
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టులకు భారీ డిమాండ్ నెలకొంది. 26 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఏకంగా 3,278 దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనం. జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ పోస్టులకు కూడా అభ్యర్థుల నుంచి మంచి స్పందన లభించింది. 2010 తర్వాత ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో మెడికల్ పోస్టులను భర్తీ చేయకపోవడంతో అభ్యర్థులు భారీగా దరఖాస్తు చేశారు.
► తాజాగా విడుదల చేసిన ప్రొవిజనల్ మెరిట్ జాబితా ప్రకారం మొత్తం 718 పోస్టులకు 4,430 దరఖాస్తులు వచ్చాయి.
► గైనకాలజీ విభాగంలో 333 పోస్టులుండగా 189 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మార్కెట్‌లో గైనకాలజిస్టులకు డిమాండ్ ఉండటంతో ఎక్కువ మంది ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లకే మొగ్గు చూపారు.
► దరఖాస్తులపై ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 16 వరకు రాతపూర్వకంగా ఇవ్వొచ్చు.
► ఆ తర్వాత ఒరిజినల్ మెరిట్ జాబితా ప్రకటించి రెండ్రోజుల్లోనే నియామక ఉత్తర్వులిస్తారు.
► ఎంపికైన వైద్యులు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో పనిచేయాల్సి ఉంటుంది.