సాక్షి, అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును గాయాల పరిశీలన నిమిత్తం రమేశ్ ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ ఈ నెల 15న తామిచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదంటూ సీఐడీపై హైకోర్టు మండిపడింది. తమ ఆదేశాలను అమలు చేయకపోవడం కోర్టు ధిక్కారమేనంటూ సీఐడీ అదనపు డీజీ, సీఐడీ మంగళగిరి ఎస్‌హెచ్‌వోలపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించింది. ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్‌కు (జ్యుడీషియల్) సూచించింది. రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించి 15వ తేదీ మధ్యాహ్నం కల్లా నివేదిక అందచేయాలన్న తమ ఆదేశాల అమల్లో జాప్యంపై వివరణ ఇవ్వాలని మెడికల్ బోర్డు చైర్మన్‌గా వ్యవహరించిన గుంటూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ ప్రభావతిని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేస్తూ కేసును జూన్ 16కి వాయిదా వేసింది.
మేజిస్ట్రేట్ ఉత్తర్వులు చట్టవిరుద్ధమైనవి..
సుప్రీకోర్టులో విచారణ జరిగి... సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి రఘురామరాజును తరలించిన నేపథ్యంలో హైకోర్టు తాజా ఉత్తర్వుల పట్ల అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి విస్మయం వ్యక్తంచేశారు. రమేశ్ ఆస్పత్రికి పంపాలన్న మేజిస్ట్రేట్ ఉత్తర్వులు చట్టవిరుద్ధమని, ఇవి అమలు చేయడానికి వీల్లేని విధంగా ఉన్నాయని చెప్పారు. వీటిని అమలు చేయాలని అధికరణ 226 కింద హైకోర్టు ఆదేశాలివ్వడం సరికాదన్నారు. సీఆర్‌పీసీ సెక్షన్ 54ను ఓసారి చూడాలని, దాన్ని చదివితే మేజిస్ట్రేట్ ఉత్తర్వులు ఎలా చట్టవిరుద్ధమో అర్థమవుతుందని నివేదించారు. దాంతో తమకు సంబంధం లేదని, తమ ఉత్తర్వులను అమలు చేశారా? లేదా? అన్నది మాత్రమే చెప్పాలని ధర్మాసనం స్పష్టం చేసింది. మేజిస్ట్రేట్ ఉత్తర్వులు చట్టవిరుద్ధమైతే వాటిని హైకోర్టులో సవాల్ చేసుకోవాలని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ‘‘మేం ఇప్పటికే ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ వేశాం’’ అని సుధాకర్‌రెడ్డి వివరించారు.
రఘురామకృష్ణరాజును రమేశ్ ఆస్పత్రికి తీసుకెళ్లాలన్న మేజిస్ట్రేట్ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలంటూ 15న మేం ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ధర్మాసనం మళ్లీ ప్రశ్నించింది. ‘‘రాత్రి 12 గంటలకు ఆదేశాలిస్తే వాటిని అమలు చేయడం ఎలా సాధ్యం?’’ అని సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ లలిత స్పందిస్తూ.. తమ ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. మీరేం చెప్పాలనుకున్నా కోర్టు ధిక్కార పిటిషన్ విచారణ సమయంలో చెప్పుకోండని ఆమె తేల్చి చెప్పారు. కోర్టు అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని, తాను చెప్పే విషయాలను నమోదు చేయాలని సుధాకర్‌రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. ఆ అవసరం లేదని న్యాయమూర్తి జస్టిస్ లలిత తెలపగా... తన వాదనలు వినేందుకు సిద్ధంగా లేకపోతే వాకౌట్ చేసి వెళ్లిపోతానని సుధాకరరెడ్డి చెప్పారు. తన వాదనలు విననప్పుడు తాను ప్రభుత్వం తరఫున హాజరవడంలో అర్థం ఏముందని ప్రశ్నించారు.
ఇదేదో ప్రత్యేక కేసు అన్నట్టు వ్యవహరించడం సరికాదు
న్యాయమూర్తి జస్టిస్ లలిత స్పందిస్తూ.. తామిచ్చిన ఉత్తర్వులను తప్పని చెప్పే అధికారం మీకు లేదంటూ సుధాకర్‌రెడ్డికి స్పష్టం చేశారు. ‘మేం ఏం చెప్పాలనుకుంటున్నామో అది చెప్పే హక్కు మాకు ఉంది’ అని తేల్చి చెప్పారు. ‘‘ఉదయం 10.30 గంటలకే సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై విచారణ మొదలుపెట్టింది. అలాంటప్పుడు చట్టవిరుద్ధమైన మేజిస్ట్రేట్ ఉత్తర్వులను మేమెలా అమలు చేయగలం? పైపెచ్చు అంత రాత్రి మేం వెళ్లి జైలుగేట్లు తెరవలేం కదా? ఇదో ప్రత్యేక కేసు అన్నట్లు కనిపించేలా ఈ కోర్టు వ్యవహరించకూడదు. చట్టం ముందు అందరూ సమానమే. రాజ్యాంగంలోని అధికరణను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని సుధాకరరెడ్డి నివేదించారు. అయినా ఈ కేసులో అంత ప్రత్యేక ఆసక్తి ఏముందన్నారు. ఈ సమయంలో జస్టిస్ లలిత తీవ్రంగా స్పందించారు. కంట్రోల్‌లో ఉండి మాట్లాడాలని సుధాకర్‌రెడ్డికి సూచించారు.
రమేశ్ ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడం కోర్టు ధిక్కారమే
Published Thu, May 20 2021 3:17 AM | Last Updated on Thu, May 20 2021 3:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment