగుల నుంచి పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకున్నట్టు తెలిసింది. నియామకం పారదర్శకంగా జరగడంతో మాట నిలబెట్టుకోకపోయారు. దీంతో ఔట్ సోర్సింగ్ పోస్టులు ఇప్పించేందుకు సీఎం పేషీ నుంచే పైరవీలు మొదలెట్టారు. విద్యుత్‌శాఖ కార్యదర్శి ద్వారా ఈపీడీసీఎల్ నుంచి వివరాలు సేకరించారు.
తమ నియోజకవర్గ పరిధిలోని ఖాళీల్లో తమ వారికి, తమకు భారీగా ముట్టజెప్పుకున్నవారికి అవకాశం కల్పిస్తున్నారు. నెలకు రూ.9 వేల నుంచి రూ.9,500 జీతం వచ్చే ఈ పోస్టుకు ఒక్కొక్కరి నుంచి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం.
చేతులెత్తేసిన అధికారులు : సీఎం పేషీ ఆదేశాలతో ఈపీడీసీఎల్ అధికారులు చేతులెత్తేశారు. ఫిజికల్ టెస్ట్ సమయంలో ఎంపిక కాని వారిని ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకుంటామని, అందుకు అంగీకరించేవారు అప్పటికప్పుడే తమ అనుమతి తెలపాల్సిందిగా ఈపీడీసీఎల్ అధికారులు సూచించారు. దీనికి వందల సంఖ్యలో అభ్యర్థులు ఆసక్తి చూపారు.
2006 నియామకాల్లో కూడా అప్పటి ఈపీడీసీఎల్ సీఎండీ ప్రవీణ్‌ప్రకాష్ ఇదే తరహాలో మెరిట్ కమ్ రోస్టరు ప్రకారం ఔట్‌సోర్సింగ్ పోస్టుల్ని భర్తీ చేశారు. ఈసారి కూడా అలానే జరుగుతుందని జేఎల్‌ఎం పోస్టులకు ఎంపిక కాని నిరుద్యోగ అభ్యర్థులు ఆశించారు. కానీ వారి ఆశల్ని అడియాశలు చేస్తూ అధికారపక్ష ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. దీంతో తాము చేయగలిగేదేమీ లేదని ఏకంగా ఈపీడీసీఎల్ అధికారులే తమకు మొరపెట్టుకునేందుకు వచ్చే అభ్యర్థులకు సెలవిస్తున్నారు. అవకాశముంటే ఎమ్మెల్యేల ద్వారా పైరవీలు చేసుకోండంటూ ఉచిత సలహాలిస్తున్నారు.
ఆప‘రేట్’ @5లక్షలు
Published Wed, Aug 27 2014 3:51 AM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM
Advertisement
Advertisement