ముడుపులిచ్చికో.. పోస్టింగ్ పుచ్చుకో
వైద్యుల నియామకాల్లో భారీగా అవకతవకలు
ఇష్టారాజ్యంగా కాంట్రాక్టు సర్వీసు వెయిటేజీ మార్కులు
డబ్బులిచ్చిన విదేశీ డిగ్రీ
అభ్యర్థులకు దండిగా మార్కులు
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లుగా నియామకాలు లేవు. మరోపక్క వయసైపోతోంది. రాక రాక వచ్చిన నోటిఫికేషన్‌లోనైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదిద్దామనుకున్న నిరుద్యోగ వైద్య పట్టభద్రుల కలను ముడుపులందుకున్న అధికారులు చెరిపేస్తున్నారు. ప్రతిభను పక్కనబెట్టి పోస్టులను అమ్ముకుంటున్నారు. ఒక్కో పోస్టును రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు రేటు కుదుర్చుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అమ్మకాలతో మొత్తం ఎంపిక జాబితాను తారు మారు చేసి అనర్హులకు పోస్టులు కట్టబెట్టినట్లు వెల్లడైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కోసం చేపట్టిన 1125 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామకంలో చాలా అవకతవకలు బయటపడ్డాయి. చివరకు అభ్యర్థులు ధర్నాలు, ఆందోళనలు చేసి ఒత్తిడి తేగా.. అధికారులు వారి అభ్యంతరాలను స్వీకరించారు. ఒకటి కాదు రెండు కాదు 300 మంది దరఖాస్తులను స్వీకరించి వారిని తిరిగి జాబితాలో చేర్చారంటే ఏమేరకు అవినీతి జరిగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
సర్వీసును పరిగణనలోకి తీసుకోకుండా..
శ్రీలక్ష్మి అనే వైద్యురాలికి తొలి జాబితాలో పేరే లేదు. ఆ తర్వాత గొడవ చేస్తే ఆమెకు 77వ ర్యాంకు కేటాయించారు. ఇదెలా సాధ్యం అంటే సమాధానం లేదు. ఇలాంటివి కోకొల్లలు. అభ్యర్థుల వెయిటేజీ మార్కుల ను తారుమారు చేశారు. కాంట్రాక్టు సర్వీసు వైద్యులకి చ్చే 15 శాతం వెయిటేజీ మార్కులను ఇష్టారాజ్యంగా వేసినట్టు వెల్లడైంది. అంతేకాదు అభ్యర్థి ఎంబీబీఎస్ పాసైనప్పటి నుంచి ఆ సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నా, ఆ పని చేయలేదు. ఇక అభ్యర్థుల జోన్‌లకు జోన్‌లే మార్చేశారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పనిచేసేవారి సర్వీసునూ పరిగణనలోకి తీసుకోకుండా మార్కులు వేశారు. రష్యా, చైనా, ఉక్రెయిన్, ఉజ్బెకిస్థాన్ తదితర విదేశాల్లో డిగ్రీలు చేసిన వారు మార్కుల కోసం భారీగా ముడుపులు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. చివరకు వికలాంగ అభ్యర్థుల శాతాన్ని కూడా లెక్కించకుండా అభ్యర్థులను ఎంపిక చేయడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ర్యాంకులు తారుమారే..
సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకంలో 300 పైగా దరఖాస్తుదారులను జాబితాలో చేర్చడమంటే పాత ర్యాంకులు తారు మారు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విచారణ చేపట్టడం, ట్రిబ్యునల్ జోక్యం చేసుకోవడం చూస్తుంటే అసలు ఈ జాబితానే నిలిపేసి కొత్త జాబితా రూపొందిస్తారా? అనే అనుమానం కలుగుతోంది. ఇదిలా ఉండగా వైద్య విధాన పరిషత్‌లోనూ స్పెషలిస్టుల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆ నియామకాల్ని సక్రమంగా చేపట్టాలని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ సూచించినట్టు తెలిసింది.