సాక్షి, అమరావతి :ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పులో అక్రమాలు, క్విడ్ ప్రో కోకు సంబంధించి సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏ–1 నిందితుడైన మాజీ సీఎం చంద్రబాబునాయుడు దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా హైకోర్టు కొట్టేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా తాను కస్టడీలోనే ఉన్నట్లు (డీమ్డ్ కస్టడీ) భావించాలన్న చంద్రబాబు వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, స్కిల్ డెవలప్‌మెంట్ కేసు రెండూ వేర్వేరు కేసులని, రెండూ కూడా వేర్వేరు లావాదేవీలకు సంబంధించినవని, రెండు కేసుల్లో దర్యాప్తు అధికారులూ వేర్వేరని, విచారించిన సాక్షులు, సేకరించిన సాక్ష్యాలు కూడా వేర్వేరని హైకోర్టు స్పష్టంచేసింది. అందువల్ల ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు కస్టడీలో ఉన్నట్లు (డీమ్డ్) భావించడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. ఈ కేసులో చంద్రబాబు అరెస్టు కావడంగానీ, జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేయడంగానీ జరగలేదని, అందువల్ల ఆయన బెయిల్‌కు అర్హులుకాదని స్పష్టంచేసింది.
చంద్రబాబు వాదనలో బలంలేదు
2022లో నమోదు చేసిన ఈ కేసులో ఇప్పటివరకు తనను అరెస్టుచేయకపోవడంలో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారని, తనను మరింత కాలం జైలులో ఉంచేందుకే ఇలా చేస్తున్నారంటూ చంద్రబాబు వాదనలో ఎలాంటి బలంలేదని హైకోర్టు స్పష్టంచేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు నమోదైన విషయం చంద్రబాబుకు బాగా తెలుసునని, ఇదే కేసులో ఏ–2 నుంచి ఏ–5 వరకు నిందితులు ముందస్తు బెయిళ్లు కూడా పొందారని న్యాయస్థానం గుర్తుచేసింది. ముందస్తు బెయిల్ విషయంలో చంద్రబాబు ఇన్నేళ్లు నిద్రపోయి, ఇప్పుడు పోలీసులను నిందిస్తున్నారని హైకోర్టు ఆక్షేపించింది.
స్కిల్ కేసులో అరెస్టుచేసిన మరుసటిరోజే చంద్రబాబును ఇన్నర్ కేసులో కూడా కోర్టు ముందు హాజరుపరచాలంటూ సీఐడీ సీఆర్పీసీ సెక్షన్–267 కింద సంబంధిత కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని గుర్తుచేసింది. అలాగే, ఈ బెయిల్ పిటిషన్‌ను తన సరెండర్ పిటిషన్‌గా భావించి, తనకు బెయిల్ మంజూరు చేసే విషయాన్ని పరిశీలించాలన్న చంద్రబాబు అభ్యర్థనను సైతం హైకోర్టు తిరస్కరించింది. అలాగే, ఇన్నర్ కేసులో హైకోర్టు ముందు చంద్రబాబు భౌతిక హాజరుగానీ, వాస్తవిక లొంగుబాటు గానీ సాధ్యంకాదని, తన పిటిషన్‌లో చంద్రబాబు ఎక్కడా కూడా తాను హైకోర్టు ముందు లొంగిపోయేందుకు అనుమతినివ్వాలని కూడా కోరలేదని తెలిపింది. అలాంటి అభ్యర్థన ఏదీ లేనప్పుడు, ఈ పిటిషన్‌ను సరెండర్ పిటిషన్‌గా భావించలేమని తేల్చిచెప్పింది.
అలాగే, బెయిల్ విషయంలో ఆ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోలేమని కూడా స్పష్టంచేసింది. అంతేకాక.. ఒకవేళ కోర్టు స్కిల్ కేసులో తన కస్టడీని ఇన్నర్ కేసులో డీమ్డ్ కస్టడీగా భావించని పక్షంలో, తాను దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా పరిగణించి, ముందస్తు బెయిల్ మంజూరు విషయాన్ని పరిశీలించాలన్న చంద్రబాబు వాదనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి ఏ మాత్రం వెళ్లడంలేదని, కేవలం డీమ్డ్ కస్టడీ అంశానికే పరిమితం అవుతున్నట్లు న్యాయస్థానం తెలిపింది. అన్నీ అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ చంద్రబాబు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి సోమవారం 24 పేజీల తీర్పును వెలువరించారు.
క్విడ్ ప్రో కో పై ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు..
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పులో అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఇందులో అప్పటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, అలాగే క్విడ్ ప్రో కో కూడా జరిగిందంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ.. లింగమనేని రమేష్, హెరిటేజ్ ఫుడ్స్, రామకృష్ణ హౌసింగ్ సంస్థలకు లబ్ధిచేకూర్చారని ఆరోపించింది.
ఈ లబ్ధికి ప్రతిఫలంగా కరకట్ట వద్ద ఉన్న ఇంటిని లింగమనేని రమేష్ చంద్రబాబుకు ఇచ్చారని తెలిపింది. ఇక ఈ కేసులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, ప్రమోద్‌కుమార్ దూబే, సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించగా, సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment