‘స్కిల్‌’ స్కామ్‌ కేసు: ప్రజాధనాన్ని లూటీ చేశారు | Misappropriation of public funds is not a part of official functions | Sakshi
Sakshi News home page

‘స్కిల్‌’ స్కామ్‌ కేసు: ప్రజాధనాన్ని లూటీ చేశారు

Published Wed, Sep 20 2023 4:07 AM | Last Updated on Wed, Sep 20 2023 7:28 PM

Misappropriation of public funds is not a part of official functions  - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజాధనం దుర్వినియోగం అధి­కార విధుల్లో ఎంతమాత్రం భాగం కాదని, అందు­వల్ల స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో మాజీ సీఎం చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు గవర్నర్‌ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. చంద్రబాబు స్వలాభాపేక్షతో, ఉద్దేశపూర్వకంగా రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, రంజిత్‌ కుమార్, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌­రెడ్డి హైకోర్టుకు మంగళవారం నివేదించారు.

ఇదంతా అప్పటి సీఎం చంద్ర­బాబుకు తెలిసే, ఆయన సమక్షంలోనే జరిగింద­న్నారు. ప్రభుత్వ ఖజానాకు రూ.371 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కుంభకోణంలో చంద్ర­బాబు పాత్రకు సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించేందుకు సీఐడీకి ఇంత సమయం పట్టిందని, చిన్న ఛాన్స్‌ కూడా తీసు­కోలేదని, పక్కా ఆధారాలు­న్నాయని నిర్ధారించు­కున్న తరువాతనే చంద్రబాబు అరెస్ట్‌ వరకు వెళ్లామ­న్నారు. గుజరాత్‌లో ఇదే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రా­లకు రూ.కోటి చెల్లించగా, మన రాష్ట్రంలో మాత్రం అవే కేంద్రాలకు రూ.వందల కోట్లు చెల్లించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఈ కేసు రాజ­కీయ ప్రేరితమంటూ చంద్రబాబు తప్పించుకో­వడా­నికి ప్రయత్నిస్తున్నారని కోర్టుకు వివరించారు. నిజా­యతీతో పనిచేసే అధికారులు, ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులను రాజకీయ కక్ష సాధింపుల నుంచి కాపా­డేందుకే అవినీతి నిరోధక చట్టంలో 17ఏను చేర్చారే కానీ, నిర్భీతితో పట్ట పగలే ప్రజాధనాన్ని లూటీ చేసిన చంద్రబాబు వంటి వారి కోసం కాదన్నారు. ప్రజా­ధనానికి ధర్మకర్తగా, రక్షకుడిగా వ్యవహరించాల్సిన వ్యక్తి భక్షకుడిగా మారి రూ.వందల కోట్లను దారి మళ్లించేశారన్నారు. ఇది పూర్తిగా అనధికారిక విధుల కిందకే వస్తుందని, అందువల్ల చంద్రబా­బుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ ఎంత మాత్రం వర్తించదని స్పష్టం చేశారు.

స్కిల్‌ డెవల­ప్‌మెంట్‌ స్కామ్‌లో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, ఈ దశలో దర్యాప్తునకు ఆటంకం కలిగించేలా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయ­వద్దని కోర్టును అభ్య­ర్థించారు. ఈ కేసులో ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సైతం దర్యా­ప్తు చేపట్టాయని నివేదించారు. ఇరుపక్షాల వాద­నలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేస్తు­న్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్త­ర్వులు జారీ చేశారు. కాగా విచారణ నిమి­త్తం చంద్రబాబును తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌లో కౌంటర్‌ దాఖలు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయ­వాదులను సోమవారం వరకు ఒత్తిడి చేయవద్దంటూ ఏసీబీ కోర్టును ఆదేశిస్తూ గత వారం ఇచ్చిన ఉత్తర్వులను న్యాయమూర్తి పొడిగించలేదు.

సుదీర్ఘంగా వాదనలు..
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అరెస్టయిన మాజీ సీఎం చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో భాగంగా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ చంద్ర­బాబు గత మంగళవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖ­లు చేశారు. ఈ కేసు ఆధారంగా విజయవాడ ఏసీబీ కోర్టు తనకు రిమాండ్‌ విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వు­లను సైతం కొట్టేయాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు.

ఈ వ్యాజ్యంపై హైకోర్టులో మధ్యాహ్నం 12.05 గంటలకు మొదలైన వాదనలు సాయంత్రం 5.20 వరకు నిరాటంకంగా కొన­సాగాయి. వాదనల సమయంలో కోర్టు హాలు కిక్కిరిసిపోయింది. చంద్ర­బాబు తరఫున దేశంలోనే అత్యంత ఖరీదైన సీని­యర్‌ న్యాయవాదిగా పేరున్న హరీష్‌ సాల్వే, టీడీపీ తరఫున ప్రతి కేసును వాదించే మరో సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. లండన్‌లో ఉంటున్న హరీష్‌ సాల్వే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తన వాదనలను వినిపించారు. ఈ సందర్భంగా అర్ణబ్‌ గోస్వామి కేసును కూడా ప్రస్తావించారు.

2024లో ఎన్నికలు రాబోతున్నా­య­ని, వాటిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్‌ చేశారన్నారు. ప్రభుత్వం తన కౌంటర్‌ను చివరి నిమిషంలో తమకు అందచేసిందని, ముందే అందచేసి ఉండాల్సిందని సాల్వే పేర్కొనగా, సీఐడీ తరఫు సీనియర్‌ న్యాయవాది రంజిత్‌కుమార్‌ జోక్యం చేసుకుని ఇది కూడా కక్షపూరిత రాజకీ­యంలో భాగమేనంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు.  

చంద్రబాబు మనుషులు విదేశాలకు పారిపోయారు..
ఐటీ శాఖ అధికారులు చంద్రబాబుకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులకు నోటీసులు ఇవ్వగానే ఒకరు దుబాయ్‌కి, మరొకరు వాషింగ్టన్‌కు పారి­పో­యారని సీఐడీ తరఫున న్యాయవా­దులు తెలిపారు. డిజైన్‌ టెక్‌ కంపెనీ రూ.200 కోట్లు దారి మళ్లించినట్లు ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో బహిర్గత­మైం­ద­న్నారు. పలు కీలక డాక్యుమెంట్లను మాయం చేశారని, వాటన్నింటినీ కూడా వెతికే పనిలో దర్యాప్తు అధికారులు­ఉన్నారని తెలిపారు.

ముగ్గురి వాదనలు పూర్తి కాగానే దీనిపై సాల్వే, లూథ్రా తిరుగు సమాధా­నం ఇచ్చారు. అనంతరం న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఈ వ్యవహా­రంలో ఏం చెప్పాలను­కున్నా, ఇప్పుడే చెప్పా­లని, ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం లేదని, ప్రధాన వ్యాజ్యంపైనే నిర్ణయం వెలువ­రిస్తానని తేల్చి చెప్పారు. ఇరుపక్షాలు వాదనలు పూర్తి చేయడంతో తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

10 రోజుల్లోనే కొట్టేయాలంటున్నారు
సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ, రంజిత్‌ కుమార్, పొన్నవోలు సుధాకర్‌రెడ్డిలు వాదనలు వినిపిస్తూ స్కాం జరిగిన తీరును వివరించారు. స్కిల్‌ కుంభకోణంలో దర్యాప్తు కొనసాగుతోందని, పలువు­రిని విచారించాల్సి ఉందని, మరి కొందరిని అరెస్ట్‌ చేయాల్సి ఉందని తెలిపారు. దర్యాప్తు దశలో కేసును కొట్టేయడానికి వీల్లేదని, ఈ విషయంలో సుప్రీం­కోర్టు చాలా స్పష్టమైన తీర్పునిచ్చిందంటూ నిహారికా కేసులో సుప్రీంకోర్టు తీర్పును చదివి వినిపించారు. సెప్టెంబర్‌ 7న చంద్రబాబును నింది­­తుడిగా చేర్చారని, 9న అరెస్ట్‌ చేశారని, 12న ఆయన తనపై కేసును కొట్టేయాలంటూ హైకో­ర్టులో పిటిషన్‌ దాఖలు చేశారని తెలిపారు. చంద్ర­బాబుపై కేసు నమోదు చేసి కేవలం 10 రోజులే అయిందన్నారు.

 తాము కౌంటర్‌ ఇప్పుడే ఇచ్చా­మ­ని చంద్రబాబు న్యాయవాదులు చెబుతు­న్నా­­రని, వాస్తవానికి 900 పేజీల అదనపు డాక్యమెంట్లను వారు  ఇప్పుడే తమకు అందచేశారని కోర్టు దృష్టికి తీసుకొ­చ్చారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన వారికి అవినీ­తి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ అసలు వర్తించదన్నారు. కేసు నమోదు చేసింది 2021లో కావొచ్చు, కానీ కథ నడిచింది మొత్తం 2014, ఆ తరువాతేనని కోర్టుకు నివేదించారు. 2018­కి ముందే ఈ కుంభకోణం వ్యవహారంలో సీఐడీ ప్రాథమిక దర్యాప్తు జరిపిందని వివరించారు. రికా­ర్డులను తారుమారు చేయడం, ప్రజా­ధనాన్ని కొల్ల­గొట్టడం పబ్లిక్‌ డ్యూటీ కిందకు రానే రాద­న్నారు. అప్పటి ప్రభుత్వ పెద్ద ఆలోచనల నుంచే ఈ కుంభకోణం మొదలైందని రోహత్గీ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐశాఖ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయ­న్నారు. డ్యాం కట్టాం, వరదల వల్ల అది కొట్టుకుపో­యి­ంది.. మా తప్పేమీ లేదని చెప్పేంత చిన్న వ్యవ­హా­రం కాదని కోర్టుకు నివేదించారు. ఈ కుంభకోణం వెనుక లోతైన కుట్ర ఉంద­న్నారు. ప్రజాధ­నాన్ని లూటీ చేసిన పెద్దలు, దాని­ని దారి మళ్లించేందుకు పలు షెల్‌ కంపెనీలను సృష్టించా­రని, ఇందుకు పక్కా ఆధారాలున్నాయంటూ కోర్టు ముందుంచారు. కేసు డైరీని సైతం కోర్టుకు సమ­ర్పించి కీలక ఆధారాలను నివేదించారు. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే హైకోర్టు సీఆర్‌సీసీ సెక్షన్‌ 482 కింద తనకున్న అధికారాన్ని ఉపయోగించగలదన్నారు. ప్రాథ­మిక దశలో దర్యా­ప్తు­ను కొనసాగించకుండా పోలీసులను నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేయడానికి వీల్లేదని తెలి­పారు.

దర్యాప్తు ప్రాథ­మిక దశలో కోర్టులు ఆరో­ప­ణల పూర్వాపరాల్లోకి వెళ్లడానికి వీల్లేదన్నారు. దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్‌ను దాఖలు చేసేందుకు పోలీసులకు అనుమతిని­వ్వాలని కోరారు. ఈ కేసు రాజకీయ ప్రేరేపితం అని చెబుతున్నారని, అదే నిజమైతే 2021లోనే చంద్రబాబును నిందితుడిగా చేర్చి అరెస్ట్‌ చేసే వారమన్నారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్రకు సంబంధించి ఆధారాలు లభించాయి కాబట్టే ఇప్పుడు అరెస్ట్‌ చేశామన్నారు. స్కిల్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ముందే రూ.300 కోట్లకు పైగా మొత్తాన్ని ప్రైవేటు కంపెనీల పేరు మీద మళ్లించేశారు, అదే ఇక్కడ కీలక విషయ­మని కోర్టుకు వివరించారు.

ఒప్పందంలో భాగమైన రెండు ప్రైవేటు కంపెనీలు కలిసి మూడో కంపెనీని తెరపైకి తెచ్చి, ఆరు షెల్‌ కంపెనీలను సృష్టించి నిధులను మళ్లించేశాయ­న్నారు. ఇదంతా కూడా చంద్రబాబుకు తెలిసే జరిగిందని వివరించారు. నిధుల చెల్లింపునకు ఆయనే అనుమతిని­చ్చారని తెలిపారు. ఇదంతా తాము చెబుతున్నది కాదని, కాగితాలే అందుకు సాక్ష్యమన్నారు.

కార్పొరేషన్‌ను ప్రతివాదిగా చేర్చాల్సిందే..
ఈ కుంభకోణంపై ఫిర్యాదు చేసిన ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌డీసీ)ను ప్రతివాదిగా చేర్చకుండానే పిటిషన్‌ దాఖలు చేశారని న్యాయవాది సన్నపురెడ్డి వివేక్‌ చంద్రశేఖర్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కేసులో కె.అజయ్‌రెడ్డిని ప్రతివాదిగా చేర్చారని, ఆయనకు ఇప్పుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో ఎలాంటి సంబంధం లేదని గట్టిగా చెప్పారు. అందువల్ల కార్పొరేషన్‌ను ప్రతివాదిగా చేర్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ఈ విషయాన్ని ముందే చెప్పి ఉండాల్సిందని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement