సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా త్వరలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది భర్తీకి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. బోర్డు ఏర్పాటైన ఏడాది తర్వాత తొలిసారి ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రికి సంబంధించి 32 స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేయనున్నారు. అందుకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తారని బోర్డు వర్గాలు తెలిపాయి. ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రిలో ఆంకాలజీ, గైనకాలజీ సహా ఇతర స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా వైద్య, ఆరోగ్యశాఖలోని నియామకాల విషయంలో కోర్టు కేసులుండటంతో విపరీతమైన జాప్యమవు తోంది. అత్యవసర సేవలు అందించాల్సిన వైద్య ఆరోగ్యశాఖలో జాప్యం వల్ల రోగులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తమిళనాడు తరహాలో మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డును గతేడాది ఏర్పాటు చేసిన సంగ తి తెలిసిందే. దాని ద్వారానే వైద్య ఆరోగ్యశాఖ లోని పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది.
బోర్డు స్పెషలాఫీసర్‌గా రాజారెడ్డి..
మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు స్పెషలాఫీసర్‌గా ఎన్.రాజారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజారెడ్డి వైద్య, ఆరోగ్యశాఖలో అడిషనల్ సెక్రటరీగా పనిచేసి కొన్నాళ్ల క్రితమే రిటైరయ్యారు. అయితే బోర్డు స్పెషలాఫీసర్‌గా ఆయన ఏడాది పాటు కొనసాగుతారని ఉత్తర్వుల్లో సర్కారు పేర్కొంది. కాగా తెలంగాణ మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డును ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చిన సంగతి తెలిసిందే. బోర్డు చైర్మన్‌గా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సభ్య కార్యదర్శిగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, సభ్యుడిగా జాయింట్ డైరెక్టర్ హోదా వారిని బోర్డు కోసం నియమిస్తున్నట్లు ఆ జీవోలో పేర్కొన్నారు.
బోర్డు ఏర్పాటు కోసం మొత్తం 24 పోస్టులను మంజూరు చేసింది. బోర్డు కార్యకలాపాల కోసం కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యాలయం ప్రాంగణంలో అవసరమైన భవనాలను కూడా సిద్ధం చేశారు. 2017లో టీఎస్‌పీఎస్సీ ద్వారా 500 డాక్టర్ పోస్టులు, 3,300 స్టాఫ్ నర్సు పోస్టులు, మరో 1,000 పారా మెడికల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. అయినా ఆ భర్తీ ప్రక్రియ పూర్తికాకపోవడం గమనార్హం. వీటితో పాటు ఆ తర్వాత ఖాళీ అయిన వైద్య సిబ్బంది పోస్టులను కూడా బోర్డు మున్ముందు భర్తీ చేయాల్సి ఉంది. ఏడాదికేడాది ఖాళీలు పెరిగిపోతున్నాయి. సరిపడా డాక్టర్లు, ఇతర సిబ్బంది లేకపోవడంతో ఉన్న సిబ్బందిపైనే పని భారం పడుతోంది. దీంతో రోగులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
పీహెచ్‌సీల నుంచి...
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు మొద లు బోధనాస్పత్రుల వరకు అన్నిచోట్ల పోస్టుల మంజూరు నుంచి భర్తీ వరకు మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డే చూస్తుంది. ఖాళీలు ఏర్పడగానే ఆ సమాచారం బోర్డుకు చేరుతుంది. అనంతరం బోర్డు ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి ఆ పోస్టులను భర్తీ చేస్తుంది. ఎంఎన్‌జే కోసం భర్తీ చేయబోయే పోస్టులన్నీ కూడా రాష్ట్రస్థాయి పోస్టులేనని అధికారులు చెబుతున్నారు. ఇక మల్టీజోనల్ పోస్టులు ప్రస్తుతానికి భర్తీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఆ పోస్టు ల భర్తీకి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వు ల సవరణ పెండింగ్‌లో ఉండటం వల్ల అవి ఆలస్యమవుతాయని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment