Medical board
-
5,204 స్టాఫ్ నర్సు పోస్టులు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ వైద్యారోగ్య విభాగాల్లో 5,204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఆయా పోస్టులకు తగిన అర్హతలున్నవారు తమ వెబ్సైట్ (https://mhsrb. telangana.gov.in)లో దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి తెలిపారు. వచ్చే నెల 25వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి ఫిబ్రవరి 15న సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు, సంస్థల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ అనుభవమున్న వ్యక్తులు అనుభవ ధ్రువీకరణ పత్రాలు పొందాలని సూచించారు. ఈ పోస్టులకు పేస్కేల్ రూ.36,750 – రూ.1,06,990 మధ్య ఉంటుందని తెలిపారు. అనుభవ ధ్రువీకరణతో.. స్టాఫ్ నర్సు పోస్టులను బహుళ ఐచ్చిక ఎంపిక విధానంలో రాతపరీక్ష ఆధారంగా భర్తీ చేస్తారు. పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. ఇప్పటికే వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన/చేస్తున్న వారికి గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించినవారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ అనుభవమున్నవారు ధ్రువీకరణ పత్రాన్ని పొందిన తర్వాత ఆ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్‌లో ఏ సేవలు అందించి ఉంటే.. ఆ కేటగిరీ పోస్టులకు మాత్రమే పాయింట్లు వర్తింపజేస్తారు. ఉదాహరణకు స్టాఫ్ నర్స్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గతంలో కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ నర్స్‌గా చేసిన కాలానికి సంబంధించిన పాయింట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఏఎన్ఎంగా, ఇతర సేవలు అందించి ఉన్నా దానిని పరిగణనలోకి తీసుకోరు. రాత పరీక్ష సిలబస్ ఇదీ.. అనాటమీ ఫిజియాలజీలో 14 అంశాలపై, మైక్రోబయాలజీలో 6 అంశాలు, సైకాలజీ, సోషియాలజీ, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, ఫస్ట్ ఎయిడ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఎన్విరాన్మెంటల్ హైజీన్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, న్యూట్రిషన్, మెడికల్ సర్జికల్ నర్సింగ్, మెంటల్ హెల్త్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మిడ్ వైఫరీ గైనకాలాజికల్, గైనకాలజియల్ నర్సింగ్, కమ్యూని టీ హెల్త్ నర్సింగ్, నర్సింగ్ ఎడ్యుకేషన్, ఇంట్రడక్షన్ టు రీసెర్చ్, ప్రొఫెషనల్ ట్రెండ్స్ అండ్ అడ్జస్ట్మెంట్, నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్మెంట్ లకు సంబంధించి రాత పరీక్ష సిలబస్ ఉంటుంది. జోన్లవారీగా స్థానికులకు 95% రిజర్వేషన్ నర్సు పోస్టులను జోన్లవారీగా భర్తీ చేయనున్నారు. ఆయా జోన్లకు అభ్యర్థులకే 95% పోస్టులను కేటా యిస్తారు. మిగతావి ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేస్తా రు.జోన్–1లో ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్ జిల్లాలు.. జోన్–2లో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల.. జోన్–3లో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి.. జోన్–4లో కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్.. జోన్–5లో సూర్యాపేట, నల్లగొండ, భువన గిరి, జనగాం.. జోన్–6లో మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్.. జోన్–7లో పాలమూరు, నారాయణపేట, జోగుళాంబ–గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలు ఉన్నాయి. నోటిఫికేషన్‌లోని ముఖ్యాంశాలివీ.. ►అభ్యర్థులు నోటిఫికేషన్ తేదీ నాటికి బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు తేదీ నాటికి తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో నమోదు చేసుకోవాలి. ►ఎవరైనా అభ్యర్థి ఈ అర్హతలకు సమానమైన ఇతర అర్హతలను కలిగి ఉంటే.. ఆ విషయాన్ని బోర్డు ఏర్పాటు చేసిన ’నిపుణుల కమిటీ’కి రిఫర్ చేస్తారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. ►దరఖాస్తుదారులకు కనీసం 18 ఏళ్లు, గరిష్టంగా 44 ఏళ్ల వయో పరిమితి ఉంటుంది. వయసును 2022 జూలై ఆధారంగా లెక్కిస్తారు. వివిధ వర్గాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. ►అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులో వివరాలు నమోదు చేయడంతోపాటు అవసరమైన పత్రాల సాఫ్ట్ కాపీ (పీడీఎఫ్)లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ►ఆధార్ కార్డ్, పదో తరగతి సర్టిఫికెట్, జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికెట్, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, అనుభవ ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే), స్థానికత గుర్తింపు కోసం 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు చదివిన సర్టిఫికెట్లు లేదా నివాస ధ్రువీకరణ పత్రం, ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే సదరు కుల ధ్రువీకరణ పత్రం, బీసీల విషయంలో తాజా నాన్–క్రీమీలేయర్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోరేవారు తాజా ’ఆదాయం, ఆస్తి సర్టిఫికెట్’, స్పోర్ట్స్ సర్టిఫికెట్, సదరం నుంచి దివ్యాంగ సర్టిఫి కెట్, ఎన్సీసీ ధ్రువపత్రం వంటివి అవస రాన్ని బట్టి జత చేయాల్సి ఉంటుంది. ►దరఖాస్తు రుసుము రూ.120, పరీక్ష ఫీజు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ కేటగిరీలకు మినహాయింపు ఉంటుంది. ►ఆన్లైన్లో ఒకసారి సమర్పించిన దరఖాస్తుల్లో మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. రాతపరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తారు. ►ఓఎంఆర్ విధానంలో ఇంగ్లిష్‌లో నిర్వహించే రాతపరీక్షలో 80 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ►హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. -
వైద్య నియామకాలకు స్పెషల్ మెడికల్ బోర్డు
సాక్షి, అమరావతి: వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే పలు విప్లవాత్మక చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య, ఆరోగ్య శాఖలో నియామకాల కోసం ప్రత్యేకంగా ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఏపీ ఎంస్‌ఆర్‌బీ) ఏర్పాటు చేయనుంది. ఈమేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి మెంబర్ సెక్రటరీగా, జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి సభ్యుడిగా బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మానవ వనరుల కొరతకు తావుండరాదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి జగన్ 2019 నుంచి ఏకంగా 46 వేల పోస్టుల భర్తీ చేపట్టిన విషయం తెలిసిందే. వైద్య శాఖలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా అత్యవసర అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల గుర్తింపు, భర్తీ ప్రక్రియ నిరంతరాయంగా చేపట్టేందుకు ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 2012లో తమిళనాడు మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటైంది. ఈ బోర్డు ద్వారానే వైద్య శాఖలో నియామకాల ప్రక్రియ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందం తమిళనాడులో పర్యటించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీ ఎంఎస్ఆర్బీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ఈ బోర్డు ద్వారానే వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన నియామకాలను చేపట్టనున్నారు. కీలక పరిణామం ఏపీ ఎంఎస్ఆర్బీ ఏర్పాటు వైద్య శాఖ చరిత్రలో కీలక పరిణామం కానుంది. ప్రభుత్వ ఆస్పత్రులను వేధిస్తున్న సమస్యల్లో మానవ వనరుల కొరతే ప్రధానం. సరిపడా వైద్యులు, వైద్య సిబ్బంది లేకపోవడం వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెరిగిన జనాభా, రోగుల రద్దీకి అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బందిని సమకూర్చడం, మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులంటే నరకానికి చిరునామాగా 2019 ముందు వరకూ రాష్ట్రంలో పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దుస్థితిని అరికట్టేందుకు వైద్య శాఖలో ఏకంగా రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో సీఎం జగన్ నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చడంతో పాటు 17 కొత్త వైద్య కళాశాలలు, ఇతర సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నెలకొల్పుతున్నారు. నిరంతర ప్రక్రియగా నియామకాలు వైద్య ఆరోగ్య శాఖలో ఎక్కడ పోస్టు ఖాళీగా ఉన్నా వెంటనే నోటిఫై చేసి భర్తీకి చర్యలు తీసుకోవాలని, నియామకాల కోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈమేరకు బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. వైద్య శాఖలో నియామకాలను నిరంతర ప్రక్రియగా కొనసాగించి ఎప్పటికప్పుడు ఆస్పత్రుల్లో వైద్య సిబ్బందిపై ఆడిట్ నిర్వహిస్తాం. ప్రస్తుతం వైద్య శాఖకు అవసరమైన మందులు, పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఏపీఎంఎస్ఐడీసీ ఉంది. ఇదే తరహాలో మానవ వనరుల కల్పనకు ఏపీ ఎంఎస్ఆర్బీ పని చేస్తుంది. – ఎం.టి.కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి -
వైద్య పోస్టుల భర్తీ మెడికల్ బోర్డుకే!
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని వైద్య, వైద్య సహాయక పోస్టుల భర్తీ ప్రక్రియనంతా ఒక నియామక సంస్థకే అప్పగించాలంటూ ప్రభుత్వాన్ని కోరాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. ఈ మేరకు సర్కారుకు లేఖ రాయాలని నిర్ణయించింది. వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని 2,662 ఉద్యోగ ఖాళీల భర్తీకి నియామక ఏజెన్సీగా టీఎస్పీఎస్సీని ఎంపిక చేసిన ప్రభుత్వం... మరో 10,028 పోస్టుల భర్తీ బాధ్యతలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యసేవల నియామకాల బోర్డుకు అప్పగించింది. అయితే రెండు నియామక సంస్థలకు అప్పగించిన ఉద్యోగాల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, స్టాఫ్ నర్సు పోస్టులు ఒకే కేడర్‌కు చెందినవిగా ఉన్నాయి. ఈ పోస్టులను రెండు ఏజెన్సీల ద్వారా భర్తీ చేస్తే సమయం వృథా, నిర్వహణ భారం కావడంతోపాటు అభ్యర్థుల్లో గందరగోళం నెలకొనే అవకాశం ఉందని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. ప్రతిపాదనలు పంపండి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన నియామకాలపై వెద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో టీఎస్పీఎస్సీ ఇటీవల సమావేశమైంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, జోన్లు, జిల్లాలవారీగా ఖాళీల ప్రతిపాదనలు సమర్పించాలని సూచించింది. -
10,028 పోస్టులకు నోటిఫికేషన్లు
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలో 12,755 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే 10,028 పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగనుంది. వారం వారం విడతల వారీగా నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముందుగా ఒకట్రెండు రోజుల్లో ఎంబీబీఎస్ అర్హతతో 1,326 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన మెడికల్ బోర్డు, ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్య విద్య, ప్రజారోగ్య విభాగం, టీవీవీపీ, ఐపీఎం విభాగాల్లో 1,326 పోస్టులు భర్తీ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అనుసరించి ఎలాంటి న్యాయ వివాదాలు తలెత్తకుండా నోటిఫికేషన్ రూపొందించాలని హరీశ్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని, రెండుమూడు వారాల్లో విడతల వారీగా నోటిఫికేషన్ల జారీ ఉంటుందని వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ తెలిపారు. ఈ సమీక్షలో ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్, డీఎంఈ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస్‌రావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం డైరెక్టర్ శ్వేత మహంతి, ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణి, మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సెక్రెటరీ గోపీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. నర్సులకు మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో పరీక్ష.. ‘ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 20% వెయిటేజి మార్కులు ఇవ్వాలి. ఆయుష్ విభాగంలోని పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు.. టెక్నికల్ పోస్టులు, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులను టీఎస్ పీఎస్సీ.. నిమ్స్‌లోని ఖాళీలను నిమ్స్ బోర్డు.. మిగతా అన్ని పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు, ట్యూటర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్టాఫ్ నర్సులు, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు వంటి పోస్టులన్నీ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలి. స్టాఫ్ నర్సులకు మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో రాత పరీక్ష నిర్వహించి.. మార్కుల ఆధారంగా ఎంపిక చేయాలి. 80 మార్కులు రాత పరీక్షకు, 20 మార్కులు కోవిడ్ కాలంలో పని చేసిన వారికి వెయిటేజి ఇవ్వాలి. ఆయుష్ డాక్టర్లను టీచింగ్ స్టాఫ్‌గా మార్చే ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, ఆ ఖాళీలను భర్తీ చేయాలి. ఆయుష్ సర్వీసు రూల్స్‌లో సవరణలు చేయాలి’అని సూచించారు. వారిపై నివేదిక రూపొందించండి... ‘ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌ను రద్దు చేస్తూ సవరణలు చేయాలి. జాతీయ ఆరోగ్య మిషన్‌లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ద్వారా పని చేస్తున్న వారు ఎంత మంది ఉన్నారు.. ఏ పని చేస్తున్నారన్న అంశాలపై పూర్తి నివేదిక రూపొందించాలి. సీనియర్ రెసిడెంట్లు, హౌస్ సర్జన్లకు రూ.330 కోట్లు స్టైపెండ్‌గా ఇస్తున్నారు. వారి సేవలు వినియోగించుకునేలా విధివిధానాల రూపకల్పన చేయాలి. తొలి నోటిఫికేషన్లో ట్యూటర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులున్నాయి. ఈ పోస్టుల్లో ఔట్ సోర్సింగ్ ద్వారా సేవలందిస్తున్న వారికి 20 శాతం వెయిటేజీ మార్కులు, మిగతా 80 శాతం మార్కులు ఎంబీబీఎస్ మార్కుల ఆధారంగా ఎంపిక చేయాలి. తొలి విడత తర్వాత. వెంటనే స్టాఫ్ నర్సులకు, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలి’అని హరీశ్ వివరించారు. జిల్లా ఆసుపత్రుల్లో కాటరాక్ట్ ఆపరేషన్లు అన్ని జిల్లా ఆసుపత్రుల్లో కాటరాక్ట్ ఆపరేషన్లు చేయాలని మంత్రి హరీశ్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న కంటి వైద్యులతో ఆయన జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అవసరమైన వైద్య పరికరాలు వెంటనే సమకూర్చాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకులను ఆదేశించారు. తగిన పరికరాలు, సదుపాయాలున్న ఆసుపత్రుల్లో చికిత్సల సంఖ్య పెంచాలన్నారు. దీని కోసం ప్రజాప్రతినిధుల సహకారంతో ఆయా ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించాలని చెప్పారు. -
ఒంటిపై గాయాలేవీ లేవు
సాక్షి, అమరావతి: వర్గాలు, కులాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడటంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు తనను అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు తనను కస్టడీలో తీవ్రంగా కొట్టారంటూ నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తేలిపోయింది. ఆయన ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని హైకోర్టు ఏర్పాటు చేసిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ నేతృత్వంలోని మెడికల్ బోర్డు ఆదివారం హైకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదిక ఇచ్చింది. గాయాలున్నాయనేందుకు ఎలాంటి ఆధారాలు లేవంది. కాళ్లలో నీరు చేరిందని (ఎడెమా), అందుకే కాళ్లు రంగు మారి కనిపిస్తున్నాయని హైకోర్టుకు వివరించింది. ఎక్కువ సేపు కూర్చున్నా, ప్రయాణించినా కాళ్లు రంగుమారుతాయని చెప్పింది. 2020 నవంబర్ 30న తనకు బైపాస్ సర్జరీ అయిందని, గుండె నొప్పిగా ఉందని రఘురామ చెప్పడంతో వెంటనే కార్డియాలజిస్ట్‌ను పిలిపించామంది. కార్డియాలజిస్ట్ పరిశీలించి, ప్రస్తుతం గుండెకు ఎలాంటి ముప్పు లేదని, ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని చెప్పారని మెడికల్ బోర్డు తన నివేదికలో పేర్కొంది. న్యూరాలజీ, నెఫ్రాలజీ వైద్యులు సైతం రఘురామ ఆరోగ్యం స్థిరంగా ఉందనే చెప్పారని బోర్డు తన నివేదికలో వివరించింది. కొట్టడం వల్ల ఎలాంటి గాయాలు కాలేదని బోర్డు తన నివేదికలో తేల్చి చెప్పింది. ఆయనకు కలర్ డాప్లర్, ఈసీజీ, రక్త పరీక్షలన్నీ చేశామని, అన్నీ పరీక్షల ఫలితాలు సాధారణ స్థితిలో ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు మెడికల్ బోర్డు నివేదికను హైకోర్టు న్యాయమూర్తులు చదివి వినిపించారు. బోర్డు చైర్మన్ అయిన జీజీహెచ్ సూపరింటెండెంట్‌తో సహా మిగిలిన డాక్టర్లు కూడా వేర్వేరుగా ఒక రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తెలిపింది. ఈ నివేదికను హైకోర్టు రిజిస్ట్రీ నుంచి పొందే వెసులుబాటును ఇరుపక్షాలకు ఇచ్చింది. రమేశ్ ఆస్పత్రికి పంపలేం.. మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాల మేరకు రఘురామను గాయాల పరిశీలన నిమిత్తం రమేశ్ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దీనిపై సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. రమేశ్ ఆస్పత్రికి పంపడం అంటే టీడీపీ ఆఫీసుకి పంపడమేనన్నారు. అగ్ని ప్రమాదం వల్ల పలువురు కోవిడ్ రోగులు మృతి చెందడానికి కారణమైన రమేశ్ ఆస్పత్రిపై రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసిందని ఆయన వివరించారు. దీంతో రమేశ్ ఆసుపత్రి యాజమాన్యం ప్రభుత్వంపై కక్ష కట్టి ఉందని, అందువల్ల ఆ ఆస్పత్రికి పంపడానికి తమకు అభ్యంతరం ఉందని తెలిపారు. రమేశ్ ఆసుపత్రికి పంపితే నిష్పాక్షిక నివేదిక వచ్చే అవకాశం ఉండదన్నారు. అంతేకాక రఘురామ గాయాల పరిశీలనకు హైకోర్టు మెడికల్ బోర్డును ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయన్ను రమేశ్ ఆసుపత్రికి పంపాలన్న ఉత్తర్వులను సవరించాలని కోరుతూ మేజిస్ట్రేట్ ముందు ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశామని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ఆయన్ను రమేశ్ ఆస్పత్రికి పంపాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై దర్మాసనం స్పందిస్తూ ఆ ఉత్తర్వులను సవాలు చేయడం గానీ, వాటిపై స్టే గానీ లేనందున, అవి అమల్లో ఉన్నాయని తెలిపింది. అందువల్ల వాటిని అమలు చేయాల్సిందేనని సీఐడీ అధికారులకు తేల్చి చెప్పింది. మేజిస్ట్రేట్ ఉత్తర్వుల అమలును రేపటి వరకైనా నిలుపుదల చేయాలని పొన్నవోలు కోరగా, ధర్మాసనం ఆ అభ్యర్థనను సైతం తోసిపుచ్చింది. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రఘురామను రమేశ్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్‌కుమార్, జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం ఆదివారం రాత్రి ఉత్తర్వులిస్తూ తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లమంటే జైలుకు తీసుకెళ్లారు.. ► అంతకు ముందు రఘురామకృష్ణరాజు తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, తనను కొట్టారన్న రఘురామ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన మేజిస్ట్రేట్ అతన్ని గుంటూరు ప్రభుత్వాస్పత్రితో పాటు రమేశ్ ఆసుపత్రికి సైతం తీసుకెళ్లాలని పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారని తెలిపారు. ► అయితే ఈ ఆదేశాలను అమలు చేయకుండా అధికారులు రఘురామను జైలుకు తరలించారని చెప్పారు. హైకోర్టు మెడికల్ బోర్డు ఏర్పాటు చేసిన నేపథ్యంలో రమేశ్ ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం లేదని పోలీసులు చెబుతున్నారన్నారు. మేజిస్ట్రేట్ ఉత్తర్వుల కంటే హైకోర్టు ఉత్తర్వులే అమల్లో ఉంటాయని వక్రభాష్యం చెబుతున్నారని తెలిపారు. సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడంతో ఏపీ సీఐడీ ఆయన్ను అరెస్టు చేసిన విషయం విదితమే. బెయిలు కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ఆయనకు అక్కడ చుక్కెదురైంది. దీంతో హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంను ఆశ్రయించారు. బెయిల్ కారణాలను హైకోర్టు పరిశీలించలేదని, సెషన్స్ కోర్టును ఆశ్రయించాలని సూచించిందని పిటిషన్లో పేర్కొన్నారు. పోలీసులు తనను కొట్టారంటూ పిటిషన్లో ఆరోపించారు. ఆ ఉత్తర్వులను సవరిస్తామని మేజిస్ట్రేట్ చెప్పారు.. ► దీనిపై ఏం చెబుతారని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఆ విషయాన్ని రాత్రి 8.30 గంటల సమయంలో మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. మేజిస్ట్రేట్ హైకోర్టు ఉత్తర్వుల కాపీ కావాలని కోరడంతో, హైకోర్టు ఉత్తర్వుల అధికారిక కాపీని ఆదివారం ఉదయం పంపామన్నారు. ఆ ఉత్తర్వులను చూసి రఘురామను రమేశ్ ఆసుపత్రికి పంపాలన్న ఉత్తర్వులను సవరిస్తామని మేజిస్ట్రేట్ చెప్పారని తెలిపారు. సవరణ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందన్నారు. ► జస్టిస్ లలిత స్పందిస్తూ, ఉత్తర్వులను మేజిస్ట్రేట్ సవరిస్తారన్న ఊహతో రఘురామను ఎలా జైలుకు తరలిస్తారని ప్రశ్నించారు. ఆ ఉత్తర్వులపై సందిగ్ధత ఉంటే తమ దృష్టికి ఆ విషయాన్ని తీసుకొచ్చి స్పష్టత తీసుకుని ఉండాల్సిందన్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకల్లా నివేదిక ఇవ్వాలని మెడికల్ బోర్డును ఆదేశిస్తే, సాయంత్రం ఎప్పుడో నివేదిక వచ్చిందని, నివేదిక ఆలస్యం అవుతుందన్న కనీస సమాచారం కోర్టుకు ఇవ్వకపోవడం ఏమిటని జస్టిస్ లలిత ప్రశ్నించారు. జైలుకు తీసుకెళ్లడంపై నిషేధం లేదు ► పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ, మెడికల్ బోర్డును తాము సంప్రదించే పరిస్థితి లేదన్నారు. మెడికల్ బోర్డు నివేదిక ఎందుకు ఆలస్యం అయిందో తమకెలా తెలుస్తుందన్నారు. పలు వైద్య పరీక్షలు చేయాల్సి రావడంతో నివేదిక ఆలస్యం అయి ఉండొచ్చని చెప్పారు. ► రిమాండ్‌కు అనుమతినిస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసినప్పుడు నిందితుడైన రఘురామను జైలుకు తీసుకెళ్లడంపై ఎలాంటి నిషేధం లేదన్నారు. పైపెచ్చు మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తూ అధికరణ 226 కింద హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. ► ఆదినారాయణరావు జోక్యం చేసుకుంటూ, జీజీహెచ్ సూపరింటెండెంట్ వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ నాయకుని భార్య అని తెలిపారు. జైల్లో రఘురామను హత్య చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ విషయాన్ని రికార్డ్ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. ► ఈ ఆరోపణలపై అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ వాటిలో అర్థం లేదన్నారు. ఆయన్ను చంపాలనుకుంటే జైల్లోనే ఎందుకు చంపాలనుకుంటుందని ప్రశ్నించారు. ఆదినారాయణరా>వు తీవ్ర స్వరంతో మాట్లాడుతుండటంతో పొన్నవోలు అభ్యంతరం తెలిపారు. మెడికల్ బోర్డును రఘురామ కోరితేనే హైకోర్టు ఏర్పాటు చేసిందన్నారు. ► సుధాకర్‌రెడ్డి కూడా తీవ్ర స్వరంతో మాట్లాడుతూ దీటుగా బదులిచ్చారు. కొద్దిసేపు ఇద్దరు న్యాయవాదులు వాదించుకున్నారు. దీంతో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సంయమనం పాటించాలని కోరింది. ► మెడికల్ బోర్డు నివేదికపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదినారాయణరావుకు ధర్మాసనం స్పష్టం చేసింది. మెడికల్ బోర్డు నివేదికను తమకు అందజేసేలా చూడాలని ఆదినారాయణరావు కోరగా, రిజిస్ట్రీని ఆశ్రయించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. నేడు మేజిస్ట్రేట్ కోర్టు విచారణ.. ► రఘురామకృష్ణంరాజు తనను పోలీసులు కొట్టారని ఆరోపించిన నేపథ్యంలో ఆయనకు అయిన గాయాలను పరిశీలించేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రితో పాటు రమేశ్ ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న ఆదేశాలను సవరించాలంటూ మేజిస్ట్రేట్ కోర్టులో సీఐడీ సోమవారం ఉదయం పిటిషన్ దాఖలు చేయనుంది. ► పిటిషన్ సిద్ధం చేసినప్పటికీ ఆదివారం కావడంతో దాఖలు చేయలేకపోయింది. ఈ పిటిషన్‌పై మేజిస్ట్రేట్ సోమవారం విచారణ జరపనున్నారు. హైకోర్టు ఏకంగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేసిన నేపథ్యంలో రఘురామకృష్ణంరాజును రమేశ్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని, ఆ ఉత్తర్వులను సవరించాలని సీఐడీ తన పిటిషన్లో కోరనుందని తెలిసింది. -
Raghu Rama Krishna Raju: ఏం గాయాలో తేల్చండి
సాక్షి, గుంటూరు, అమరావతి: తనను సీఐడీ పోలీసులు కొట్టారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మెజిస్ట్రేట్ కోర్టులో చెప్పడంతో, ఆ గాయాల నిగ్గు తేల్చేందుకు హైకోర్టు శనివారం మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరుస్తూ, ఓ సామాజికవర్గం, ఓ మతాన్ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఉద్రిక్తతలు రెచ్చగొడుతుండటంతో ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ పోలీసులు శుక్రవారం సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురవ్వడంతో సీఐడీ పోలీసులు ఆయన్ను శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గుంటూరు సీఐడీ కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఆయన తనను పోలీసులు కొట్టారని చెప్పడంతో, ఆ విషయాన్ని వివరిస్తూ ఆయన తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణ హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను హెబియస్ కార్పస్ పిటిషన్‌గా పరిగణించాలని కోరారు. ఈ లేఖపై న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, పార్లమెంట్ సభ్యుడినే కొడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటన్నారు. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శనివారం రఘురామకృష్ణరాజు స్టేట్మెంట్ రికార్డ్ చేశారని తెలిపారు. హైకోర్టు ఆయన గాయాలను పరిశీలించాలని కోరారు. గాయాల పరిశీలనకు మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని, అందువల్ల తాము పరిశీలించాల్సిన అవసరం లేదని ధర్మాసనం చెప్పింది. గాయాల వెనుక వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ముగ్గురు వైద్యులతో కూడిన మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి, సూపరింటెండెంట్ సిఫారసు చేసే మరో డాక్టర్‌తో మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ పోలీసులు తక్షణమే రఘురామకృష్ణరాజును మెడికల్ బోర్డు ముందు హాజరు పరచాలంది. గాయాల పరిశీలన ప్రక్రియను మొత్తం వీడియోగ్రఫీ చేయాలని మెడికల్ బోర్డును ఆదేశించింది. అవన్నీ అసత్య ఆరోపణలు సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని ధర్మాసనం ఈ విషయమై వివరణ కోరింది. ఆదినారాయణరావు ఆరోపణలను సుధాకర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. సీఐడీ పోలీసులు కొట్టారనడం శుద్ద అబద్ధమని చెప్పారు. ఉదయం హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో ఒత్తిడి తీసుకొచ్చే ఎత్తుగడలో భాగంగా ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అసత్య ఆరోపణలతో కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. మధ్యాహ్నం ఎంపీ కుటుంబ సభ్యులు భోజనం తీసుకొచ్చారని, అప్పటి వరకు రఘురామ బాగానే ఉన్నారని, ఆ తర్వాతే సీఐడీ పోలీసులు కొట్టారన్న నాటకాన్ని తెరపైకి తెచ్చారని తెలిపారు. డాక్టర్ పరిశీలించాకే అతన్ని కోర్టు ముందు హాజరు పరిచామని, అప్పుడు ఎలాంటి గాయాలు లేవన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ఆ గాయాలు తాజావని తేలితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని వ్యాఖ్యానించింది. రఘురామ భద్రతా సిబ్బందిని ఆస్పత్రిలోకి అనుమతించాల్సిన అవసరం లేదని చెప్పింది. అనంతరం ధర్మాసనం రిమాండ్ రిపోర్ట్ గురించి ఆరా తీసింది. అరెస్ట్‌కు స్పీకర్ అనుమతి లేదన్న కారణంతో రిమాండ్ రిపోర్ట్‌ను కింది కోర్టు తిరస్కరించిందని ఆదినారాయణరావు చెప్పారు. స్పీకర్‌కు ఇప్పటికే అరెస్ట్ గురించి సమాచారం ఇచ్చామని సుధాకర్‌రెడ్డి తెలిపారు. తదుపరి విచారణను ఆదివారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. హైకోర్టులో చుక్కెదురు నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజు బెయిల్ కోసం హౌస్ మోషన్ రూపంలో దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. బెయిల్ కోసం మొదట కింది కోర్టులో పిటిషన్ వేసుకోకుండా నేరుగా హైకోర్టును ఆశ్రయించడంపై అభ్యంతరం తెలిపింది. బెయిల్ కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి కంచిరెడ్డి సురేశ్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రఘురామకృష్ణరాజును వెంటనే మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచాలని సీఐడీ పోలీసులను మౌఖికంగా ఆదేశించారు. తగిన వైద్య సాయం కూడా అందించాలని సూచించారు. దీనికి ఎంపీ తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు స్పందిస్తూ, ముందు కింది కోర్టుకెళ్లడం తప్పనిసరన్న నిబంధన ఏదీ లేదన్నారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ కింది కోర్టులో బెయిల్ పిటిషన్ వేయకుండా నేరుగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించిన దాఖలా ఒక్కటి కూడా లేదన్నారు. ఈ పిటిషన్‌ను అనుమతిస్తే, హైకోర్టులో పిటిషన్ల వరద మొదలవుతుందని తెలిపారు. సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదన్నారు. ఎంపీని న్యాయమూర్తి ఎదుట హాజరు పరచలేదని, రిమాండ్ లేకుండా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 437, 438 ప్రకారం దాఖలు చేసిన ఈ వ్యాజ్యానికి ఎంత మాత్రం విచారణార్హత లేదని వివరించారు. ఈ సందర్భంగా హైకోర్టు, సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను సుధాకర్‌రెడ్డి ఉదహరించారు. ఇద్దరి వాదనలు విన్న న్యాయమూర్తి, ఉత్తర్వులు జారీ చేస్తూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలతో కోర్టు సంతృప్తికరంగా లేదని స్పష్టం చేశారు. కింది కోర్టు బెయిల్ రద్దు చేసినప్పుడు దానిని సవాలు చేస్తూ బెయిల్ కోసం దాఖలు చేసే వ్యాజ్యాలనే వెకేషన్ కోర్టులో విచారిస్తారన్నారు. ఇక్కడ చెప్పుకున్న విషయాలన్నింటినీ సెషన్స్ కోర్టులో చెప్పుకోవాలని తేల్చి చెబుతూ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 14 రోజుల రిమాండ్ నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజుకు గుంటూరు సీఐడీ కోర్టు ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్ విధించింది. శనివారం సాయంత్రం సీఐడీ పోలీసులు ఆయన్ను గుంటూరులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో గల ఆరవ అదనపు, గుంటూరు సీబీసీఐడీ కోర్టు జడ్జి కె.అరుణ ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, వైద్య సాయం అవసరమని, పోలీసులు తనను కొట్టారని రఘురామకృష్ణరాజు న్యాయమూర్తికి తెలిపారు. ఈ నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్, రమేష్ ఆసుపత్రిల్లో వైద్యులు పరీక్షించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఎంపీకి ఉన్న ‘వై’ కేటగిరీ భద్రత నడుమే వైద్యుల పరీక్ష ప్రక్రియ కొనసాగాలని పేర్కొన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్, రమేష్ ఆసుపత్రి యాజమాన్యం వైద్య పరీక్షల రిపోర్టును కోర్టుకు సమర్పించాలని సూచించారు. అంతకు ముందు హైకోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను రద్దు చేయడంతో సీఐడీ కార్యాలయానికి వచ్చిన వైద్యుల బృందం ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించింది. అనంతరం రఘురామకృష్ణరాజును కోర్టుకు తరలించారు. రిమాండ్ రిపోర్టులో సాంకేతిక తప్పిదాలు ఉండటంతో వాటిని సరిచేయాలని కోర్టు సీఐడీ అధికారులకు సూచించింది. ఆ తప్పిదాలను సరిచేసి, తిరిగి సీఐడీ అధికారులు రిమాండ్ రిపోర్టు సమర్పించారు. హావభావాలతో రక్తికట్టించిన రఘురామ సీఐడీ పోలీసుల అదుపులో ఉన్నంత వరకు ఎంపీ రఘురామకృష్ణరాజు మామూలుగానే ఉన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎంపీ కోసం కుటుంబ సభ్యులు తీసుకువచ్చిన ఆహారాన్ని, మందులను పోలీసులు లోనికి అనుమతించారు. శుక్రవారం రాత్రి నుంచి రిమాండ్‌కు తరలించేవరకు వైద్యుడిని ఆయనకు అందుబాటులో ఉంచారు. అయితే హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు రద్దు చేసిందని తెలిశాక సీఐడీ కోర్టులో ఒక్కసారిగా కొత్త డ్రామాకు రఘురామకృష్ణరాజు తెరతీశారని విమర్శలు వినిపిస్తున్నాయి. తనను పోలీసులు కొట్టారని హావభావాలతో డ్రామాను రక్తి కట్టించి కోర్టును సైతం తప్పుదోవ పట్టించేందుకు పూనుకున్నాడని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసింగ్‌లోనూ మార్పులు వచ్చాయి. కరుడుగట్టిన నేరస్తులపై సైతం పోలీసులు చేయి చేసుకోవడం లేదు. అలాంటిది పార్లమెంట్ సభ్యుడు అయిన తనను పోలీసులు కొట్టారని రఘురామ చెప్పడం సర్వత్రా అనుమానాలకు తావిస్తోంది. తన కాళ్లపై లాఠీలతో కొట్టడం వల్ల కాళ్లు కందిపోయి, గాయాలయ్యాయని, నడవలేకపోతున్నానని ఎంపీ కోర్టులో తెలిపారు. సోరియాసిస్ వ్యాధితో బాధ పడుతున్నందున ఆయన అరికాళ్లలో ఎర్రగా బొబ్బలు వచ్చినట్లు తెలిసింది. జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు సీఐడీ కోర్టు ఆదేశాల మేరకు శనివారం రాత్రి వైద్య పరీక్షల నిమిత్తం ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు జీజీహెచ్‌కు పోలీసులు తరలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి, ఆర్ఎంవో డాక్టర్ సతీష్‌ల ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. సీఐడీ డీఐజీ సునీల్‌కుమార్ నాయక్, గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి జీజీహెచ్‌ను సందర్శించారు. బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో కొత్త కథ.. సీఐడీ పోలీసులు ఎంపీ రఘురామను కొట్టారనడం శుద్ద అబద్ధం. ఉదయం హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో ఒత్తిడి తీసుకొచ్చే ఎత్తుగడలో భాగంగా ఆయన ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులు భోజనం తీసుకొచ్చినప్పుడు కూడా రఘురామ బాగానే ఉన్నారు. ఆ తర్వాతే సీఐడీ పోలీసులు కొట్టారన్న నాటకాన్ని తెరపైకి తెచ్చారు. డాక్టర్ పరిశీలించాకే అతన్ని కోర్టు ముందు హాజరు పరిచాం. అప్పుడు ఎలాంటి గాయాలు లేవు. – అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి -
వైద్య పోస్టుల భర్తీకి మెడికల్ బోర్డు ఓకే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా త్వరలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది భర్తీకి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. బోర్డు ఏర్పాటైన ఏడాది తర్వాత తొలిసారి ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రికి సంబంధించి 32 స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేయనున్నారు. అందుకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తారని బోర్డు వర్గాలు తెలిపాయి. ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రిలో ఆంకాలజీ, గైనకాలజీ సహా ఇతర స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా వైద్య, ఆరోగ్యశాఖలోని నియామకాల విషయంలో కోర్టు కేసులుండటంతో విపరీతమైన జాప్యమవు తోంది. అత్యవసర సేవలు అందించాల్సిన వైద్య ఆరోగ్యశాఖలో జాప్యం వల్ల రోగులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తమిళనాడు తరహాలో మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డును గతేడాది ఏర్పాటు చేసిన సంగ తి తెలిసిందే. దాని ద్వారానే వైద్య ఆరోగ్యశాఖ లోని పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది. బోర్డు స్పెషలాఫీసర్‌గా రాజారెడ్డి.. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు స్పెషలాఫీసర్‌గా ఎన్.రాజారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజారెడ్డి వైద్య, ఆరోగ్యశాఖలో అడిషనల్ సెక్రటరీగా పనిచేసి కొన్నాళ్ల క్రితమే రిటైరయ్యారు. అయితే బోర్డు స్పెషలాఫీసర్‌గా ఆయన ఏడాది పాటు కొనసాగుతారని ఉత్తర్వుల్లో సర్కారు పేర్కొంది. కాగా తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డును ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చిన సంగతి తెలిసిందే. బోర్డు చైర్మన్‌గా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సభ్య కార్యదర్శిగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, సభ్యుడిగా జాయింట్ డైరెక్టర్ హోదా వారిని బోర్డు కోసం నియమిస్తున్నట్లు ఆ జీవోలో పేర్కొన్నారు. బోర్డు ఏర్పాటు కోసం మొత్తం 24 పోస్టులను మంజూరు చేసింది. బోర్డు కార్యకలాపాల కోసం కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యాలయం ప్రాంగణంలో అవసరమైన భవనాలను కూడా సిద్ధం చేశారు. 2017లో టీఎస్పీఎస్సీ ద్వారా 500 డాక్టర్ పోస్టులు, 3,300 స్టాఫ్ నర్సు పోస్టులు, మరో 1,000 పారా మెడికల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. అయినా ఆ భర్తీ ప్రక్రియ పూర్తికాకపోవడం గమనార్హం. వీటితో పాటు ఆ తర్వాత ఖాళీ అయిన వైద్య సిబ్బంది పోస్టులను కూడా బోర్డు మున్ముందు భర్తీ చేయాల్సి ఉంది. ఏడాదికేడాది ఖాళీలు పెరిగిపోతున్నాయి. సరిపడా డాక్టర్లు, ఇతర సిబ్బంది లేకపోవడంతో ఉన్న సిబ్బందిపైనే పని భారం పడుతోంది. దీంతో రోగులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పీహెచ్‌సీల నుంచి... ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు మొద లు బోధనాస్పత్రుల వరకు అన్నిచోట్ల పోస్టుల మంజూరు నుంచి భర్తీ వరకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డే చూస్తుంది. ఖాళీలు ఏర్పడగానే ఆ సమాచారం బోర్డుకు చేరుతుంది. అనంతరం బోర్డు ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి ఆ పోస్టులను భర్తీ చేస్తుంది. ఎంఎన్‌జే కోసం భర్తీ చేయబోయే పోస్టులన్నీ కూడా రాష్ట్రస్థాయి పోస్టులేనని అధికారులు చెబుతున్నారు. ఇక మల్టీజోనల్ పోస్టులు ప్రస్తుతానికి భర్తీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఆ పోస్టు ల భర్తీకి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వు ల సవరణ పెండింగ్‌లో ఉండటం వల్ల అవి ఆలస్యమవుతాయని అధికారులు చెబుతున్నారు. -
చిదంబరం ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లోఉన్న మాజీ ఆర్థికమంత్రి చిదంబరం (74) ఆరోగ్యంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చిదంబరం ఆరోగ్య పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఒక మెడికల్ బోర్డును ఈ సాయంత్రం 7 గంటల్లోగా బోర్డును ఏర్పాటు చేసి.. శుక్రవారం మధ్యాహ్నానికి నివేదిక అందచేయవలసిందిగా ఢిల్లీ హైకోర్టు గురువారం ఎయిమ్స్‌ను ఆదేశించింది. ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ( చిదంబరం ఫ్యామిలీ వైద్యులు ) నాగేశ్వర రెడ్డిని బోర్డులో చేర్చాలని తెలిపింది. అక్టోబర్ 5న తీవ్ర అనారోగ్యానికి గురైన చిదంబరంను వైద్య పరీక్షల తరువాత వచ్చే16 వారాల పాటు స్టెరాయిడ్ చికిత్సలో ఉంచాలని నిర్ణయించారు. అయితే ఎయిమ్స్ చికిత్సకు తన శరీరం స్పందించడం లేదనీ, హైదరాబాద్ ఏఐజీ వద్ద అత్యవసర చికిత్సకు బెయిల్ మంజూరు చేయాలని చిదంబరం కోర్టును కోరారు. అటు చిదంబరం ఆరోగ్యపరంగా కోలుకునే వాతావరణాన్ని కల్పించాలంటూ ఆయన తరఫు న్యాయవాది కపిల్ సిబల్ గురువారం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అనారోగ్యం కారణంగా ఆయన దాదాపు ఏడు కిలోల బరువు కోల్పోయారన్నారు..పరిస్థితి క్షీణిస్తోందని, అతను శుభ్రమైన వాతావరణంలో ఉండాల్సిన చికిత్స అందించాల్సిన అవసరం ఉందని సిబల్ కోరారు. ఉదర సంబంధమైన తీవ్ర వ్యాధితో బాధపడుతున్న చిదంబరం సోమవారం అస్వస్థత కారణంగా ఎయిమ్స్‌కు తరలించిన సంగతి తెలిసిందే. INX Media (Enforcement Directorate case): Delhi High Court directs AIIMS (All India Institute of Medical Sciences) to constitute a medical board comprising of Dr Nageshwar Reddy (family doctor of P Chidambram from Hyderabad) for Chidambram's treatment in AIIMS. (file pic) pic.twitter.com/uJZNqsVYWI — ANI (@ANI) October 31, 2019 -
సైనికులను ఆదుకోవడం కనీస బాధ్యత
సాక్షి, హైదరాబాద్: ఈ దేశ పౌరులకోసం ప్రాణాలు లెక్క చేయకుండా శత్రుమూకల నుం చి సరిహద్దులను కాపాడుతున్న సైనికులకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వారిని ఆదుకునేందుకు పౌరులు ముందుకు రాకపోవడం శోచనీయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. దేశ సేవలో వీర మరణం పొందడమో, గాయపడటమో జరిగినప్పుడు ఆ సైనికుల సంక్షేమంకోసం తలా రూ.100 చొప్పున సాయం చేసినా ఆ సైనికుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిస్తుంది. మన కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న వారిని ఆదుకోవడం కనీస సామాజిక బాధ్యతని తెలిపింది. పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై జరిగిన ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడి కుడికన్ను, కుడిచేయి, కుడికాలు పనిచేయని పరిస్థితుల్లో జీవనాన్ని సాగిస్తున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ)కి చెందిన సైనికుడు కంగాల శ్రీరాములుకు మెడికల్ బోర్డు నిర్ణయంతో సంబంధం లేకుండా అన్ని రకాలుగా సాయం అందచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ తదుపరి విచారణను డిసెంబర్ 4కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2016లో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కంగాల శ్రీరాములు పరిస్థితిపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ లేఖ రూపంలో శ్రీరాములు పరిస్థితిని అప్పటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఏసీజే ఆ లేఖను పిల్‌గా పరిగణించి విచారణ ప్రారంభించారు. తాజాగా ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) కె.లక్ష్మణ్ స్పందిస్తూ, శ్రీరాములు ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు మెడికల్ బోర్డు సమావేశం కానున్నదని తెలిపారు. బోర్డు తీసుకునే నిర్ణయాన్ని బట్టి అతనికి అందే సాయం ఆధారపడి ఉంటుందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, దేశం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న వారికి సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వారికి దక్కాల్సిన బీమా ప్రయోజనాలను అందచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపింది. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోకపోతే ఆ సైనికుల కుటుంబాలు ఎంతో క్షోభను అనుభవిస్తుంటాయని విచారం వ్యక్తం చేసింది. మెడికల్ బోర్డు నిర్ణయంతో సంబంధం లేకుండా శ్రీరాములకు సాయం చేయాలని, ఇందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలంటూ విచారణను డిసెంబర్ 4కి వాయిదా వేసింది. -
కార్మికులకు ఊరట
సింగరేణి(కొత్తగూడెం) : హైకోర్టు తీర్పు సింగరేణి కార్మికులకు ఊరట కలిగించింది. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకునే కార్మికులకు యాజమాన్యం విధించిన రెండు సంవత్సరాల నిబంధన రద్దు చేయాలని, ఎలాంటి కొర్రీలు పెట్టకుండా అనారోగ్యంతో ఉన్న కార్మికులందరినీ ఇన్వాలిడేషన్ చేయాలని ఈ నెల 5న ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఆ తీర్పును వెంటనే అమలు చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నాయి. అయితే తమకు ఎలాంటి సమాచారం లేదని సింగరేణి అధికారులు చెబుతున్నారు. ఆ నిబంధన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.. ఈ నెల 5న ఇచ్చిన తీర్పులో అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికుడికి జబ్బు ఉందా లేదా అని నిర్ధారణ చేసుకున్న యాజమాన్యం వెంటనే ఇన్వాలిడేషన్ చేయకుండా, అతనికి రెండు సంవత్సరాల సర్వీసు ఉందా? ఉన్న జబ్బు ఎంత శాతం ఉంది? అనే నిబంధనలు విధించటం కార్మికులను వేధింపులకు గురిచేయటమే అవుతుందని, కానీ కార్మిక కుటుంబాలకు సహాయ కారిణి కాదని, ఇది రాజ్యాంగా స్ఫూర్తికి విరుద్ధమని, ఈ నిబంధనను పూర్తిగా కొట్టివేస్తున్నట్లు కోర్టు పేర్కొంది. రెండేళ్ల నిబంధనతో అన్యాయం ఎనిమిది నెలలక్రితం సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల నియామకాల స్థానంలో మెడికల్ ఇన్వాలిడేషన్తో కారుణ్య నియామకాల ప్రక్రియ ప్రారంభమైంది. కారుణ్యం తమకు ఆసరా అవుతుందని కార్మిక కుటుంబాలు ఆశపడ్డాయి. కానీ రెండేళ్ల సర్వీస్ నిబంధన విధించడంతో చాలా మంది కార్మికులు మెడికల్ ఇన్వాలిడేషన్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కోల్పోయారు. రెండేళ్లకు వారం, పదిరోజులు, పక్షంరోజులు తక్కువగా ఉన్నా, వారు తీవ్ర అనారోగ్యానికి గురైనప్పటికీ యాజమాన్యం మెడికల్ బోర్డుకు పిలవడంలేదు. ఈ క్రమంలో తమకు అన్యాయం జరుగుతోందని కొందరు కార్మికులు హైకోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలో పుర్వపరాలు పరిశీలించిన పిదప యాజమాన్యంను తప్పుపడుతూ తీర్పు నిచ్చినిన్తూ రెండేళ్ల సర్వీసు నిబంధన సరైందికాదని, వెంటనే ఈ నిబంధనను ఉపక్రమించి కార్మికులకు న్యాయం చేయాలని ఆదేశించింది. -
అబార్షన్ కు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ: 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతివ్వాలన్న ఓ మహిళ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కడుపులోని పిండం ‘డౌన్ సిండ్రోమ్’తో బాధపడుతోందని, కాబట్టి అబార్షన్ కు అనుమతించాలని మహారాష్ట్రకు చెందిన మహిళ కోర్టును కోరింది. అయితే, ఈ విషయంలో గర్భాన్ని కొనసాగిస్తే తల్లికి ఎలాంటి హాని ఉండదంటూ మెడికల్ బోర్డు నివేదిక సమర్పించింది. బిడ్డకు మానసిక, శారీరక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు మాత్రమే ఉన్నాయని వైద్యుల బృందం తేల్చిందని మంగళవారం కేసును విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎల్ఎన్ లు వ్యాఖ్యానించారు. -
సునంద మృతిపై చేతులెత్తేసిన బోర్డు
-
సునంద మృతిపై చేతులెత్తేసిన మెడికల్ బోర్డు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ మృతికి కారణం కనుగొనడంలో మెడికల్ బోర్డ్ చేతులెత్తేసింది. ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌బీఐ, ఎయిమ్స్ కనుగొన్న అంశాలను పరిశీలించిన బోర్డు సునంద మరణంపై స్పష్టమైన అంచనాకు రాలేకపోతున్నామని తెలియజేస్తూ ఈ కేసును అధ్యయనం చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)కు నివేదిక సమర్పించింది. సునంద మృతికి కారణం తెలియడంలేదంటూ నెలరోజులక్రితం మెడికల్ బోర్డు నివేదిక సమర్పించింది. అయితే ఎఫ్‌బీఐ, ఎయిమ్స్ నివేదికల ఆధారంగా మరోసారి పరిశీలించాల్సిందిగా వారిని కోరాము అని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. మెడికల్ బోర్డు చేతులెత్తేయడంతో పోలీసులు మరోకోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మొబైల్ ఫోన్ నుంచి డిలీటైన మెస్సేజ్‌లను తిరిగి తీసుకురావడం ద్వారా ఆమె ఎవరితో మాట్లాడిందో తెలిస్తే దర్యాప్తు కొంతవరకు ముందుకు తీసుకుపోవచ్చని భావిస్తున్నారు. దక్షిణ ఢిల్లీలోని ఒక ఫైవ్‌స్టార్ హోటల్లో 2014 జనవరి 17 రాత్రి సునందా పుష్కర్ (51) అనుమానస్పదంగా మరణించిన విషయం తెలిసిందే. -
ఆమె అబార్షన్‌కు సుప్రీం ఓకే
అత్యాచార బాధితురాలి కేసులో.. 1971 నాటి అబార్షన్ చట్టం సడలింపు న్యూఢిల్లీ : ముంబైకి చెందిన ఒక అత్యాచార బాధితురాలికి ఊరటనిచ్చేలా అబార్షన్ చట్టంలో సడలింపునిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గర్భంలోని 24 వారాల పిండం పరిస్థితి బాగాలేకపోవడం, దీనివల్ల తల్లి ప్రాణాలకే ముప్పు ఉండడంతో గర్భస్రావానికి సోమవారం అనుమతిచ్చింది. ఇటీవల బాధితురాలి పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. ఈ వ్యవహారంపై జూలై 22న ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ కాలేజీకి చెందిన మెడికల్ బోర్డు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటుచేసింది. అత్యాచార బాధితురాలి కడుపులో పెరుగుతున్న పిండం అసాధారణ రీతిలో ఉందని, అది అలాగే కొనసాగితే ఆమె శారీరక, మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని కమిటీ కోర్టుకు నివేదించింది. దీన్ని ప్రాతిపదికగా తీసుకున్న జస్టిస్ జేఎస్ కెహర్, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం.. బాధితురాలి అబార్షన్‌కు అనుమతిచ్చింది. వాస్తవానికి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్రెన్సీ చట్టం 1971లోని సెక్షన్ 3 ప్రకారం 20 వారాలలోపు మాత్రమే అబార్షన్‌కు అనుమతి ఉంది. కానీ ఈ కేసులో గర్భస్రావం చేయకపోతే తల్లి ప్రాణాలకు ముప్పు ఉన్నందున ఆ చట్టం వర్తించదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి కోర్టుకు వివరించారు. దీనికి స్పందించిన కోర్టు 1971 చట్టానికి వ్యతిరేకంగా మరో పిటిషన్ కూడా పెండింగ్‌లో ఉందని పేర్కొంది. అలాగే బాధితురాలి పిటిషన్‌ను పరిగణలోకి తీసుకొని ఈ తీర్పునిచ్చింది. -
బదిలీల పేరుతో బాదుడు
రూ.50 లక్షలకు పైగా వసూళ్లు ఒక్కొక్కరి నుంచి రూ.50వేల పైమాటే అధికారుల సహకారంతో ఓ కార్మిక నాయకుడి నిర్వాకం సింగరేణిలో ఇప్పటి వరకు బొగ్గు రవాణా, క్వాలిటీ, మెడికల్ బోర్డు తదితర అక్రమాలు చూశాం. తాజాగా కార్మికుల బదిలీల్లో సైతం వసూళ్లకు తెరలేచింది. ఇందులో ఓ యూనియన్ నాయకుడు సాధారణ బదిలీలను సైతం తమ ఘనకార్యంగా చెప్పుకుంటూ అధికారుల సహకారంతో పెద్ద మొత్తంలో దండుకున్నట్లు బాధిత కార్మికుల ద్వారా తెలిసింది. - కొత్తగూడెం(ఖమ్మం) మణుగూరు ఏరియాలోని ప్రకాశం ఖని-1 ఇంక్లైన్ మూతపడటంతో సుమారు 150 మంది కార్మికులను రెండేళ్ల నుంచి పలు దఫాలుగా బదిలీలు చేశారు. సీనియారిటీ ప్రకారం 51 మంది కార్మికులను చివరి దఫాగా 8 నెలల క్రితం కొత్తగూడెంలోని పీవీకే-5 ఇంక్లైన్, వీకే-7 ఇంక్లైన్ భూగర్భగనులకు బదిలీ చేశారు. వీరు చాలాకాలం నుంచి మణుగూరు ఏరియాలోనే పనిచేయడం, అక్కడే స్థిరపడటంతో తిరిగి అదే ఏరియాకు వెళ్లేందుకు ఆసక్తి కనపర్చారు. ఈ నేపథ్యంలో మణుగూరులోని ఓపెన్‌కాస్టులో పోస్టింగ్ కోసం అదే ఏరియాకు చెందిన ఒక యూనియన్ నాయకుడిని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇటీవల మణుగూరు కొండాపూర్ ఓసీలో పంచ్ ఎంట్రీ ఓపెన్ చేస్తుండటంతో కొత్తగూడెం ఏరియాకు బదిలీ అయిన కార్మికులను తిరిగి మణుగూరుకు బదిలీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ సమాచారం ముందుగానే తెలుసుకున్న సదరు నాయకుడు కార్మికులతో బేరం కుదుర్చుకుని ఒక్కొక్కరి వద్ద రూ.50 వేలకు పైగానే వసూలు చేసినట్లు సమాచారం. అరుుతే ఈ విషయమ బయటకు రానీయకుండా ఉండేందుకు అతను సింగరేణిలోని పర్సన ల్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులతో కుమ్మక్కైన ట్లు సమాచారం. మొత్తం రూ.50 లక్షల వరకు వసూలుచేసి కొంత అధికారులకు ముట్టచెప్పినట్లు తెలుస్తోంది. ఈనెల 18న బదిలీలకు సంబంధించిన సర్క్యులర్ విడుద ల కావడంతో కార్మికులు తాము ఆశ్రయించిన నాయకుడే బదిలీలు చేయించాడని నమ్మారు. అయితే సీనియారిటీ ప్రకారం బదిలీలు జరిగాయని తెలుసుకున్న కార్మికులు లబోదిబోమంటున్నారు. నిద్రపోతున్న విజిలెన్స్ విభాగం సింగరేణిలో అవినీతిని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన విజిలెన్స్ విభాగం నిద్రపోతోందనడానికి తాజా ఘటనతోపాటు అనేక ఉదాహరణలున్నారుు. రెండేళ్ల క్రితం జరి గిన మెడికల్ అన్‌ఫిట్ కుంభకోణం నుంచి మొదలు నిన్న మొన్నటి వరకు జరిగిన బదిలీలలో చోటు చేసుకున్న అక్రమాలను వెలికితీయడంలో ఈ విభాగం పూర్తిగా విఫల మైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. ఇప్పటికైనా అవినీతి అక్రమాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. దృష్టికి రాలేదు.. విచారణ చేపడతాం బదిలీల వసూళ్ల వ్యవహారంపై సింగరేణి విజిలెన్స్ జీఎం మధుసూదన్‌రావును ‘సాక్షి’ వివరణ కోరగా ఇప్పటి వరకు ఈ విషయం తమ దృష్టికి రాలేదని, విచారణ చేపడతామని పేర్కొన్నారు. -
పని ఇవ్వకున్నా జీతం చెల్లించాల్సిందే
ఏపీ, తెలంగాణ ఆర్టీసీలకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: అనారోగ్య కారణాలతో డ్రైవర్‌గా విధులు నిర్వర్తించలేని వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగం చూపేంతవరకు పక్కన పెడితే ఆ కాలానికి కూడా జీతభత్యాలు చెల్లిం చాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రత్యామ్నాయంగా మరో ఉద్యోగం ఇచ్చినప్పటికీ, వారికి డ్రైవర్ హోదాలో వచ్చిన జీతభత్యాలను ఇవ్వాల్సిందేనంది.ప్రత్యామ్నాయ ఉద్యోగానికి ఎంతిస్తారో అంతే ఇస్తామంటే కుదరదంది. ఖాళీలు లేకపోతే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించాలని ఆదేశించింది. ఏపీ, తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యాలు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని, ఇలాంటి వివాదాలకు ముగింపు పలకాలని మందలించింది. ఆనారోగ్య కారణాలవల్ల పని కల్పించకుండా పక్కన పెట్టిన మొత్తంకాలానికి డ్రైవర్‌కు జీతభత్యాలు చెల్లిం చాలని, 8శాతం వడ్డీతో బకాయిలను కూడా ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. తీర్పు కాపీ అందుకున్న నాటి నుంచి 8 వారాల్లోపు దీన్ని అమలు చేయాలంది. ప్రత్యామ్నాయ ఉద్యోగం ఇవ్వలేకపోతే, ఖాళీలు ఏర్పడే వరకు లేదా పదవీ విరమణ వయస్సు వరకు అతడిని సూపర్ న్యూమరరీ పోస్టులో ఉంచాలంది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు తీర్పునిచ్చారు. ఉద్యోగిని గౌరవంగా చూడాలి ‘‘ఓ ఉద్యోగి విధులు నిర్వర్తించాలని భావిస్తున్నప్పుడు అతడిని సెలవుపై వెళ్లాలని ఆదేశించడానికి వీల్లేదు. అనారోగ్య కారణాలతో డ్రైవర్ గా పనిచేయలేరని మెడికల్ బోర్డు తేల్చిన నాటి నుంచి ఆ వ్యక్తి ప్రత్యామ్నాయ ఉద్యోగం పొం దే వరకు లేదా పదవీ విరమణ వరకు విధి నిర్వహణలో ఉన్నట్లే. ప్రతికూల పరిస్థితుల మధ్య పనిచేసే డైవర్లు అనారోగ్యం పాలవుతుంటారు. డ్రైవర్ కంటి చూపు సక్రమంగా లేకపోతే ప్రయాణికులకు ప్రమాదం సంభవించే అవకాశం ఉండటంతో అతడు విధులు నిర్వర్తించలేడని మెడికల్ బోర్డు తేలుస్తుంది. అయితే, ఈ వైకల్యం డ్రైవర్ విధులు మినహా మిగిలిన విధులు నిర్వర్తించడానికి అడ్డుకాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తికి డ్రైవర్ హోదా ఉండే మరో ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగిని గౌరవంగా చూడాల్సిన బాధ్యత యజమానిది. ఆ గౌరవాన్ని యజమాని నుంచి ఆశించే హక్కు ఉద్యోగికి ఉంది. ఈ తీర్పుతో భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు పునరావృతం కావని ఆశిస్తున్నా’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇదీ వివాదం.. అనారోగ్య కారణాల వల్ల విధులు నిర్వర్తించలేరని మెడికల్ బోర్డు తేల్చిన డ్రైవర్లను ఆర్టీసీ అధికారులు పక్కన పెడుతున్నారు. వారిని సెలవుపై వెళ్లాలని ఆదేశిస్తున్నారు. పక్కన పెట్టిన కాలానికి జీతభత్యాలు చెల్లిం చడం లేదు. ప్రత్యామ్నాయంగా తక్కువస్థాయి ఉద్యోగం ఇస్తూ, డ్రైవర్ హోదాలో ఇచ్చిన జీతభత్యాలను చెల్లించడం లేదు. వీటన్నింటినీ సవాలు చేస్తూ పలువురు ఆర్టీసీ డ్రైవర్లు 2013లో హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న జస్టిస్ నవీన్‌రావు గతవారం తీర్పు వెలువరించారు. -
జీఎంసీకి పూర్వ వైభవం
సాక్షి, గుంటూరు : ఎందరో గొప్ప వైద్యులను తయారు చేసిన గుంటూరు వైద్య కళాశాల(జీఎంసీ)కి పూర్వ వైభవం రానుందా.. రాజధాని నగరంగా రూపాంతరం చెందుతున్న గుంటూరు నగరంలో ఉన్న ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జీజీహెచ్)కు మహర్దశ పట్టనుందా.. అనే ప్రశ్నలకు ఉన్నతస్థాయి వైద్య వర్గాలు అవునంటున్నాయి. ఇప్పటి వరకూ 150 సీట్లకే సరైన భవన సముదాయాలు, బోధనా సిబ్బంది, వైద్య పరికరాలు లేకపోవడంతో భారత వైద్యమండలి తనిఖీలు చేసినప్పుడల్లా అసంతృప్తి వ్యక్తం చేసి వెళ్ళడం పరిపాటిగా మారింది. అయితే ఇటీవల పరిస్థితి మెరుగుపడిందని గుర్తించిన భారత వైద్య మండలి బృందం ఇటీవల గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు 200 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసింది. వచ్చే ఏడాది నుంచి మరో 50 ఎంబీబీఎస్ సీట్లు పెంచాలని భారత వైద్య మండలికి ప్రతిపాదనలు పంపారు. గుంటూరు వైద్యకళాశాలకు 250 సీట్లు మంజూరు చేయాలంటే జీజీహెచ్, జీఎమ్సీల్లో నూతనభవనాల నిర్మాణం, వైద్య పరికరాల కొనుగోలుకు సుమారుగా రూ.300 కోట్ల మేర నిధులు అవసరమవుతాయని ఏపీఎమ్ఎస్ఐడీసీకి ప్రభుత్వ వైద్య కళాశాల అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విడుదల చేసేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. 250 సీట్లు మంజూరు చేయాలంటే భారత వైద్య మండలి నిబంధనల మేరకు ఎలాంటి భవనాలు నిర్మించాలి, సౌకర్యాలను ఏమేరకు మెరుగుపర్చాలి, కావాల్సిన వైద్య పరికరాలు వంటి వాటిపై మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేయాలంటూ హైదరాబాద్‌కు చెందిన భార్గవ్ అసోసియేట్స్ కంపెనీకి అప్పగించారు. వైద్య కళాశాలలో శిథిలావస్థకు చేరిన రీజనల్ ల్యాబ్, బయోకెమిస్ట్రీ విభాగాల భవనాలను కూల్చి వాటి స్థానంలో ఐదు అంతస్తులతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన భవనాలు నిర్మించేందుకు బార్గవ్ అసోసియేట్‌కు చెందిన ఇంజినీర్ల బృందం వైద్య కళాశాలకు వచ్చి పరిశీలించారు. వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న జీజీహెచ్‌లో మెడికల్ స్టోర్స్ విభాగం, లాండ్రి, మోడ్రన్ కిచెన్, వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రం, కాలినగాయలవారికి ప్రత్యేకవార్డు, బ్లడ్‌బ్యాంక్, కాన్పుల విభాగం, ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్మెంట్, మెడికల్ ఆఫీసర్స్ రూమ్, నర్సుల క్వార్టర్స్, రెసిడెంట్ డాక్టర్స్ క్వార్టర్స్ తదితర విభాగాలను నిర్మించేందుకు ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నేడు వైద్య కళాశాలలోని అన్ని విభాగాల అధిపతులతో కళాశాల అధికారులు సమావేశమై దీనిపై చర్చించనున్నారు. -
బ్రోకర్లకు బిగుస్తున్న ఉచ్చు
మెడికల్ అన్‌ఫిట్ కేసుల్లో నిలదీస్తున్న బాధితులు డబ్బుల కోసం పెరుగుతున్న ఒత్తిడి తప్పించు కుతిరుగుతున్న దళారులు శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : మెడికల్ అన్‌ఫిట్‌లో చోటుచేసుకున్న అక్రమాల నేపథ్యంలో ఇటు యాజమాన్యం, అటు ప్రభుత్వం విచారణ చేపట్టడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. మెడికల్ బోర్డు నిర్వహించిన ప్రతీసారి డబ్బులతో పండుగ చేసుకొనే బ్రోకర్ల పరిస్థితి కుడితిల పడిన ఎలుకల తీరుగా మారింది. జబ్బు పడిన వారి నుంచే కాకుండా దొంగ మెడికల్ అన్‌ఫిట్ కేసులు చేయించడానికి రూ.లక్షల్లో దండుకున్న దళారులకు డబ్బులిచ్చిన కార్మికుల నుంచి రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోంది. దీంతో రేపు.. మాపు.. అంటూ తప్పించుకు తిరుగుతున్నారు. మరి కొందరైతే ముఖం చూపించుకోలేక అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రకృతికి విరుద్ధమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి భూగర్భం నుంచి బొగ్గు వెలికితీస్తున్న కార్మిక కుటుంబాలకు మేలు చేయడానికి యాజమాన్యం కల్పించిన అవకాశం నేడు దళారులకు, కొందరు నాయకులకు వరంగా మారిపోయింది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇక విధులు నిర్వర్థించలేని కార్మికుడికి మెడికల్ బోర్డు అన్‌ఫిట్ సర్టిఫికెట్ ఇస్తే అతడి స్థానంలో వారసుడికి సంస్థ ఉద్యోగ అవకాశం కల్పిస్తోంది. దీనిని ఆసరాగా చేసుకున్న దళారులు, నాయకులు బోర్డులోని అధికారులను మచ్చి చేసుకుని వ్యాపారం చేస్తున్నారు. ఎలాంటి అనారోగ్యం లేకున్నా అన్‌ఫిట్ చేయిస్తామని ఒక్కో కేసుకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేశారు. ఈ క్రమంలో వాస్తవంగా అనారోగ్యంతో ఉన్న కార్మికుల నుంచి సైతం త్వరగా అన్‌ఫిట్ చేయిస్తామని డబ్బులు దండుకున్నారు. సింగరేణి వ్యాప్తంగా సుమారు 150 మందికి పైగానే బ్రోకర్లు ఉన్నారని అంచనా. ఇందులో పలు సంఘాల నేతలు, ఉద్యోగులు, కొందరు అధికారులు, వైద్యుల పాత్రు సైతం ఉన్నట్లు సమాచారం. అయితే మెడికల్ బోర్డులో అక్రమాలపై దుమారం రేగడంతో ఆగస్టు నుంచి మెడికల్ అన్ఫిట్లు ఆగిపోయాయి. ఎప్పుడు మెడికల్ బోర్డు పెడుతారో తెలియకపోవడంతో బ్రోకర్లకు డబ్బులిచ్చిన కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని బ్రోకర్ల వెంబడి పడుతున్నారు. ఉదయం, సాయంత్రం వారి ఇళ్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. దీంతో కొందరు ఇంట్లో ఉండి కుటుంబ సభ్యులతో లేడని చెప్పి తప్పించుకుంటున్నారు. కార్మికుల వద్ద నుంచి వసూలు చేసిన డబ్బును కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. అలాంటి వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. -
రెండంచెల విధానంలో మెడికల్ బోర్డు
శ్రీరాంపూర్ : మెడికల్ బోర్డులో కొత్త మార్పులు తెచ్చారు. ఇకపై రెండంచెల పద్ధతిలో మెడికల్ బోర్డును నిర్వహిస్తారు. కొత్త విధానానికి సంబంధించి యాజమాన్యం తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. సర్క్యూలర్ నంబర్ సీఆర్పీ/పీఈఆర్/ఐఆర్‌అండ్‌పీఎం/సీ/81/2088 ననుసరించి మెడికల్ బోర్డు పని చేస్తుంది. గతంలో ఒకటే బోర్డు ఉంటే కొత్త సర్క్యూలర్ ప్రకారం కార్పొరేట్ మెడికల్ బోర్డు, అప్పిలేట్ మెడికల్ బోర్డు అను రెండు రకాలు బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రతీ బోర్డులో ఆరుగురు సభ్యులు ఉంటారు. కార్పొరేట్ మెడికల్ బోర్డు నెలకు రెండు సార్లు సమావేశం అవుతుంది. ఇందులో సీజీఎం(పీపీ), సీఎంవో, జీఎం(మైనింగ్), జీఎం(పర్సనల్), ఏజీఎం, నిపుణుడైన వైద్యుడు ఉంటారు. అప్పిలేట్ మెడికల్ బోర్డు మూడునెలలకోసారి సమావేశం అవుతుంది. ఇందులో నిమ్స్ నుంచి ఒక వైద్యుడితోపాటు ఐదుగురు కంపెనీ డెరైక్టర్లు, పర్సనల్ అండ్ వెల్ఫేర్, ఆపరే షన్స్, ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్, ఫైన్సాన్స్, ఈఅండ్ఎండ్ విభాగాలకు చెందిన వారు ఉంటారు. కొత్త సర్క్యూలర్ జూలై 1 నుంచి అమలు అవుతుంది. క్యాన్సర్, లెప్రసీ, పెరాలసిస్, గుండెపోటు, అంధత్వం, కిడ్నీల సమస్యలు, గని ప్రమాదాలు, బయటి ప్రమాదాలు, ఎముకలు విరగడం, శరీరాకృతిలో మార్పులు రావడం వంటి పలు వ్యాధులతో బాధపడేవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ధారుడు ఇచ్చిన మొబైల్ నంబర్ ఆధారంగా బోర్డుకు ఎప్పుడు హాజరుకావాలో మెస్సేజ్ వస్తుంది. కార్పొరేట్ బోర్డులో అన్‌ఫిట్ కాని వారు అప్పిలేట్ మెడికల్ బోర్డుకు 60 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రతీ నెల 10న దరఖాస్తు చే సుకున్న వారి దరఖాస్తులను సీరియల్ నంబర్లు ఇచ్చి దాని ఆధారంగా పిలుస్తారు. పీఎంఈ, కార్పొరేట్ ఆస్పత్రికి రెఫర్ చేయబడిన వారికి సీరియల్లో 50 శాతం ప్రాధాన్యతఇస్తారు. ఇంకా 24 నెలల సర్వీసు మాత్రమే మిగిలి ఉన్న వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మెడికల్ బోర్డుకు హాజ రైన వారు అదే కారణంతో తిరిగి సంవత్సరం వరకు అనుమతించరు. ఇదిలా ఉంటే కొత్త విధానం వల్ల మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికులకు ఫిట్ లేదా అన్ఫిట్లు త్వరగా అవుతాయని, గుర్తింపు సంఘంగా తాము ఒత్తిడి చేయడంతోనే యాజమాన్యం ఈ రెండంచెల విధానం ప్రవేశపెట్టిందని టీబీజీకేఎస్ కార్పొరేట్ చర్చల ప్రతినిధి గోవర్ధన్, నాయకులు పానుగంటి సత్తయ్య, ఏ సమ్మిరెడ్డి, గోపాల్, రమణారావు తెలిపారు. దీని కోసం తమ యూనియన్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు.