పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్‌కు వెళ్తున్న ఎంపీ రఘురామకృష్ణరాజు
సాక్షి, గుంటూరు, అమరావతి: తనను సీఐడీ పోలీసులు కొట్టారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మెజిస్ట్రేట్ కోర్టులో చెప్పడంతో, ఆ గాయాల నిగ్గు తేల్చేందుకు హైకోర్టు శనివారం మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరుస్తూ, ఓ సామాజికవర్గం, ఓ మతాన్ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఉద్రిక్తతలు రెచ్చగొడుతుండటంతో ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ పోలీసులు శుక్రవారం సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురవ్వడంతో సీఐడీ పోలీసులు ఆయన్ను శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గుంటూరు సీఐడీ కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఆయన తనను పోలీసులు కొట్టారని చెప్పడంతో, ఆ విషయాన్ని వివరిస్తూ ఆయన తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణ హైకోర్టుకు లేఖ రాశారు.
ఈ లేఖను హెబియస్ కార్పస్ పిటిషన్‌గా పరిగణించాలని కోరారు. ఈ లేఖపై న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, పార్లమెంట్ సభ్యుడినే కొడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటన్నారు. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శనివారం రఘురామకృష్ణరాజు స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారని తెలిపారు. హైకోర్టు ఆయన గాయాలను పరిశీలించాలని కోరారు. గాయాల పరిశీలనకు మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని, అందువల్ల తాము పరిశీలించాల్సిన అవసరం లేదని ధర్మాసనం చెప్పింది.
గాయాల వెనుక వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ముగ్గురు వైద్యులతో కూడిన మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి, సూపరింటెండెంట్ సిఫారసు చేసే మరో డాక్టర్‌తో మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ పోలీసులు తక్షణమే రఘురామకృష్ణరాజును మెడికల్ బోర్డు ముందు హాజరు పరచాలంది. గాయాల పరిశీలన ప్రక్రియను మొత్తం వీడియోగ్రఫీ చేయాలని మెడికల్ బోర్డును ఆదేశించింది.
అవన్నీ అసత్య ఆరోపణలు
సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని ధర్మాసనం ఈ విషయమై వివరణ కోరింది. ఆదినారాయణరావు ఆరోపణలను సుధాకర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. సీఐడీ పోలీసులు కొట్టారనడం శుద్ద అబద్ధమని చెప్పారు. ఉదయం హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో ఒత్తిడి తీసుకొచ్చే ఎత్తుగడలో భాగంగా ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అసత్య ఆరోపణలతో కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. మధ్యాహ్నం ఎంపీ కుటుంబ సభ్యులు భోజనం తీసుకొచ్చారని, అప్పటి వరకు రఘురామ బాగానే ఉన్నారని, ఆ తర్వాతే సీఐడీ పోలీసులు కొట్టారన్న నాటకాన్ని తెరపైకి తెచ్చారని తెలిపారు. డాక్టర్ పరిశీలించాకే అతన్ని కోర్టు ముందు హాజరు పరిచామని, అప్పుడు ఎలాంటి గాయాలు లేవన్నారు.
ధర్మాసనం స్పందిస్తూ ఆ గాయాలు తాజావని తేలితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని వ్యాఖ్యానించింది. రఘురామ భద్రతా సిబ్బందిని ఆస్పత్రిలోకి అనుమతించాల్సిన అవసరం లేదని చెప్పింది. అనంతరం ధర్మాసనం రిమాండ్ రిపోర్ట్ గురించి ఆరా తీసింది. అరెస్ట్‌కు స్పీకర్ అనుమతి లేదన్న కారణంతో రిమాండ్ రిపోర్ట్‌ను కింది కోర్టు తిరస్కరించిందని ఆదినారాయణరావు చెప్పారు. స్పీకర్‌కు ఇప్పటికే అరెస్ట్ గురించి సమాచారం ఇచ్చామని సుధాకర్‌రెడ్డి తెలిపారు. తదుపరి విచారణను ఆదివారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
హైకోర్టులో చుక్కెదురు
నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజు బెయిల్ కోసం హౌస్ మోషన్ రూపంలో దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. బెయిల్ కోసం మొదట కింది కోర్టులో పిటిషన్ వేసుకోకుండా నేరుగా హైకోర్టును ఆశ్రయించడంపై అభ్యంతరం తెలిపింది. బెయిల్ కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి కంచిరెడ్డి సురేశ్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రఘురామకృష్ణరాజును వెంటనే మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచాలని సీఐడీ పోలీసులను మౌఖికంగా ఆదేశించారు. తగిన వైద్య సాయం కూడా అందించాలని సూచించారు. దీనికి ఎంపీ తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు స్పందిస్తూ, ముందు కింది కోర్టుకెళ్లడం తప్పనిసరన్న నిబంధన ఏదీ లేదన్నారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ కింది కోర్టులో బెయిల్ పిటిషన్ వేయకుండా నేరుగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించిన దాఖలా ఒక్కటి కూడా లేదన్నారు. ఈ పిటిషన్‌ను అనుమతిస్తే, హైకోర్టులో పిటిషన్ల వరద మొదలవుతుందని తెలిపారు.
సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదన్నారు. ఎంపీని న్యాయమూర్తి ఎదుట హాజరు పరచలేదని, రిమాండ్ లేకుండా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదన్నారు. సీఆర్‌పీసీ సెక్షన్ 437, 438 ప్రకారం దాఖలు చేసిన ఈ వ్యాజ్యానికి ఎంత మాత్రం విచారణార్హత లేదని వివరించారు.
ఈ సందర్భంగా హైకోర్టు, సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను సుధాకర్‌రెడ్డి ఉదహరించారు. ఇద్దరి వాదనలు విన్న న్యాయమూర్తి, ఉత్తర్వులు జారీ చేస్తూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలతో కోర్టు సంతృప్తికరంగా లేదని స్పష్టం చేశారు. కింది కోర్టు బెయిల్ రద్దు చేసినప్పుడు దానిని సవాలు చేస్తూ బెయిల్ కోసం దాఖలు చేసే వ్యాజ్యాలనే వెకేషన్ కోర్టులో విచారిస్తారన్నారు. ఇక్కడ చెప్పుకున్న విషయాలన్నింటినీ సెషన్స్ కోర్టులో చెప్పుకోవాలని తేల్చి చెబుతూ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
14 రోజుల రిమాండ్
నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజుకు గుంటూరు సీఐడీ కోర్టు ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్ విధించింది. శనివారం సాయంత్రం సీఐడీ పోలీసులు ఆయన్ను గుంటూరులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో గల ఆరవ అదనపు, గుంటూరు సీబీసీఐడీ కోర్టు జడ్జి కె.అరుణ ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, వైద్య సాయం అవసరమని, పోలీసులు తనను కొట్టారని రఘురామకృష్ణరాజు న్యాయమూర్తికి తెలిపారు. ఈ నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్, రమేష్ ఆసుపత్రిల్లో వైద్యులు పరీక్షించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ఎంపీకి ఉన్న ‘వై’ కేటగిరీ భద్రత నడుమే వైద్యుల పరీక్ష ప్రక్రియ కొనసాగాలని పేర్కొన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్, రమేష్ ఆసుపత్రి యాజమాన్యం వైద్య పరీక్షల రిపోర్టును కోర్టుకు సమర్పించాలని సూచించారు. అంతకు ముందు హైకోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను రద్దు చేయడంతో సీఐడీ కార్యాలయానికి వచ్చిన వైద్యుల బృందం ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించింది. అనంతరం రఘురామకృష్ణరాజును కోర్టుకు తరలించారు. రిమాండ్ రిపోర్టులో సాంకేతిక తప్పిదాలు ఉండటంతో వాటిని సరిచేయాలని కోర్టు సీఐడీ అధికారులకు సూచించింది. ఆ తప్పిదాలను సరిచేసి, తిరిగి సీఐడీ అధికారులు రిమాండ్ రిపోర్టు సమర్పించారు.
హావభావాలతో రక్తికట్టించిన రఘురామ
సీఐడీ పోలీసుల అదుపులో ఉన్నంత వరకు ఎంపీ రఘురామకృష్ణరాజు మామూలుగానే ఉన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎంపీ కోసం కుటుంబ సభ్యులు తీసుకువచ్చిన ఆహారాన్ని, మందులను పోలీసులు లోనికి అనుమతించారు. శుక్రవారం రాత్రి నుంచి రిమాండ్‌కు తరలించేవరకు వైద్యుడిని ఆయనకు అందుబాటులో ఉంచారు. అయితే హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు రద్దు చేసిందని తెలిశాక సీఐడీ కోర్టులో ఒక్కసారిగా కొత్త డ్రామాకు రఘురామకృష్ణరాజు తెరతీశారని విమర్శలు వినిపిస్తున్నాయి. తనను పోలీసులు కొట్టారని హావభావాలతో డ్రామాను రక్తి కట్టించి కోర్టును సైతం తప్పుదోవ పట్టించేందుకు పూనుకున్నాడని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు.
మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసింగ్‌లోనూ మార్పులు వచ్చాయి. కరుడుగట్టిన నేరస్తులపై సైతం పోలీసులు చేయి చేసుకోవడం లేదు. అలాంటిది పార్లమెంట్ సభ్యుడు అయిన తనను పోలీసులు కొట్టారని రఘురామ చెప్పడం సర్వత్రా అనుమానాలకు తావిస్తోంది. తన కాళ్లపై లాఠీలతో కొట్టడం వల్ల కాళ్లు కందిపోయి, గాయాలయ్యాయని, నడవలేకపోతున్నానని ఎంపీ కోర్టులో తెలిపారు. సోరియాసిస్ వ్యాధితో బాధ పడుతున్నందున ఆయన అరికాళ్లలో ఎర్రగా బొబ్బలు వచ్చినట్లు తెలిసింది.
జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు
సీఐడీ కోర్టు ఆదేశాల మేరకు శనివారం రాత్రి వైద్య పరీక్షల నిమిత్తం ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు జీజీహెచ్‌కు పోలీసులు తరలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి, ఆర్‌ఎంవో డాక్టర్ సతీష్‌ల ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. సీఐడీ డీఐజీ సునీల్‌కుమార్ నాయక్, గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి జీజీహెచ్‌ను సందర్శించారు.
బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో కొత్త కథ..
సీఐడీ పోలీసులు ఎంపీ రఘురామను కొట్టారనడం శుద్ద అబద్ధం. ఉదయం హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో ఒత్తిడి తీసుకొచ్చే ఎత్తుగడలో భాగంగా ఆయన ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులు భోజనం తీసుకొచ్చినప్పుడు కూడా రఘురామ బాగానే ఉన్నారు. ఆ తర్వాతే సీఐడీ పోలీసులు కొట్టారన్న నాటకాన్ని తెరపైకి తెచ్చారు. డాక్టర్ పరిశీలించాకే అతన్ని కోర్టు ముందు హాజరు పరిచాం. అప్పుడు ఎలాంటి గాయాలు లేవు.
– అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment