సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మాక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్)లో వైద్యుల పోస్టులు భారీగా ఖాళీ ఏర్పడ్డాయి. నెలకు సగటున ఇద్దరు వైద్యులు పదవీ విరమణ చేస్తుండగా అంతర్గత కుమ్ములాటలకు తోడు కార్పొరేట్ ఆస్పత్రులతో పోలిస్తే ఇక్కడ వేతనాలు చాలా తక్కువగా ఉండటంతో మరికొంత మంది ఆస్పత్రిని వీడుతున్నారు. ఎప్పటికప్పుడు ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు ఆస్పత్రి యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేస్తున్నప్పటికీ..ఇక్కడ పని చేసేందుకు పెద్దగా ముందుకు రావడం లేదు. వచ్చిన వారు కూడా రెండు మూడేళ్ల తర్వాత ఆస్పత్రిని వీడుతున్నారు. ఉన్నతాధికారులు కూడా వీరిని ఆపే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ప్రస్తుతం 311 పోస్టులకు గాను 133 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్, అడిíషనల్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భారీగా ఖాళీగా ఉండటంతో సూపర్ స్పెషాలిటీ వైద్యవిద్యపైనే కాదు..రోగుల చికిత్సలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. సీనియర్ వైద్యులు లేకపోవడంతో ఆ భార మంతా రెసిడెంట్లపై పడుతుంది. చికిత్సల్లో వారికి సరైన అనుభవం లేకపోవడంతో వారు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. పదవీ విరమణ చేసిన కొంత మంది సీనియర్ వైద్యులు ఆ తర్వాత కూడా ఇక్కడ పని చేసేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ వారిని తీసుకునేందుకు యాజమాన్యం విముఖత ప్రదర్శిస్తోందని తెలుస్తోంది.
ఇమడలేక వీడుతూ..
జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ జీఎస్‌ఎన్‌రాజు, ప్రముఖ అనెస్తీయన్ డాక్టర్ గోపినాథ్ సహా మరో వైద్యురాలు ఇటీవల పదవీ విరమణ చేశారు. కొంత మంది వైద్యుల మధ్య నెలకొన్ని అంతర్గత విభేధాల వల్ల న్యూరోసర్జరీ విభాగంలో సీనియర్ సర్జన్ డాక్టర్ మానసపాణిగ్రహి, సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ ప్రవీణ్ కూడా ఆస్పత్రిని వీడారు. పరిపాలనా పరమైన వేధింపులే ఇందుకు కారణమని డాక్టర్ ప్రవీణ్ అప్పట్లో తన రాజీనామా లేఖలో పేర్కొనడం గమనార్హం. ఆర్థోపెడిక్ విభాగం పూర్వ అధిపతి డాక్టర్ వీబీఎన్ ప్రసాద్ రాజీనామా తర్వాత మోకాలి చికిత్సలు 10 నుంచి 15 శాతానికి పడిపోయాయి. రుమటాలజీ విభాగం, హెమటాలజీ విభాగం, ఎండోక్రైనాలజీ విభాగాల్లో చికిత్సలు గగనమయ్యాయి. యూరాలజీ, నెఫ్రాలజీ విభాల్లోనే ఇదే పరిస్థితి. ఇదిలా ఉంటే అనస్తీషియా విభాగంలోని ఓ సీనియర్ ప్రొఫెసర్ ఇటీవల వీఆర్‌ఎస్ తీసుకుని వెళ్లిపోయారు. అనస్తీషియన్ల కొరత వల్ల పలు ఆపరేషన్ థియేటర్లు కూడా మూతపడ్డాయంటే పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో తెలుసుకోవచ్చు. కాలేయ మార్పిడి, గుండె మార్పిడి చికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి. వైద్యు లను ప్రోత్సహించి చికిత్సల సంఖ్యను పెంచాల్సిన ఉన్నతాధికారులే వీటికి అడ్డుపడుతున్నట్లు విమర్శలు లేకపోలేదు.
రెసిడెంట్లపైనే భారం..
పోస్టు గ్రాడ్యుయేషన్ మెడికల్ ట్రైనింగ్ సెంటర్లలో నిమ్స్ దేశంలోనే ప్రతిష్టాత్మాకమైంది. 1986లో పడకల సామర్థ్యం 500 ఉండగా, ప్రస్తుతం 1500 చేరింది . ఉద్యోగుల పదవీ విరమణలతో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఇక్కడ వివిధ విభాగాల్లో 423 మంది రెసిడెంట్ డాక్టర్లు చదువుతున్నారు. చదువుకునే సమయంలో ఏ విద్యార్థి అయినా ఒత్తిడికి గురవుతుండటం సహజమే. అయితే రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులను నియమించక పోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాదు ఆస్పత్రికి రోజురోజుకూ రోగుల తాకిడి పెరగడం, వారి నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడం వల్ల రెసిడెంట్లపై పని భారం పడుతోంది. రోజుకు 12 నుంచి 14 గంటల పాటు పని చేయాల్సి వస్తుంది. రెసిడెంట్లకు కనీస విశ్రాంతి, పండుగలు, ఇతర శుభకార్యాల సమయంలో కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం లేకపోవడం, పని ప్రదేశంలో అహ్లదకరమైన వాతావరణం లేకపోవడం కూడా మానసిక ఒత్తిడికి గురువుతున్నారు. గత రెండేళ్ల క్రితం నిమ్స్‌లో వెలుగు చూసిన ఓ రెసిడెంట్ డాక్టర్ ఆత్మహత్య ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్ రాజారెడ్డి కమిటీ కూడా ఇదే అంశాన్ని గుర్తించి, 18 సూచనలు కూడా చేసింది. కానీ వాటిలో ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా అమలు చేసిన దాఖలాలు లేవని రె సిడెంట్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment