స్కిల్ కుంభకోణంలో సీఐడీ తీరును తీవ్రంగా తప్పుపట్టిన హైకోర్టు
నిందితులకు వరంగా మారిన సీఐడీ ఉద్దేశపూర్వక జాప్యం
ఈ కుంభకోణం మాస్టర్ మైండ్ సుమన్ బోస్‌కు లబ్ధి
బోస్ బెయిల్ షరతులను సడలించిన హైకోర్టు
విదేశాలకు వెళ్లేందుకు అనుమతి
ఆయన పాస్‌పోర్ట్‌ని వెనక్కివ్వాలని విశాఖ కోర్టుకి ఆదేశం
బెయిల్ షరతుల సడలింపును వ్యతిరేకించిన ఈడీ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంపై దర్యాప్తును అటకెక్కించిన సీఐడీని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టంది. 2021లో కేసు నమోదు చేసినప్పటికీ, ఇప్పటికీ దర్యాప్తు పూర్తి చేయలేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. మూడేళ్లు దాటినా ఎందుకు చార్జిషీట్ దాఖలు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు ప్రధాన నిందితునిగా ఉన్న స్కిల్ డెలప్‌మెంట్ కుంభకోణం కేసు దర్యాప్తును సీఐడీ ఉద్దేశపూర్వకంగానే మూలన పడేసిందని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హైకోర్టు సైతం ఆక్షేపించడం చర్చనీయాంశంగా మారింది.
కోట్లాది రూపాయల ప్రజాధనం లూటీ అయిన ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేయకుండా సీఐడీ చేస్తున్న ఉద్దేశపూర్వక జాప్యం నిందితులకు వరంగా మారింది. ఈ కుంభకోణం మాస్టర్ మైండ్ సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు బెయిల్ ఇచ్చిన సందర్భంగా విధించిన షరతుల్లో కొన్నింటిని హైకోర్టు సడలించింది. విదేశాలకు వెళ్లేందుకు ఆయనకు అనుమతినిచ్చింది. బోస్ సరెండర్ చేసిన పాస్‌పోర్ట్‌ను వెనక్కి ఇచ్చేయాలని విశాఖపట్నం మొదటి అదనపు సెషన్స్ జడ్జిని ఆదేశించింది.
రూ.25 వేలతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని బోస్‌ను ఆదేశించింది. విశాఖపట్నం కోర్టు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు పాస్‌పోర్ట్‌ని సరెండర్ చేస్తానని హామీ ఇవ్వాలని బోస్‌ని ఆదేశించింది. ప్రయాణ వివరాలన్నింటినీ ముందస్తుగానే కింది కోర్టుకు తెలియజేయాలని కూడా చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రజాధనం కొల్లగొట్టి విదేశాల్లో దాచారని ఈడీ వెల్లడి
సుమన్ బోస్‌ను విదేశాలకు వెళ్లేందుకు అనుమతినివ్వడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. బోస్ పలు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టి, ఆ డబ్బును విదేశాలకు తరలించారని, అందువల్ల విదేశాలకు వెళ్లేందుకు అనుమతినివ్వొదని ఈడీ తరఫు న్యాయవాది జోస్యుల భాస్కరరావు హైకోర్టును కోరారు. దీని ప్రభావం దర్యాప్తుపై పడుతుందని వివరించారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్ షరతులను సడలించడం సరికాదని గట్టిగా వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment