సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌లో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వరకు విచారణ చేపట్టవద్దని విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశించింది.
ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ వాదన వినకుండా ఈ కేసులో ప్రస్తుత దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడం సాధ్యం కాదని న్యాయ మూర్తి స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో అరెస్టయిన చంద్రబాబు నాయుడు జ్యుడీషి యల్ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ కుంభకోణంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ మంగళవారం ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ కేసు ఆధారంగా విజయవాడ ఏసీబీ కోర్టు తనకు రిమాండ్ విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సైతం కొట్టేయాలని తన పిటిషన్‌లో కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు.
మీరు ఈ వ్యాజ్యంపై విచారించేందుకు అభ్యంతరం లేదు
విచారణ ప్రారంభం కాగానే వాదనలు వినిపించేందుకు చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా సిద్ధమవుతుండగా, న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. వాదనలు వినిపించే ముందు తాను ఓ విషయం చెప్పదలచుకున్నానని తెలిపారు. తాను పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)గా ఉన్న సమయంలో కొన్ని కేసుల్లో పిటిషనర్ చంద్రబాబుకు వ్యతిరేకంగా హాజరయ్యానని, దీనిపై మీకు అభ్యంతరం ఉంటే విచారణ నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. దీనిపై లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు స్పందిస్తూ, తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ గట్టిగా చెప్పారు.
ఈ వ్యాజ్యాన్ని మీరే వినాలని కోరారు. దీంతో న్యాయమూర్తి విచారణను కొనసాగించారు. లూథ్రా వాదనలు మొదలు పెడుతుండగా, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, ఈ వ్యాజ్యంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, ఇందుకు తమకు కొంత గడువు కావాలని కోర్టుకు స్పష్టం చేశారు. కౌంటర్ దాఖలుకు ఆదేశాలిస్తానని చంద్రబాబు న్యాయవాదులను ఉద్దేశించి న్యాయమూర్తి చెప్పగా, తాము వాదనలు వినిపిస్తామని వారు తెలిపారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరించారు.
చంద్రబాబు రిమాండ్ చెల్లదు..
సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు అరెస్ట్ అక్రమమన్నారు. అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని సెక్షన్ 17ఏ ప్రకారం పబ్లిక్ సర్వెంట్‌ను విచారించాలన్నా, కేసు నమోదు చేయాలన్నా అందుకు గవర్నర్ నుంచి అనుమతి తప్పనిసరి అని తెలిపారు. ఈ కేసులో అలాంటి అనుమతి ఏదీ తీసుకోలేదన్నారు. ఇది చట్ట విరుద్ధమని తెలిపారు. గవర్నర్ అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు కూడా చెప్పిందన్నారు.
సెక్షన్ 17ఏను ఏసీబీ ప్రత్యేక కోర్టు సరైన కోణంలో అర్థం చేసుకోలేదన్నారు. 2018 జూలై తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2018 తర్వాత నమోదైన కేసులకు గవర్నర్ అనుమతి తప్పనిసరి అని తెలిపారు. గవర్నర్ అనుమతి తీసుకోకుండా నమోదు చేసిన కేసు, అరెస్ట్, రిమాండ్ ఇవన్నీ కూడా చెల్లవన్నారు. అదువల్ల చంద్రబాబు రిమాండ్ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోరారు.
నిబంధనల ప్రకారమే కస్టడీ పిటిషన్ వేశాం
ఈ సమయంలో అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, లూథ్రా పూర్తి స్థాయిలో వాదనలు వినిపిస్తున్నారని, తాము కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వాదనలు వినిపించుకోవచ్చన్నారు. సెక్షన్ 17ఏ విషయంలో చట్టం చాలా స్పష్టంగా ఉందని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవా లని లూథ్రా కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. అవతలి పక్షానికి సైతం అవకాశం ఇద్దామని తెలిపారు.
కౌంటర్ల దాఖలకు ఎంత సమయం కావాలని ప్రశ్నిస్తూ.. తొలుత శుక్రవారం కల్లా కౌంటర్ దాఖ లు చేయాలని అదనపు ఏజీకి చెప్పారు. అంత తక్కువ సమయం సరిపోదని అదనపు ఏజీ తెలిపారు. నిబంధనల ప్రకారం రిమాండ్ విధించిన మొదటి 14 రోజుల లోపు పోలీసు కస్టడీ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుందని, అందుకు అనుగుణంగానే ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. అయితే విచారణను సోమవారానికి వాయిదా వేస్తానని, అప్పటి లోపు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. సోమవారం వినాయక చవితి సెలవు అని సుధాకర్‌రెడ్డి చెప్పడంతో అలా అయితే మంగళవారం విచారణ చేపడతానని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
Skill Development Scam: చంద్రబాబు పిటిషన్‌లో కౌంటర్ వేయండి
Published Thu, Sep 14 2023 1:50 AM | Last Updated on Thu, Sep 14 2023 11:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment