ఒంటిపై గాయాలేవీ లేవు | Allegations made by Raghu Rama Krishna Raju proved to be untrue | Sakshi
Sakshi News home page

ఒంటిపై గాయాలేవీ లేవు

Published Mon, May 17 2021 3:32 AM | Last Updated on Mon, May 17 2021 8:20 AM

Allegations made by Raghu Rama Krishna Raju proved to be untrue - Sakshi

రఘురామను గుంటూరు జీజీహెచ్‌ నుంచి జైలుకు తరలిస్తున్న సీఐడీ అధికారులు

సాక్షి, అమరావతి: వర్గాలు, కులాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడటంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు తనను అరెస్ట్‌ చేసిన సీఐడీ పోలీసులు తనను కస్టడీలో తీవ్రంగా కొట్టారంటూ నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తేలిపోయింది. ఆయన ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని హైకోర్టు ఏర్పాటు చేసిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్‌) సూపరింటెండెంట్‌ నేతృత్వంలోని మెడికల్‌ బోర్డు ఆదివారం హైకోర్టుకు సీల్డ్‌ కవర్‌లో నివేదిక ఇచ్చింది. గాయాలున్నాయనేందుకు ఎలాంటి ఆధారాలు లేవంది. కాళ్లలో నీరు చేరిందని (ఎడెమా), అందుకే కాళ్లు రంగు మారి కనిపిస్తున్నాయని హైకోర్టుకు వివరించింది. ఎక్కువ సేపు కూర్చున్నా, ప్రయాణించినా కాళ్లు రంగుమారుతాయని చెప్పింది. 2020 నవంబర్‌ 30న తనకు బైపాస్‌ సర్జరీ అయిందని, గుండె నొప్పిగా ఉందని రఘురామ చెప్పడంతో వెంటనే కార్డియాలజిస్ట్‌ను పిలిపించామంది. కార్డియాలజిస్ట్‌ పరిశీలించి, ప్రస్తుతం గుండెకు ఎలాంటి ముప్పు లేదని, ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని చెప్పారని మెడికల్‌ బోర్డు తన నివేదికలో పేర్కొంది. న్యూరాలజీ, నెఫ్రాలజీ వైద్యులు సైతం రఘురామ ఆరోగ్యం స్థిరంగా ఉందనే చెప్పారని బోర్డు తన నివేదికలో వివరించింది. కొట్టడం వల్ల ఎలాంటి గాయాలు కాలేదని బోర్డు తన నివేదికలో తేల్చి చెప్పింది. ఆయనకు కలర్‌ డాప్లర్, ఈసీజీ, రక్త పరీక్షలన్నీ చేశామని, అన్నీ పరీక్షల ఫలితాలు సాధారణ స్థితిలో ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు మెడికల్‌ బోర్డు నివేదికను హైకోర్టు న్యాయమూర్తులు చదివి వినిపించారు. బోర్డు చైర్మన్‌ అయిన జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌తో సహా మిగిలిన డాక్టర్లు కూడా వేర్వేరుగా ఒక రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తెలిపింది. ఈ నివేదికను హైకోర్టు రిజిస్ట్రీ నుంచి పొందే వెసులుబాటును ఇరుపక్షాలకు ఇచ్చింది.

రమేశ్‌ ఆస్పత్రికి పంపలేం..
మేజిస్ట్రేట్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు రఘురామను గాయాల పరిశీలన నిమిత్తం రమేశ్‌ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దీనిపై సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. రమేశ్‌ ఆస్పత్రికి పంపడం అంటే టీడీపీ ఆఫీసుకి పంపడమేనన్నారు. అగ్ని ప్రమాదం వల్ల పలువురు కోవిడ్‌ రోగులు మృతి చెందడానికి కారణమైన రమేశ్‌ ఆస్పత్రిపై రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసిందని ఆయన వివరించారు. దీంతో రమేశ్‌ ఆసుపత్రి యాజమాన్యం ప్రభుత్వంపై కక్ష కట్టి ఉందని, అందువల్ల ఆ ఆస్పత్రికి పంపడానికి తమకు అభ్యంతరం ఉందని తెలిపారు. రమేశ్‌ ఆసుపత్రికి పంపితే నిష్పాక్షిక నివేదిక వచ్చే అవకాశం ఉండదన్నారు. అంతేకాక రఘురామ గాయాల పరిశీలనకు హైకోర్టు మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయన్ను రమేశ్‌ ఆసుపత్రికి పంపాలన్న ఉత్తర్వులను సవరించాలని కోరుతూ మేజిస్ట్రేట్‌ ముందు ఇప్పటికే పిటిషన్‌ దాఖలు చేశామని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ఆయన్ను రమేశ్‌ ఆస్పత్రికి పంపాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై దర్మాసనం స్పందిస్తూ ఆ ఉత్తర్వులను సవాలు చేయడం గానీ, వాటిపై స్టే గానీ లేనందున, అవి అమల్లో ఉన్నాయని తెలిపింది. అందువల్ల వాటిని అమలు చేయాల్సిందేనని సీఐడీ అధికారులకు తేల్చి చెప్పింది. మేజిస్ట్రేట్‌ ఉత్తర్వుల అమలును రేపటి వరకైనా నిలుపుదల చేయాలని పొన్నవోలు కోరగా, ధర్మాసనం ఆ అభ్యర్థనను సైతం తోసిపుచ్చింది. మేజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు రఘురామను రమేశ్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాలని న్యాయమూర్తులు జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్, జస్టిస్‌ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం ఆదివారం రాత్రి ఉత్తర్వులిస్తూ తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.

ఆస్పత్రికి తీసుకెళ్లమంటే జైలుకు తీసుకెళ్లారు..
► అంతకు ముందు రఘురామకృష్ణరాజు తరఫు సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, తనను కొట్టారన్న రఘురామ వాంగ్మూలాన్ని రికార్డ్‌ చేసిన మేజిస్ట్రేట్‌ అతన్ని గుంటూరు ప్రభుత్వాస్పత్రితో పాటు రమేశ్‌ ఆసుపత్రికి సైతం తీసుకెళ్లాలని పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారని తెలిపారు. 
► అయితే ఈ ఆదేశాలను అమలు చేయకుండా అధికారులు రఘురామను జైలుకు తరలించారని చెప్పారు. హైకోర్టు మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేసిన నేపథ్యంలో రమేశ్‌ ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం లేదని పోలీసులు చెబుతున్నారన్నారు. మేజిస్ట్రేట్‌ ఉత్తర్వుల కంటే హైకోర్టు ఉత్తర్వులే అమల్లో ఉంటాయని వక్రభాష్యం చెబుతున్నారని తెలిపారు. 

సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌
సాక్షి, న్యూఢిల్లీ:  ఎంపీ రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడంతో ఏపీ సీఐడీ ఆయన్ను అరెస్టు చేసిన విషయం విదితమే. బెయిలు కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ఆయనకు అక్కడ చుక్కెదురైంది. దీంతో హైకోర్టు ఆదేశాలు సవాల్‌ చేస్తూ బెయిల్‌ ఇవ్వాలంటూ సుప్రీంను ఆశ్రయించారు. బెయిల్‌ కారణాలను హైకోర్టు పరిశీలించలేదని, సెషన్స్‌ కోర్టును ఆశ్రయించాలని సూచించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసులు తనను కొట్టారంటూ పిటిషన్‌లో ఆరోపించారు. 

ఆ ఉత్తర్వులను సవరిస్తామని మేజిస్ట్రేట్‌ చెప్పారు.. 
► దీనిపై ఏం చెబుతారని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఆ విషయాన్ని రాత్రి 8.30 గంటల సమయంలో మేజిస్ట్రేట్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. మేజిస్ట్రేట్‌ హైకోర్టు ఉత్తర్వుల కాపీ కావాలని కోరడంతో, హైకోర్టు ఉత్తర్వుల అధికారిక కాపీని ఆదివారం ఉదయం పంపామన్నారు. ఆ ఉత్తర్వులను చూసి రఘురామను రమేశ్‌ ఆసుపత్రికి పంపాలన్న ఉత్తర్వులను సవరిస్తామని మేజిస్ట్రేట్‌ చెప్పారని తెలిపారు. సవరణ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందన్నారు.
► జస్టిస్‌ లలిత స్పందిస్తూ, ఉత్తర్వులను మేజిస్ట్రేట్‌ సవరిస్తారన్న ఊహతో రఘురామను ఎలా జైలుకు తరలిస్తారని ప్రశ్నించారు. ఆ ఉత్తర్వులపై సందిగ్ధత ఉంటే తమ దృష్టికి ఆ విషయాన్ని తీసుకొచ్చి స్పష్టత తీసుకుని ఉండాల్సిందన్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకల్లా నివేదిక ఇవ్వాలని మెడికల్‌ బోర్డును ఆదేశిస్తే, సాయంత్రం ఎప్పుడో నివేదిక వచ్చిందని, నివేదిక ఆలస్యం అవుతుందన్న కనీస సమాచారం కోర్టుకు ఇవ్వకపోవడం ఏమిటని జస్టిస్‌ లలిత ప్రశ్నించారు.

జైలుకు తీసుకెళ్లడంపై నిషేధం లేదు
► పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ, మెడికల్‌ బోర్డును తాము సంప్రదించే పరిస్థితి లేదన్నారు. మెడికల్‌ బోర్డు నివేదిక ఎందుకు ఆలస్యం అయిందో తమకెలా తెలుస్తుందన్నారు. పలు వైద్య పరీక్షలు చేయాల్సి రావడంతో నివేదిక ఆలస్యం అయి ఉండొచ్చని చెప్పారు. 
► రిమాండ్‌కు అనుమతినిస్తూ మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులు జారీ చేసినప్పుడు నిందితుడైన రఘురామను జైలుకు తీసుకెళ్లడంపై ఎలాంటి నిషేధం లేదన్నారు. పైపెచ్చు మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేస్తూ అధికరణ 226 కింద హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు.  
► ఆదినారాయణరావు జోక్యం చేసుకుంటూ, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ నాయకుని భార్య అని తెలిపారు. జైల్లో రఘురామను హత్య చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ విషయాన్ని రికార్డ్‌ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. 
► ఈ ఆరోపణలపై అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ వాటిలో అర్థం లేదన్నారు. ఆయన్ను చంపాలనుకుంటే జైల్లోనే ఎందుకు చంపాలనుకుంటుందని ప్రశ్నించారు. ఆదినారాయణరా>వు తీవ్ర స్వరంతో మాట్లాడుతుండటంతో పొన్నవోలు అభ్యంతరం తెలిపారు. మెడికల్‌ బోర్డును రఘురామ కోరితేనే హైకోర్టు ఏర్పాటు చేసిందన్నారు. 
► సుధాకర్‌రెడ్డి కూడా తీవ్ర స్వరంతో మాట్లాడుతూ దీటుగా బదులిచ్చారు. కొద్దిసేపు ఇద్దరు న్యాయవాదులు వాదించుకున్నారు. దీంతో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సంయమనం పాటించాలని కోరింది. 
► మెడికల్‌ బోర్డు నివేదికపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదినారాయణరావుకు ధర్మాసనం స్పష్టం చేసింది. మెడికల్‌ బోర్డు నివేదికను తమకు అందజేసేలా చూడాలని ఆదినారాయణరావు కోరగా, రిజిస్ట్రీని ఆశ్రయించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

నేడు మేజిస్ట్రేట్‌ కోర్టు విచారణ..
► రఘురామకృష్ణంరాజు తనను పోలీసులు కొట్టారని ఆరోపించిన నేపథ్యంలో ఆయనకు అయిన గాయాలను పరిశీలించేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రితో పాటు రమేశ్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న ఆదేశాలను సవరించాలంటూ మేజిస్ట్రేట్‌ కోర్టులో సీఐడీ సోమవారం ఉదయం పిటిషన్‌ దాఖలు చేయనుంది.
► పిటిషన్‌ సిద్ధం చేసినప్పటికీ ఆదివారం కావడంతో దాఖలు చేయలేకపోయింది. ఈ పిటిషన్‌పై మేజిస్ట్రేట్‌ సోమవారం విచారణ జరపనున్నారు. హైకోర్టు ఏకంగా మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేసిన నేపథ్యంలో రఘురామకృష్ణంరాజును రమేశ్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని, ఆ ఉత్తర్వులను సవరించాలని సీఐడీ తన పిటిషన్‌లో కోరనుందని తెలిసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement