వైద్యుల పోస్టులను భర్తీ చేస్తాం
వైద్యుల పోస్టులను భర్తీ చేస్తాం
Published Fri, May 12 2017 10:54 PM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM
–రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్
ఆదోని: ఆలూరు తాలూకా ఆసుపత్రి, ఆదోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు వెంటనే భర్తీ చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన.. పట్టణంలోని స్త్రీలు, పిల్లల ఆసుపత్రిలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆదనపు వార్డులకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రెండు ఆసుపత్రులను పరిశీలించారు. వైద్య సేవలు, వైద్యుల ఖాళీలపై ప్రాంతీయ ఆసుపత్రి చీఫ్ డాక్టర్ లింగన్న, స్త్రీలు, పిల్లల ఆసుపత్రి చీఫ్ డాక్టర్ మాధవీలత, ఆలూరు తాలూకా ఆసుపత్రి అధికారులతో మాట్లాడారు. అనంతరం టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జ్ మీనాక్షినాయుడు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆలూరు ఆసుపత్రిలో అనస్తీషియా, చిన్నపిల్లల వైద్యులు ఉన్నప్పటికీ గైనకాలిస్ట్ లేక పోవడంతో కాన్పులు జరుగడం లేదని, ఆదోనిలో ప్రాంతీయ ఆసుపత్రిలో చిన్న పిల్లల వైద్యుడు ఉన్నప్పటికీ, అనస్థిషియా, గైనాకాలిస్ట్ లేక పోవడం వల్ల వైద్య సేవలు కుంటుపడుతున్నట్లు వైద్యులు తన దృష్టికి తెచ్చారని అన్నారు. వెంటనే ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ కమిషనరుకు ఫోన్‌లో ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
ప్రాంతీయ ఆసుపత్రిలో నర్సుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, ప్రభుత్వ పరంగా నర్సింగ్ కళాశాల మంజూరు చేసే అవకాశం లేనందున ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా ముందుకు వస్తే అనుమతి ఇస్తామని చెప్పారు. కాంట్రాక్ట్ పద్ధతిన వైద్యుల నియామకం జరుగడం వల్ల చాలా మంది ఆసక్తి చూపక పోవడం వల్ల ఖాళీలు ఏర్పడ్డాయని, అయితే ఇకపై వైద్యుల నియామకం శాశ్వత ప్రాతిపదికన చేపడుతామని తెలిపారు. జిల్లాలో 240 పీహెచ్‌సీలలో 40 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ఆయన వెంట కమీషనరు గోవిందప్ప, తహసీల్దారు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, ఆలూరు ఇన్‌చార్జ్ వీరభద్ర గౌడు, ఎంపీపీ పద్మావతి, బీజీపీ పట్టణ అధ్యక్షుడు కునిగిరి నాగరాజు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ భాస్కరరెడ్డి, కుమార్‌గౌడు పాల్గొన్నారు.
Advertisement